ధనం మూలం

జ్ఞానోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు. డబ్బుకు సంబంధించి ప్రతి వారికి జీవితంలో చాలా సార్లు జ్ఞానోదయం కలుగుతుంది. చిన్న వయసులోనే ఈ జ్ఞానోదయం కలిగితే జీవితానికి ఎంతో ఉపయోగం. కానీ కొందరికి జీవిత చరమాంకంలో జ్ఞానోదయం కలుగుతుంది. అప్పటికీ చాలా మంది ఇక చేయగలిగింది ఏమీ లేదనే నిరాశలో ఉంటారు.
అత్యవసరంగా డబ్బులు అవసరం అయినప్పుడు, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే బిల్లు కట్టడానికి సైతం కటకటలాడినప్పుడు. ఉద్యోగం పోవడం, ఖర్చులు పెరగడం, వ్యాపారంలో నష్టం. నమ్మి మోసపోవడం వంటి పలు సందర్భాల్లో డబ్బు విలువ ఏమిటో తెలుస్తుంది.
40 ఏళ్ళ వయసులో డబ్బుకు సంబంధించి మన ఆలోచనలు ఎలా ఉంటాయో 40 అంశాలతో ఇటీవల ఒక జాబితా రూపొందించారు. దేశాలు ఏవైనా కావచ్చు. డబ్బు అవసరం అందరికీ ఉంటుంది. చేతిలో డబ్బు ఉన్నప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదు. సంపాదన మొదలు పెట్టినప్పుడే డబ్బుపై శ్రద్ధ వహించాల్సింది అని వయసు మీరిన తరువాత అందరిలోనూ కలిగే భావనలు ఒకేలా ఉంటాయి.
40 ఏళ్ల వయసులో కలిగే ఇలాంటి ఆలోచనల జాబితా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఉంది.
40 ఏళ్ల లోపు వయసు కావచ్చు, 40 దాటి ఉండొచ్చు. డబ్బుకు సంబంధించి అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండేందుకు ఆ జాబితా ఉపయోగపడుంది.
* డబ్బు ముఖ్యమే: డబ్బు ముఖ్యం కాదు అనే భావన ప్రారంభంలో ఉంటుంది. కుటుంబం, ఆరోగ్యం, మానవ సంబంధాలు ముఖ్యమే అదే సమయంలో వీటన్నిటినీ కాపాడుకునేందుకు డబ్బు కూడా ముఖ్యమే అనేది మనం ఎంత చిన్న వయసులో గుర్తిస్తే అంత మంచిది. సంపాదన మొదలు పెట్టిన ప్రారంభంలో డబ్బు అంత ముఖ్యం కాదు అన్నట్టుగా ఖర్చు చేస్తారు. ఆదాయం ఎంత వస్తే ఖర్చు అంతకు మించి ఉంటుంది. డబ్బు ముఖ్యమే అనేది ఎంత చిన్న వయసులో గుర్తిస్తే భవిష్యత్తు జీవితానికి అంత మంచిది.
* పొదుపునకు శ్రీకారం: మీరు ఏ వయసులో పొదుపు ప్రారంభించారు అన్నదాన్ని బట్టి మీ భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. సాధ్యమైనంత తక్కువ వయసులోనే రేపటి గురించి ఆలోనతో పొదుపు ప్రారంభించాలి. చక్రవడ్డి ప్రాధాన్యత అనేది చిన్న వయసులో గుర్తిస్తే మంచిది. యుక్త వయసులోనే పొదుపు ప్రారంభిస్తే కంపౌండ్ ఇంట్రస్ట్ ప్రయోజనం మీ భవిష్యత్తు జీవితంలో చూస్తారు. యుక్త వయసులో మరింత పొదుపు చేసి ఉంటే బాగుండేది ఇప్పటి నా జీవితం కచ్చితంగా ఇంత కన్నా మెరుగ్గా ఉండేది అని 40 ఏళ్ల వయసులో దాదాపు అందరూ అనుకుంటారట!
* మంచి అలవాటు: అలవాటు అనేది మంచిది కావచ్చు, నష్టం కలిగించేది కావచ్చు. జీవితంపై అవి చాలా ప్రభావం చూపిస్తాయి. సిగరేట్లు తాగడం, మద్యం వంటి అలవాట్లు చిన్న వయసులోనే చేసుకుంటే వాటి కంపౌండింగ్ ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అదే విధంగా పొదుపు ఇనె్వస్ట్‌మెంట్ అనే హాబీని చిన్న వయసులోనే అలవర్చుకుంటే కంపౌండింగ్ ఇంట్రస్ట్ ప్రభావం అదే విధంగా సానుకూలంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించి చెడు అలవాట్లును మానుకుని పాజిటివ్ అలవాట్లు అలవర్చుకుంటే మేలు. అంతిమ దశలో ఆస్పత్రిలో చేరినప్పుడు దురలవాట్లు చేసుకోకుండా ఉండాల్సింది అని అనుకునే బదులు, ఆర్థికంగానూ, ఆరోగ్య పరంగానే దెబ్బతీసే అలవాట్ల స్థానంలో జీవితానికి ఉపయోగపడే అలవాట్లు అలవర్చుకోవాలి.
* డబ్బుకు సంబంధించి ఇతరులను గుడ్డిగా అనుసరించవద్దు. చేతులు కాలిన తరువాత అలా చేయాల్సింది కాదు అనుకునే బదులు ముందుగానే మేల్కొనాలి. వారెవరో ఇనె్వస్ట్ చేశారని, వ్యాపారం చేశారని గుడ్డిగా అనుసరించే బదులు మీకు ఆసక్తి, అవగాహన ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలి. చేతిలో ఉన్నదంతా పోయిన తరువాత జ్ఞానోదయం వల్ల ప్రయోజనం ఉండదు. ఇతరులు దెబ్బతిన్నప్పుడు దాని నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు.
* ఎంబిఎ చేసిన వారికి ఆర్థిక వ్యవహారాల్లో బోలెడు జ్ఞానం ఉంటుందని అనుకుంటాం. విషయ పరిజ్ఞానం వేరు, ప్రాక్టికల్‌గా దానిని అమలు చేయడం వేరు. ఎంబిఏ చేసిన ఎంతో మంది సాధారణ చదువుతో వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించిన వారి వద్ద ఉద్యోగాలు చేస్తారు. డిగ్రీలను చూసి వారికి ఆర్థిక రంగంలో బోలెడు పరిజ్ఞానం ఉందనుకుని గుడ్డిగా అనుసరించవద్దు. టెక్ట్స్ బుక్‌లో జ్ఞానం వేరు. అనుభవ సారం వేరు.
* నా వద్ద ఇంకొంత డబ్బుంటే ఆర్థిక సమస్యలు తీరిపోయేవి, ఇంకొంత జీతం ఎక్కువ అయితే ఈ సమస్యలే ఉండేవి కావు అని మనలో చాలా మందికి అనిపిస్తుంది. కానీ ఇది నిజం కాదు. జీతం ఎంతయినప్పటికీ డబ్బును ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది ముఖ్యం. ఒకే జీతం వచ్చే వారి జీవితం ఒకేలా ఉంటుందని లేదు. ఆ డబ్బును వారు ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిపైనే వారి భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. మనీ మేనేజ్‌మెంట్‌పై ఎంత చిన్న వయసులో దృష్టిసారిస్తే మీకంత మేలు.
* మీ డబ్బు ఎలా ఖర్చు అవుతుంది అనే నిఘా మీకు ఎంత త్వరగా అలవాటు అయితే అంత మంచిది. డబ్బు ఎలా వస్తుంది అనేదే కాదు. ఎలా ఖర్చు అవుతోంది అనేది కూడా ముఖ్యం. డబ్బు ఎలా ఖర్చు అవుతుంది అనే దానిపై దృష్టిసారించినప్పుడు వృధా ఖర్చు ఎక్కడ అవుతుందో తెలుస్తుంది. డబ్బు ఖర్చుపై దృష్టిసారించక పోతే మహా మహా సంస్థలే కుప్ప కూలిపోతాయి. అలాంటిది ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి తలక్రిందులు కావడం పెద్ద కష్టమేమీ కాదు.
* డబ్బు పొదుపు చేయాలి అనే ఆలోచన మీకు ఉంటే మీ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు దేనికి ఉంటాయో చూడాలి. చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకున్నా మిగిలేది కొద్దిగానే. అదే భారీ ఖర్చులు దేనికి అవుతున్నాయో చూస్తే, వాటినిలో ఎంత శాతం వరకు తగ్గించుకునే అవకాశం ఉందో చూడాలి. అది భారీ మిగులు అవుతుంది. చిన్న చిన్న ఖర్చుల్లో భారీ పొదుపు చేయడం వల్ల మిగిలేది కొద్దిగానే కానీ భారీ ఖర్చులో కొద్దిగా మిగిల్చినా భారీ మిగులు ఉంటుంది.
* ఆదాయం పెంచుకోవాలి అంటే దానికి రెండు మార్గాలు. మీ జీతం పెరగాలి, మీ ఖర్చు తగ్గాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా మీ ఆదాయం పెరుగుతుంది. ఒకవైపు జీతం పెరిగి మరో వైపు ఖర్చు తగ్గించుకుంటే ఇంకా మంచిది మరింత వేగంగా మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు.
(మిగతా వచ్చే వారం)

-బి.మురళి