ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మేనిఫెస్టోల మాయాజాలం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల సమయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ప్రజల ముందు పెట్టే మేనిఫెస్టోలు నానాటికీ ప్రహసనంలా మారుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలు ప్రజలను మభ్యపెట్టి, ఓట్లు దండుకునేందుకు చేసే మోసపూరిత ఎత్తుగడగా తయారయ్యాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ఇచ్చే హామీలు చాలావరకూ ఆచరణకు నోచుకోవటం లేదు. మేనిఫెస్టోల పేరిట ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ అధికారంలోకి వచ్చాక మన నేతలు హామీలను విస్మరిస్తున్నారు. గత 70 సంవత్సరాల నుండి ఎన్నికల ప్రణాళికలు వస్తూనే ఉన్నాయి, హామీల మీద హామీలు కురుస్తూనే ఉన్నాయి. కానీ, దేశంలో పేద-మధ్య తరగతి వర్గాల ప్రజలు మాత్రం అభివృద్ధి చెందటం లేదు. రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత మేనిఫెస్టోలను అమలు చేస్తున్నాయా? లేదా? అనే విషయాలను నిర్ధారించే యంత్రాంగమే లేదు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజకీయ పార్టీల మేనిఫెస్టోల అమలు గురించి పట్టించుకోవటం లేదు. దీంతో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నాయి తప్ప వాటిని ఎలా అమలు చేస్తామని కచ్చితంగా చెప్పటం లేదు.
లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే- దేశంలో ఇరవై శాతం బీద కుటుంబాలకు అంటే దాదాపు ఐదు కోట్ల కుటుంబాలకు ప్రతినెలా ఆరు వేల రూపాయలు, సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయల చొప్పున- ఐదు సంవత్సరాలకు మూడు లక్షల అరవై వేల రూపాయల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. బీదలకు న్యాయం చేసేందుకే తానీ కొత్త పథకాన్ని ప్రకటిస్తున్నానని ఆయన చెప్పారు. ఐదు కోట్ల కుటుంబాలకు ప్రతి నెలా ఆరు వేల రూపాయల చొప్పున చెల్లించాలంటే మూడు లక్షల కోట్లు అవసరముంటాయి. ప్రతి కుటుంబానికీ సాలీనా డెబ్బై రెండు వేల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలంటే ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇంత డబ్బును ఎలా సర్దుతారు? అనే ప్రశ్నకు కాంగ్రెస్ అధినాయకత్వం సమాధానం ఇవ్వటం లేదు. తాము ప్రకటించిన నగదు బదిలీ పథకం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, భాజపా నాయకులను ఆశ్చర్యరంలో పడవేసిందంటూ రాహుల్‌తోపాటు ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం చంకలు గుద్దుకుంటున్నారు.
భాజపాను గెలిపిస్తే విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయల చొప్పున జమ చేస్తానంటూ 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ హామీ ఇవ్వటం అందరికీ తెలిసిందే. విదేశీ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం ఏ మేరకు ఉన్నది? దానిని ఎలా తెస్తారు? ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయల చొప్పున ఎలా జమ చేస్తారనే ప్రశ్నలకు మోదీ, భాజపా నాయకులు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ఇన్నాళ్లూ తప్పించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత విదేశీ బ్యాంకుల్లో మూ లుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురావటంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారు. పదిహేను లక్షల రూపాయల కోసం దేశ ప్రజలు ఇప్పటికీ వేచిచూస్తునే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఏ రోజు కూడా పదిహేను లక్షల రూపాయల గురించి ప్రస్తావించలేదు. ఇప్పుడు రాహుల్ ఇచ్చిన ఐదు కోట్ల మందికి ప్రతినెలా ఆరు వేల రూపాయల నగదు పథకం కూడా మోదీ ఇచ్చిన హామీ లాంటిదే. ఇది ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే తప్ప చిత్తశుద్ధితో ఇచ్చిన హామీ కాదు.
జాతీయ పార్టీల స్థాయిలోనే ప్రాంతీయ పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రణాళికల్లో ప్రజలకు స్వర్గం చూపిస్తున్నాయి. అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో సైతం ఈ కోవకు చెందిందే తప్ప నిజంగా జనం అభ్యున్నతికి ఉద్దేశించిన ప్రణాళికలా లేదు. ఎస్‌పి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మహాపరివర్తన్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసి, ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించారు. ‘సామాజిక న్యాయంతో మహాపరివర్తన్ ఒక కొత్త దిశ, ఒక కొత్తఆశ’ అనే నినాదంతో విడుదలైన సమాజావాదీ పార్టీ మేనిఫెస్టోలో పరోక్షంగా కులతత్వానికి పెద్దపీట వేయటం గమనార్హం. అఖిలేశ్ యాదవ్ అధికారంలో ఉన్నపుడు యాదవులు, ముస్లింలకు తప్ప మరో వర్గం గురించి పట్టించుకోలేదనేది జగమెరిగిన సత్యం. ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల పంపిణీలో యాదవులకు ప్రాధాన్యత ఇచ్చిన ఆయన ఇపుడు మేనిఫెస్టోలో సామాజిక న్యాయం గురించి మాట్లాడటం సిగ్గు చేటు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 190 ఎస్.ఐ పోస్టులకు జరిగిన భర్తీలో దాదాపు నూట ఇరవై మంది యాదవులకు ఉద్యోగాలివ్వడం ఏ సామాజిక న్యాయానికి అద్దం పడుతుంది? ఆయన తన మేనిఫెస్టోలో అహిర్ (యాదవ్) రెజిమెంట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించటం కులతత్వాన్ని ప్రోత్సహించటం కాదా?
మోదీ, రాహుల్ మాదిరిగానే అఖిలేశ్ కూడా పేదలకు నెలనెలా మూడు వేల రూపాయల నగదు బదిలీ పథకాన్ని ప్రకటించారు. రైతు రుణాలను నూటికి నూరు శాతం మాఫీ చేయటంతోపాటు, మహిళలకు సమానావకాశాలు, ప్రతి పేద మహిళకూ ప్రతి నెలా మూడు వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని ఆయన ఘనంగా ప్రకటించారు. ప్రతి పార్టీ కూడా రైతులు, మహిళలు, యువకులకు నగదు బదిలీ ఆశలు చూపించి ఓట్లు అడుగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత సమస్యల పరిష్కారానికి తమ వద్ద ఉన్న మార్గాలేమిటి? విధానాలు ఏమిటి? వాటిని ఎలా అమలు చేస్తామనేది శాస్ర్తియంగా వివరించటం లేదు. రుణమాఫీ హా మీలు తప్ప, రైతులు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి గౌరవంగా జీవించే స్థాయికి ఎందుకు ఎదగలేకపోతున్నారు? రైతు ల ఎదుగుదలను అడ్డుకుంటున్న పరిస్థితులు ఏమిటి? వాటి పరిష్కారానికి తాము అనుసరించే విధానం ఏమిటనేది రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో వివరించటం లేదు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామంటారు తప్ప వారు స్వశక్తితో నాలుగు డబ్బులు సంపాదించుకునే పరిస్థితులను కల్పించటం లేదు. యువతకు ఉపాధి కల్పనలో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఘోరంగా విఫలమైంది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఓటర్లను నగదు బదిలీ పథకంతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించటం ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతికి అద్దం పడుతోంది.
నగదు బదిలీ అనే విష వలయం నుండి ప్రజాస్వామ్యాన్ని బైట పడవేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇకనైనా నడుం బిగించాలి. ఎన్నికల ప్రణాళికల్లో ఇచ్చే హామీలను అమలు చేయని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదా న్యాయ వ్యవస్థకు కల్పించే అంశాన్ని పరిశీలించటం మంచిది. గొప్పగా విడుదల చేసే మేనిఫెస్టోలు ఎన్నికలు ముగిశాక చెత్తబుట్టల్లోకి పోతున్నాయి. దీనికి కారణం ప్రజలు ఏ మాత్రం పట్టించుకోకపోవటమే. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయని పార్టీల నాయకులను ప్రజలు నిలదీయాలి. అలా నిలదీసినపుడే నాయకులు తమ ఎన్నికల హామీలను ఎంతోకొంత అమలు చేస్తారు. ప్రజలు పట్టించుకోనంత కాలం నాయకులు ఇలా ఆచరణ సాధ్యం హామీలతో తమ పబ్బం గడుపుకుంటారు. ప్రజలంటే భయం లేకపోవడంతో పాలకులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మేనిఫెస్టోల నాటకానికి తెర పడాలంటే ప్రజలు అప్రమత్తం కాక తప్పదు.
*

-కె.కైలాష్ 98115 73262