ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘కాషాయ దళం’ దూరాలోచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యసభలో ఆధిక్యత సంపాదించేందుకు, తా ము అధికారంలో లేని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు భాజపా తహతహలాడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులనే అప్రజాస్వామిక వ్యూహంతో భాజపా అగ్రనాయకత్వం చురుగ్గా పావులు కదుపుతోంది. ఈ దురాలోచన వెనక ‘దూరాలోచన’ ఉన్నట్లు కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించి బలాన్ని పెంచుకోవటం, ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే ఆలోచనతో భాజపా ఉంది. ఇందులో భాగంగానే విలువలకు తిలోదకాలిచ్చి, నలుగురు తెదేపా రాజ్యసభ సభ్యులను భాజపా అక్కున చేర్చుకున్నది.
ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో తమపై దుష్ప్రచారం చేసిన తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును రాజకీయంగా దెబ్బ తీసేందుకు మోదీ రాజ్యసభలో ఫిరాయింపులను ప్రోత్సహించారన్న విమర్శలు జోరందుకొన్నాయి. ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్నాక చంద్రబాబు ప్రధాని మోదీపై వ్యక్తిగత ఆరోపణలు సంధించిన సంగతి తెలిసిందే. ఒక దశలో జుగుప్సాకరమైన భాషలో ఆయన మోదీపై దుమ్మెత్తిపోశారు. ఏపీకి తగినంతగా ఆర్థిక సహాయం చేయనందుకు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వంపైన, మోదీపైన చంద్రబాబు ఎన్నికల సమయంలో విరుచుకుపడ్డారు. భాజపాను ఓడించి మోదీకి గుణపాఠం నేర్పిస్తానంటూ శపథాలు చేశారు. ఢిల్లీ, కోల్‌కత, లక్నో, చెన్నై, ముంబయి తదితర నగరాలకు వెళ్లి విపక్ష నేతలతో సమాలోచనలు జరిపి ఎన్డీఏకు దీటుగా కూటమిని ఏర్పాటు చేసేందుకు బాబు యత్నించారు. ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ఆయన ఢిల్లీలో మకాం వేసి, ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చి కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆశించిన దానికి భిన్నంగా మోదీ భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చారు. తనను వ్యక్తిగత విమర్శలతో దూషించిన చంద్రబాబుకు గుణపాఠం నేరేందుకు మోదీ ఇపుడు శ్రీకారం చుట్టారు.
నలుగురు తెదేపా రాజ్యసభ సభ్యులను భాజపాలో చేర్చుకోవటం ద్వారా మోదీ తన పగసాధింపును ప్రారంభించారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి గురైన చంద్రబాబు ఇపుడు భాజపా చేస్తున్న దాడిని ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాల్సిందే. ఎన్నికల అనంతరం విపక్షాలన్నీ చెల్లాచెదురయ్యాయి. రాహుల్ గాంధీ వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రమాదంలో పడింది. చంద్రబాబును ఆదుకునేందుకు విపక్ష పార్టీలేవీ ముందుకు రావన్నది పచ్చి నిజం. తాను అధికారంలో ఉండగా వైకాపాకు చెందిన 23 మంది శాసనసభ్యులను చంద్రబా బు తెదేపాలో చేర్చుకోవడం తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసే ప్రక్రియకు భాజపా శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు దారిలోనే భాజపా ఇపుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో కొంతమందిని తన శిబిరంలో చేర్చుకునేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర స్థాయి , జిల్లా స్థాయి తెదేపా నాయకులను కూడా భాజపాలోకి ఆహ్వానిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో వైకాపాకు తాము ప్రత్యామ్నాయం కావాలని భాజపా అధినాయకత్వం భావిస్తోంది.
రాజకీయంగా ఎదగాలని భాజపా ఆశించడంలో తప్పులేదు కానీ ఈలక్ష్యాన్ని సాధించేందుకు అనుసరిస్తున్న విధానం సక్రమంగా లేదు. చంద్రబాబుపై కక్ష తీర్చుకొనేందుకు, రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకునేందుకు భాజపా అడ్డదారులు తొక్కుతోంది. భాజపాలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు పెద్ద వాణిజ్యవేత్తలున్నారు. వీరిలో ఒకరి ఆస్తిపాస్తులపై ఇటీవలే సీబీఐ రోజుల తరబడి దాడులు జరిపింది. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను ఎగ్గొట్టారనీ, మోసం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో వీరిని భాజపాలో చేర్చుకోవటం ఎంత వరకు సమర్థనీయం? రాజ్యసభలో తెదేపా వర్గం భాజపాలో విలీనమైందనటం అపహాస్యం కాదా? రాజ్యసభలో తెదేపా పక్షం నాయకుడు ఇచ్చిన విలీనం లేఖను వెంటనే ఆమోదించటం, ఈ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రకటించటం మోసపూరిత రాజకీయాలకు అద్దం పట్టటం లేదా? చంద్రబాబుపై పగ సాధించేందుకు విలువలను పాతర వేయడం మోదీకి ఎంత మాత్రం మంచిది కాదు. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని చేర్చుకోవటం వలన భాజపాతో పాటు మోదీ పరువుదెబ్బతిన్నదని కచ్చితంగా చెప్పవచ్చు. నలుగురు ఎంపీలను చేర్చుకున్నంత మాత్రాన రాజ్యసభలో భాజపాకు మెజారిటీ రావటం లేదు.
లోక్‌సభ ఆమోదించే ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందాలంటే 2020 వరకు వేచి ఉండక తప్పదు. వచ్చే సంవత్సరం పలువురు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు చెందిన రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో భాజపా అభ్యర్థులు ఎన్నిక కావటం ద్వారా రాజ్యసభలో ఆ పార్టీకి మెజారిటీ వస్తుంది. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని చేర్చుకునే బదులు వచ్చే సంవత్సరం వరకూ వేచి ఉండి, స్వశక్తితో రాజ్యసభలో మెజారిటీ సాధిస్తేనే మోదీకి విలువ పెరుగుతుంది. ఇందుకోసం ఫిరాయింపులను ప్రోత్సహించ టం ద్వారా రాజ్యసభలో బ లాన్ని పెంచుకొంటే నైతికత అడుగంటుతుంది.
ఇటీవలి కాలంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, తెలంగాణ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో అవినీతి సహితంగా పార్టీ ఫిరాయింపులు జరిగాయి. పార్టీ ఫిరాయించిన కొందరికి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఇంకొంతమందికి ఆర్థక పరమైన ప్రయోజనాలు అందాయనే అపవాదులున్నాయి. మోదీ ఇప్పుడు నలుగురు తెదేపా రాజ్యసభ సభ్యులను భాజపాలో చేర్చుకొనడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో జరిగిన పార్టీ ఫిరాయింపులకు వత్తాసు పలికినట్లయ్యింది. భాజపా ఇప్పటికే పదకొండు రాష్ట్రాల్లో సొంత బలంతో అధికారంలో ఉంది. మరో ఐదు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి త్వరలోనే మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. గవర్నర్ పాలన కొనసాగుతున్న జమ్మూ కశ్మీర్ సంగతి పక్కన పెడితే- మరో ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలనూ తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలన్నదే భాజపా ఆలోచనగా కనిపిస్తోంది.
కేంద్రంలో భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ‘కాషాయ ధ్వజం’ రెపరెపలాడాలని పావులు కదుపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం దెబ్బతినటం వల్ల ఏర్పడే శూన్యాన్ని భర్తీ చేసేందుకే నరేంద్ర మోదీ నలుగురు టి.డి.పి రాజ్యసభ సభ్యులను తన పార్టీలో చేర్చుకున్నారని భావించవలసి ఉంటుంది. ఇదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్‌కు బదులు- అధికార తెరాస పార్టీకి ప్రత్యామ్నాయంగా భాజపాను రూపొందించాలన్న ప్రయత్నం జరుగుతోంది. తమిళనాడు, కేరళలో కూడా ఇలాంటి ప్రయత్నాలకు భాజపా నాంది పలికింది. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదుగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సత్తా చాటుకున్నది. రాహుల్ గాంధీ అసమర్థ రాజకీయాల ఫలితంగా కాంగ్రెస్ ఎక్కడా ప్రభావం చూపలేక పోతోంది. దీంతో భాజపా ఒక్కటే దేశంలో రెండవ జాతీయ పార్టీగా ముద్ర వేసుకొంది. మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలే కావటంతో జాతీయ స్థాయిలో భాజపాకు ఎదురనేది లేకుండాపోతోంది.
*

-కె.కైలాష్ 98115 73262