దక్షిన తెలంగాణ

నవ్వు మొఖం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానకాలం కురిసి
ప్రకృతి మురిసి స్నానం చేసి
ఆకుపచ్చగా సింగారించుకుంటున్నప్పుడు
ముతె్తైదువ తనంతో
పసిడిగా నవ్వు తడి తంగేడు పువ్వు

గాలికి ఊగిసలాడే తంగేడుపువ్వు
కొమ్మల చేతులతో కదిలి రమ్మని పిలుస్తది
బతుకమ్మలో అతికిపోయి
మూలాధారమై అలరారు తడి
పూల వరుసలు పేర్చుటలో పలు వరుసలుగా
పలువరుసగా ప్రకాశిస్తది

తంగేడు పువ్వు కోసం తండ్లాట
కూర్పు పొద్దుకు పాదయాత్ర
చెట్టు చెట్టుకు వెతుకులాట
దొరుకకపోతే తొక్కులాట
దొరికినప్పుడు ఉరకలెత్తే మనసు
అవధులు లేని ఆనందంతో
ఆధ్యాత్మిక సుగంధమైతది

బతుకమ్మ చుట్టూ ఆవృతమై తిరిగే
ఆడపడచుల సంబూరం
మహాగంభీరం
ఒకేసారి స్వరమెత్తి పాడే కోకిలలై
శబ్దాలయ చప్పట్లలో
ఆభరణాల మెరుపు హొయలతో పాటు
తంగేడు పువ్వు స్వర్ణవర్ణమై
సమోన్నతంగా పరవశిస్తది
దృష్టికోణమై విశిష్టత చెప్పుతది

మరో తరాన్ని ప్రసవించే పరిపూర్ణత
తల్లిగారి పొలిమేర దాటేటప్పుడు
పలుగురాళ్లకు పెట్టిన పసుపు కుంకాలతో
తొవ్వలో తంగేడు పువ్వుంచినపుడు
దాటిపోతున్న తల్లిపిల్లల చూసి
కన్నతల్లిలా సాగతోలుతది
బాటసారులకు పయనమైన తల్లుల
తతంగమంతా తవ్విపోస్తది

అలుకు పూతకు తెచ్చే
ఎర్రమట్టి తట్టలో
మట్టి శిఖిలం మీద
తంగేడు పువ్వు
కిరీటం మీది నెమలీకయితది
స్వరాష్ట్ర సాధనకై ఒరిగిన
అమరుల ఆశయాలను పుష్పించడానికి
ఆరిన ఆరడుగుల నేలలో
తంగేడు మొలకై జన్మ ఎత్తి
ఆశయాల పువ్వులై వికసిస్తది

తంగేడు పువ్విపుడు
నాలుగు కోట్ల ప్రజల నవ్వు మొఖం
తెలంగాణ శిఖలో
సాధికార సాధన తురిమిన
అధికార ముద్రిక
ప్రగతి పొద్దుమీద
సంప్రదాయ సంతోషాలపైన
చెరిగిపోని ప్రభుత్వ ముద్దెర

- సిద్దెంకి యాదగిరి
9441244773

దుడ్డుకర్ర

పచ్చని పంట చేనును చూస్తూ తనలోతానే నవ్వుకుంటున్న రైతులా ఉదయాకాశం రంగులు దిద్దుకుంటూ మురిసిపోతోంది. పట్టణ సరిహద్దులకు కూతవేటు దూరములోనున్న లింగారెడ్డిపల్లి..పల్లెలు దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్మాగాంధీ సందేశాన్ని నెమరేసుకుంటోంది.
మూడు పదుల వయసు దాటిన ముగ్గురు యువకులు ఊరుదాటి కాలినడకన పట్నానికెళ్లే తార్రోడ్డు మీదికొచ్చారు. టక టక శబ్ధాలతో బూట్లు మాట్లాడుకుంటూంటే మాటామంతితో మార్నింగ్ వాక్ సాగిస్తున్నారు. ఆ ఊళ్లోనే పుట్టి, పెరిగిన వారికి మార్నింగ్ వాకింగులో తప్ప మరెక్కడికెళ్లాలన్నా బైకు సవారీయే. మాటామంతిలో ఊరి రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి.
ఆ ముగ్గురూ పట్నం కార్యాలయాల్లో ప్రభుత్వోద్యోగులు హాపీగా నవ్వుకుంటూ వంద గజాల దాకా నడిచారు. అలసట ఆవహించింది. రోజట్లాగే రోడ్డుపక్కన పల్లవిస్తున్న గుడిసె హోటల్లో వేడి చాయలు సేవించి వాడిగా నడక ప్రారంభించారు. బారెడు పొద్దెక్కింది రోడ్డు మీద వాహనాల ఉనికి శ్రీకారం చుట్టుకుంది.
కుడిపక్కన అరవింద్, మధ్యనున్న రవిచంద్ర, అటువైపున నాగభూషణం వరుసల్లో నడుస్తున్నారు. రోజు మార్నింగ్‌వాక్ తర్వాత తయారై పట్నంకెళ్లి రాత్రికల్లా ఇంటికి రావడం వారికలవాటైంది. వెనకటి రోజుల్లోని మనుషుల గట్టిదనం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆనాడు రసాయనిక ఎరువుల్లేని పంటలే ఆ గట్టితనానికి కారణమని తేల్చేశారు. చివరికి ఈ రోజుల్లో మనలాంటి యువకులు గూడా రోగాల పాలవుతున్నారు. మన ముగ్గురిలో ఒకరికి షుగర్, ఒకరికి బిపి, మరొకరికి అధిక బరువు అన్నాడు రవిచంద్ర. ఆ మాటతో ఏకీభవించారు. వెనకనుండి కిర్రుచెప్పుల నడక జోరు వినబడింది.
వెనక్కు తిరిగి చూశారు. చేతిలో దుడ్డుకర్ర, మోకాలు దాకా మలిచిన దోవతి, నెత్తికి రుమాలుతో రంగరాజమువేగంగా నడిచి వస్తున్నాడు. మన వెనకెందుకొస్తున్నట్టా? ముగ్గురిలో ఆందోళన, గత ఆదివారం కచేరివద్ద జరిగిన పంచాతీలో ముగ్గురూ రంగరాజముకు వ్యతిరేకంగా మాట్లాడారు. అందుకు పగదీర్చుకునేందుకే మన వెంట పడ్డట్టుంది. గుండెల్లో దొర్లింది. ముగ్గురూ సైగలు చేసుకుని పరుగందుకున్నారు.
రంగరాజము దుడ్డు కర్ర ఊపుతూ అంలేస్తూ నడుస్తున్నాడు. కొద్ది సేపట్లోనే కిర్రు చెప్పుల నడక, రన్నింగ్ షూస్ పరుగు సమానమైనాయి. మూడు నిమిషాల పరుగు..అలవాటు లేని పరుగు..దమ్ముదీస్తున్నారు. ఎరక్కపోయి ఇరుక్కున్నాం దోస్త్, నాగభూషణం పశ్చాత్తాపం, ఆదివారమునాడు టివి చూస్తూ కూచుండక ఆ పంచాయతీకి పోయినం’ అరవింద్ గురగు.
‘అగో..ఆ కుడిపక్క బాటమదికెల్దాం పదండి, రవిచంద్ర సలహా ముగ్గుర్ని అటు మళ్లించింది. వెనక్కు తిరిగి చూసిండ్రు. రంగరాజము గూడా బాటమీదికొచ్చింది. మరికొద్ది సేపు పరుగు..పిక్కలు పట్టేసినై. నాగభూషణం ఆగి, రెండు చేతులతో ఇద్దర్నీ ఆపేశాడు’ ఇహ పరుగెత్తలేము. అతనే్న క్షమించుమందాం రొప్పుతూ సలహా విసిరాడు. ముగ్గురు ముక్కోణాకారములో బాట మీద కూచున్నారు. భారమంతా భగవంతుని కొదిలేసిండ్రు.
పక్కూరికేదో పనిమీదవెళ్లి, రాత్రికి అక్కడే బస చేసి తిరిగి వస్తున్నా ఆ ఊరి కానిస్టేబుల్ కనకయ్యను ఆశ్చర్యమావరించింది. ముక్కుమీద లాఠీ వేసుకుని, రాస్తారోకో చేస్తున్నారా ఫ్రెండ్స్?’ వాళ్ల చుట్టూ తిరుగుతూ ఎర్రటోపీ సవరించుకున్నాడు. వాళ్లకతడు గ్లాసుమేటు, ఖాకీడ్రెస్సు కనబడగానే ముగ్గురు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. అటు చూడు కనికన్నా! రంగరాజము మా వెంటబడి తరుముకొస్తుండు. దొరికితే దుడ్డుకర్రతోని మా వీపులు సాపు జేస్తడు. నాగభూషణం మూడు ముక్కల్లో విషయం చెప్పిండు. కనకయ్యకంతా అర్థమైంది.
గబగబా వస్తున్న రంగరాజమును లాఠీ అడ్డుపెట్టి ఆపేసిండు. ‘ఆగు రంగరాజమన్నా! మనమంతా ఒక్క ఊరోళ్లము. అభిప్రాయబేధాలుంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలె’. దుడ్డు కర్రలాక్కుని ముగ్గురికీ సైగచేశాడు. ముగ్గురూ లేచి రంగరాజము చేతులు పట్టుకుని’ ఈసారి మమ్ముల్ని క్షమించుమన్నారు. బతిమాలారు. కనకయ్య సపోర్టు చేసిండు.
రంగరాజము రుమాలు సర్దుకుని అవన్నీ నాకు అర్థంగాలేదు కనకన్నా. ననె్నందుకు ఆపేసినవూ? అసహనంగా అడిగిండు.
‘చూడు రంగన్నా! వాళ్లు చదువుకున్నోళ్లు..’కనకయ్య సముదాంచబోయాడు.
‘అయితే నాకేంది? నన్నిడువన్నా!’ అరిచిండు.
‘వాళ్లను కొడితే నీకేంలాభం? కనకయ్య ప్రశ్న
‘వాళ్లను నేనెందుకు కొడ్తా? నాకు పిచ్చా?
‘అహా, ఆదివారం నాడు పంచాయతీల వాళ్లు నాకు వ్యతిరేకంగా మాట్లాడిండ్రని పగబట్టినవట గదా!’ కనకయ్య పక్కకు జరిగిండు.
రంగరాజము మీసాలు మెలేసిండు’ ఆదివారం సంగతి ఆనాడే మరిచిపోయిన. వాళ్లమీద నాకెందుకు పగా?’
‘మరి వాళ్లవెంట ఎందుకు వస్తున్నావు?’
‘పొద్దుగాల్ల పాలు పిండుదామని వాకిట్ల చూస్తే బర్రెలేదు. గుంజ ఖాళీగా వుంది. కట్టేసిన తాడు తెగి వుంది. అగో..అక్కడ మా పొలము, పశువుల దొడ్డి ఉంది. బర్రె అటుపోయిందేమోనని వెతుక్కుంట వస్తున్న పక్కకు జరుగుండ్రి’ ముగ్గుర్ని తోసుకుని ముందుకెళ్లిండు. కానిస్టేబుల్ కనకయ్య ఎర్ర టోపిని ఎడమచేతిలోకి తీసుకుని కుడిచేతి లాఠీతో నెత్తిగోక్కున్నాడు.

- ఐతా చంద్రయ్య
సిద్దిపేట, సెల్.నం.9391205299

చిన్న కథ

కానుక

‘అమ్మా.. బాపూ..బాగున్నారా.. ఆరోగ్యం బాగుంటాన్దా.. చెప్పా పెట్టకుండా వచ్చిండ్రు. మీరొస్తున్నారంటే ఆయనను యాపారానికి పోవద్దందును కదా..’ తల్లిదండ్రుల కాళ్లకు నీళ్లిచ్చి, వాళ్ల చేతిల సంచులందుకుంటూ అంది పద్మ.
‘దానిదేముందిలే బిడ్డా..మా కోసం ఆయన పనేందుకు పోగొట్టుకోవాలే..బువ్వ దినడానికి వత్తడు కదా..నువ్వేట్లున్నవ్ బిడ్డా..పిల్లలేరీ..సంచిలో నుండి పండ్లను, పొలంల పండిన పల్లికాయలను, పప్పును, బిడ్డ దగ్గరకు పోతానమని చేసిన ఫలారాలను తీసిస్తూ అంది కమలమ్మ.
‘బాగానే ఉన్నామమ్మా..ఇయ్యాల బడి ఉన్నది కదా..ఇద్దరక్కడికే పోయిండ్రు. శివకిప్పుడు పదో తరగతి కదమ్మా..సదువు బాగనే ఉంటాంది. రాణి కూడా బానే సదువుతాన్దీ అంది పద్మ.
‘అల్లుని యాపారం ఎట్లున్నది బిడ్డా..’
‘గట్ల గట్లనే ఉన్నదమ్మా..వూరూరు తిరిగి బట్టలమ్ముడాయే. సైకిల్ మీద కష్టమైతాందని ఇప్పుడు బండి గూడ కొన్నాడు..ఆ డబ్బు కూడా కట్టాల్నాయే..ఒకరికి చెయ్యి చాపకుండా ఆడికాడికి బొటాబొటిగా సరిపోతాన్దీ. మళ్లా నాలుగు రోజులయితే శివకి ఫీజులు కట్టల్నాయే..అవునూ చెప్పకుండా వచ్చిండ్రు..ఏమైనా సంగతులా..
‘ఆ..ఆ..అల్లుడు రానియ్యి..’
‘అంతా రహస్యమా..నాతోని జెప్పకూడనిదా..’
‘తినబోతూ రుచేందుకు బిడ్డా..అల్లుడు రానియ్యరాదు..’
చెప్పకపోయేసరికి ఇంకా కుతూహలం పెరిగింది పద్మలో. బాపు కిష్టమని పప్పు నానబెట్టి గారెలు చేసింది. కూర తెచ్చి వండింది. తల్లిగారింటి ముచ్చట్లు అడుక్కుంట ఈ పనులన్నీ జేసింది.
ఇంతలో అల్లుడు వచ్చి అత్తమామల్నీ జూసి సంబరపడ్డాడు. అంతా కల్సీ భోజనాలు చేసిన తరువాత, ఫ్లాస్టిక్ సంచి నుండి తీసిన డబ్బును బిడ్డ ముందర అల్లుని చేతుల పెట్టిండ్లు. ‘ఏం లేదు బాబూ..మా పద్మకు ఎప్పటినుండో లక్ష్మీదేవి బిల్ల ఉన్న గొలుసు కావాలని కాయిశుండే. పెళ్లీల జెయిస్తామనుకుంటే, పెళ్లి ఖర్చులయ్యేసరికి మిగల్లేడు. తర్వాత నాలుగైదేళ్లు పెళ్లికి జేసిన అప్పులు దీర్చుడే సరిపాయే. తర్వాత వర్షాలు బడక యవసాయానికి జేసిన అప్పులే కడితి. ఇక్కడ పిల్లల సదువులతోని, ఇంట్ల ఖర్చులతోని దాని కోరికెప్పుడు బయట పెట్టకపాయే. ఇగ వచ్చేది బతకమ్మ పండుగ కదా..ఈసారి బట్టలు పెట్టకున్నా దానికిష్టమైన గొలుసు జెయించుకుంటదని ముందర్నే తెచ్చినమ్. గొలుసే చేయించి తీస్కస్తామనుకుంటే దానికి నచ్చినట్లు లేకపోతే మళ్లా చెడగొట్టడమెందుకని..’ ‘అమ్మా..ఎందుకే అంత డబ్బు..ఇస్తున్నారు. మీ కష్టాలు మీ కున్నాయ్ కదా! ‘మామా..ఇప్పుడేదో పిల్లల సదువులు ఉన్నాయ్ గాని తర్వాత నేను జెయించన..ఉంచుకోండి..అల్లుడివ్వబోయినా, బలవంతాన అతని చేతులబెట్టి స్కూల్ నుండి వచ్చిన పిల్లలతో కాస్సేపు గడిపి వెళ్లిపోయారిద్దరూ.
పండుగకు పిల్వడానికొచ్చి, ‘బిడ్డా గొలుసు చేయించుకున్నవా..‘ అన్న తండ్రిని లోపలకు తీస్కెల్లి కొడుకు చదువుకుంటున్న కంప్యూటర్ చూపించింది.
‘బాపూ..నాకిప్పుడా గొలుసు మీద మోజుపోయిందే..నా కొడుక్కి ఇప్పుడు కంప్యూటర్ అవసరం బాగుంది..వాళ్ల ఫ్రెండ్స్ అందరూ అందులోనే సదువుకుంటాడ్రట. అది ఉండే వాడు బాగా సదివి ఇట్లాంటి గొలుసులు నాలుగ్గొంటాడు. అప్పయినా చేసి వాడికి కొనాలనుకుంటుంటే దేవుడిలా తెచ్చినవ్..బాగా లేదా బాపూ.’ విప్పార్చుకున్న కళ్లతో కొడుకు మొహంలోని ఆనందాన్ని చూస్తూ అంటున్న బిడ్డ, అమ్మలకు ప్రతీకలా అనిపస్తుంటే, నీళ్లు నిండిన కళ్లతో చూస్తుండిపోయాడు.
‘అమ్మ.. ప్రేమకు మారు పేరు.. అమ్మ మనసు పూలతేరు.. రేడియో నుండి పాట వస్తుంది. అవును తన బిడ్డ సంతోషం గురించి తను ఆలోచిస్తే, ఆమె బిడ్డ సంతోషం గురించి ఆమె ఆలోచించింది. వింతేముంది అనుకున్నాడు.

- నామని సుజనా దేవి
వరంగల్, సెల్.నం.8728222156

సంసారం

నా మనోగీతాలు
వౌనానికి సంకేతాలు
గుండెల్లో
సుడిగుండాలు పరిభ్రమిస్తున్నా
అప్పు తెచ్చుకున్న నవ్వు
అంత తృప్తి నివ్వడం లేదు
సంసారం అనే సాగరంలో
జీవితపు నౌక
ఒక్కసారిగా
తలక్రిందులయ్యింది
నా కుటుంబం గల్లంతయ్యింది
కళ్లు తెరిస్తే ఏదో తెలియని ద్వీపం
చెక్క కర్ర ఊతతో చేరింది నా దేహం
భాష రాని, భావం తెలియని
మతి లేని వింత మనుష్యులదా లోకం
నా నయనాలు మాట్లాడుతున్నాయి
నా హృదయం
మూగగా రోదిస్తోంది

- బి.చంద్రశేఖర్,
జడ్చర్ల, 964037003

లోకం

ఇహ లోకపు
భవబంధాలు
ఈ లోకం వరకే చెల్లు
మానవజాతి యావత్తూ
ఆ బ్రహ్మకు
చెల్లించక తప్పదు బిల్లు
రసీదు చూపించకపోతే
పడుతుంది
నవరంధ్రాలకు చిల్లు
ప్రాణం పోయాక
అందరూ అంటారు ఘొల్లు
యమలోకం చేరాక
యముడంటే ఝల్లు

- విజయలక్ష్మి,
జడ్చర్ల, 9014115323

ఉస్మానియా కళాశాల
చదువుల తల్లి ఉస్మానియా
కలల శాల ఉస్మానియా
నా చైతన్యం ఉస్మానియా
ఉద్యమ కరచాలనం ఉస్మానియా
నా భవితకు ఉషోదయం
నా బ్రతుకు బాటకు సూర్యోదయం
నిత్యనూతనం ఉస్మానియా
నిత్యానందం ఉస్మానియా
వెలుగు నీడ ఉస్మానియా
నా ఊపిరి ఉస్మానియా
కొత్త జీవితం ఉస్మానియా
నా నిరంతర శోధనం ఉస్మానియా
సత్యానే్వషి ఉస్మానియా
నా పరిశోధనం ఉస్మానియా
నా ఉత్సాహం ఉస్మానియా
ఒక ఉత్సవం ఉస్మానియా
నన్ను గుండెలకద్దుకుంది ఉస్మానియా
నా జీవితానికి మలుపు ఉస్మానియా
కలల జాడ ఉస్మానియా
నా వసంత గీతం ఉస్మానియా

- బోస్క సత్తమ్మ
నకిరేకల్, నల్గొండ జిల్లా, 9701594727

గ‘మత్తు’ వేదాంత లోకం

గల్లీగల్లీకో మద్యం దుకాణం
బారులు తీరిన బీర్ బాబులతో
పేరు ఏదైనా
హౌస్‌ఫుల్ కనెక్షన్ల కామెడీ జంక్షన్
టైమ్‌పాస్-కిక్ టానిక్కంటూ
కొంపలో గొడవ- తాగలేక బతకలేనంటూ
ఊసరవెల్లి ఊగిసలాటతో ప్రతివాడూ ఓ హీరో!

ఆరిపోతున్న దీపాన్ని వదిలేసి
ఆనంద క్రీడలాడే వారితో
మద్యం మధురపానీయమనీ
మూడు ఫుల్, ఆరు ఆఫ్ బాటిళ్ళు
ఆఖరి బొట్టు అమృతమంటూ గుటగుట
మట్టిజీవుల నెత్తురు పీకల్లోతు తాగి
తోలుబొమ్మల్లా క్రీడా విన్యాసం
ఎన్ని మాంగల్యాలు తాకట్టు పెట్టారో!

కన్నీళ్ళు కానరాని
నెత్తుటి బంధాలు గుర్తుకురాని
మత్తిల్లిన మాయాలోకం
పృచ్ఛకులుండరు
అందరూ అవధానులే
అంతా మూడుపదుల వయస్సే
కాపురాలు చిచ్చుబుడ్డుల్లా పేలినా
అక్కడ కాలచక్రం కునుకు తీస్తుంది!

ప్రపంచాన్ని పల్టీలు కొట్టించి
తలరాత తార్మార్ చేసే మాయగాళ్ళు
కలల సౌధాలను కూలదోసి
సరిహద్దు నియంత్రణ రేఖ దాటి
ఆనంద డోలికల్లో తేలాడే
గ‘మ్మత్తు’ వేదాంత లోకం
గతి తప్పిన యువ‘కుల’ గందరగోళం

- నాశబోయిన నరసింహ,
చిట్యాల, 9542236764

గేయం

అమ్మ తనము
చూపినది చెట్టు

పల్లవి మొక్క నాటుకోవాలి
ప్రతి చెట్టు పెంచుకోవాలి
ఒట్టు పెట్టుకోవాలి
హరిత హారముకై సాగాలి

ఇరువద్దు ఇరువద్దు చెల్లెమ్మ కొమ్మలిరువద్దూ
నరకొద్దు నరకొద్దు అన్నయ్య చెట్లు నరకొద్దూ

చెట్టు వల్ల మనకు ఎంతో మేలు జరుగును
నరకడం వల్ల చాల కీడు పెరుగును
పెద్ద పెద్ద రోగాలకు మందు అయతవి
నల్లమల్ల అడవులల్ల దొరుకుతుంటవి

సీతమ్మకు నీడైనది చెట్టు కాడ
రామయ్య విల్లంబు చెట్టు కాడ
ఏకలవ్య ప్రతిభకు చెట్టు కాడ
కనకప్ప కావడి చెట్టు కాడ

నీళ్లకు దారి చూపిన దోణి అయతది
కాయలు తొక్కుగ పెడితే కుంచెనయతది
దరువుకు అండగ నిలచె తప్పెటయతది
ఫకీరు సాహెబుల చిప్ప అయతది

జ్ఞానాన్ని పెంచినది చెట్టు కాడ
బుద్ధుడి ప్రతి రూపము చెట్టు కాడ
మంచికి చెడులకు పూలు కాడ
నాడు ఏసిన లకిడికాపూలు కాడ

ఆయుర్వేదంలో చెట్టు పసరుంటది
హోమియోపతిలో చెట్టు ముందుగుంటది
బ్రహ్మంగారి కాలజ్ఞాని నంటది
దేవుని గుళ్ళో కొబ్బరికాయనంటది

పీర్ల పండగల్లో మంటలయతవి
కులమతాలను కలుపుతుంటవి
తేనెపట్టును కూర్చి మనకు ఇస్తవి
పక్షులకు గూడునిచ్చి పెంచుతుంటవి

ఒళ్లును కప్పెబట్ట చెట్టుకాడ
అమ్మతనము చూపినది చెట్టుకాడ
గంజిని ఒడపోసినది చెట్టుకాడ
గంధము వాసనలు పంచె చెట్టేకాడ

ప్రకృతి వరమైనది చెట్లురన్నా
ప్రాణవాయువును పెంచునన్నా
కాలుష్యాన్ని తరిమేయ కదులురన్నా
సకల కోటి ప్రాణులు కాపాడుమన్నా

- కోడుపర్తి విజయకాంత్
గుడ్లనర్వ, 9948692805

email : merupumbn@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ఎస్.ఎస్.గుట్ట, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, మహబూబ్‌నగర్ - 509 001. merupumbn@andhrabhoomi.net

- సిద్దెంకి యాదగిరి 9441244773