ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

దేశ ప్రయోజనాలను విస్మరించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పటి నుండి విదేశాల్లో భారత దేశం పేరు మారుమోగిపోంది. భారత దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. భారత దేశం పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తోంది, దేశంలో పెద్ద ఎత్తున మార్పు వస్తోందనే అభిప్రాయం విదేశీయులకు కలుగుతోంది. వ్యాపార వాణిజ్య రంగంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో భారత దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తోంది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లు ఒక మూలకు పడి ఉన్న భారత దేశం నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందుతోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత దేశం కూడా తన వంతు పాత్రను నిర్వహించే స్థాయికి ఎదిగిందనే అభిప్రాయం కలుగుతోంది.
అయితే నరేంద్ర మోదీ జరిపే విదేశీ పర్యటనల మూలంగా భారత దేశానికి ఏ మేరకు లాభం కలుగుతోందనేది పరిశీలించవలసి అవసరం ఎంతో ఉన్నది. మోదీ విదేశీ పర్యటనలపై పెద్ద ఎత్తున హంగామా జరుగుతోంది. మోదీ ప్రపంచాన్ని చుట్టి రావటమే కాదు, ప్రపంచాన్ని గెలిచి వస్తున్నారనే అభిప్రాయం కలిగించేందుకు ఎన్.డి.ఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మోదీ విదేశీ పర్యటనల గురించి కొంత వరకు గొప్పలు చెప్పుకుంటే ఫరవా లేదు కానీ గోరంతను కొండలు చేసి చూపించటం మంచిది కాదు. విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందాల మూలంగా మన దేశానికి ప్రయోజనం కలగాలి, మన వ్యాపార రంగానికి మేలు జరగాలి, ఎగుమతులు పెరిగేందుకు దోహదపడాలి తప్ప విదేశాలకు ప్రయోజనం కలిగించకూడదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించటం ద్వారా ఇరు దేశాల ప్రయోజనాల పరిరక్షణ జరిగితే అందరికి మేలు కలుగుతుంది. నరేంద్ర మోదీ ఈ లక్ష్య సాధన కోసమే పని చేయాలి. ఇటీవలి కాలంలో ఇతర దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు భారత దేశానికి ఎక్కడ లేని ప్రాధాన్యతను ఇస్తున్నారు. అమెరికా, మెక్సికో తదితర దేశాలు గత వారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టాయి. అమెరికన్ కాంగ్రెస్‌లో నరేంద్ర మోదీ ప్రసంగానికి ప్రజా ప్రతినిధుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వారు పలు మార్లు లేచి నిలబడి మోదీ ప్రసంగం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక చప్పట్లకైతే కొదవే లేదు. మోదీ ప్రసంగం కొనసాగినంత సేపు అమెరికన్ ప్రజాప్రతినిధుల హర్శధ్వానాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకాశానికి ఎత్తినంత పని చేశారు.
భారత, అమెరికా స్నేహంపై మోదీ చేసిన ప్రతిపాదనకు అమెరికన్లు ఒక పేరు కూడా పెట్టుకున్నారు. మోదీ విధానమంటూ వారు నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన అమెరికా, ఖతర్, స్విట్జర్‌లాండ్, మెక్సికో, అఫ్ఘానిస్తాన్ దేశాల్లో పర్యటించటం తెలిసిందే. ఈ ఐదు దేశాల పర్యటనలో అమెరికా, స్విట్జర్లాండ్, మెక్సికో దేశాల పర్యటన అత్యంత ముఖ్యమైంది. స్విట్జర్లాండ్‌లోని బ్యాంకు ఖాతాల్లో ఉన్న అక్రమ ఆస్తులను రాబట్టటంతోపాటు అణు సరఫరాదారుల బృందం (ఎన్.ఎస్.జి), క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (ఎం.టి.సి.ఆర్)లో సభ్యత్వం సంపాదించటం అత్యంత ముఖ్యమైన లక్ష్యాలు. నరేంద్ర మోదీ ఈ లక్ష్య సాధన కోసం చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్.ఎస్.జిలో భారత సభ్యత్వానికి అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్‌లు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇటలీ కూడా మనకు మద్దతు ప్రకటించటం గమనార్హం. అయితే ఈ మద్దతు ఇచ్చేందకు అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఇటలీ దేశాలు తమ దేశ ప్రయోజనాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. కేరళలో ఇద్దరు మత్స్యకారులను నిర్దాక్షిణ్యంగా చంపినందుకు జైల్లో ఉన్న ఇద్దరు ఇటలీ నావికులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మరు క్షణం ఆ దేశం మనకు మద్దతు ప్రకటించటం గమనార్హం.
అమెరికా కూడా పలు ప్రయోజనాల కోసమే మనకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. మన దేశంలోని పౌర అణు రియాక్టర్లను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురావటం, ఇక మీదట అణు పరీక్షలు చేయమనే హామీ ఇవ్వటంతోపాటు అమెరికాలోని అణు రియాక్టర్లను ఉత్పత్తి చేసే సంస్థల నుండి అణు రియాక్టర్లను కొనుగోలు చేయటం వంటి షరతులకు అంగీకరించినందుకే బరాక్ ఒబామా మనకు మద్దతు ఇస్తున్నారు. నరేంద్రమోదీ, బరాక్ ఒబామా చేసిన సంయుక్త ప్రకటనలో దక్షిణ చైనా సముద్రం గురించి ప్రస్తావించకపోవటం వెనక కూడా ఇలాంటి రాజకీయమే ఉన్నది. చైనాను దువ్వేందుకే సంయుక్త ప్రకటన నుండి దక్షిణ చైనా సముద్రం వ్యవహారాన్ని తొలగించారనే మాట వినిపిస్తోంది. భారత దేశం ఎన్.ఎస్.జి సభ్యత్వానికి చైనా అభ్యంతర పెట్టకుండా చూసేందుకే ఈ విధంగా వ్యవహరించారని భావించవలసి ఉంటుంది. అఫ్ఘానిస్తాన్‌లో మన దేశ సహాయంతో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాకిస్తాన్‌ను చెక్‌మేట్ చేసే కార్యక్రమంలో భాగంగా మనం అఫ్ఘానిస్తాన్‌కు అన్ని రకాల సహాయ, సహకారాలను అందజేస్తున్నారు. అఫ్ఘానిస్తాన్ పర్యటన ముగిసిన అనంతరం మోదీ ఖతార్ పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు ఘన స్వాగతం లభించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన ఈ పర్యటన ఆశించిన ఫలితాలను ఇస్తోందనే మాట వినిపిస్తోంది. ఇక స్విట్జర్లాండ్‌లో జరిపిన పనె్నండు గంటల పర్యటనలో మోదీ నల్లధనం వివరాలపై దృష్టి సారించారు. జెనీవాలోని పలు బ్యాంకుల్లో ఉన్న అక్రమ ఖాతాల్లో వందలు, వేల కోట్ల నల్ల ధనం డిపాజిట్లు ఉన్నాయి. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న కోట్లాది రూపాయల అక్రమ నల్ల ధనాన్ని స్వదేశానికి తెచ్చి అందరికి పంచి పడతానని నరేంద్ర మోదీ 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించటం తెలిసిందే. మోదీ స్విట్జర్లాండ్ పర్యటన సంధర్భంగా ఈ నల్ల ధనం ఖాతాల గురించి చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని ఆశిద్దాం.