దక్షిన తెలంగాణ

ఘరానా మోసం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి మండపమంతా కోలాహలంగా ఉంది. పెద్దవారితో తాకించి మంగళధారణ కార్యక్రమం పూర్తి చేయడంతో మగవాళ్లు, ఆడవాళ్లు అంతా వరుసగా వేదికపైకి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ వారి గుర్తుగా బహుమతులు ఇస్తున్నారు. వారి గుర్తుగా ఇస్తున్న జ్ఞాపికలను, డబ్బులు పెట్టి ఇస్తున్న కవర్లను పక్కనే కూర్చున్నా అమ్మమ్మ చేతికందిస్తుంది పెళ్లి కూతురు కళ్యాణి.
అంతా భోజనాలకు వెళ్లడంతో ముప్పావువరకు పెళ్లికి వచ్చిన వారు ఖాళీ అయి భోజనశాల నిండింది. పంతులుగారు వధూవరులనిద్దరినీ మండపం చుట్టూ తిప్పించి నక్షత్రాన్ని చూపించడానికి పక్కకు తీసుకెళ్లారు. అతనితో పాటే ఉన్న ఆ కాస్త దగ్గరి బంధుజనం, వీడియో వాళ్లు కదలివెళ్లారు.
అన్ని బహుమతులు ఒక పక్కగా పేర్చి, వొడి నిండా ఉన్న డబ్బుల కవర్లను ఒక ప్లాస్టిక్ సంచిలో వేస్తుంది జయమ్మ. ఇంతలో ‘ఎక్స్ క్యూజ్ మీ’ అన్న పిలుపు విని తల తిప్పి చూసింది. ఎవరో ఒకతను దాదాపు 40 వయస్సుంటుంది. తెల్లని డ్రెస్ టక్ చేసుకుని షూ వేసుకుని ఉన్నాడు. అమ్మాయి తరపువాళ్లయితే తన కందరూ తెలుసు. బహుషా అబ్బాయి తాలూకా వాళ్లేమో కొత్త చుట్టరికం కదా అందరూ తెలీదు. చిరునవ్వుతో చూసింది. ‘ఆ కవర్లలో మావి కొన్ని కలిశాయండి..చూపిస్తారా..ఇబ్బందిగా అడిగాడు. అడగలేక అడుగుతున్నట్లు.
తనకేమో చదువురాదు. ఏదో కూడబలుక్కుని తెలుగు చదవగలడు కానీ, ఇంగ్లీష్ రాదు. అన్నీ కవర్లపై ఎక్కువగా ఇంగ్లీష్‌నే ఉంది. అసలే అల్లుడు అబ్బాయి వాళ్లకి ఎక్కడ అమర్యాద జరక్కూడదు అన్నాడు అనుకుని ‘అయ్యో దానిదేముంది బాబూ..చూడండి..అంటూ కవర్లున్నా సంచిని ముందుకు తోసింది.
అందులో పేర్లు అటూ ఇటూ చూసి వొక పది వరకు ఉన్న కవర్లు చూపిస్తూ ‘ఇవి మావేనండి ఆఫీస్‌వాల్లవి’ అన్నాడు.
‘దానిదేముంది బాబూ..పెళ్లన్నప్పుడు ఇందులోవీ అందులో అందులోవీ ఇందులో కలవడం సహజం’. అంటూ అందించింది జయమ్మ.
‘్థంక్ యూ...’ అంటూ తీసుకువెళ్లి పోయాడతను.
పెళ్లి హడావుడంతా నాలుగు రోజుల్లో అయిపోయింది. అలా కాస్త స్థిమితపడ్డాక అందరూ తెచ్చిన బహుమతులను హాల్లో పెట్టుకుని కుటుంబ సభ్యులంతా కూర్చుని ఎవరెవరేమిచ్చారోనని ఆతృతగా కుతూహలంగా విప్పి చూస్తున్నారు. రకరకాల ప్రెజెంటేషన్స్ డబ్బులు కవర్లలో పెట్టి ఇచ్చిన వారి వివరాలను అన్నీ చూశారు. ‘మా ఆఫీస్ వాళ్లు ఇచ్చిన కవర్ కళ్యాణి చేతిలో పెట్టగా చూశాను. ఆ కవర్ లేదు మరో నాలుగైదు కూడా కనబడటం లేదు.’ అన్నాడు నారాయణ, జయమ్మ అల్లుడు. ఎలా మిస్ అయ్యాయోనని మళ్లీ కవర్లు పెట్టిన సంచిలను వెదికారు. బీరువాలో చూశారు. ఆ సంచి నుండి పడిపోయాయోమోనని..అక్కడే ఉన్న జయమ్మ వొకతను వచ్చి కొన్ని కవర్లు తమవేనని తీస్కెళ్లిన సంగతి చెప్పింది. పెళ్లి వీడియో క్యాసెట్ ఆన్ చేసి చూశారు. ఎక్కడా అతని జాడ లేదు. అతనెలా ఉన్నాడో చెప్పింది. పెళ్లి కొడుకు కూడా అక్కడే ఉండడంతో అతనూ అలాంటి వారెవరూ తమలో లేడన్నాడు. మొత్తం మీద వీడియో, కెమెరాలలో రాకుండా సమయం చూసుకుని మంచిగా టిప్ టాప్‌గా తయారయి తీరిగ్గా అందరి కళ్లముందు మహారాజులా దోచుకుపోయాడు దొంగ అని మాత్రం అర్థమయ్యిందందరికి! తరువాత నెలకు ఇలాగే దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగ గురించి ‘ఘరానా మోసం’ శీర్షికన వచ్చిన వార్తను చూసి ‘వీడే’ అని జయమ్మ అనడంతో, తామా రోజే ఈ విషయం పోలీసుల దృష్టికో పేపర్ దృష్టికో తీసుకొస్తే మిగతావారు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండేవారు కదా అనుకున్నారంతా.

- నామని సుజనాదేవి
వరంగల్, సెల్.నం.7799305575

తెలుగు జాతీయాలు

అతలాకుతలం
దీనికొక రూపాంతరం ఉన్నది. అతలాకుతలం. దీనికర్థం తలక్రిందులు, ఏదైనా విషయం సవ్యంగా లేకపోతే అది అతలాకుతలంగా ఉంది అంటారు. అతలాకుతలం కావటమంటే విసిగి వేసారటం, అలసట చెందటం అన్నమాట. తలక్రిందులు, లేదా అయోమయం, కుతలం అంటే భూమి అని అర్థం. భూమి క్రింద ఏడు లోకాలున్నాయని పురాణాలు వివరిస్తున్నాయి. అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనేవి. ఇదే విధంగా ఊర్థ్వలోకాలు ఉన్నాయి. అవి భూలోకం, భువర్లోకం, స్వర్లోకం, మహాలోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఏడేడు పధ్నాలుగు లోకాలున్నాయి. ఖగోళ శాస్త్రంలో ఏ లోకమెక్కడున్నదో కూడా తెలిసేటట్లు లేదు. ఇవి మన వేదాలలో చెప్పినవి. అతలాకుతలమంటే అయోమయం అని అర్థం కదా! ‘నా స్థితి అతలాకుతలమయ్యింది’ అంటే అయోమయస్థితి ఏర్పడిందని భావించాలి.

అడుగులకు మడుగు లొత్తుట
అడుగులు అంటే పాదాలు. మడుగులు అంటే బట్టలు. పూర్వము మహారాజులు, మహారాణులు బయలుదేరేటప్పుడు వాళ్ల కొంగులు, వెనుక వ్రేలాడే వస్త్రాలను ఎత్తటానికి సేవకులుండేవారు. కాళ్లకు అంటే పాదాలకు నేల తగిలి బాధపడకుండా ఉండే కొరకు రాజులు, రాణులు నడుస్తూ ఉంటే వాళ్ల ముందు తట్టులు మున్నగు మెత్తని తివాచీల లాంటివి పరిచేందుకు భటులు ఉండేవారు. అయితే వారు నడిచే కొద్దీ తివాచీని తీసి ముందు ముందు పరుస్తూ పోతుంటారు. దీనినే అడుగులకు మడుగులొత్తుట అంటారు.
అలాంటి సేవలు లేవు కానీ మంత్రులకు డబ్బు గలవారికి వంగి వంగి సలాములు చేయటం. వారికి అణిగిమణిగి ఉండటం అనేవి జరుగుతూ ఉంటుంది. అట్టి వారిని అడుగులకు మడుగులొత్తుతున్నారని అంటారు.
దేవస్థానాలల్లో ఈనాటి పూజార్లు రాజకీయ నాయకులు దైవదర్శనానికి వచ్చినపుడు అడుగులకు మడుగులొత్తుంటారు. వినయ విధేయతలు ప్రకటిస్తూ ఉంటారు.

- ఎం.వి.నర్సింహారెడ్డి, జగిత్యాల, సెల్.నం.9849110922

మనోగీతికలు

చెట్టు చింత
చేను నడిబొడ్డు మంచె దిగి
మక్క కర్రల ఊగులాటను పలుకరించాను
చేను చేవ నాలో ప్రవహించగానే
అలసట ఆవులించింది
నీడ జాడ వెతికి
మావిచెట్టు కొరిగాను
కాండము కన్న తల్లిలా వీపు నిమిరింది
కొమ్మలరెమ్మలు గాలితో ఊసులాడుకుంటున్నాయి
కమ్మని మగత కౌగలించుకుంది
చెట్టు చేవ నా మనసుతో మనసు కలిపింది
చెట్టంత మనిషీ! చెట్టు చింత
చెవికెక్కించుకో!
గ్యాసు పొయ్యి వంట మంటలకు
వంట చెరుకు చిత్తు
ప్లాస్టిక్ మోజు
కర్ర సామానులకు కటీఫ్ చెప్పింది గదూ!
ఎయిర్ కండిషన్ మురిపాలు పిండుతుంటే
పర్యావరణం ప్రాణహానిని ప్రోత్సహించింది
ఇంటి ముందు కాపలా చెట్టు
‘కందకు లేని దురద కత్తిపీటకెందు’కని
అదృశ్యమై పోయినై
అడవుల అంతు చూస్తుంటే
వానలు సమ్మె సవాళ్లు విసురుతున్నై!
కట్టెల్లో కాలాల్సిన తోటి కట్టె
కరంటు మిషన్లలో కరిగిపోతుంటే
వేదమంత్రాల అస్తికల అస్తిత్వ మెక్కడా?
చెట్టు మాటల మూటలు విచ్చుకుంటుంటే
కొమ్మ జారిన కొర్రు చీమ
చిటుక్కున కుట్టేసి..
లటుక్కున ఈ లోకానికి లాక్కొచ్చింది!

- ఐతా చంద్రయ్య
సిద్దిపేట, మెదక్ జిల్లా, సెల్.నం.9391205299

ఎవరికి ఎరుక?
ఎంత విచిత్రం?
ఏడుస్తూ పుట్టి
ఏడుస్తూ పోయే మనిషికి
కన్నీళ్లే..
కొండంత అండగా మారాయి!
బాధతో
గుండె బరువెక్కి నిండితే..
గండిపడి
పరవళ్లు తొక్కుతూ
ఏంచక్కా..
చెక్కిళ్లపై నృత్యం చేస్తూ
సాంత్వననిస్తాయి కన్నీళ్లు!
మనసున్న
ప్రతి ఒక్కరినీ
అక్కున చేర్చుకుంటాయి!
ఏదో ఒకప్పుడు
మదిలో దూరి..
హృదిలో ఓ మూల
సవ్వడి చేస్తాయి!
నమ్ముకున్న ఆసరా
నీడ నివ్వలేదన్న నిజం తెలిస్తే...
ఒక్క క్షణం కూడా
నిరీక్షించకుండా..
మనసు పొర ఆలంబనతో..
కంటి గడప దాటి
బయట పడతాయి!
అవి..
వేదనను ప్రతిబింబిస్తేనేం?
మనో భారాన్ని తగ్గిస్తాయి!
ఓ కన్నీటి చుక్క..
ఆవేదనకు ప్రతీక!
ఆనందానికీ..
ఓ మచ్చు తునక!
అది
ఎప్పుడు, ఎలా?
మనల్ని కవ్విస్తుందో..
ఎవరికి ఎరుక?

- డి. సవీణ
హైదరాబాద్
సెల్.నం.9440525544

స్వప్న జగత్తు
నడిసంద్రంలో తానమాడి
విశ్వమంతటి గుండెపై
నిదురపోతానంటే నీ జ్ఞాపకాల తీగలు కదిలి
నీ కన్నీటి రెప్పల మధ్యనుంచి
వచ్చే వెచ్చని జలతారు వేడి
నీ గుండె బరువును దించగలదు
కాని, గుండె గాయాల్ని మాన్చలేదు
నీ స్వప్న శకలాల్ని కదల్చనూ లేదు
నీ గతం మారదు, స్వగతాన్ని మార్చనూ లేదు
పున్నమి చంద్రుని నీడలో
నీ స్వప్న జగత్తును విడిచి
వాస్తవ ప్రపంచం వైపు కదులు
ముల్ల దారైన, గతుకుల దారైనా
గమ్యం వైపు సాగాలి
నీ కలలోని భువన భవనాలు కుప్పకూలినా
కలల సౌధాలు కరిగిపోయినా
గతం వల్లె వేసుకున్నా
యుగాలు క్షణాలుగా మారిపోతాయి
బతుకు భారంగా మారుతుంది
లే లేచి వాస్తవంలోకి రా!

- గంప ఉమాపతి
కరీంనగర్
సెల్.నం.9849467551

కళాకారుడు
అతడొక కళాకారుడు!
స్టేజీపై విభిన్న పాత్రలకు ప్రాణం పోసే భాష్యకారుడు!
కన్నీళ్లను జీవితపాత్రలో ఒడిసిపట్టి
నిత్యం రంగస్థలం బతుకు పోరాటంలో
ముసలి ముఖానికి
రంగులు పులుముకునే వృద్ధదధీచి అతడు!
అవమానాలు, అపనిందలను ముఖాన పూసిన
బెత్తెడు రంగుల మేటలలో అద్దుకుంటూ..
నలుపుతున్న గుండె గాయాలను..కాలం కమ్ముకొన్న
దిగులు పొరలలో జో కొడుతూ..స్టేజీ ఎక్కగానే
సర్వమూ మరిచి..తానొక హాస్యపు పంటై..
ప్రేక్షకుల అభినందనల కరతాళ ధ్వనులలో
కాసుల గలగలలను గుండెలయగా మల్చుకొని
నీరెండ మావులలో తడి తడిగా మారే జీవన దృశ్యాల్ని
నలుపు తెలుపుల రంగుల లోకంలో ఆవిష్కరిస్తూ..
తానెప్పటి ఈ దగాకోరు ప్రపంచానికి
నల్లని దిష్టిచుక్కేనని ఒప్పుకుంటూ..
తన అసలు ముఖాన్ని చిలక్కొయ్యకు
తగలించి, తనలో రగిలే అస్తిత్వ సంపుటిని
గాలికి రెపరెపలాడే కాస్ట్యూమ్‌లలో భద్రపరుస్తూ..
తన అంతులేని విషాద కథలో..
ఆద్యంతాలెరుగని ఒంటరి రాత్రుల నక్షత్రవేటలో
పరకాయ ప్రవేశపు బ్రతుకు ప్రతినిధిగా..
మరణంలోనూ అద్భుతంగా జీవిస్తూ..
మరణించీ జీవించేవాడు..
మరణాన్ని జయించినవాడు..
అతడొక కళాకారుడు..
విభిన్న జీవితాల భాష్యకారుడు!

- బి.కళాగోపాల్
నిజామాబాద్, సెల్.నం.9441631029

ఒకరికొకరం!
నీలి మబ్బుల్లో తేలిపోతూ
వెండి వెనె్నల్లో మెరుస్తూ..
జగమంతా మురిసేలా
గువ్వల్లా ఎగిరి పోదాం!
హహాలోకాల్లో విహరిద్దాం!
చిలకా గోరింకల్లా జతకూడి..
పాలు నీళ్లలా కలిసిపోదాం!
ప్రయాణ పుఝరిలో తడిసి పోతూ..
మూడు ముళ్లతో ఏకమై
పవిత్ర బంధానికి..
ప్రతీకలుగా నిలుద్దాం!
కష్ట సుఖాల్లో.. తోడుంటూ
సంసార బంధంతో పెనవేసుకుని
పిల్లా పాపలతో..
శత వసంతాలు కలిసి జీవిద్దాం!!

- సల్వాజి వాణి, కరీంనగర్
సెల్.నం.9000282372

ఆశావహ ప్రకృతి
శీతాకాలపు పచ్చగడ్డి మైదానాలు
మంచు ముసుగులను కప్పుకుని
అంతర్ముఖులైనాయి
సింగిడిల్లోని రంగులన్నీ
ప్రకృతి అలంకరించుకుందప్పుడే
కొత్త సూరీడుని లోకానికి పరిచయం చేస్తూ!
ఎప్పుడో విత్తిన అంకురం నేడు
చాలా నిశ్శబ్దంగా మొలకెత్తింది!
మైదానమంతా విస్తరించింది
శిఖరంలా ఎదిగింది
చూసేవాళ్ల కళ్లను మంత్రించి
కలల లోకంలోకి తీసుకెళ్లింది
పురాస్మృతుల అద్భుత ప్రపంచాన్ని
తన మంత్రదండంతో స్తబ్ధత నుండి
విముక్తి చేయాలనుకునే
బుద్ధి జీవుల భావోద్వేగ పదబంధాలని
మైదానమే దత్తత తీసుకుంది,
అంతటా పర్చుకున్న విచ్చు దుబ్బల
కాలుష్యాన్ని...
కాలమే కడిగేయాలనే
వక్ర పోకడలు తలెత్తుతున్న వేళ..
గడ్డి పరకలు మంచు బిందువులను
నెత్తిన మోస్తూ కనిపించాయి,
ప్రక్షాళనా కార్యక్రమాన్ని
విఘ్నం లేకుండా చెయ్యడానికి
ఎన్ని మంచు కడవలో వాటి తలల మీద!!
చెడు పోకడలు మనిషి మెదడుని
తుత్తినియలు చేస్తుంటే
గజం భూమికో ఆక్రమితుడు
విషపు ఎరలాగా విస్తరిస్తున్నాడు
బార్న్ లీడర్ లాగా బలహీనులను
బంజరు నుండి తరిమేస్తున్నాడు
ఇప్పుడు
ఒంటరి మైదానం పొగమంచులో
కులీన స్ర్తిలా కూలిపోయి వుంది.
యజ్ఞపు హవిస్సు అందుకునే పురుషునికై
ఎదురు చూసే
గంధర్వ పడుచులా నీలాకాశం అంచుల కేసి
ప్రకృతి ఎడతెగని విస్ఫోటనం చేయిస్తోంది
వర్షాగమనానికి అస్తస్రన్నద్ధున్ని చేస్తూ
రాలే చినుకుని బట్టి మైదానం బ్రతుకు,
మొలిచే గడ్డిని బట్టి జీవాల వెలుగు,
విస్తరించే కలలను బట్టి రంగుల ప్రపంచం,
ఆక్రమిత ముష్కరుల నించి
చెర విడిపించుకునే మైదానం
భళ్లున తెల్లవారే భవిష్యత్తుకు
మొక్కవోని కవచం!!

- తుమ్మెర రాధిక
తొర్రూరు, వరంగల్ జిల్లా
సెల్.నం.9440626702

పుస్తక సమీక్ష

సాదాసీదాగా విరబూసిన
కవితా కుసుమాలు!

పేజీలు: 60, వెల : 30/-
ప్రతులకు:
డి.పద్మావతి
ఫ్లాట్ నం.301, సప్తగిరి హైట్స్
శ్రీనగర్ కాలనీ, ఇసిఐఎల్ పోస్టు,
కుషాయిగూడ
రంగారెడ్డి జిల్లా - 500062

వృత్తిరీత్యా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తెలుగు పిజిటిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ దాసోజు పద్మావతి ‘కవితా కుసుమాలు’ పేరుతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. ఇటీవల అంతర్జాలంలో ఆరంభమైన ఆయుత కవితా యజ్ఞంలో తనవంతుగా ఉడతా భక్తిగా పద్మావతి సమర్పించిన కవితా కుసుమాలు ఇవి! వాట్సాప్ వేదికగా రూపుదిద్దుకున్న ఈ కవితలు సాదా సీదాగా కనిపించినప్పటికీ.. కవయిత్రి పద్మావతి ఉత్తమ వ్యక్తిత్వం ఆయా కవితల్లోని పంక్తుల్లో ప్రతిబింబిస్తోంది. ‘వాట్సాప్’లో పోటీపడి.. కవితల పరంగా రాశి పెంచుకోవాలన్న ఆరాటంతో రాసిన కవితలే ఇందులో ఎక్కువ ఉన్నప్పటికీ.. వాసిలో నాణ్యతపరంగా ఆమె మున్ముందు ప్రయత్నిస్తారన్న విశ్వాసం ఉంది. కవిత్వం రాయడానికి కావలసిన కనీస ప్రమాణాలు.. ఆ కవిత్వపు లక్షణాలను ఆమె ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఆమె సామాజిక చింతనను అభినందించకుండా ఉండలేము! వస్తు ఎంపిక.. అభివ్యక్తిలో ఇంకా ఆమె తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నప్పటికీ.. ఆమెకు కవిత్వం రాయడం పట్ల ఉన్న ఆసక్తిని, అభిరుచిని ఎవ్వరం తప్పుపట్టలేము! ఈ గ్రంథంలోని 24 కవితల్లో కవిత్వాంశ కొరవడినప్పటికీ.. సరైన మార్గదర్శనం ఆమెకు లభిస్తే తప్పక గొప్ప కవయిత్రి అయ్యే అవకాశముంది! పిట్టగూడు, చెట్టు, తంగేడుపూలు, కోయిలమ్మ, ఆరుద్రపురుగు, కవితల్లో మాత్రం కొన్ని కవిత్వ సంబంధ ప్రమాణాలున్నాయి. కానీ మిగతా కవితలు బలవంతంగా రూపుదిద్దబడటం వల్ల.. కవిత్వాంశ కొరవడింది. ఎక్కడా శిల్పం పట్ల శ్రద్ధ చూపిన దాఖలాలు లేకపోవడం వల్ల.. కంటెంట్ కంటెంట్‌గా మిగిలిపోవడాన్ని గమనిస్తాం.. కొన్ని కవితలు స్కూల్ మ్యాగజైన్లలో పిల్లలు రాసే కవితల్ని తలపిస్తాయి. చాలా కవితలు.. నినాదాలు, సామెతలు, సూక్తులుగా రూపుదిద్దుకున్నాయి. మరికొన్ని కవితలు నిర్వచనాలుగా పొందుపరచబడ్డాయి. విసుర్రాయి కవిత ఆసక్తికరంగా మలచబడింది. ‘హరితహారం’ కవితలో కవయిత్రి సామాజిక బాధ్యత కానవస్తుంది. ‘0’ (జీరో)పై రాసిన కవిత సృజనాత్మకంగా ఉంది. ‘సడక్ మల్లెలు’ కవితలో స్పష్టత కొరవడింది. ‘ఆదర్శం’ కవిత కవయిత్రి ఆశావహ దృక్పథానికి అద్దం పట్టేలా ఉంది. ‘ఆరోజు కోసం’ కవితలో కూడా కవయిత్రి ప్రకటించిన భావాలు ఆశావహ దృక్పథానే్న సూచించేలా ఉన్నాయి. ‘్భగ్యనగరం’ కవితలో కన్న తల్లిని, ఉన్న ఊరుని వదిలి పట్నం వచ్చే ప్రజల వ్యధలను ఆవిష్కరింప యత్నించారు. ‘కోయిలమ్మ’ కవితలో కవయిత్రి తమ బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ.. ఆ బాల్యం మళ్లీ వస్తే ఎంత బాగుండును అన్న పంక్తులతో ముగించడం బాగుంది. ‘స్వచ్ఛ్భారత్’ కవితలో ప్రతి పుట్టిన రోజు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని ఎంచక్కా ప్రారంభ పంక్తుల్ని పొందుపరిచినా.. కొనసాగింపు బలంగా లేదు.. ‘్భషణం-్భషణం’ కవితలో చివరి మూడు పంక్తులు బాగున్నాయి. కంటిలో కాటుకలా-్భషణం పదప్రయోగం వున్నప్పుడే మనకు శాంతి-సమాజానికి క్రాంతి అని చెప్పడం బాగుంది. సమయస్పూర్తితో మాట్లాడటం గురించి ఈ కవితలో కవయిత్రి కొన్ని విషయాలు చెప్పేందుకు యత్నించారు. ‘సీరియల్’ పేరుతో రాసిన కవితలో.. నేడు బుల్లి తెరపై వస్తున్న సీరియళ్లపై తమ కలాన్ని ఎక్కుపెట్టారు. ఈ సీరియళ్లు భవిష్యత్ తరాలకు ఆశనిపాతాలని తేల్చి చెప్పారు. ‘్ఫలించిన కల’ కవితలో.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం పట్ల కవయిత్రి తమ మనసులోని భావాలను మనతో పంచుకున్నారు. ‘చెట్టు కూలిన దృశ్యం’ కవిత ఆలోచనాత్మకంగా ఉంది. ‘సమానత్వం’ కవితకు చక్కని ముగింపునిచ్చారు. ‘మీకు తెలుసా?’ కవితలో ఒకనాటి ‘మొగరం’ గొప్పతనాన్ని చక్కగా అక్షరబద్ధం చేశారు. మహిళలు బహు పాత్రాభినయ జీవనాన్ని ‘స్ర్తిమూర్తి’ కవితలో చిత్రీకరించిన తీరు బాగుంది. ‘వెన్నుని లీలలు’ కవిత ద్వారా కృష్ణుని గూర్చి కవయిత్రి కొత్త అంశాన్ని ప్రస్తావించలేదు.
‘ఓర్పు’, ‘తథ్యం’, మహాగ్రంథం, కొమ్మ, అందమైన సందేశం, నిత్యసత్యాలు, పరమహంస, పుణ్యం-పాపం, ఆదిశక్తి, పచ్చతోరణం తదితర కవితల్లో నినాదాలు, సామెతలు, సూక్తులు, సందేశాలు కన్పిస్తాయేతప్ప.. కవిత్వాంశ మచ్చుకైనా లేదు! కానీ.. కవయిత్రి లోక పరిశీలనను అభినందించకుండా ఉండలేము! ‘జీవన నానీలు’ నానీల ప్రక్రియలో రాయబడలేదు. కాకతాళీయంగా ‘జీవన నానీలు’ అని నామకరణం చేసినట్లు తెలుస్తుంది. నానీల ప్రక్రియకు నాలుగు పాదాలు మాత్రమే ఉండాలి.. సంఖ్యాపరంగా ఇరవై అక్షరాలకు తక్కువైనా.. ఇరవై ఐదు అక్షరాలకు ఎక్కువైనా అది నానీ అనిపించుకోదు. జీవన నానీల్లోనూ నినాదాలకే పెద్దపీట వేశారు. కవిత్వాంశను ప్రక్కన పెట్టారు.
ఇలా పద్మావతి గారు ఈ గ్రంథంలో తమ భావచిత్రాలను ఆవిష్కరించారు. కవిత్వం రాయడంలో మెలకువలు తెలిస్తే.. మున్ముందు ఆమె ఓ మంచి కవయిత్రిగా స్థిరపడే అవకాశముంది. వస్తు ఎంపిక పట్ల శ్రద్ధ చూపాలి. అభివ్యక్తి విషయంలో జాగ్రత్తపడాలి. ప్రతీకలు.. వర్ణనలు.. ఉన్నప్పుడే కవితలు గాఢంగా రూపుదిద్దుకుంటాయి. కవితకు ‘శిల్పం’ కూడా ప్రధానమన్న విషయం గ్రహించాలి. కవిత ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అధ్యయనం పట్ల మక్కువ చూపినట్లయితే ఇవన్నీ ఇట్టే తెలుసుకోవచ్చు. కంటెంట్‌కు ఏ విధమైన ప్రతీకలు వర్ణనలు జోడిస్తున్నామనేది ముఖ్యం. కనుక పద్మావతి గారు ఆయుత కవితా యజ్ఞం కోసం రాసిన ఈ కవితలకు ఆహ్వానం పలుకుదాం.. తమ కలానికి పదును పెట్టుకుని తమ రచనా, వ్యాసంగాన్ని కొనసాగించాలని కోరుకుందాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544
email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- నామని సుజనాదేవి