ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారం కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్న ఫిరాయింపుల నాటకానికి తెర దించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నీరు కారిపోతుంది. రాజకీయ పార్టీల పట్ల ప్రజలకు విశ్వసనీయత సన్నగిల్లుతుంది. కర్నాటకలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు మన నేతల అధికార దాహానికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్, భాజపాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటం కర్నాటక ప్రతిష్టను దెబ్బతీస్తోంది. తాము అధికారంలోకి వచ్చేందుకు భాజపా అధినాయకత్వం కాంగ్రెస్, జేడీయూ ఎమ్మెల్యేలను రాజీనామాలకు ప్రోత్సహించటం, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య చేస్తున్న రాజకీయంతో ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టిపోతోంది. అధికారంలో ఉన్న జేడీయూ-కాంగ్రెస్ , కుర్చీ కోసం ఆరాటపడుతున్న భాజపా నేతలు కర్నాటక ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు.
ఎన్నికల వేళ ప్రజలకు కుప్పలు తెప్పలుగా హామీలు ఇచ్చిన నాయకులు ఇపుడు అధికారం కోసం తాము ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నామనే అంశంపై నోరు మెదపడం లేదు. జనం అభ్యున్నతి కోసం ఈ పెనుగులాట జరిగితే బాగుండేది కానీ అధికారం కోసమే ఇలా వీరు పంతాలకు పోవడం గమనార్హం. శాసనసభ-లోక్‌సభ స్పీకర్లు, శాసనమండలి- రాజ్యసభ చైర్మన్లు నిష్పక్షపాతంగా వ్యవహరించనందునే ఫిరాయింపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. స్పీకర్లు, చైర్మన్లుగా ఎన్నికైన వారు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలకు రాజీనామా చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నందునే నేడు ఫిరాయింపులు జుగుప్సాకరంగా తయారయ్యాయి. వీరు నిజాయితీగా వ్యవహరిస్తే అసెంబ్లీల్లో, పార్లమెంటులో ఫిరాయింపుల జోరు ఇంతలా ఉండేది కాదు.
1985లో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులో దీనిని పొందుపరిచారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి కొంత చరిత్ర ఉంది. మొదట్లో మన రాజ్యాంగంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన ఉండేది కాదు. 1950-60 ప్రాంతంలో దేశంలో బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ ఉండేది కాదు. కాంగ్రెస్ ఒక్కటే ప్రధాన పార్టీ కావడంతో ఆ పార్టీకి ఫిరాయింపుల అవసరం ఉండేది కాదు. 1967 సార్వత్రిక ఎన్నికలు దేశ రాజకీయాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా మార్చి వేశాయని చెప్పక తప్పదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మైలురాయిగా మిగిలిపోయిన ఆ ఎన్నికలు రాజకీయ పార్టీల అధికార దాహానికి అద్దం పట్టడంతో పాటు ఫిరాయింపులకు నాంది పలికాయి. అప్పట్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, ఎన్నికల్లో ఎదురైన ఓటమిని గెలుపుగా మార్చుకున్నది. డబ్బు, పదవులను ఎరగా వేసి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చివేసే కార్యక్రమానికి కాంగ్రెస్ 1967లో శ్రీకారం చుట్టింది. 1967లో పదహారు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జ రిగితే కాంగ్రెస్ ఒక్క రా ష్ట్రంలో విజయం సాధించింది. మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు గెలవటంతో కాంగ్రెస్ ఫిరాయింపులకు తెర లేపింది. 1967-71 మధ్య 142 మంది పార్లమెంటు సభ్యులు, దాదాపు 1900 మంది శాసన సభ్యులు ఫిరాయింపులకు పాల్పడ్డారంటే ఆ ఐదు సంవత్సరాల కాలం ఏ స్థాయిలో రాజకీయ అస్థిరత నెలకొందో సులభంగానే ఊహించుకోవచ్చు.
హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఫిరాయింపుల మూలం గా ప్రభుత్వాలు కూలిపోయాయి. ఫిరాయింపుల కోసం ముఖ్యమంత్రి, మంత్రి పదవులతోపాటు పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయి. శాసన సభ్యులు, లోక్‌సభ సభ్యులు తమ సభ్యత్వాల ఆధారంగా పెద్ద ఎత్తున డబ్బు చేసుకోవటం అప్పటి నుండే ప్రారంభమైంది. హర్యానాకు చెందిన ‘గయాలాల్’ అనే ఎమ్మెల్యే వెంటవెంటనే మూడుసార్లు పార్టీ ఫిరాయించాడు. రావు బీరేంద్ర సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహించటం అందరికీ తెలిసిందే. ఆ తరువాత బన్సీలాల్, భజన్‌లాల్ తదితర నాయకులు ఎన్నిసార్లు పార్టీ ఫిరాయించారు. ఎన్నిసార్లు హర్యానాలో రాష్టప్రతి పాలన విధించారనేది చరిత్ర చెప్పే సాక్ష్యం. గయాలాల్ ఫిరాయింపుల నేపథ్యంలోనే ‘ఆయారాం గయా రాం’ అనే పదం వాడుకలోకి వచ్చింది. 1967లో ప్రారంభమైన పార్టీ ఫిరాయింపుల పర్వం దాదాపు పదిహేడు సంవత్సరాల పాటు యథేచ్ఛగా కొనసాగింది. ఈ పదిహేడేళ్ల కాలంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపులను అదుపుచేసేందుకు చట్టం తీసుకురావాలని ఆలోచించలేదు. 1985లో రాజీవ్ గాంధీ హయాంలో ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చింది.
ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ రోజు కూడా నిజాయితీగా అమలు కాలేదు, నాయకులు కానివ్వలేదు. స్పీకర్లు తమ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు నడుచుకోవటంతో పార్టీ ఫిరాయింపుల చట్టం ఇప్పటికీ సమర్థవంతంగా అమలు కాలేదు. అధికారంలో ఉన్నవారు బలపరీక్ష సమయంలో తమ ప్రభుత్వాలను కాపాడుకునేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజకీయ ఎత్తుగడగా మారింది. స్పీకర్ తమ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారంలో ఉన్న పార్టీలు- ఫిరాయింపులకు పాల్పడే వారిపై వేటు పడకుండా చేయగలిగారు. కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం తెలుగుదేశం సభ్యుల పార్టీ ఫిరాయింపులతో గట్టెక్కడం తెలిసిందే.
ఆమధ్య తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పార్టీ ఫిరాయించిన తెలుగుదేశం శాసన సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకున్నా స్పీకరు, గవర్నర్ ఏ మాత్రం పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దెబ్బతీసే లక్ష్యంతో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన మండలి సభ్యులను పార్టీ ఫిరాయించేలా ప్రోత్సహించటం ఆడియో టేపుల్లో నిక్షిప్తమైనట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపాకు చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకోవడం ఫిరాయింపులకు పరాకాష్ఠ. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఫిరాయింపుల విషయంలో నాయకులు అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా మాట్లాడుతారు. అధికారంలో ఉన్నపుడు ఫిరాయింపులను తమ రాజకీయ చాణక్యానికి నిదర్శనంగా భావిస్తే, ప్రతిపక్షంలో ఉన్నపుడు రాజ్యాంగ విరుద్ధమంటూ గోల చేస్తారు. కొందరు స్పీకర్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తమ నిర్ణయాలను నెలల తరబడి వాయిదా వేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎమ్మెల్యేల పదవీ కాలం పూర్తయినా స్పీకర్లు స్పష్టత ఇవ్వకపోవడం పరిపాటిగా మారింది.
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇటీవల పార్టీ ఫిరాయించినప్పుడు భాజపా చేసిన వాదన ద్వంద్వ ప్రమాణాలకు తిరుగులేని నిదర్శనం. మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఆమోదిస్తేనే ఒక పార్టీ మరో పార్టీలో విలీనం అవుతుంది. కానీ ఇప్పుడిది మారిపోయింది. మూడింట రెండు వంతుల మంది బైటికి వెళ్లి మరో పార్టీలో చేరి ‘విలీనం’ జరిగిందని ప్రకించుకుంటున్నారు. నాయకులు తమ రాజకీయ అవసరాల మేరకు ఫిరాయింపుల చట్టానికి నిర్వచనం ఇస్తున్నారు. స్పీకర్లు నిబద్ధతతో వ్యవహించక, తమ పార్టీ అధినాయకత్వం ఆదేశాలను పాటిస్తున్నందున కర్నాటకలో ఫిరాయింపు రాజకీయాలు అందరికీ రోత పుట్టిస్తున్నాయి. *

-కె.కైలాష్ 98115 73262