ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

వోట్ల కాలం.. ‘ఉచితాల’తో గాలం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలు సమీపించినపుడు మాత్రమే రైతులకు రుణమాఫీ, పెన్షన్లు, ఇతర రాయితీ పథకాలను ప్రకటించటం, వాటిని ఆగమేఘాలపై అమలు చేయడం మన పాలకులకు పరిపాటిగా మారింది. బీదరికాన్ని తొలగిస్తాం, రైతులను ఆదుకొంటామని నేతలు ఇస్తున్న హామీలు కేవలం నినాదాలుగా మారుతున్నాయి. నిజంగా రైతులను ఆదుకోవాలని, బీదరికాన్ని తొలగించాలనే లక్ష్యం, చిత్తశుద్ధి, పట్టుదల, నిజాయితీ మన రాజకీయ నాయకుల్లో లేదు. ప్రతి రాజకీయ పార్టీ తాము అధికారంలోకి వస్తే బడుగుల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తామని, రైతులను తమ నెత్తిన పెట్టుకుంటామని ఎన్నికల సమయంలో ప్రకటించటం ఆనవాయితీగా మారింది. అధికారంలోకి వచ్చాక దాదాపు అన్ని పార్టీలూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం తప్ప నిజాయితీగా అమలు చేసిన దాఖలాలు లేవు.
కనీస ఆదాయ హామీ పథకం, ప్రధానమంత్రి కిసాన్ యోజన, రైతుబంధు వంటి పథకాలు ఎన్నికల్లో ప్రయోజనం పొందాలన్న లక్ష్యంతోనే వచ్చాయి. ప్రజల సొమ్మును వారికే ఇచ్చి ఓట్లు దండుకోవటం ద్వారా తమ అధికారాన్ని నిలబెట్టుకోవటం రాజకీయ నేతల అసలు లక్ష్యం. ఈ వాస్తవాన్ని ప్రజలు గ్రహించకపోవటం బాధాకరం. సరిగ్గా ఎన్నికలకు ముందు రైతులు, డ్వాక్రా మహిళలు, బలహీన వర్గాలకు నగదు బదిలీ పథకం ద్వారా కొంత విదిల్చి ఓట్లు రాల్చుకుంటున్నారు. ఓట్లను దండుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కనీస ఆదాయ హామీ పథకాన్ని ప్రకటించారు. దాదాపు ఐదు కోట్ల కుటుంబాలకు సాలీనా డెబ్బై రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానంటూ ఆయన భారీ ప్రకటన చేశారు. ఈ పథకం వల్ల దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఈ పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు, దేశం నుండి బీదరికాన్ని పారదోలేందుకు ఇది తుది అస్తమ్రంటూ మాటలు చెప్పారు. ఒక కుటుంబానికి ప్రతినెలా ఆరు వేల రూపాయల ఆదాయం ఉంటే ప్రభుత్వం తన తరపున మరో ఆరు వేల రూపాయలను జత చేసి మొత్తం పనె్నండు వేల రూపాయలు బీద కుటుంబానికి అందజేస్తామని ఆయన ఆవేశంతో ప్రకటించారు. తాను ప్రకటించిన కనీసం ఆదాయ హామీ పథకం పట్ల ఆయనకు ఎలాంటి అవగాహన లేదనేందుకు నగదు జత చేయడం (టాపప్) వివరణ ఒక ఉదాహరణ. ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారు? లబ్దిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది? టాపప్ ఎలా సాధిస్తారనే ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. పథకాన్ని దశల వారీగా అమలు చేస్తామని చెప్పిన రాహుల్ వెంటనే మాట మారుస్తూ మొదట పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన అనంతరం దశల వారీగా అమలు చేస్తామనే వివరణ ఇవ్వవలసి వచ్చింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా మరుసటి రోజు విలేకరులతో మాట్లాడుతూ, ది టాపప్ పథకం కాదు, ప్రతి కుటుంబానికి ప్రతి నెలా పనె్నండు వేల రూపాయల ఆదాయాన్ని అందజేస్తామని, సాలీనా ఇది డెబ్బై రెండు వేల రూపాయలు అవుతుందంటూ రాహుల్ చేసిన ప్రకటనలోని లోపాలను సరిదిద్దవలసి వచ్చింది. అధికారం కోసం వెనకాముందూ ఆలోచించకుండా పథకాలు ప్రకటించటం, ప్రకటనలు చేయటం రాజకీయ నాయకులకు ఉన్న అలవాటు. బీదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇవ్వడం కాంగ్రెస్‌కు కొత్త కాదు. గరీబీ హటావో అనే నినాదం ఈరోజు వచ్చింది కాదు. రాహుల్ గాంధీ నాయినమ్మ ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో ఉండగా- 1971లో గరీబీ హటావో నినాదంతోనే అధికారంలోకి వచ్చింది. ఆమె అధికారంలోకి వచ్చాక ఏ మేరకు బీదరికాన్ని నిర్మూలించగలిగారనేది ఎవరైనా ఊహించుకోవచ్చు. గరీబీ హటావో నినాదంతో ఇందిరమ్మ అధికారంలోకి వచ్చినట్లే ఆ తరువాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా అదే నినాదాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకున్నాడు. అందమైన నినాదాలతో అధికారంలోకి రావటమే తప్ప నిజంగా బీదరికాన్ని తొలగించేందుకు ఏ రోజు కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు రాహుల్ సైతం అధికారంలోకి వచ్చేందుకే కనీస ఆదాయ హామీ పథకాన్ని ప్రకటించారు.
ఇందిరా గాంధీ గరీబీ హటావో పేరిట- దేశ ఆర్థికాభివృద్దికి కేటాయించిన నిధుల నుండి కేవలం నాలుగు శాతం మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఈ నాలుగు శాతం నిధులు కూడా కోట్లాది మంది బీదలకు చేరలేదు. 1971లో గరీబీ హటావో నినాదం వచ్చినా- బీదరికం నిర్మూలన జరగలేదంటే పథకాలను ఎంత సమర్థంగా అమలు చేశారనేది ఊహించుకోవచ్చు. రాహుల్ ఇప్పుడు కనీస ఆదాయ హామీ పథకం అనేది బీదరికంపై ఆఖరి పోరాటమంటూ ప్రకటనలు చేస్తున్నారు. గత అనుభవాలను చూస్తే రాహుల్ మాటలు నీటి మూటలు కావా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతుబంధు పేరుతో ఆర్థిక సహాయం చేసే పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఇలాంటి పథకానే్న అమలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్’ పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాల కింద రైతులకు, బడుగువర్గాలకు కొంత ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి పనె్నండు వేల కోట్ల రూపాయలు కేటాయించింది. చిన్న,సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు కూడా ఆర్థిక సహాయం అందుతోంది. వాస్తవానికి ఈ పథకం వల్ల బడుగువర్గాల రైతులకంటే ఉన్నత వర్గాలకు చెందిన పెద్ద రైతులు, జమీందారులకే ఎక్కువ ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది. ఒకటి,రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్న రైతులే కష్టాలకు లోనవుతున్నారు. ఇలాంటి వారికి ఎక్కువ ఆర్థిక సహాయం అందేలా ఈ పథకం ఉంటే బాగుండేది. ఎకరం భూమి ఉన్న రైతుకు నాలుగు వేల రూపాయలు అందితే వంద ఎకరాలున్న రైతుకు లక్షలాది రూపాయలు అందుతున్నాయి.
ఒడిశా ప్రజలు తమ ఆరాధ్య దైవమైన జగన్నాథుడిని కాలియా అని పిలుచుకుంటారు. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేద రైతులకు ఆర్థిక సహాయం చేసేందుకు కాలియా పేరుతో ఒక పథకాన్ని గత ఏడాది ప్రారంభించారు. రుణమాఫీ వల్ల ఆశించిన ఫలితం రాదు కాబట్టే ఈ పథకాన్ని ప్రారంభించామని నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ పథకంతో బీదరికంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నానని పట్నాయక్ చెప్పుకున్నారు. 10,180 కోట్లతో ప్రారంభించిన ఈ పథకం 92 శాతం రైతులతోపాటు వ్యవసాయ కార్మికులు, కూలీలకు వర్తిస్తుంది. రైతులకు ఆర్థిక సహాయం, భూమిలేని నిరుపేదలకు జీవనోపాధి, జీవిత బీమా, వడ్డీలేని రుణాలు ‘కాలియా’ పథకంలో ప్రధానాంశాలు. ప్రతి రైతు కుటుంబానికి ఖరీఫ్‌లో ఐదు వేల రూపాయలు, రబీ కాలంలో మరో ఐదు వేల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఇక, ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రైతులకు మూడు కిస్తుల కింద ఆరు వేల రూపాయల నగదును అందిస్తారు. మన ప్రభుత్వాలు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినవే తప్ప రైతుల సర్వతోముఖాభివృద్ది కోసం నిర్దేశించినవి కావు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది పథకాలు సక్రమంగా అమలైతే దేశంలో ఇంతలా బీదరికం ఉండేది కాదు. పథకాలను సజావుగా అమలు చేయటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైనందున సమాజంలోని అన్ని వర్గాల వారు సమాన అభివృద్దిని సాధించలేకపోతున్నారు. ఈ సంగతి తెలిసి కూడా ఎన్నికల్లో వోట్లు పొందాలన్న తపనతో నగదు బదిలీ పథకాలను ప్రకటిస్తున్నారు.
*

-కె.కైలాష్ 98115 73262