ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అవమానించినదెవరో మర్చిపోయారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాత్‌రూంలో రెయిన్ కోట్ వేసుకుని స్నానం చేయటం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు వచ్చినట్లు మరెవ్వరికి రాదంటూ వ్యంగ్య విమర్శలు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నది. నరేంద్ర మోదీ రాష్టప్రతి ప్రసంగంపై రాజ్యసభలో జరిగిన చర్చకు బదులిస్తూ మన్మోహన్ సింగ్‌పై వ్యంగ్య వాఖ్యలు చేశారు. యు.పి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల అవినీతి కుంభకోణాల గురించి ప్రస్తావిస్తూ రెయిన్‌కోట్ వేసుకుని స్నానం చేసే కళ కేవలం మన్మోహన్ సింగ్‌కు మాత్రమే తెలుసునని, ఆయన నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉన్నదని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు తప్ప సభలో ఉండే మన్మోహన్ సింగ్‌కు అనుకూలంగా వాదించలేకపోయారు. మాజీ ప్రధాన మంత్రిని అవమానించిన నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పనంత వరకు పార్లమెంటులో ఆయనను బాయ్‌కాట్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మన్మోహన్‌ను రాహుల్ గాంధీతోపాటు యు.పి.ఎ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులు అవమానించినట్లు మరెవ్వరు అవమానించి ఉండరు.
పశువుల దాణా, గడ్డి కుంభకోణంలో శిక్ష అనుభవించిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్.జె.డి అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను రక్షించేందుకు అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రతిని భారత ప్రెస్‌క్లబ్ ముందు ముక్కలు, ముక్కలుగా చింపి ‘నానె్సన్స్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయిన సంగతి రాహుల్ గాంధీ ఎలా మరిచిపోతారు? కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయతో ఇచ్చిన ప్రధానమంత్రి పదవిని ఎంతో భక్తిశ్రద్ధలతోపాటు అణకువ, విధేయతతో నిర్వహిస్తున్న మన్మోహన్ సింగ్‌ను తప్పుపట్టే అధికారం, అవకాశం రాహుల్ గాంధీకి ఎంత మాత్రం లేవు. లాలూప్రసాద్ యాదవ్‌ను రక్షించేందుకు ఆర్డినెన్స్‌ను తనంత తానుగా మన్మోహన్ జారీ చేయలేదు. సోనియా ఆదేశం మేరకే అది జరిగింది. అయితే రాహుల్ మాత్రం పత్రికా విలేకరులకు కేంద్రమైన జాతీయ ప్రెస్‌క్లబ్‌లో మన్మోహన్ సింగ్‌ను తప్పుపట్టారు. తమ కన్నుసన్నల్లో, తాము చెప్పింది చేస్తున్న మన్మోహన్ సింగ్‌ను రాహుల్ గాంధీ నానె్సన్స్ అంటూ అవమానించటం ఏ మాత్రం సమర్థనీయం కాదు. తాము చెబుతున్నట్లు చేస్తున్న మన్మోహన్ సింగ్‌ను అవమానించటం అంటే తమను తాము అవమానించుకోవటం అనేది కూడా రాహుల్ గాంధీకి అర్థం కాదా? రెయిన్‌కోట్ వేసుకుని స్నానం చేయటం అంటే తన హయాంలో ఎన్నో అవినీతి కుంభకోణాలు జరిగిపోతున్నా పట్టించుకోకపోవటం అని అర్థం. మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల యు.పి.ఏ పాలనలో ఎన్ని అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు జరిగాయనేది అందరికి తెలిసిందే. తన మంత్రులు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నా మన్మోహన్ మాత్రం బురదనీటిలో కమలం మాదిరిగా, తామరాకుపై నీటి బొట్టులా ఉండిపోయారు తప్ప అవినీతిపరులపై చర్య తీసుకోవటం అటుంచితే కనీసం వారిని హెచ్చరించటం కూడా చేయలేదు. మంత్రులు అవినీతికి పాల్పడుతుంటే అదుపు చేయవలసిన బాధ్యత ప్రధాన మంత్రిది కాదా? తాను ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినంత మాత్రాన సరిపోతుందా? అవినీతికి పాల్పడటమే కాదు అవినీతికి పాల్పడే వారిని అదుపు చేయటం కూడా శిక్షార్హమే. కామన్‌వెల్త్ క్రీడల్లో చోటుచేసుకున్న అవినీతి మూలంగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పరువు మంటకలుస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన మన్మోహన్ సింగ్ బాత్‌రూంలో రెయిన్‌కోట్ వేసుకుని స్నానం చేసినట్లు కాదా? యు.పి.ఎ హయాంలో మంత్రులు, ముఖ్యంగా సీనియర్ మంత్రులు ఏ రోజు కూడా మన్మోహన్ సింగ్‌ను ప్రధాన మంత్రిగా చూడలేదు. ఆయన పట్ల కనీస గౌరవం, మర్యాద చూపించలేదు. కొందరు సీనియర్ మంత్రులు ఆయనను బాహాటంగా విమర్శించటాన్ని రాహుల్ పరోక్షంగా సమర్థించారు తప్ప ఏ రోజుకూడా అది తప్పని వారించలేదు. సీనియర్, జూనియర్ మంత్రుల దృష్టిలోకూడా మన్మోహన్ ఒక సేవకుడు మాత్రమే. ప్రధాన మంత్రి నివాసం, ఏ.ఐ.సి.సి కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోసం ఎదురు చూస్తూ చేతులు కట్టుకుని నిలబడటం ఆయనకు ఒక అలవాటుగా మారటం అందరికి తెలిసిందే. ఇదంతా జరుగుతున్నప్పుడు ఏ రోజు కూడా ప్రధాన మంత్రి పట్ల ఇలా వ్యవహరించటం మంచిది కాదని రాహుల్ చెప్పలేదు. ప్రధానిని అవమానించినట్లే మాజీ ప్రధానులను అవమానించటం కూడా కాంగ్రెస్‌కు అలవాటే. మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావును కాంగ్రెస్ ఎలా అవమానించిందనేది జగమెరిగిన సత్యం. నరసింహారావు ఇద్దరు ప్రధాన మంత్రులు, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వద్ద సీనియర్ మంత్రి పదవులతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించిన వ్యక్తి. రాజీవ్ మరణాంతరం ప్రధాన మంత్రి పదవి చేపట్టి మైనారిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించిన ఘనుడు. అలాంటి వ్యక్తి మరణిస్తే అతని భౌతిక కాయాన్ని ఏ.ఐ.సి.సి కార్యాలయానికి తెచ్చేందుకుకూడా గాంధీ కుటుంబం అనుమతించలేదు. మరణించిన మాజీ ప్రధాన మంత్రులందరికి ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద అంత్యక్రియలు నిర్వహించి సమాధి నిర్మిస్తే కేవలం పి.వి.నరసింహారావు అంత్యక్రియలు మాత్రం హైదరాబాదులో నిర్వహించి అక్కడే సమాధి నిర్మించటం కాంగ్రెస్ అధినాయకత్వం కుట్ర కాదా?
నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా గుర్తించేందుకు రాహుల్ గాంధీ ఈరోజు కూడా సిద్ధంగా లేడు. ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ విమర్శిస్తూనే ఉన్నారు. మోదీని విమర్శించే అధికారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా రాహుల్ గాంధీకి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ విమర్శలు రాజకీయంగా ఉండాలి తప్ప వ్యక్తిగతమైనవిగా ఉండకూడదు. రాహుల్, ఆయన అనుచర వర్గం మొదటినుండి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. యోగా గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్న మోదీకి పద్మాసనం వేసుకోవటం రాదనటం రాహుల్ విమర్శించటం ఏ విధంగా సమర్థనీయం. ఖూన్ కా దలాల్ (సైనికుల రక్తంతో వ్యాపారం చేసేవాడు), వౌత్ కా సౌదాగర్ ( మృత్యు వ్యాపారి ) అంటూ మోదీని విమర్శించిన కాంగ్రెస్‌కు రెయిన్‌కోట్ విమర్శ మింగుడుపడకపోవటం విచిత్రంగా ఉన్నది. చాయ్ అమ్మేవాడు ప్రధాన మంత్రి కావటం ఏమిటంటూ నరేంద్ర మోదీ పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్‌ను సమర్థించిన కాంగ్రెస్ నుండి ఇంత కంటే ఏమి ఆశించగలము?

కె. కైలాష్