ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

నవభారత నిర్మాణానికి ముందడుగు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శనంలో తొలి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌లో నవ భారత నిర్మాణం దిశగా అడుగులు వేశారు. పేదలు, పల్లెలు, రైతుల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన 2019-20 సంవత్సరం బడ్జెట్ ప్రభుత్వ లక్ష్యాలను సునాయసంగా సాధిస్తుందని చెప్పవచ్చు. తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్ నేల విడిచి సాము చేయలేదు, జనాకర్షణ పథకాలను దరి చేరనివ్వకుండానే సమాజంలో ప్రతి వర్గానికీ ఎంతో కొంత మేలు చేసే విధంగా బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆమెతో పాటు మోదీని ప్రశంసించాలి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన దేశ ప్రజల ప్రశంసలు పొందేందుకు మోదీ పలు జనాకర్షణ పథకాలకు తెర లేపితే ఆయనను అడ్డుకునేవారెవ్వరూ లేరు. అయితే మోదీ, సీతారామన్ బృందం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అతి త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు అవసరమైన ప్రాతిపదికను తయారు చేయడంలో విజయం సాధించారు.
దేశ ప్రజలిచ్చిన భారీ మెజారిటీ ఆధారంగా పెద్ద పెద్ద సంస్కరణలను మోదీ చేపడితే బాగుండేదని కొందరు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే మోదీ, నిర్మల ద్వయం మాత్రం ఆచితూచి ఒక్కొక్క అడుగు ముందుకు వేయటం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు యత్నించారు. ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించి బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకోలేదు. కోట్లాది మంది పేద ప్రజల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనం, రైతుల ప్రగతిని లక్ష్యంగా చేసుకొని బడ్జెట్‌ను రూపొందించడం సమర్థనీయం. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్లు నిజమైన భారత దేశం గ్రామాల్లోనే ఉంది. గ్రామాలు అభివృద్ధి చెందనంత కాలం దేశం అభివృద్ధి చెందదు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయటం ద్వారా మోదీ ప్రభుత్వం గాంధీ కలల సాఫల్యానికి కృషి ప్రారంభించింది. ప్రధానమంత్రి గృహ నిర్మాణం పథకం కింద దాదాపు రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగితే పల్లెల రూపురేఖలే మారిపోతాయి. ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల నిర్మాణం పథకం కింద ఎనభై వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించటం మామూలు విషయం కాదు. ఈ నిధులు సమర్థంగా ఖర్చయితే గ్రామీణ ప్రాంతాల రోడ్లు కూడా పట్టణ ప్రాంత రోడ్లతో సమానంగా అభివృద్ధి చెందుతాయి.
బడ్జెట్‌లో ఉపాధి కల్పన పథకాల గురించి ప్రభుత్వం మరిచిపోయిందని విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం కనిపించటం లేదు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్దపీట వేయటం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను క్రమపద్దతిలో పెంచేందుకు ప్రభుత్వం ఆలోచనతో కూడిన నిర్ణయం తీసుకున్నదని చెప్పవచ్చు. ‘నారి నారాయణి’గా రూపాంతరం చెందేందుకు మహిళలకు లక్ష రూపాయల రుణ సౌకర్యం, ఐదు వేల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం మహిళలకు సాధికారిత అందజేయటంతోపాటు గ్రా మీణ ప్రాంతాల్లో ఉపాధిని మరింత పెంచుతుంది.
బడ్జెట్‌లో అందరినీ సం తృప్తపరచడం ఏ ఆర్థిక మంత్రికీ సాధ్యం కాదు. వేతన జీవుల ఆదాయపు పన్ను చెల్లింపు మొత్తంలో ఎలాంటి మార్పు చేయకపోయినా, కొత్తగా ఇళ్లు కొనుగోలు చేసే వారికి మంచి సౌకర్యం కల్పించటం హర్షణీయం. సాలీనా రెండు నుండి ఐదు కోట్లు, ఆపైన ఆదాయం ఉన్న వారిపై సర్‌చార్జి విధించటం ద్వారా మోదీ ప్రభుత్వం సంపన్నుల నుండి కొంత తీసుకుని లేని వారికి పంచే కార్యక్రమం చేపట్టిందని భావించవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు పెంచటం ద్వారా మోదీ ప్రభుత్వం ఈ రంగాల వారిని ఆదుకునేందుకు గట్టి చర్యలు తీసుకున్నది. మహిళలకు పది శాతం, ఎస్‌సిలకు 30 శాతం, ఎస్‌టి 25 శాతం కేటాయింపులను పెంచటం ద్వారా నరేంద్ర మోదీ ‘సోషల్ ఇంజినీరింగ్’ ప్రారంభించారు. ఇలా కేటాయింపులు పెంచటం వెనక రాజకీయ లక్ష్యాలు ఉండవచ్చు. ఈ వర్గాలు సాధికారత సాధించేందుకు ప్రభుత్వ విధానాలు వీలు కల్పిస్తాయి.
మనం హక్కుల కోసం పోరాడుతామే తప్ప బాధ్యతల గురించి పట్టించుకోమనేది పచ్చి నిజం. దేశంలో పన్ను ఎగ్గొట్టే వారి సంఖ్య అత్యధికమనేది అందరికీ తెలిసిందే. జీతాలు పొందేవారు టి.డి.ఎస్ మూలంగా ఆదాయం పన్ను చెల్లిస్తారు. దీనినే ముక్కుపిండి వసూలు చేయటం అంటారు. ప్రైవేట్ రంగంలో కోట్లాది మంది ఉద్యోగులు లెక్కకు మించి ఆదాయం వస్తున్నా పన్ను మాత్రం చెల్లించరు. ఢిల్లీలో సమోసాలు విక్రయించే వాళ్లు కూడా లక్షలకు లక్షలు సంపాదిస్తారు కానీ ఆదాయం పన్ను మాత్రం చెల్లించరు. వీరి ఆదాయ వ్యయాలన్నీ నల్లబజారులోనే జరిగిపోతుంటాయి. ఇలాంటి వారందరినీ అదుపులోకి తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటోంది. సంవత్సరానికి కోటి లేదా అంతకంటే ఎక్కువ నగదును బ్యాంకు నుండి తీసుకునే వారిపై రెండు శాతం టి.డి.ఎస్ విధించటం ఇలాంటి చర్యల్లో ఒకటి.
నగదు కార్యకలాపాలను అరికట్టి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ అభినందించవలసిందే. సాలీనా యాభై కోట్లు అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్నవారు తమ లావాదేవీలను డిజిటల్ రూపంలో నిర్వహించేందుకు వీలు కల్పించటంతోపాటు దీనికయ్యే ఖర్చును రిజర్వు బ్యాంకు భరించటం వ్యాపారాల్లో నిజాయితీని ప్రోత్సహించటమే. నిజాయితీతో వ్యాపారం చేసేందుకు మోదీ ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని వ్యాపారస్తులు ఉపయోగించుకోవటం మంచిది.
పెట్రోలు, డీజిల్‌పై ఒక రూపాయి సర్‌చార్జి విధించ టం వలన బజారులో వీటి ధరలు లీటరుకు రెండున్నర రూపాయలు పెరిగాయి. దీని వల్ల సగటు మనిషిపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న చమురు ధరలు, ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తత మూలంగా మన ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న భారాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ సర్‌చార్జి విధించింది. సర్‌చార్జీ మూలంగా సగటు మనిషిపై భారం పడకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తాము విధిస్తున్న పన్నును తగ్గించటం మంచిది. పెట్రోలు, డీజిల్‌పై సర్‌చార్జి విధించటంతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రజలపై భారం పడడాన్ని సమర్థించని రాష్ట్ర ప్రభుత్వాలు తాము విధించే పన్నును కొంత తగ్గించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సిద్ధపడతాయా?
పెట్రోలు, డీజిల్ వాహనాల మూలంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం ‘ఈ-వాహనాల’ను ప్రోత్సహించటం ఎంతో సమర్థనీయం. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించటంతోపాటు దేశంలో విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్నది. విద్యుత్ వాహనాలపై పన్నును పనె్నండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించటం చాలా మంచి నిర్ణయం. డీజిల్, పెట్రోలు వాహనాల వల్ల దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబయి తదితర నగరాల్లో వాతావరణం పూర్తిగా కాలుష్యమైపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం మూలంగా ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమైపోయింది. ఈ నేపథ్యంలో ఈ-వాహనాలను ప్రోత్సహించటం ముదావహం. బంగారంపై పన్ను పెంచటం గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. మద్యంపై పన్ను పెంచనంత మాత్రాన దాని వినియోగం తగ్గదన్న రీతిలోనే- పన్నులు పెంచినంత మాత్రాన బంగారం కొనుగోళ్లు తగ్గవు. మోదీ ప్రభుత్వం డెబ్బై వేల కోట్లు కేటాయించటం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగు పరిచి ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు శ్రీకారం చుట్టింది.
ఒక వైపుగ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేయటం, పెట్టుబడులను ప్రోత్సహించటం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని విపక్షాలు విమర్శించే బదులు సానుకూల దృక్పథంతో ఆహ్వానించటం మంచిది. మోదీ ప్రభుత్వం సగటు మనిషిని పట్టించుకోకుండా, ఆర్థిక నిపుణులతో చర్చించకుండా బడ్జెట్‌ను సిద్ధం చేసిందంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన విమర్శలో పస లేదు. విమర్శ కోసం ఆరోపణలు చేయటం మన రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. బడ్జెట్‌లో ఉన్న మంచిని ప్రశంసిస్తూనే చెడును వేలెత్తి చూపించినప్పుడే విమర్శకు గుర్తింపు వస్తుంది. నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన బడ్జెట్‌ను ప్రతిపక్షం రాజకీయ కోణంలో విమర్శించడం సరికాదు.
*

-కె.కైలాష్ 98115 73262