ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విపక్షం కళ్లు తెరిచేదెపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ ప్రతిపక్ష పార్టీల అధినాయకులకు కనువిప్పు కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలకు ఐదు రాష్ట్రాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద నోట్ల రద్దు తదితర విప్లవాత్మక నిర్ణయాలకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు ఇప్పుడు కూడా కళ్లు తెరవకపోతే ప్రజాస్వామ్యానికి తీరని అన్యాయం చేసినట్టే. మోదీని ప్రతిదానికీ విమర్శించటం, ఎగతాళి చేయటం మానేసి వాస్తవాల ఆధారంగా రాజకీయాలను నడిపించడం మంచిదని ప్రతిపక్షం ఇకనైనా తెలుసుకోవాలి. మోదీ వ్యూహంతో బిజెపి అజేయశక్తిగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు కలిసి 325 సీట్లు గెలుచుకోవటమే ఇందుకు నిదర్శనం. యుపిలో దాదాపు 19 శాతం జనాభా ఉన్న ముస్లింలకు ఒక్క టిక్కెట్ కూడా కేటాయించకుండానే బిజెపి ఇన్ని సీట్లను గెలుచుకోవటం నిజంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తినట్టే. ప్రజలు ఎటువైపు వెళుతున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏ అంశాల ఆధారంగా ఓటు వేస్తున్నారు? ఎలాంటి నేతలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారు ? అనే విషయాలను ప్రతిపక్షం అర్థం చేసుకోవలసిన అవసరం ఆసన్నమైంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి బ్రహ్మరథం పట్టటం ద్వారా ప్రజలు ఆయన ఇంత వరకు తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. దాదాపు ఇరవై రెండు కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌ను స్వాధీనం చేసుకొని మోదీ తన సత్తాను చాటుకోగా, ప్రతిపక్షం నోరెళ్లబెట్టి చూస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఈ ఏడాది జూలైలో జరిగే రాష్టప్రతి ఎన్నికపై తప్పకుండా పడుతుంది. వచ్చే ఏడాది జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల శాసనసభల ఎన్నికలపైనా, 2019 లోక్‌సభ ఎన్నికలపైన ఆ ప్రభావం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వచ్చిన మోదీ రాజకీయ సునామీ ఇక మీదట కూడా కొనసాగితే గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ బిజెపి దూకుడు తప్పక కనిపిస్తుంది.
జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చెప్పినట్లు ప్రతిపక్షం 2019 లోక్‌సభ ఎన్నికలను మరిచిపోయి, 2024 ఎన్నికల గురించి ఆలోచించాలని ఇచ్చిన సలహాను ప్రతిపక్షం తు.చ తప్పకుండా పాటించవలసి వస్తుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఘన విజయంతో పాటు, మణిపూర్‌లో ‘శూన్యం’ నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బిజెపి ఎదగటం మామూలు విజయం కాదు. ప్రస్తుత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీ రానున్న రెండు సంవత్సరాల్లో రాజకీయంగా చెలరేగిపోతారు. ఆర్థిక,రాజకీయ, న్యాయ, పరిపాలనా రంగాల్లో పెద్ద ఎత్తున సంస్కరణలను అమలు చేస్తారు. ముస్లిం మహిళల మనోగతం మేరకు ‘ట్రిపుల్ తలాఖ్’ను రద్దు చేయటంతోపాటు ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తారు. రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలను మరింత పారదర్శకం చేసి, లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు వీలుగా చట్టాన్ని సవరించినా ఆశ్చర్య పోకూడదు. అవినీతి, అక్రమాలను అదుపు చేసేందుకు మోదీ ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. వ్యక్తిగతంగా అవినీతి ముద్ర లేని మోదీ మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. బిజెపి ప్రభుత్వం తీసుకునే ఇలాంటి పలు నిర్ణయాలను దేశప్రజలు సమర్థించే అవకాశాలే అధికంగా ఉన్నాయి. మోదీ విధానాలు, నిర్ణయాలను ప్రజలు సమర్థించడం అంటే- రానున్న ఎన్నికల్లో బి.జె.పికి ఓటు వేయడం అని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి.
‘పెద్దనోట్ల రద్దు ద్వారా దేశంలోని పేదలకు మోదీ తీరని అన్యాయం చేశారు, బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేశారం’టూ తాము చేసిన ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ ప్రజలే విశ్వసించనప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలు నమ్మతారని ప్రతిపక్షం ఎలా భావిస్తుంది? ఉత్తరప్రదేశ్‌లో సాధించిన బ్రహ్మాండమైన విజయం నేపథ్యంలో మోదీ రాకేట్ వేగంతో ముందుకు సాగుతూంటే దేశానికి ప్రయోజనం కలగవచ్చు. అయితే, ఈ ప్రక్రియలో మోదీ నియంతగా వ్యవహరించవచ్చునన్న అనుమానాలు లేకపోలేదు. ఆయన నీడలో బిజెపి ప్రజలకు హాని కలిగించే విధంగా వ్యవహరించవచ్చు. ఇలా జరగకుండా చూసేందుకు, ప్రజాస్వామ్యం విఘాతం లేకుండా కొనసాగేందుకు బలమైన ప్రతిపక్షం ఎంతో అవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థ కోసమైనా ప్రతిపక్షం బలపడటం చారిత్రక అవసరం. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఒక పటిష్టమైన ప్రతిపక్షం లేకుండాపోయింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ తరహా నాయకుడు అనేది చెప్పటం చాలా కష్టం. ‘ఆయన నిజంగానే నాయకుడా?’ అనే ప్రశ్న కాంగ్రెస్ నాయకులకే కలుగుతోంది. పునాదులు కదిలిపోయిన కాంగ్రెస్ త్వరలోనే కనుమరుగైపోయే ప్రమాదం లేకపోలేదు. గ్రామగ్రామాన గుర్తింపు ఉన్న కాంగ్రెస్ బతికి బట్టకట్టకపోతే జాతీయ స్థాయిలో గట్టి ప్రతిపక్షం అనేదే లేకుండాపోతుంది. కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం కూడా కనిపించటం లేదు. పెద్ద పెద్ద నాయకులు, సిద్ధాంతకర్తలున్న సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు ఏనాడో ప్రాంతీయ పార్టీలుగా మారిపోయాయి. వామపక్షాలు పేరుకే జాతీయ పార్టీలుగా మిగిలాయి. ఇక మిగతా పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే. ఈ ప్రాంతీయ పార్టీలకు తమ ప్రాంత ప్రయోజనాలు తప్ప దేశం, ప్రజల సర్వతోముఖాభివృద్ధి అనేదే పట్టదు. ప్రాంతీయ ప్రయోజనాల కోసం జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు కూడా ఈ ప్రాంతీయ పార్టీలు వెనకాడవు.
మన రాజకీయ వ్యవస్థ ఎంత మరుగుజ్జుగా మారిందంటే ఇటీవలి కాలంలో ఒక్క ప్రాంతీయ నాయకుడు కూడా జాతీయ స్థాయికి ఎదగలేకపోయారు. మోదీ మాత్రమే గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయి నుండి ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగి ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం తిరుగులేని జాతీయనేతగా ఖ్యాతి పొందారు. మోదీని జాతీయ స్థాయిలో నిలువరించగలిగే మరో జాతీయ నాయకుడు లేకుండాపోయాడు. ఆయన స్థాయిలో ప్రశ్నించగలటం లేదా తప్పులు ఎత్తి చూపగలిగే నాయకుడు ప్రతిపక్షంతోపాటు అధికార పక్షంలో కూడా కనిపించటం లేదు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎదిగిన స్థాయికి మోదీ ఎదిగారని కొందరంటుంటే మరికొందరు మాత్రం ఆయన ఇందిరాగాంధీని మించిపోయారని చెబుతున్నారు. ఇందిరా గాంధీ తిరుగులేని నాయకురాలిగా ఎదిగిన అనంతరం జరిగిన పరిణామాలు అందరికి తెలిసినవే. మోదీ కూడా తిరుగులేని స్థాయికి ఎదిగినందున ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించేందుకు జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిభావంతమైన ప్రతిపక్షం ఎంతో అవసరం. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇకనైనా చిల్లర రాజకీయాలను పక్కన జాతీయ స్థాయిలో పటిష్టమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు చిత్తశుద్ధితో యత్నించాలి. ప్రతిపక్షం ఇప్పుడు మేల్కొనకపోతే ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం తలెత్తే ప్ర మాదం లేకపోలేదు.
*

కె. కైలాష్