ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాష్టప్రతి ఎన్నికపై ఆధిపత్య పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన రాష్టప్రతి ఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య సమరానికి దారి తీయడం మంచిది కాదు. దేశ ప్రథమ పౌరుడిని నిర్ణయించడంలో అధికార, విపక్ష పార్టీలు పరస్పర సహకారంతో పని చేస్తే బాగుండేది. కానీ ఇపుడు అలా జరగటం లేదు. ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 24వ తేదీతో ముగుస్తుంది. జూలై 20న కొత్త రాష్టప్రతి ఎవరనేది తేలిపోతుంది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్టప్రతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూలును ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈనెల 14న జారీ చేస్తారు. అయితే, అభ్యర్థి విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఇంతవరకూ ఎలాంటి అవగాహన ఏర్పడలేదు. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య ఇప్పటివరకూ నామమాత్రంగానైనా ప్రస్తావన జరగకపోవటం ఆశ్చర్యకరం.
రాష్టప్రతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే బాగుంటుందంటూ అధికార పక్షాన్ని కట్టడి చేసేలా ప్రతిపక్షం ఎత్తులు వేస్తోంది. అధికార పక్షం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తాము నిర్ణయించే వ్యక్తే రాష్టప్రతి భవన్‌లో అడుగుపెడతారంటోంది. ఈ విషయమై ప్రతిపక్షాలతో చర్చిస్తామని బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా ఒకటి,రెండు సార్లు ప్రకటించినా- ఆ దిశగా ఇంత వరకు ఎలాంటి అడుగులు పడలేదు. ఇరుపక్షాలూ ఆధిపత్య పోరుకు సిద్ధం కావటంతో రాష్టప్రతి ఎన్నిక ఆసక్తికరంగా తయారైంది. తమ పార్టీ చరిత్రలో మొదటిసారి తమ అభ్యర్థిని రాష్టప్రతిగా ఎన్నుకునే అవకాశం వచ్చింది, దీనిని ఎలా జారవిడుచుకుంటామని భాజపా నాయకత్వం చెబుతోంది. అయితే, భాజపా భావజాలం ఉన్న నాయకుడు మాత్రం రాష్టప్రతిగా ఎన్నిక కాకూడదన్నది ప్రతిపక్షాల ఆలోచన. అధికార, ప్రతిపక్షాల బలాబలాలను పరిశీలిస్తే భాజపా నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి తన అభ్యర్థిని రాష్టప్రతిగా ఎన్నిక చేయించుకోగలుగుతుంది.
గతంలో ఒకరిద్దరు మినహా మిగతా రాష్టప్రతులందరూ కాంగ్రెస్‌తో సంబంధం ఉన్నవారే. ఇప్పుడు తొలిసారి భాజపా ఆలోచనా విధానంతో పని చేసే నాయకుడు రాష్టప్రతి భవన్‌లో ప్రవేశించే పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్‌డిఏ కూటమి ఇరవై ఐదు వేల ఓట్లను సంపాదించుకోగలిగితే రాష్టప్రతి ఎన్నికలో తమ అభ్యర్థిని అనాయాసంగా గెలిపించుకోగలుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా గత నెల రోజుల నుండి ఈ అంశంపై దృష్టి సారించి తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, అన్నా డిఎంకె లాంటి పలు ప్రాంతీయ పార్టీల అధినాయకులతో చర్చలు జరిపి వారి మద్దతు సంపాదంచుకోవటంలో విజయం సాధించారు. రాష్టప్రతి ఎన్నిక సమయానికి ఒకటి, రెండు ప్రాంతీయ పార్టీలు అటు,ఇటు మొగ్గు చూపినా ప్రస్తుత పరిస్థితుల్లో భాజపా అభ్యర్థికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
నరేంద్ర మోదీ రాజకీయంగా అత్యంత బలవంతుడిగా ఎదగటం బి.జె.పికి ఇప్పుడు బాగా కలిసివస్తోంది. మోదీ ప్రతిష్ట మూలంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ విధానాన్ని అవలంబించే పరిస్థితిలో లేవు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక, రాజకీయ సహకారంపై ఆధారపడిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి అభ్యర్థికి తప్పకుండా మద్దతు ఇవ్వవలసిన పరిస్థితిలో ఉన్నాయి. అందుకే బిజెపి అభ్యర్థి రాష్టప్రతి భవన్‌లో అడుగుపెట్టటం అనేది దాదాపుగా ఖాయమైపోయింది. ప్రధాని మోదీ తనకు అనుకూలంగా ఉండే నాయకుడిని రాష్టప్రతిగా ఎంపిక చేసేందుకు ఇష్టపడతారు తప్ప, ప్రతిపక్షం సూచించే వ్యక్తిని అంగీకరించరనేది అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం పట్టుదలకు పోయి ఎన్నికను అనివార్యం చేస్తే దాని వలన ఆ పార్టీలకే నష్టం కలిగి బి.జె.పికి రాజకీయంగా కలిసి వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి.
వాస్తవానికి రాష్టప్రతి పదవికి పోటీ జరగాలని బి.జె.పి కోరుకుంటోంది. గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల శాసన సభల ఎన్నికలకు ముందు జరుగుతున్న రాష్టప్రతి ఎన్నికను బిజెపి తన రాజకీయ లబ్దికి ఉపయోగించుకోవాలని భావిస్తోంది. రాష్టప్రతి పదవికి ఎన్నిక జరిగితే విపక్షం బలం ఎంతో తేలిపోతుందని బిజెపి నాయకులు చెబుతున్నారు. తమ అభ్యర్థి ఘన విజయం సాధిస్తే- ఆ ప్రభావం కర్నాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభల ఎన్నికలపై పడుతుందని బిజెపి భావిస్తోంది. విచిత్రం ఏమటంటే ప్రతిపక్షం కూడా ఇదే విధంగా ఆలోచిస్తోంది. తమకు ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పడే పక్షంలో అది బిజెపి నైతిక బలాన్ని దెబ్బతీస్తుందని ప్రతిపక్షం చెబుతోంది. ఈ ఎన్నిక దేశంలో విపక్షాల సమైక్య బలప్రదర్శనకు పనికొస్తుందని వారు అంచనా వేస్తున్నారు. అధికార పక్షం అభ్యర్థి ఎవరనేది స్పష్టమైతే తమ బలం మరింత పెరిగే అవకాశం ఉన్నదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
హిందూత్వవాది లేదా సంఘ్ పరివార్‌కు చెందిన వ్యక్తిని రాష్టప్రతి పదవికి బిజెపి ఎంపిక చేస్తే కొన్ని ప్రాంతీయ పార్టీలు విపక్ష అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. బిజెపి ఇంతవరకూ తన అభ్యర్థి పేరును వెల్లడించకపోవటం ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందిగా మారిందనేది నిజం. వాస్తవానికి రాష్టప్రతి పదవికి ప్రతిపక్షం వద్ద సరైన అభ్యర్థి లేడు. అందుకే వారు ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి మరో అవకాశం ఇవ్వాలని, ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. ఈ పదవికి జాతిపిత మహాత్మా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ, జె.డి యు సీనియర్ నాయకుడు శరద్ యాదవ్, ఎన్‌సిపి అధినాయకుడు శరద్ పవార్ పేర్లను విపక్షం పరిశీలిస్తోంది. అయితే వీరెవ్వరు కూడా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు సంపాదించలేరు. ప్రతిపక్షం తరఫున గట్టి నాయకుడిని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించటం లేదు. ఎన్‌డిఎ అభ్యర్థి విషయంలో మోదీ, షాలు అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఒడిశాకు చెందిన ప్రస్తుత ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, తావర్ చంద్ గెహ్లోట్, ఎం.వెంకయ్యనాయుడు తదితరుల పేర్లు నరేంద్ర మోదీ, అమిత్ షా పరిశీలనలో ఉన్నాయనే వార్తలు వస్తున్నా, వీటిని ఎవరూ ధ్రువీకరించటం లేదు. వాస్తవానికి బిజెపిలో రాష్టప్రతి పదవి చేపట్టే అర్హత, యోగ్యత ఎవరికైనా ఉన్నదంటే అది కేవలం- లాల్‌కృష్ణ అద్వానీ మాత్రమే. మోదీ ఎందుకోగానీ మొదటి నుండి అద్వానీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే మాట వినిపిస్తోంది.
ఇక, ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్మును రాష్టప్రతి పదవికి ఎంపిక చేస్తే ప్రతిపక్షాలు ఆమెకు మద్దతు ఇవ్వక తప్పదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి ఒక గిరిజన మహిళ రాష్టప్రతి పదవి చేపట్టినట్లు అవుతుంది కాబట్టి ప్రతిపక్షాలు ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించటం అసాధ్యం అనే చెప్పాలి. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, తావర్‌చంద్ గెహ్లోట్‌ల అభ్యర్థిత్వాలను వ్యతిరేకించటం కూడా ప్రతిపక్షాలకు కష్టమవుతుంది. అధికార పక్షానికి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షం ఏకాభిప్రాయం కోసం మొండిపట్టు పట్టటం కూడా మంచిది కాదు. దేశ ప్రథమ పౌరుడు అందరికీ చెందిన వ్యక్తి కాబట్టి అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా కలుపుగోలుగా వెళితే బాగుంటుంది.
*

కె. కైలాష్