ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అధికారం కోసం ఏమైనా చేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్టలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు శివసేన, ఎన్.సి.పి. కాంగ్రెస్ పార్టీలు తమ సిద్ధాంతాలు, విలువలను తుంగలో తొక్కటం సిగ్గుచేటు. లౌకికవాదం తమ నరనరాల్లో జీర్ణించుకుపోయిందని ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ పార్టీ హిందు తీవ్రవాద పార్టీ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం చూస్తుంటే అధికారం కోసం ఏ మేరకు దిగజారిపోతారనేది తెలుస్తోంది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రెండు హిందుత్వ పార్టీలు బి.జె.పి, శివసేన ఒక కూటమిగా పోటీ చేసి 161 సీట్లు సాధించాయి. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్.సి.పి 54, కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రజలు బి.జె.పి., శివసేన కూటమికి అధికారాన్ని అప్పగించాలనుకున్నారు. శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం రాష్ట్ర ప్రజల అభీష్టానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం బి.జె.పి ముఖ్యమంత్రి పదవి చేపడితే శివసేన ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టాలి కానీ రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. తక్కువ సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి పదవిని ఆశించటం ద్వారా శివసేన అధినాయకుడు ఉద్దావ్ థాక్రే రాష్ట్ర ప్రజల తీర్పును వమ్ము చేస్తున్నారు. కూటమిలోని జూనియర్ భాగస్వామి ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేయటం రాజకీయంగా ఎంత మాత్రం సమర్థనీయం కాదు. శివసేన ఏ లెక్క ప్రకారం బి.జె.పితో సమానంగా రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవుల్లో సగ భాగం డిమాండ్ చేస్తుంది? శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం బి.జె.పికి శతృవుగా మారింది. కాంగ్రెస్, ఎన్.సి.పి ఇప్పుడు శతృవు శతృవు తమ మిత్రుడు అనే రాజకీయానికి తెర లేపింది. జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయటంతో పాటు రాష్ట్రాన్ని రెండుగా విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయటం, అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించి భవ్యమైన రామాలయం నిర్మాణానికి రంగం సిద్ధం చేయటం, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయటం తదితర విజయాలతో దూసుకుపోతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏ విధంగానైనా ఇబ్బందుల్లో పడవేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం శివసేన రాజకీయ దురాశను తన రాజకీయానికి ఉపయోగించుకుంటోంది. మహారాష్టల్రో బి.జె.పి. అధికారంలోకి రాకుండా చూసేందుకు జీవితాంతం అసహ్యించుకున్న శివసేనతో సోనియా గాంధీ చేతులు కలుపుతున్నారు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తక్కువ సీట్లున్న పార్టీకి అధికారం అప్పగించేందుకు కాంగ్రెస్, ఎన్.సి.పి. సిద్ధపడ్డాయి. కాంగ్రెస్ మొదటి నుండి కుహనా లౌకికవాదాన్ని నడిపించింది. బి.జె.పి.ని వ్యతిరేకించటమే లౌకికవాదం అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరించింది. సోనియా గాంధీ, శరద్ పవార్ మొదటి నుండి బి.జె.పి.ని తమ శతృవుగా భావించారు తప్ప రాజకీయ ప్రత్యర్థిగా తీసుకోలేదు. బి.జె.పి. ఏం చేసినా వ్యతిరేకించటం అనేది ఈ రెండుపార్టీల సిద్ధాంతం. హిందువులను వ్యతిరేకించటమే లౌకికవాదం అనే సిద్ధాంతాన్ని అమలు చేసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్, అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎం.ఐ.ఎం.తో దోస్తీ చేయటాన్ని కాంగ్రెస్ లౌకికవాదంగా చెప్పుకోవటం అందరికీ తెలిసిందే. ఇంతకాలం ముస్లిం మైనారిటీ రాజకీయ పార్టీలతో కలిసి పని చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారం కోసం శివసేనతో చేతులు కలిపింది. హిందు ఉగ్రవాద శివసేనతో కాంగ్రెస్ చేతులు కలపటం వెనక కాంగ్రెస్ మనుగడ వ్యవహారం కూడా ఇమిడి ఉన్నది. కాంగ్రెస్‌కు చెందిన దాదాపు ఇరవై మంది మరాఠా శాసనసభ్యులు ఉద్దావ్ థాక్రే నాయకత్వంలోని శివసేనతో చేతులు కలపాలని పెద్ద ఎత్తున వత్డిడి తెచ్చారు. దాదాపు పదిహేను మంది మరాఠా శాసనసభ్యులు ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి శివసేనకు మద్దతు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. శివసేనకు మద్దతు ఇవ్వని పక్షంలో పార్టీకి గుడ్‌బై చెబుతామనే హెచ్చరిక చేసి వెళ్లటం గమనార్హం. మహారాష్టల్రో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో కులం ప్రధాన పాత్ర నిర్వహిస్తోంది. కాంగ్రెస్, ఎన్.సి.పి.కి చెందిన మొత్తం తొంబై ఎనిమిది మంది శాసన సభ్యుల్లో దాదాపు డెబ్బై మంది మరాఠా కులానికి చెందిన వారే. శివసేనలోని 56లో దాదాపు అరవై శాతం మంది మరాఠా శాసన సభ్యులున్నారు. వీరందరు కూడా మరాఠా వర్గానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని గట్టిగా పట్టుపడుతున్నారు. శరద్‌పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరాఠాల పార్టీ అనేది అందరికి తెలిసిందే. ఎన్.సి.పి. గెలిచిన 54 మంది శాసన సభ్యుల్లో మెజారిటీ మరాఠాలున్నారు. శివసేన కూడా మరాఠాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 105 గెలిచిన బి.జె.పి. ఈ సారి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ప్రకటించటం తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ స్థానంలో ఎవరైనా మరాఠా వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించేందుకు బి.జె.పి. అధినాయకత్వం అంగీకరించి ఉంటే శివసేన ఈ స్థాయిలో గొడవ పడేది కాదు. బి.జె.పి. మరోసారి బ్రాహ్మణ వర్గానికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను నియమించాలనే నిర్ణయానికి రావటంతో మహారాష్టల్రో కుల రాజకీయం ఊపందుకున్నదని చెప్పకతప్పదు.
మహారాష్టల్రో బి.జె.పి. అధికారంలోకి రాకుండా చూసేందుకు కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం ఏ మేరకు విజయం సాధిస్తుందనేది ఇప్పుడే చెప్పలేము. శివసేన ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ఎన్.సి.పి, కాంగ్రెస్‌తో ఆడుకుంటుంది. శివసేన అధినాయకత్వానికి మొండిగా వ్యవహరించటం మొదటి నుండి అలవాటే. ముఖ్యమంత్రి పదవి కోసం తమ చిరకాల స్నేహిత పార్టీ బి.జె.పి.ని వదులుకునేందుకు సిద్ధపడిన శివసేన ముందు ముందు ఎన్.సి.పి., కాంగ్రెస్‌ల పట్ల కూడా దురుసుగా వ్యవహరించకమానదు. ఇదిలా ఉంటే చాలా కాలం నుండి అధికారానికి దూరంగా ఉంటున్న కాంగ్రెస్, ఎన్.సి.పి., శివసేనలు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని తమ ఇష్టానుసారం పాలిస్తారు. మూడు పార్టీలు తమ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాయి. దీని మూలంగా రాష్ట్రం పరిపాలనాపరంగా ఆర్థికంగా కూడా తీవ్ర సమస్యలను ఎదుర్కొనకతప్పదు. పదవులు, అధికారం కోసం ఒక వేదికపైకి వచ్చిన పార్టీలు నిజాయితీగా పని చేస్తాయని చెప్పలేము. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే శివసేన, కాంగ్రెస్, ఎన్.సి.పి.లు ఏ విధంగా కలిసి పని చేయగలుగుతాయనేది అనుమానమే. మూడు పార్టీలు కామన్ మినిమం ప్రోగ్రాం (సి.ఎం.పి)ని తయారు చేసుకున్నా ఇది అమలుకు నోచుకోదనేది గతానుభవంతో గట్టిగా చెప్పవచ్చు. గతంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు ఇలాంటి పలు సి.ఎం.పి.లను తయారు చేసుకుని దాని ఆధారంగా పని చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చినా ఆ హామీల మాటలు నీటి మూటలయ్యాయనేది అందరికీ తెలిసిందే. శివసేన హిందుత్వ, కుల రాజకీయాల ఆధారంగా పని చేస్తే కాంగ్రెస్, ఎన్.సి.పి.లు కుహనా లౌకికవాదం పేరుతో తమ రాజకీయం నడిపిస్తాయి. వీరంతా నిజంగానే సమన్వయంతో కలిసి పని చేయగలుగుతారా? అనేది అనుమానమే. భిన్నమైన తీవ్ర భావజాలాలను కలిగి ఉన్న శివసేనతో కలిసి పని చేయటం కాంగ్రెస్, ఎన్.సి.పికి ఎంత వరకు సాధ్యమవుతుంది. శివసేన ముఖ్యమంత్రి పదవీ రాజకీయం మూలంగా మహారాష్ట్రంలో గత ఇరవై రోజుల నుండి ప్రభుత్వం అనేది లేకుండా పోయింది. పంటలు దెబ్బతినటం మూలంగా గత ఇరవై రోజుల్లో దాదాపు ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారం కోసం పెనుగులాడుతున్న పార్టీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సమస్యలపై దృష్టి సారించటం లేదు. మహారాష్టల్రో 2013 నుండి 2018 వరకు దాదాపు పదిహేను వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2019 జనవరి ఓకటో తేదీ నుండి 2019 ఫిబ్రవరి వరకు 396 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతులు వేల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఆయా పార్టీలు మాత్రం వీరి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించటం లేదు. పదవుల పంపకం కోసం గంటల తరబడి సమావేశాలు జరుపుతున్న ఈ రాజకీయ పార్టీలు రైతుల సమస్యల గురించి చర్చించేందుకు ఒక గంట సమయం కూడా కేటాయించటం లేదు. రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును వక్రీకరించటం ద్వారా పదవులను పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

-కె.కైలాష్ 98115 73262