ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

యూపీ తీర్పుతో పెనుమార్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌తోపాటు ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలకు నేటితో తెరపడింది. ఐదు రోజుల తరువాత అంటే మార్చి 11 తేదీ వెలువడే ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భవిష్యత్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయటంతోపాటు జాతీయ రాజకీయాలను ఒక పెద్ద మలుపు తిప్పుతాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బి.జె.పితోపాటు ఎన్.డి.ఏ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ స్థానం ఏమిటనేది నిర్దారిస్తాయి. అన్నీ తానై వ్యవహరిస్తున్న నరేంద్ర మోదీ ఇక మీదట కూడా ఇలాగే వ్యవహరించగలుగుతారా? లేక అందరి సహకారంతో పని చేయవలసి వస్తుందా? అనేది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి. ఎన్నికలు ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరిగినా అసలు రాజకీయ పోరాటం అంతా దేశంలోని అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. యు.పి.లో అధికారంలోకి వచ్చేందుకు బి.జె.పి అన్ని శక్తులను ఒడ్డింది. నరేంద్ర మోదీ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలోని ప్రతిప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. కేంద్ర మంత్రులందరు యు.పి.లో తిష్టవేసి ఎన్నికల ప్రచారం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో బి.జె.పి అధికారంలోకి వస్తే మోదీకి ఇక తిరుగనేదే ఉండదు. ఆయన ఇప్పటికే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇక మీదట మొత్తం అధికారాన్ని అంతా తనలోనే కేంద్రీకృతం చేసుకుని పని చేస్తారు. దేశం దశ, దిశలను మార్చేందుకు ఉద్దేశించి మరిన్ని ఆర్థిక, సామాజిక సంస్కరణలను పెద్ద ఎత్తున అమలు చేస్తారు. కేంద్ర మంత్రివర్గంలో పెనుమార్పులు చేయటంతోపాటు ఆయన పని తీరు మరింత మారుతుంది. తన ఆలోచనలకు మరింత వేగంగా కార్యరూపం ఇస్తారు. విప్లవాత్మక మార్పులు తెస్తారు. ఇంతేకాకుండా 2019లో జరిగే లోకసభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మళ్లీ విజయం సాధించే అవకాశాలు బాగా మెరుగుపడతాయి.
అయితే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ లేదా బి.ఎస్.పి అధినాయకు రాలు మాయావతి అధికారంలోకి వచ్చే పక్షంలో బి.జె.పితోపాటు ఎన్.డి.ఏ ప్రభుత్వంలో కూడా నరేంద్ర మోదీ ప్రాభవం బాగా తగ్గుతుంది. నరేంద్ర మోదీ ఒక్కడు, తనంత తాను బి.జె.పికి విజయం సాధించిపెట్టలేరనే అభిప్రాయం మరింత గట్టి పడుతుంది. ఆయన ఇక మీదట కేంద్ర మంత్రులతోపాటు పార్టీలోని నాయకులందరిని కలుపుకుని పని చేయవలసి ఉంటుంది. నరేంద్ర మోదీ వెనకకు తగ్గి బి.జె.పి ముందుకు వస్తుంది. నరేంద్ర మోదీకి బదులు బి.జె.పి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అఖిలేష్ యాదవ్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన జాతీయ స్థాయి నాయకుడుగా ఎదిగిరావటంతోపాటు 2019 లోకసభ ఎన్నికల కోసం జాతీయ స్థాయి లో ఎన్.డి.ఏను సవాల్ చేయగలిగే ప్రత్యామ్నాయ శక్తి ఊపిరిపోసుకుంటుంది. అఖిలేష్ యాదవ్ రూపంలో ఒక కొత్త నాయకుడు దేశం ముందుకు వస్తాడు. ఎన్.డి.ఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపైకి వచ్చేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడుతుంది. ప్రతిపక్ష రాజకీయాల్లో ఉత్సాహం పెల్లుబుకుతుంది. ఈ కొత్త రాజకీయ వ్యవస్థలో రాహుల్ గాంధీ ఎలాంటి పాత్ర నిర్వహిస్తారనేది ఇప్పుడే చెప్పలేము. కానీ అఖిలేష్ యాదవ్ మాత్రం అత్యత కీలకపాత్ర నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షం రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా మారుతుంది. అయితే ఇందుకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించకపోతే అఖిలేష్‌యాదవ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా సర్దుకున్నా కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ రాజకీయంగా కనుమరుగైపోయే ప్రమాదం నెలకొంటుంది. సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకోవటం వలన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తాత్కాలికంగా కొంత రాజకీయ ప్రయోజనం కలిగినా దీర్ఘకాలంలో మాత్రం తీరని నష్టం వాటిల్లుతుంది. దేశానికి స్వాతంత్రం తెచ్చిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ లాంటి కులతత్వ, ప్రాంతీయ తత్వ పార్టీతో సీట్లు సర్దుబాటు చేసుకోవలసిన దుస్థితిలో పడిపోయింది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతుంది. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవటంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి మరుగుతోంది. దీనికితోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ వర్గం వ్యవహరించిన తీరు పట్ల పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ సీనియర్ నాయకులంతా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కనున్నారు. రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేశారు. గతంలో ఎప్పుడు తిరగనంతగా ఈ ఎన్నికల్లో తిరిగారు. అయితే ఆయన, ఆయన వర్గం పార్టీ సీనియర్ నాయకులను కలుపుకుని పోవటంలో విఫలం అయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఈ అంశాలన్నీ చర్చకు రానున్నాయి. ఇదిలా ఉంటే ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచార వ్యవహారం కూడా అత్యంత వివాదాస్పదమైంది. ప్రియాంకాగాంధీ ఉత్తర ప్రదేశ్‌లో పెద్దఎత్తున కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని అన్నారు. అఖిలేష్‌యాదవ్ భార్య, లోకసభ సభ్యురాలు డింపుల్ యాదవ్‌తో కలిసి రాష్టమ్రంతటా ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రచారం చేశారు. అయితే చివరకు ప్రియాంకాగాంధీని అమేథీ, రాయబరేలీతోపాటు మరికొన్ని ప్రాంతాల ఎన్నికల సభలకు పరిమితం చేశారు. దీనివలన కాంగ్రెస్ ఫ్రంట్ కార్డు అనుకున్న ప్రియాంకాగాంధీని రాజకీయంగా వృధా చేశారని పలువురు సీనియర్ నాయకులు వాదిస్తున్నారు. రాహుల్‌గాంధీ విఫలమవుతున్న నేపథ్యంలో ప్రియాంకాగాంధీకి కాంగ్రెస్ నాయకత్వం బాధ్యతలు అప్పగించాలని పలువురు వాదించటం తెలిసిందే. అయితే యు.పి ఎన్నికల ప్రచారంలో ప్రియాంకాగాంధీని నిర్వీర్యం చేశారు. దీనివలన ప్రియాంకాగాంధీ జాతీయ స్థాయి నాయకురాలు కాదనే అభిప్రాయం కలిగించారు. ఇప్పుడు ఆమె రాహుల్‌గాంధీ స్థానంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినా పార్టీ బాగుపడదనే భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ వ్యూహకర్తలు యు.పి ఎన్నికల ద్వారా ప్రియాంకాగాంధీ నాయకత్వాన్ని దెబ్బ తీశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించకపోతే మాయావతి ఏం చేస్తారనేది ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించని పక్షంలో ఆమె రాజ్యసభ సభ్యురాలుగా జాతీయ రాజకీయాల్లో తనవంతు రాజకీయం చేస్తారు. రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా చూసేందుకు బి.జె.పికి పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినా ఆశ్చర్యపడకూడదు. మాయావతి తనపై ఉన్న కేసుల నుండి బైట పడేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి పట్ల మెతకవైఖరి అవలంబించే అవకాశాలు ఉన్నాయి.

కె. కైలాష్