ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విపక్షం అనైక్యతే మోదీ బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత సార్వత్రిక సమరంలో విపక్షం వెనుకబడిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు గట్టి పోటీ ఇవ్వడంలో ప్రతిపక్షం విఫలమవుతున్న తీరు గోచరిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టేందుకు వీలులేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ప్రకటన ప్రతిపక్షంలో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తుండగా, రాహుల్ జాతీయ స్థాయి నేతగా ఎదగలేకపోతున్నారు. రాహుల్ అపరిపక్వ రాజీకీయం, కొన్ని విపక్ష పార్టీల ప్రాంతీయ దృక్కోణం వల్ల జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకుండాపోయింది. జాతీయ దృక్పథం లేని నేతలు ప్రధాని పదవిని ఎలా చేపడతారు? కొందరు ప్రాంతీయ పార్టీల నాయకులు తమ తమ రాష్ట్రాలకు పరిమితమైపోవటంతో మోదీకి ఎదురు లేకుండాపోతోంది. తెరాస అధ్యక్షుడు కేసీఆర్, తెదేపా అధినేత చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తదితర విపక్ష నాయకులు దేశమంతటా పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తే మోదీకి కొంత సవాల్‌గా మారేది. కానీ, ఇప్పుడు అందుకు విరుద్దంగా జరుగుతోంది.
చాలామంది ప్రతిపక్ష నేతలను వారి ప్రాంతాలకు పరిమితం చేయడంలో మోదీ విజయం సాధించారు. జాతీయస్థాయిలో భాజపాకు ప్రత్యామ్నాయం లేని పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమై పోయింది. ప్రాంతీయ పార్టీల సంగతి చెప్పనక్కర లేదు. దేశవ్యాప్తంగా ఇంతవరకూ నాలుగు దశల్లో 374 లోక్‌సభ సీట్లకు పోలింగ్ ముగిసింది. ఈ దశలో తాము తిరిగి అధికారంలోకి వస్తామనే విశ్వాసం భాజపాలో పెరిగింది. మోదీ ప్రభుత్వాన్ని ఓడిస్తామనే నమ్మకం ప్రతిపక్షాల్లో సన్నగిల్లుతోంది. వారణాసిలో నామినేషన్ వేసిన సందర్భంగా మోదీ కనబరచిన ఆత్మవిశ్వాసం చూస్తుంటే- ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం కలుగుతోంది. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదు. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి ప్రజల్లో ప్రభుత్వం పట్ల అనుకూలత ఏర్పడిందంటూ మోదీ చేసిన ప్రకటన సత్యదూరం కాకపోవచ్చునని అనిపిస్తుంది. వారణాసి ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టిన తీరు చూస్తుంటే- ఆయన 2014లో సాధించిన మూడున్నర లక్షల కం టే మరింత ఆధిక్యతతో గెలుస్తారన్న అంచనా లు పెరిగాయి. మో దీలో ఇంతటి ఆత్మవిశ్వాసం పెరగడానికి విపక్షాలే కారణం.
రాహుల్ గాంధీ అ మేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుండి పోటీ చేస్తుండడం చర్చనీయాంశమైంది. అమేథీలో ఓటమి భయంతోనే ఆ యన వాయనాడ్ నుంచి కూడా బరిలో నిలిచారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నా యి. ముస్లిం లు, క్రైస్తవులు అధికంగా ఉన్న వాయనాడ్‌ను ఎన్నుకోవడం ద్వారా రాహుల్ ప్రతిష్ట దెబ్బతిన్నది. మైనారిటీ ఓట్లతో గెలిచేందుకు ఆయన సిద్ధపడ్డారంటూ వచ్చిన విమర్శలు కాంగ్రెస్ ‘ఇమేజ్’ను దెబ్బతీసింది. వారణాసిలో మోదీపై కాంగ్రెస్ తరఫున ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగినా, చివరి నిముషంలో ఆమెను తప్పించడం రాహుల్ ప్రతిష్టను దిగజార్చింది. రాహుల్ వాయనాడ్ పారిపోతే, ప్రియాంక ఎన్నికల బరి నుంచి పలాయనం చిత్తగించారన్న భాజపా ప్రచారం కాంగ్రెస్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది. దక్షిణాది ప్రజల కోసమే వాయనాడ్ నుండి పోటీ చేస్తున్నానంటూ రాహుల్ ఇచ్చిన వివరణ, వారణాసి నుంచి ప్రియాంక తప్పుకోవడంపై కాంగ్రెస్ చెబుతున్న కారణాలు ఆ పార్టీ ప్రతిష్టను మసకబారేలా చేశాయి.
తెదేపా అధినేత చంద్రబాబు ప్రతిపాదించిన ‘మహాకూటమి’, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కోరుకుంటున్న ‘ఫెడరల్ ఫ్రంట్’ కొంత పురోగతి సాధించి ఉంటే లోక్‌సభ ఎన్నికల తీరు మరో విధంగా ఉండేది. ఎన్నికలకు ముందే మహాకూటమి, ఫెడరల్ ఫ్రంట్‌లు రూపుదాల్చి ఉంటే మో దీ దూకుడు కొంత తగ్గేది. ఎన్డీఏకు ప్రత్యామ్నా యం లేని పరిస్థితిలో విపక్షాల ప్రచారం అం తంత మాత్రంగానే ఉం ది. విపక్షాలు విడివిడిగా పోటీ చేయడంతో భాజపాను దెబ్బతీయ డం సాధ్యం కావడం లేదు. కొన్ని ప్రతిపక్షాలు ప్రాంతీయ ప్రయోజనాల కోసం జట్టు కట్టినా, జాతీయ దృష్టి కోణం లేకుండాపోయింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం, రాహుల్ గందరగోళం భాజపాకు బాగా కలిసొస్తున్నాయి. ఎనభై లోక్‌సభ సీట్లు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్షాల అనైకత్య భాజపా విజయానికి దోహదం చేసేలా ఉంది. యూపీలో అఖిలేశ్ యాదవ్, మాయావతి తమ రాజకీయ అవసరాల కోసం జత కట్టి, చివరికి రాహుల్‌ను దూరం పెట్టారు. కాంగ్రెస్‌తో పొత్తుకు ‘మహాకూటమి’ నిరాకరించటంతో యూపీలో త్రిముఖ పోటీ కొనసాగుతోంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ అనేదే లేకుండా పోయింది. మహారాష్టల్రో కాంగ్రెస్, ఎన్సీపీలు జత కట్టినా, శరద్ పవార్ ఒక్కరే భాజపాను ఎదుర్కొనవలసి వస్తోంది. బారామతిలో తన కుమార్తెను గెలిపించుకునేందుకు ఆయన ఎక్కువ శ్రమ పడుతున్నారు. మహారాష్టల్రో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాజపా పంచన చేరడంతో ప్రతిపక్షం పరిస్థితి అగమ్య గోచరమైంది.
కర్నాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు కలసి పోటీ చేస్తున్నా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. మాజీ ప్రధాని దేవెగౌడ పోటీ చేస్తున్న తుంకూరులో స్థానిక కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు ఫలితంగా ఆయన గెలుపు అనుమానంగా మారింది. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే అందుకు రాహుల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ‘ఆప్’ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రకటన ప్రతిపక్షంలో నెలకొన్న అనైక్యతకు, అస్పష్టతకు తార్కాణం. ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్, ‘ఆప్’ నేతలు దాదాపు నెల రోజుల పాటు చర్చలు జరిపినా పొత్తు కుదరలేదు. ఢిల్లీ సహా హర్యానా, పంజాబ్‌లో కూడా సీట్ల సర్దుబాటు జరగాలని కేజ్రీవాల్ పట్టుబట్టగా కాంగ్రెస్ మాత్రం ఢిల్లీ వరకే సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపాలని తేల్చేసింది. దీంతో హర్యానా, పంజాబ్‌లలో త్రిముఖ పోటీ అనివార్యమై, భాజపాకు పరిస్థితులు అనుకూలించేలా ఉన్నాయి.
‘దేశ పరిరక్షణ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్షాలు కట్టుబడి ఉన్నాయి, ఈ లక్ష్యసాధన కోసమే తాము కలిసి ముందుకు సాగుతున్నాం..’ అన్న పెద్ద పెద్ద మాటలతో ముందుకు వచ్చిన ప్రతిపక్షం చివరకు జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రాంతీయ కోణానికే పరిమితం కావడం చూస్తున్నాము. దీంతో భాజపా గెలుపు ‘నల్లేరుపై నడక’లా మారుతోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో కలసి పోటీ చేయలేక పోయినా, ఫలితాలు వచ్చాక ఐక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రకటనలను ప్రజలు పట్టించుకోవటం లేదు. అందుకే- ‘మరోసారి మోదీ సర్కారు’ అనే నినాదం నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. *