దక్షిన తెలంగాణ

నాలుగు ప్రశ్నలు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదర్భ దేశమనే రాజ్యాన్ని శూరసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని కుమార్తె విజయసేన చిన్నప్పటినుండే మంచి తెలివిని కనపరుస్తూ, అన్నీ విద్యల్లోనూ ఆరితేరుతుంది. అలాంటి కుమార్తెకు యుక్తవయస్సు రావడంతో ఆ రాజు ఆ రాకుమారికి వివాహము చేయ నిశ్చయిస్తాడు. అయితే అన్ని విద్యలలోను ఆరితేరిన తన కుమార్తెను చేసుకోబేయే రాకుమారుడు కూడా మేటిగా ఉండాలని అనుకుంటాడు. అందుకు రాకుమారి అభిప్రాయం కూడా తెలుసుకొనేందుకు ఆమె వద్దకు విషయం చెప్పడానికి వెళ్లాడు.
‘తల్లీ.. విజయసేన.. నీకు యుక్తవయస్సు వచ్చినందున నీకు వివాహము చేయ నిశ్చయించాను. అందుకు కత్తిసాము, విలువిద్య, మల్లయుద్ధము మొదలైన అన్ని విద్యలలో పోటీలు నిర్వహించి, వాటిలో గెలిచిన వారికి నిన్నిచ్చి వివాహము చేయాలనుకుంటున్నాను. నీ కిష్టమేనా తల్లీ..’ అని అడుగుతాడు.
అందుకు అపర సరస్వతి అయిన ఆ రాకుమారి వినయంగా, ‘తండ్రీ, మీరు నా అభిప్రాయము కూడా అడుగుతున్నందుకు కృతజ్ఞురాలిని. అయితే నాదో చిన్న మనవి. శారీరకంగా బలాన్ని పరీక్షించే అన్ని విద్యలతో పాటు బుద్ధికుశలతను, జ్ఞానాన్ని పరీక్షించుటకు నేను నాలుగు ప్రశ్నలు అడుగుతాను తండ్రీ.. అందులో గెలుపొందిన వారిని మీ ఇష్టప్రకారమే వివాహము చేసుకుంటాను. నా వినతిని మన్నిస్తారని ఆశిస్తున్నాను’ అని బదులిస్తుంది.
అందుకు సంతోషించిన శూరసేన మహారాజు రాజ్యంలో అలాగే చాటింపు వేయిస్తాడు. విషయం తెలిసి అన్ని విద్యలలో ఆరితేరిన చాలామంది రాకుమారులు రాకుమారి అందానికి, ఆమె విద్యాసంపత్తికి దాసోహమని పోటీల్లో పాల్గొనడానికి ముందుకొచ్చారు. అయితే అన్ని విద్యలలో గెలిచినా రాకుమారి అడిగే ఆ నాలుగు ప్రశ్నలన్నింటికి సరైన సమాధానము చెప్పలేక ఓడిపోసాగారు. ఆ ప్రశ్నలేమిటంటే.. 1) వచ్చేవి, పోయేవి మూడు ఏమిటి? 2) వచ్చినా, వదిలిపోనివి మూడు ఏమిటి? 3) పోతే తిరిగిరానివి మూడు ఏమిటి? 4) వెంట వచ్చే మూడు ఏమిటి? ఈ నాలుగు ప్రశ్నలకు సరైన సమాధానము చెప్పలేక చాలామంది శూరులైన రాకుమారులు తిరిగిపోయారు. మహారాజుకు రాకుమారి వివాహము కాదేమోననే చింత పట్టుకుంది. రాకుమారి మాత్రము ‘అన్న మాట వెనక్కి తీసుకునేది తమ వంశంలోనే లేదని’ భీష్మించుకుని కూర్చుంది. రాకుమారి వివాహము కుదరడం కోసం మహారాజు రాజ్యంలోని దేవాలయాల్లో పూజలు చేయించాడు. చివరకు మహారాజు నిర్వహించిన పూజల ఫలితమో, ఆయన మొక్కిన మొక్కుల ఫలితమో గానీ, ఆదిత్య వంశంలోని దేవీ వరప్రసాదుడైన రాకుమారుడు జయసింహుడు అన్ని విద్యలలో గెలుపొందడమేకాక, రాకుమారి అడిగిన ఆ నాలుగు ప్రశ్నలకు కూడా సరియైన సమాధానాలిచ్చి ఆమె మనస్సు దోచుకుంటాడు. నిండు కొలువులో రాకుమారి జయసింహుడిని వరిస్తుంది.
ఇంతకూ ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానాలేమిటో మీకు తెలుసా..? అవి వచ్చేవి, పోయేవి మూడు అంటే డబ్బు, పేదరికం, జబ్బు. వచ్చినా వదిలిపోనివి మూడు అంటే కీర్తి, జ్ఞానము, విద్య. పోతే తిరిగిరానివి మూడు అంటే పరువు, కాలము, యవ్వనము. వెంట వచ్చేవి మూడు అంటే పాపం, పుణ్యం, నీడ.

- నామని సుజనాదేవి
వరంగల్, సెల్.నం.7799305575

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
మహిళలంతా కూడి ఉయ్యాలో
భక్తితో చేరిరి ఉయ్యాలో
యుక్తితో చేరిరి ఉయ్యాలో
పడతులంతా చేరి ఉయ్యాలో
చిన్న పెద్దాలంత ఉయ్యాలో
రంగురంగుల పూలు ఉయ్యాలో
వనె్నవనె్నల పూలు ఉయ్యాలో
బతుకమ్మ నాడిరి ఉయ్యాలో
అప్పుడు గౌరమ్మ ఉయ్యాలో
వరము కోరమని ఉయ్యాలో
సంతసమున వారు ఉయ్యాలో
మాకివ్వు తల్లి ఉయ్యాలో
నిలిచి ఉండుమమ్మ ఉయ్యాలో
ఆనందముండునని ఉయ్యాలో
ఆశాదీపాలని ఉయ్యాలో
ఆదరించమని ఉయ్యాలో
తుంచరాదని చెప్పి ఉయ్యాలో
జ్ఞాన ప్రసూనాంబ ఉయ్యాలో
ఆనందము ఒప్పు ఉయ్యాలో
పడతులందరికినీ ఉయ్యాలో
తులసి ఉన్నయట్లు ఉయ్యాలో
పాడి ఉన్నయట్లు ఉయ్యాలో
పంటలున్నయట్లు ఉయ్యాలో
పాపాయున్న ఇల్లు ఉయ్యాలో
గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాలో
బతుకమ్మ నాడంగ ఉయ్యాలో
భామలంతా కలిసి ఉయ్యాలో
యువతులంతా కూడి ఉయ్యాలో
సుదతులంతా కూడి ఉయ్యాలో
తీరొక్క పూలతో ఉయ్యాలో
రాశిగాను మార్చి ఉయ్యాలో
పొందికగా కూర్చి ఉయ్యాలో
భక్తితోడ చేరి ఉయ్యాలో
ఆనందమొంది ఉయ్యాలో
సుదతులకు తెలిపె ఉయ్యాలో
సకల సౌభాగ్యాలను ఉయ్యాలో
జనుల మదిలో నువ్వు ఉయ్యాలో
ఆడపిల్లల కంటె ఉయ్యాలో
ఆడపిల్లలె మరి ఉయ్యాలో
ఆప్యాయతల తోడ ఉయ్యాలో
మొగ్గలోనే వారి నుయ్యాలో
జ్ఞానమివ్వు తల్లి ఉయ్యాలో
అప్పుడు లోకంలో ఉయ్యాలో
గౌరి వరమిచ్చె ఉయ్యాలో
ప్రతీ ఇంటిలోన ఉయ్యాలో
పాపాయ ఉండాలి ఉయ్యాలో
పావనవౌనంటు ఉయ్యాలో
భాగ్యోదయమ్ముగ ఉయ్యాలో

- ల్యాదాల గాయత్రి,
కాగజ్‌నగర్, ఆదిలాబాద్

అంతరంగం

ఆధునిక కవిత్వంపై
మమకారం ఎక్కు
వ!

: కవి చిరునామా :
వి.పి. చందన్‌రావు
ఆదిత్య బుక్ సెంటర్, కావ్య మెస్ దగ్గర,
ఆర్.పి.రోడ్, నిజామాబాద్ - 503 001
సెల్.నం. 9440038565

- వి.పి. చందన్ రావు

మాటల్లో మాధుర్యం.. పలకరింపులో పరిమళం గుబాళించే కవి, వ్యాఖ్యాత వి.పి.చందన్ రావు తనకు ఆధునిక కవిత్వంపై అధికారం కంటే.. మమకారం ఎక్కువ అని సవినయంగా ప్రకటించుకున్నారు. 1971లో రేడియోలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి కవితా గానం విన్న రసానందంతో కవిత్వాన్ని అధ్యయనం చేస్తూ.. ఆస్వాదిస్తున్న కవి వి.పి.చందన్‌రావు నిజామాబాద్ వాసి. కవిగానే కాక.. మనసున్న వ్యక్తిగా.. మహావక్తగా, వ్యాఖ్యాతగా, సాహితీ విశే్లషకులుగా వేల సభల్లో అనర్గళంగా వక్తృత్వ ప్రతిభను ప్రదర్శించుకుంటూ.. 63 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహ స్వరం, గళం, సొంతం చేసుకున్న ఆయనతో మెరుపు ముచ్చటించి.. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ముఖాముఖి విశేషాలను ఆయన మాటల్లోనే ‘మెరుపు’ పాఠకులకు అందిస్తున్నాం!

ఆ సాహిత్య సృజన, వ్యాఖ్యానం రెండింటిలో ప్రతిభవున్న మీకు ఏదంటే ఇష్టం.
నాకు సాహిత్యం..వ్యాఖ్యానం రెండు కళ్లలాంటివి. రెండింటినీ ఇష్టపడతాను..

ఆమీ దృష్టిలో వ్యాఖ్యానమంటే ఏమిటి?
వ్యాఖ్యానం అంటే సన్నని తీగపై సైకిల్ తొక్కడం లాంటిది. జనం కొట్టే చప్పట్లే ఉత్సాహపరుస్తాయి. వ్యాఖ్యానం జనరంజకంగా ఉంటేనే ఆకర్షింపబడుతుంది.

ఆ కవిత్వమంటే ఏమిటి?
కవిత్వమంటే మన లోపలితనాన్ని గుర్తు చేసేది. తక్షణం స్పందింపజేసేది!

ఆ మీ రచనల గురించి చెబుతారా?
నా రచనలు ఆనాటి భారతి, కృష్ణా పత్రిక నుండి నేటి ‘నేటి నిజం’ వరకు కవిత్వం రూపంలో అచ్చయినాయి!

ఆ మీపై ప్రభావం చూపిన కవి
మరియు గ్రంథం?
ఇంకెవరు- మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి.. వారి ‘మధ్యతరగతి మందహాసం’.

ఆ మీ అభిమాన కవులు ఎవరు?
డాక్టర్ సినారె, దాశరథి, శేషేంద్ర, డాక్టర్ ఎన్.గోపి, సూర్య ప్రకాష్, కె.శివారెడ్డి, అజంతా, సిహెచ్.మధు, కేశనకుర్తి, వీరభద్రచారి, కందాళై రాఘవాచార్య మొదలగువారు.

ఆ కందాళై, మీరు జంట కవులని
అంటారు కదా!
ఔను కందాళై నిత్యచైతన్యశీలి.. నిరంతర సాహితీ కృషీవలుడు మేమిద్దరం కలిసి ఎన్నో కవితలు ఇప్పటికీ రాశాం.. రాస్తున్నాం!

ఆ మీరు అష్ఠావధానాల్లో పాల్గొన్నారు కదా! మీ అనుభూతులను తెలుపుతారా?
డాక్టర్ బెజుగం రామ్మూర్తి నా మొదటి అవధాని. వారి ఆశీస్సులతో నేను ఇప్పటికి 22 మంది అవధానులతో అప్రస్తుత ప్రసంగిగా పాల్గొన్నాను. దేశరాజధాని ఢిల్లీలో పది రోజులు మహాసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మగారితో పాల్గొనడం గొప్ప అనుభూతిగా భావిస్తున్నాను.

ఆ ఆధునిక కవులకు రచయితలకు
మీరిచ్చే సలహా ఏమిటి?
అధ్యయనంపై దృష్టి పెట్టాలి.. బాగా వినాలి.. తక్కువగా రాయాలి.. అధ్యయనంతోనే తమ కలాలకు పదును పెట్టుకోవాలి.

ఇంటర్వ్యూ : దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

తెలంగాణ వాస్తవాల వ్యాస సంకలనం!

పేజీలు: 66, వెల: 60/-
ప్రతులకు:
సబ్బని శారద
6-6-302, సాయినగర్
కరీంనగర్ - 505001
ఫోన్.నం.0878-2230339

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కల సాకారమైన వేళ.. కవి, రచయిత సబ్బని లక్ష్మీనారాయణ ‘తెలంగాణ కొన్ని వాస్తవాలు’ పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. గత పదిహేను సంవత్సరాలుగా సబ్బని వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను ఏర్చి కూర్చి ఈ గ్రంథాన్ని రూపుదిద్దారు. ఇందులోని పదహారు వ్యాసాలు తెలంగాణ చారిత్రక ఉద్యమాల్ని ప్రతిబింబింపజేస్తూ కొన్ని వాస్తవాలను తెలియజేసేలా ఉన్నాయి. ‘హైదరాబాద్ పట్టణాన్ని ఎవరు అభివృద్ధిపరిచారు?’ వ్యాసంలో 400 ఏళ్ల హైదరాబాద్ నగర నిర్మాణ చరిత్రను రేఖా మాత్రంగా సబ్బని వివరించ యత్నించారు. హైదరాబాద్ పట్టణంలోని వివిధ కట్టడాల పుట్టు పూర్వోత్తరాల చిట్టా విప్పి మన కళ్లకు కట్టేలా సమాచారాన్ని పొందుపరిచారు. తెలంగాణ ప్రజల రక్త మాంసాల, చెమట చుక్కలతో నిర్మించిన హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమైన ఈ తెలంగాణకే చెల్లుతుందని రెండో వ్యాసంలో తేల్చి చెప్పారు. మరో వ్యాసంలో రెండు తెలుగు రాష్ట్రాల ఆవశ్యకతను నొక్కి చెప్పడం జరిగింది. ఇంకా ఇందులోని మిగతా వ్యాసాలు పరిశీలిస్తే దాశరథి భావనల్లో తెలంగాణం.
తెలంగాణ భాషపై చిన్న చూపెందుకు? సమైక్యాంధ్ర వాదులు తెలంగాణ ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? శీర్షికలతో రాసిన వ్యాసాలు విజ్ఞానదాయకంగా వున్నాయి. ప్రత్యేక తెలంగాణ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని ఇంకో వ్యాసంలో పేర్కొంటూ..వాస్తవాలు గ్రహించి విడిపోయి అన్నదమ్ముల్లా రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మరో వ్యాసంలో..తెలంగాణ ధర్మ పోరాటాన్ని చక్కగా ఆవిష్కరించారు. ‘తెలంగాణ ఒక సత్యం’ ‘్భద్రాచలం ఎవరికి చెందుతుంది?’ వ్యాసాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. 1911-1948 కాలం చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌పై ఓ వ్యాసం ఈ గ్రంథంలో కానవస్తుంది. ఈ వ్యాసంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ జీవితంలోని ఎత్తు పల్లాలను చక్కగా చిత్రించారు. మరో వ్యాసంలో సైతం చివరి నిజాం ప్రభువు, ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనా కాలం నాటి హైదరాబాద్ నగర విశేష అభివృద్ధిని అక్షరబద్ధం చేశారు. ఇంకా ఈ గ్రంథంలోని ‘రాయల తెలంగాణ కాదు, ప్రత్యేక తెలంగాణ కావాలని సబ్బని రాసిన వ్యాసం అప్పటి తెలంగాణ ఉద్యమకారులకు కావలసినంత సమాచారం అందించింది. సమైక్యాంధ్ర నాయకులు ఆనాడు చెప్పిన ‘సమన్యాయం’ అంటే ఏమిటి? అంశాన్ని ఇందులోని ఒక వ్యాసంలో సబ్బని సాధికారికంగా విశే్లషించారు. ‘సమన్యాయం’ పదం మాటున గల దురుద్ధేశాలను ఏకరువు పెట్టారు. ఈ గ్రంథంలోని చివరి వ్యాసం ‘తెలంగాణ విజయోత్సవ వేళ’ పేరుతో రాశారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులేయాలని రచయిత కోరారు. తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర పరిరక్షణ పాటు పడాలని ఆకాంక్షించారు. తెలంగాణలో దళిత బహుజనుల సంక్షేమానికి కొత్త ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందనే ఆశాభావాన్ని సబ్బని వ్యక్తపరిచారు. రాష్ట్రం సాకారమైన వేళ..యావత్ తెలంగాణ ప్రజలు, సమాజం శ్రీమతి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సందర్భమని గుర్తు చేశారు. కెసిఆర్ లాంటి నాయకుని నాయకత్వాన్ని ప్రశంసించాలనీ, కాళోజీ, జయశంకర్ లాంటి పెద్దల కృషిని గుర్తు చేసుకుని కృతజ్ఞతాపూర్వక అంజలులు ఘటించాలని కోరారు. దశాబ్దాల కల నెరవేరడానికి యావత్ తెలంగాణ సమాజం ప్రధానంగా అమరుల త్యాగం, సబ్బండ వర్ణాల ఉద్యమస్పూర్తి, కవులు, కళాకారులు, ఉద్యోగ సంఘాల పాత్రను ఎప్పటికీ మరిచి పోలేదని వివరించారు.
ఇలా..ఈ గ్రంథంలోని వ్యాసాలు తెలంగాణ ఉద్యమ కాలంలో రాసి సబ్బని లక్ష్మీనారాయణ గారు ఆనాడే ఉద్యమానికి ఊపిరులు పోశారు. ఈ గ్రంథంలో తెలంగాణ సంబంధ వాస్తవాలను చారిత్రక ఆధారాలతో సాధికారికంగా చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ వైభవాన్ని గుర్తు చేశారు. అనేక చారిత్రక కట్టడాల నేపథ్యాన్ని చక్కగా విశే్లషించారు. ఈ గ్రంథంలోని వ్యాసాలు సబ్బని లక్ష్మీనారాయణకు తెలంగాణ పట్ల, సస్కృతి పట్ల, ఇక్కడి మట్టి పట్ల ఉన్న మక్కువను గౌరవాభిమానాలను తెలిపేలా ఉన్నాయి. అందరు చదువదగిన గ్రంథమిది! ప్రతి గ్రంథాలయంలో ఉండదగినది. అంతేగాక భావితరాలకు ఉపయుక్తమైన గ్రంథమిది! అయితే ఇందులోని పదహారు వ్యాసాలకు ఓ విషయ సూచిక లేక పాఠకులు ఒకింత తికమకపడినా.. సబ్బని కృషిని అభినందించకుండా ఉండలేరు!

- సాన్వి, కరీంనగర్,
సెల్.నం.9440525544

మనోగీతికలు

చెట్టమ్మ
ప్రతీ ఒక్కరికి అక్కడ
ప్రవేశము
తడిసేటి జల్లు కురిసినా
మండేటి ఎండకాసినా
ఏ జాతి అని అడగను
ఏ మతమని ప్రశ్నించను
ఏ కులమనీ అడగను
మనమేర్పరచుకున్న
దారులకు ప్రత్యేకతలున్నాయేమో
గాని తన దగ్గరికి చేరడానికి
ఏ అడ్డు ఏ పొడువు
ఏ జుట్టూ ఏ కట్టూ
అవసరం లేదంటుంది
మనలనే కాదు
మాటలు రాని నవ్వు ఎరుగని
కపట ప్రేమలు తెలియని
నడిచేటి పాకేటి ఎగిరేటి
ప్రాణులను కూడా
దరికి చేరనిస్తుంది
ధరణికి బరువుకానిది
తన బరువునుంచుకోనిది
రాళ్లతో గాయపరిచినా
కొడవలితో కోసినా
నోటికి తీపి పులుపులను
పులుముతుంది
మేఘాలను కరిగింపజేస్తుంది
చినుకులతో భూమిని
పులకరింపజేస్తుంది
చంపేసినా చలికాలం
చలిమంటవుతుంది
కూడవుతుంది
గూడవుతుంది
గుడ్డవుతుంది మనం
మరణిస్తే మండుతూ
తోడువస్తుంది

- నూజెట్టి రవీంద్రనాథ్
జగిత్యాల, కరీంనగర్ జిల్లా
సెల్.నం.9948748982

అతనెప్పుడూ అంతే..!

అవును.. అతనెప్పుడూ అంతే
దాహం వేస్తే
ఎండమావుల వెంట పరిగెడతాడు!
వెలిగించిన దివిటీని
నైరాశ్యపు గుహల్లోకి విసిరేసి
మిణుగురులకై వెతుకుతాడు!
ఆకులురాలే కాలంలో
సీతాకోకచిలుకల జాడకై ఆరాటపడతాడు!
అతడంతే..!
పండువెనె్నలను పక్కకుపెట్టి
మండుడెండలని వెంటబెట్టుకుని
ఎడారి మైదానాల్లో షికార్లు చేస్తాడు!
అవును.. అతడంటే
సంతోషాన్ని దూది పరుపులో కూరి
అంపశయ్యపై పగటి కలలు కంటాడు..!
ఆకలి చావులకు తోడుగా చూపును త్యాగం చేసి
కన్నీటి కడలిని గుండెలకదుముకుంటాడు..!
అతనెప్పుడూ అంతే
తనను తాను ఖైదు చేసుకుని
సుడిగుండాల వలయంలో
పిడుగువలె ప్రతిధ్వనిస్తాడు..!
జ్వలిస్తున్న తపనను సమాధి చేసి
భీకర ప్రళయమై ఎగిసిపడతాడు!
అంతనంటే.. అతనెప్పుడూ అంతే..!
విధ్వంసం చేయబడిన ఉద్యానవనంలా
ఉండే హృదికి వసంతం రాకుండా
శాశ్వతంగా తలుపులు బిగిస్తాడు!
స్వప్న సౌధపు శిథిలాలు ఆలపిస్తున్న
విషాదగీతికలను అపురూపంగా నెమరువేసుకుంటాడు!
అతనంతే
అతనితో చేయి కలపడానికి జంకేకాలం
సాకుల జాబితాను సిద్ధం చేసుకుంది
అవును మరి!
గరిక పోచతో పర్వతాన్ని సైతం
అదిలించగల నేర్పరి కదా అతను!
శూన్యంలో దేనికోసమో వెతుకుతాడు!
దేన్ని సొంతం చేసుకుంటాడో చెప్పడు కానీ
విశ్వవిజేతలా చిరునవ్వు చిందిస్తాడు!
అవును..అతనెప్పుడూ అంతే..!
మార్పుకోసం తపనపడుతూ
తనను తాను సమర్పించుకుంటూ
అగ్నికీలలా విస్తరిస్తూ
అడవి మల్లెలా రాలిపోతూ..
అతనెప్పుడూ అంతే..!

- పొద్దుటూరి మాధవీలత, ఎడవల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా, సెల్.నం.7386483664

చిత్రం
గుమ్మంలో అడుగు పెట్టిన నన్ను
ఆమె నవ్వు కట్టిపడేసింది!
నా కళ్లనిండా ఆమే కొలువయ్యింది
నే వచ్చిన కార్యం కనుమరుగయ్యింది
ఆమె నారాధిస్తున్న నాలో చలనం లేదు!
ఆమె నవ్వులోనూ మార్పులేదు
కానీ ఓర్వలేని గోడ గడియారం!
నా గుండె సవ్వడిని వినిపిస్తూ
కరిగిపోతున్న కాలాన్ని కసిగా గుర్తుచేస్తుంది
పరిస్థితులు చేజారిపోతున్నాయి
నా చూపుల్లోని ఆరాధన ఆకలిగా మారుతోంది
నా చేతులు ఆమె ముంగురులను సవరిస్తూ
ఆధరాలను సృశిస్తున్నా
ఆమెలో అదే చెరగనినవ్వు!
పరిస్థితి దిగజారిపోతున్నా
నా మనసు చేజారిపోతున్నా
ఇంకా నా చేతిలోనే ఉన్న
నా ప్రవర్తనకు కళ్లెం వేసా!
భారంగా కళ్లుమూసా!
ఎందుకంటే నే మనిషిని కనుక...
కలవరం నాలోనే కానీ అలజడి ఆమెలో లేదు!
ఎందుకంటే అది మనసు లేని
నా చెలి చిత్రం కనుక.

- బి.హరిప్రియా గిరిధర్ రావు
కరీంనగర్, సెల్.నం.9133293384

ఏకాకి
కుటుంబం నడపటానికి
పనిమనిషినయ్యాను
అందరికీ అన్ని అందించడానికి
అలుపెరుగని పోరాటం చేశాను
రాత్రి, పగలు తేడా లేక
శ్రమనంతా ధారపోశాను
అందరిని కాపాడుతూ
విశ్వాసంతో జీవించాను
మెతుకు విలువ తెలిసినవాన్ని కాబట్టి
ప్రతి ఉదయం చలి కూడా తిన్నాను
కడుపునిండ తిండిలేక
ఎనే్నండ్లయిందో మార్చాను
దగ్గు పడిశం వచ్చినా
ఏన్ను పోటు వెన్నుపోటు
తన్నూతూ ఉన్నా
బాధంతా దిగమింగాను
పొద్దంతా ఎద్దులా పనిచేశాను!
అలసట వచ్చి నీరసం పట్టి
కన్నులు బైర్లు కమ్మిన
ఆదుకునేవారు లేక మోడువారిపోయాను!
అయినా ఇంకా..
నేను బ్రతికే ఉన్నాను!
ఎందుకంటారా?
ఆత్మాభిమానం కలవాన్ని
ఇంటి పరువు గడపదాటనివ్వనివాన్ని!
పరువు కోసం పాకులాడేవాన్ని
పదిమందిలో నేనింకా పెద్దవాన్ని
మోసే ఎద్దుకే తెలుస్తుంది
కాడి బరువెంతో?
కుటుంబ భారమెంతో!
అందరికోసం ఎంత ఆరాటపడితే
ఏం లాభం?
తుదకు ఎవ్వరికీ పట్టని
ఏకాకిని నేను!

- జాధవ్ పుండలీక్ రావు పాటిల్, భైంసా, ఆదిలాబాద్ జిల్లా, సెల్.నం.9441333315

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

email : merupuknr@andhrabhoomi.net

- నామని సుజనాదేవి