ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

చర్చ సాగదు.. రచ్చ ఆగదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ స్వార్థమే పరమావధిగా ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా విపక్షం సభాకార్యక్రమాలను అదేపనిగా అడ్డుకుంటోంది. అధికార పక్షం మొం డిగా వ్యవహరిస్తున్న సమయంలో ప్రతిపక్షం తన వ్యూహాన్ని మార్చుకుని లక్ష్య సాధనకు ప్రయత్నించకుండా తాను కూడా ఏకపక్షంగా ప్రవర్తించడం సమర్థనీయం కాదు. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగకుండా అడ్డుపడటం ద్వారా ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. పార్లమెంటును స్తంభింపజేసేందుకు ప్రతిపక్షాలు అర్థం పర్థం లేని అంశాలను ప్రస్తావిస్తూ గందరగోళం సృష్టించటం ఎంత మాత్రం సబబు కాదు. పార్లమెంటు ఉభయ సభల్లో ఎలాంటి చర్చ జరగకుండా ప్రతిపక్షాలు ఏరోజుకారోజు కొత్తకొత్త కారణాలను చూపుతున్నాయి. వాయిదా తీర్మానం, ఓటింగ్‌కు వీలు కల్పించేలా చర్చ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు వస్తేనే చర్చ, సభలో ముందుగా మోదీ క్షమాపణ చెప్పాలనడం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం కోల్‌కతలో ఆలస్యంగా దిగటం, ఆమెను హత్య చేసేందుకు కుట్ర, బెంగాల్‌లో సైన్యాన్ని మోహరించటం.. ఇలా పలురకాల ఆరోపణలతో, డిమాండ్లతో ఉభయ సభలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయే తప్ప- నోట్లరద్దు నేపథ్యంలో జనం కష్టాల గురించి ఏ విధమైన చర్చ జరపటం లేదు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద ‘క్కూ’లో పడిగాపులు పడుతున్న వారిలో ఇంతవరకు 85 మంది మరణించారని ఆరోపిస్తున్న ప్రతిపక్షం ఆ విషయమై చర్చ జరగకుండా అడ్డుకోవటం అర్థరహితం. ప్రతిపక్షాలు ప్రతి విషయాన్నీ రాజకీయం చేయటం న్యాయం కాదు.
దేశంలో పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8 తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ప్రకటన చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 16న ప్రారంభమయ్యాయి. ఒక ఎంపి అకాలమృతి కారణంగా లోక్‌సభ మొదటి రోజు ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండానే మరుసటి రోజుకు వాయిదా పడితే, రాజ్యసభలో మొదటి రోజే పెద్దనోట్ల రద్దు, దాని ఫలితంగా ప్రజలు పడుతున్న కష్టాలపై చర్చ ప్రారంభమైంది. అయితే, ప్రతిపక్షం రెండో రోజే అకస్మాత్తుగా మనసు మార్చుకుని చర్చను దెబ్బ తీసింది. ప్రధాని మోదీ సభకు వస్తే తప్ప చర్చ ముందుకు సాగదంటూ గొడవ ప్రారంభించింది. చర్చ జరిగినంత సేపూ సభలో మోదీ కూర్చోవాలని విపక్షం పట్టుబట్టడం వెనక రాజకీయం తప్ప ప్రజాహితం కనిపించటం లేదు. చర్చ సాఫీగా సాగిపోతే ప్రభుత్వానికి కలసి వస్తుందనే అనుమానంతో ప్రతిపక్షం చర్చను స్తంభింజేస్తోందన్న వాదన వినిపిస్తోంది. మూడు రోజుల తరువాత రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి మోదీ వచ్చినప్పుడు అందరి డిమాండ్ మేరకు పెద్దనోట్ల రద్పుపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ప్రధాని రాజ్యసభ నుంచి వెళ్లిపోగానే చర్చ ఆగిపోయింది. చర్చ జరిగినంత సేపూ సభలో ప్రధాని ఉండాలనే షరతు విధించటం ద్వారా ప్రతిపక్షం అదేపనిగా సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తోంది. ఆ తరువాత సభకు మోదీ వచ్చినా ప్రతిపక్షం చర్చకు ఒప్పుకోకుండా మళ్లీ వితండవాదానికి దిగింది. బహిరంగ సభల్లో మోదీ తమపై నిందలు వేస్తున్నారని, ఆయన క్షమాపణ చెప్పాలని విపక్ష సభ్యులు రాజ్యసభను స్తంభింపజేశారు. పెద్దనోట్ల రద్దుపై చర్చ జరగకుండా చూసేందుకే ప్రతిపక్షం ఇలా వ్యవహరిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి.
వాయిదా తీర్మానం కింద చర్చించాలి, ప్రధానమంత్రి సభకు వస్తేనే చర్చిస్తామని ప్రతిపక్షం డిమాండ్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ, ‘మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం కోల్‌కతలో దిగకుండా ఆపారు.. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో పర్యిటిస్తున్న ఆమెను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారు..’ అనే ఆరోపణలతో ఉభయ సభలను స్తంభింపజేయటం వెనక ఉన్న అర్థం, పరమార్థం ఏమిటి? మమతా బెనర్జీ అడ్డుతొలగించుకునేందుకే ఎన్‌డిఎ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ఉభయ సభల్లో గొడవ చేయటం అర్థరహితం కాదా? మమత ప్రయాణిస్తున్న విమానంతో పాటు మరో రెండు విమానాల్లో కూడా తక్కువ ఇంధనం ఉండడం వల్ల సమస్య ఏర్పడింది. ఇలా జరగటానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు చెబుతున్నా వినిపించుకోకుండా ఉభయ సభల్లో పోడియం చుట్టుచేరి గొడవ చేయటం ప్రతిపక్షం బాధ్యతారాహిత్యం కాదా?
ప్రతిపక్షం తన రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యాన్ని కూడా వివాదంలోకి లాగటం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. ఈశాన్య రాష్ట్రాలతోపాటు కోల్‌కతలోని పంతొమ్మిది ప్రాంతాల్లో సైనికులు ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం దేశంలోని పలు ప్రాంతాల్లో క్రమం తప్పకుండా సైన్యం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితుల్లో శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతను నిర్వహించేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉండేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో దీనిని సైన్యం చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీసేందుకు సైన్యాన్ని వివాదంలోకి లాగటం సిగ్గుచేటు. పెద్దనోట్ల రద్దు ఫలితంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దృష్టి కేంద్రీకరించకుండా, తన సొంత ప్రతిష్ఠను పెంచుకునేందుకు మమతా బెనర్జీ తపన పడడం రాజకీయం తప్ప మరొకటి కాదు. నల్లధనానికి విపక్షాలే కారణమని బహిరంగ సభల్లో మోదీ విమర్శిస్తే దానికి దీటైన జవాబు చెప్పాలే తప్ప, ఆయన క్షమాపణ చెబితే తప్ప పార్లమెంటు సమావేశాలను జరగనివ్వమంటూ ప్రతిపక్షం పట్టుదలకు పోవడం సబబేనా?

కె కైలాష్