ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పాక్‌ను శిక్షించకుంటే పరువు దక్కదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామిక్ ఉగ్రవాదంతో భారత్‌లో అనునిత్యం మారణ హోమం సృష్టిస్తున్న పాకిస్తాన్‌ను శత్రుదేశంగా మన నేతలు ఎందుకు ప్రకటించరాదు? మన దేశాన్ని శత్రుదేశంగా భావిస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోంది. ఈ నేపథ్యంలో మనం కూడా పాకిస్తాన్‌ను శత్రుదేశంగా ప్రకటించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో దాదాపు నలభై మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను ఎగదోస్తున్న పాకిస్తాన్‌ను కఠినంగా శిక్షించకపోతే మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికి పరువు దక్కదు. ఉగ్రవాదులు తొలిసారిగా పుల్వామా వద్ద బాంబులు నింపిన వాహనంతో ఆత్మాహుతి దాడికి దిగారు. అన్నిరకాలుగా భద్రత ఉండే పుల్వామా లాంటి ప్రాంతంలో జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడడం సాధారణ విషయం కాదు. ఈ ఘాతుకానికి కారకులైన వారిని త్వరగా శిక్షించకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయి. పాకిస్తాన్ సహా ఆ దేశం పురికొల్పే ఉగ్రవాద సంస్థలు మరింత రెచ్చిపోతాయి.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జైషే మహమ్మద్ అధినేత అజర్ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినంత మాత్రాన భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ఆ సంస్థను నిషేధిస్తే దాని స్థానంలో మరో ఉగ్రవాద సంస్థ క్షణాల్లో పుట్టుకొస్తుంది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించగానే పాకిస్తాన్ అతణ్ణి జైల్లో పెట్టదు. మసూద్‌ను హతమార్చినా అతని స్థానంలో కరడుకట్టిన మరో ఉగ్రవాది తయారవుతాడు. జైషే మహమ్మద్, లష్కరే తయ్యబా తదితర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలను నిషేధించినా ప్రయోజనం ఉండదు. ఇస్లామిక్ ఉగ్రవాదానికి పుట్టినిల్లైన పాకిస్తాన్‌ను దారికి తెస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించదు. పాకిస్తాన్ పాలకులు, ఆ దేశ సైన్యం, గూఢచార సంస్థ ఐఎస్‌ఐల ఆలోచనా విధానం మారితే తప్ప ఉగ్రవాదం సమాప్తం కాదు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా మనపై ప్రయోగిస్తోంది. ఆ దేశ పాలకులు కోరుకున్నంత కాలం ఉగ్రవాదులు మన దేశంపై దాడులు చేస్తూనే ఉంటారు. అక్కడి పాలకులు, సైన్యానికి జానోదయం కలిగి తమను తాము మార్చుకుంటారనుకోవటం కలలోని మాట. వారిలో మార్పు కలిగేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత భారత్‌పై ఉంది.
భారత్ సహా ఇతర ప్రజాస్వామ్య దేశాలు పట్టుదల, చిత్తశుద్ధితో వత్తిడి తెస్తే తప్ప పాక్ తీరు మారదు. ఇతర దేశాలు మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా మన పాలకులు పాకిస్తాన్‌ను దారికి తెచ్చేందుకు దృఢ నిశ్చయంతో దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేయాలి. ఆ దేశం పట్ల అత్యంత కఠిన విధానాన్ని అమలు చేయాలి. ఇజ్రాయిల్ ఇతర ఇస్లామిక్ దేశాల విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని మనం అనుసరించాలి. పాలస్తీనా సహా ఇతర ఇస్లామిక్ దేశాల పట్ల ఇజ్రాయిల్ కచ్చితమైన దీర్ఘకాలిక వ్యూహాన్ని ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తోంది. గనుకనే ఉగ్రవాదాన్ని అణచివేయటంలో ఆ దేశం మంచి ఫలితాలను సాధిస్తోంది.
పాకిస్తాన్ సైన్యం ప్రతి రోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంటుంది. ప్రతి రోజూ కనీసం ఒక్క భారతీయ సైనికుడినైనా బలి తీసుకుంటుంది. ఉగ్రవాదుల ద్వారా అప్పుడప్పుడు ఊరీ, పఠాన్‌కోట్, పుల్వామా లాంటి దుర్ఘటనలకు పాల్పతడుతూనే ఉంటుంది. అయినా మన పాలకులు పాక్‌ను శత్రుదేశం ఎందుకు ప్రకటించదు? పుల్వామా దాడిలో మరణించిన సైనికులకు అంతిమ సంస్కారాలు ముగియక ముందే పాక్ సైన్యం మరో సైన్యాధికారిని పొట్టన పెట్టుకున్నది. పాకిస్తాన్ వైపు నుండి ఇన్ని దురాగతాలు జరుగుతున్నా దానికి ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదా కొనసాగించటం ఏమిటి? పుల్వామా దాడి జరిగాక ఆ హోదాను తొలగించటం చూస్తుంటే మన పాలకులు ఎంత గందరగోళ విధానాన్ని అనుసరిస్తున్నారో తెలుస్తుంది. ముందుగా పాక్‌తో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలి. ఎలాంటి వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు కొనసాగించకూడదు.
పాక్‌కు మద్దతు ఇస్తున్న చైనా,సౌదీ అరేబియా వంటి దేశాల విషయంలో మనం కచ్చితమైన వైఖరిని చూపాలి. పాకిస్తాన్‌ను దారికి తెచ్చేందుకు అమెరికాపై ఆధార పడటం మానివేయాలి. అఫ్ఘానిస్తాన్‌లో శాంతి కోసం తాలిబన్లతో చర్చలు ఫలించేలా పాక్ సహాయం తీసుకుంటున్న అమెరికా మనతోకలిసి వచ్చే అవకాశాలు లేవు. అమెరికా తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి పాకిస్తాన్ కట్టడి చేసే విషయంలో అగ్రరాజ్యంపై భారత్ ఆధారపడడం అవివేకమే. ఇదే విషయమై చైనా సహాయం చేస్తుందనుకోవడం సరైంది కాదు. చైనా పాలకులు పాక్‌ను తమ వాణిజ్య, సైనిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు చైనాకు అనుబంధ దేశంగా మారింది. మనతో నేరుగా గొడవ పడకుండా పాకిస్తాన్ ద్వారా చైనా గొడవ చేయిస్తోంది.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాకిస్తాన్‌ను ఎదుర్కొనే వ్యూహాన్ని కొనసాగించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట కాల పరిమితిలో నిర్ణీత లక్ష్యాలను సాధించేలా కార్యచరణ పథకాన్ని అమలు చేయాలి. బహుముఖ వ్యూహంలో భాగంగా సైనిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, దౌత్యపరంగా నిరంతర దాడి కొనసాగించాలి. పాకిస్తాన్ సైన్యానికి నడ్డి విరిగేలా దాడులు చేయాలి. మూతి పగలగొట్టే విధంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు చెప్పటంలో అర్థం లేదు. సరిహద్దుల్లో ఒక్క భారతీయ సైనికుడు మరణిస్తే దానికి ప్రతీకారంగా పదిమంది పాకిస్తాన్ సైనికులను వెంటనే హతమార్చేలా మన సైనిక చర్య ఉండాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు ఎప్పుడో విముక్తి కలిగించి ఉండాల్సినా, మన పాలకులు ఈ లక్ష్యాన్ని సా ధించలేకదోయారు. ఒకప్పుడు ప్రధాని పీవీ నరసింహారావు ఢిల్లీలోని ఎర్రకోటపై నుండి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను మనం తిరిగి తీసుకోవటం మిగిలిపోయిందని వాపోయారే తప్ప ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మోదీ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో పీవీ తరహాలో మాటలు చెబుతున్నా ఆచరణలో చూపించలేకపోయారు.
1971 యుద్ధంలో మన సైనికులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ పొలిమేరల్లోకి వెళ్లివచ్చారు తప్ప పాక్ అక్రమిత కాశ్మీర్‌కు విముక్తి కలిగించలేకపోయారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసేందుకు చూపించిన తెగువను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవటంలో చూపించలేదు. ఆనాడు ఆమె ఆ పని చేసి ఉంటే- ఇప్పుడు పాకిస్తాన్, చైనాల మధ్య ఇంత స్నేహం ఏర్పడేది కాదు. పాకిస్తాన్ గిల్గిట్ ప్రాంతంలో ఎంతో భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేయటం ద్వారా మన భద్రతకు ముప్పు తెచ్చి పెట్టింది. ఇప్పుడు మనం పాకిస్తాన్‌ను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యకు దిగినా చైనా జోక్యం చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్, చైనాల మధ్య భూమార్గం ఏర్పడటంతో చైనా సైన్యం గుట్టుచప్పుడు కాకుండా సైనిక సామాగ్రిని అందజేసేందుకు వీలు ఏర్పడింది. చైనా,సౌదీ అరేబియాల అండ చూసుకునే పాకిస్తాన్ పాలకులు మన దేశంపై ఉగ్రవాదులను ప్రయోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన పాలకులు ఒకటి, రెండు మెరుపు దాడులు చేసినంత మాత్రాన పాకిస్తాన్ దారికి రాదు. దాని పీచమణచి వేసేందుకు దీర్ఘకాలిక సైనిక, ఆర్థిక, మతపరమైన వ్యూహాన్ని అమలు చేయాలి. పాక్‌ను ఏకాకి చేసేందుకు ప్రయత్నిస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదం. *

-కె.కైలాష్ 98115 73262