ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కోవింద్‌కు పట్టం.. అద్వానీకి అన్యాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా తప్పు చేశారని అనలేము కానీ అద్వానీ లాంటి సీనియర్ నాయకుడి గురించి ఆలోచించకుండా తప్పు చేశారని చెప్పకతప్పదు. భాజపా కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన అద్వానీని రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం విజతతో కూడిన నిర్ణయం అయ్యేది. మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పటి నుం చి భాజపా వైఖరి పూర్తిగా మారిపోయిందనడానికి కోవింద్ అభ్యర్థిత్వం ఎంపిక అద్దం పడుతోంది. మోదీ అధ్యక్షతన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగిన అనంతరం అమిత్ షా విలేఖరుల సమావేశంలో రాష్టప్రతి పదవికి రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్‌డిఏ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ప్రకటించగానే అక్కడ ఉన్నవారంతా ఒక్కసారి విస్మయం చెందారు. రాష్టప్రతి పదవికి ఎవరూ ఊహించని వ్యక్తిని మోదీ ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ, ఇలా జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రాధాన్యత లేని వ్యక్తిని ఎంపిక చేస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఎవరీ కోవింద్? అతని ఎంపిక ఎలా జరిగింది? ఆయన ఎంపికకు ప్రాతిపదిక ఏమిటంటూ అంతా ప్రశ్నించుకున్నారు. ‘కోవింద్‌ను మోదీ ఎక్కడి నుండి తెచ్చారు? ఇంతకంటే మంచి అభ్యర్థి దొరకలేదా?’ అని రాజకీయ, పాత్రికేయ ప్రముఖులు సైతం ఎదురు ప్రశ్నలు వేశారే తప్ప, ‘ఇది మంచి ఎంపిక’ అంటూ ఒక్కరు కూడా తమ సంతృప్తి,సంతోషాన్ని వ్యక్తం చేయలేదు. అధికార, విపక్షాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు సైతం రాష్టప్రతి పదవికి అద్వానీని ఎంపిక చేస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. భాజపాలో ఎవరికైనా రాష్టప్రతి పదవి చేపట్టే అర్హత, యోగ్యత ఉన్నదంటే అది కేవలం అద్వానీకి మాత్రమే అని అందరూ అంగీకరించే విషయం. మోదీ, అమిత్‌షా రాష్టప్రతి పదవికి అద్వానీని ఎంపిక చేయటం జరగదనేది అందరికీ తెలుసు.
ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత గత మూడు సంవత్సరాల్లో మోదీ రాజకీయంగా ఎంతో ఎదిగారు కాబట్టి అద్వానీని రాష్టప్రతి పదవికి ఎంపిక చేస్తారేమోననే కాసింత ఆశ పార్టీ సీనియర్ నాయకుల్లో ఉండేది. కానీ, మోదీ విషయంలో ఇలా ఆశించడం మంచిది కాదని మరోసారి రుజువైంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి ఎంపిక జరిగే సమయంలో మోదీ అభ్యర్థిత్వాన్ని అద్వానీ, మురళీమనోహర్ జోషి వం టి సీనియర్ నాయకులు గట్టిగా వ్యతిరేకించారు. ఆ తరువాత కూడా వారు మోదీ పనితీరును పలుమార్లు తప్పుపట్టారు. అప్పటి నుండి మోదీ,అద్వానీల మధ్య దూరం పెరిగిందే తప్ప తరగలేదు. అద్వానీ పాకిస్తాన్ పర్యటన సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నాను లౌకికవాది అంటూ ప్రశంసించినప్పటి నుండి ఆర్‌ఎస్‌ఎస్‌కు కూడా దూరమయ్యారు. అయితే, ఇంతమాత్రాన రాష్టప్రతి పదవికి ఆయన అనర్హుడైపోతాడా? ఈ కారణాల చేత అతణ్ణి రాష్టప్రతి పదవికి ఎంపిక చేయకపోవటం సమర్థనీయం కాదు.
మోదీ మూలంగా 2014లో భాజపాకు భారీ మెజారిటీ లభించి ఉండవచ్చు. ఉత్తరప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ఈ స్థాయికి ఎదగటానికి అద్వానీ రథయాత్ర బలమైన పునాది అన్న వాస్తవాన్ని విస్మరించలేము. అద్వానీ రథయాత్ర మూలంగానే భాజపా జవసత్వాలు నింపుకుని కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. ఉత్తరాది పార్టీగా ముద్ర పడిన భాజపాకు దక్షిణాదిలో కూడా అద్వానీ వల్లనే గుర్తింపులభించింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తరువాత భాజపాలో అంత పేరున్న నాయకుడు అద్వానీ మాత్రమే. వాజపేయి, అద్వానీ మూలంగానే భాజపాను జనం గుర్తించే వారనేది పచ్చి నిజం. పార్టీకి పునాదిగా పనిచేసిన అద్వానీని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ ఇలా అవమానించటం సమర్థనీయం కాదు. అద్వానీని రాష్టప్రతి పదవికి ఎంపిక చేసి ఉంటే మోదీ స్థాయి మరింత పెరిగేది తప్ప తరిగేది కాదు. అద్వానీని రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం ద్వారా తనది కక్ష సాధింపు విధానం కాదని నిరూపించుకునే అవకాశాన్ని మోదీ జారవిడుచుకున్నారని చెప్పకతప్పదు. అద్వానీని ఎంపిక చేసి ఉంటే భాజపా శ్రేణులకు మంచి సందేశం వెళ్లేది. ‘పార్టీ కోసం పని చేసే వారిని భాజపా ఎప్పడూ విస్మరించద’నే సందేశం వెళ్లేది. అద్వానీని పక్కన పెట్టడం ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలను మోదీ తీవ్ర నిరుత్సాహానికి గురి చేశారు. అధినాయకత్వం కక్షసాధింపుతో వ్యవహరిస్తుందనే అభిప్రాయం కర్యకర్తలకు కలుగుతోంది. అద్వానీ లాంటి నేతకే ఈ గతి పట్టినప్పుడు తమ పరిస్థితి ఏమిటనే ఆలోచన ఈరోజు పార్టీ నాయకులు, కార్యకర్తలకు కలుగుతోంది.
అద్వానీని రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం ద్వారా తనను తాను గౌరవించుకునే అవకాశాన్ని భాజపా కోల్పోయింది. రాజ్యాంగంలో నిష్ణాతుడు కావటంతోపాటు ప్రజా జీవితంలో తలపండిన వ్యక్తి రాష్టప్రతిగా ఎన్నిక కావడాన్ని జనం హర్షిస్తారు. అధికారం చెలాయిస్తున్న వారు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయకుండా చూడటంతోపాటు అవసరమైనప్పుడు తప్పిదాలను ఎత్తిచూపించగలిగే నైతిక స్థాయి, ధైర్యం ఉన్న వారు రాష్టప్రతి పదవి చేపట్టటం మంచిది. భాజపా అధినాయకత్వం అద్వానీని విస్మరించడానికి ఇలాంటి అంశాలే కారణం కావచ్చు. ‘ముక్కుమీద గుద్దినట్లు’ మాట్లాడే అద్వానీ రాష్టప్రతి భవన్‌లో ఉండటం మోదీకి ఇష్టం లేకపోవచ్చు. అద్వానీ రాష్టప్రతి అయితే ఇబ్బందులు ఎదురవుతాయని పార్టీ అధినాయకత్వం భావించి ఉండవచ్చు.
మోదీ నాయకత్వంలో 2014లో కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్న వారికి రామ్‌నాథ్ కోవింద్ ఎంపిక పెద్దగా ఆశ్చర్యపరచదు. కార్యకర్తల విశ్వాసంపై, విలువలతో పని చేసే భాజపా ఇప్పుడు వ్యక్తి ఆరాధనలో కోట్టుకుపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలువలను పక్కన పెట్టి వ్యక్తిపూజకు, పార్టీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే అద్వానీకి బదులు కోవింద్ రాష్టప్రతి పదవికి ఎంపికయ్యారు. రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికైన తరువాత, బిహార్ గవర్నర్‌గా పని చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి పదవికి ఎంపిక చేయటం వెనక బిజెపిలో రాజకీయ ప్రయోజనం దాగి ఉంది. మోదీ, అమిత్ షా కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కోవింద్‌ను ఎంపిక చేశారు. కోవింద్‌కు దళిత కోణంతోపాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోణం కూడా ఉన్నది. కోవింద్ ఎంపిక వచ్చే ఏడాది జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పాత్ర నిర్వహించబోతోంది. గుజరాత్‌లో కోలి కులం జనాభా దాదాపు పదిహేను శాతం. కోవింద్‌ను రాష్టప్రతి భవన్‌కు పంపడం ద్వారా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కోలి వర్గం ఓట్లు పదిలం చేసుకోవాలన్నది మోదీ వ్యూహం. కోవింద్ ఎంపిక వెనక 2019 లోక్‌సభ ఎన్నికల వ్యూహం కూడా ఉన్నది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ దళితుల ఓట్లు సంపాదించుకోవటంతోపాటు రాష్టప్రతి భవన్‌లో తమకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఉండటం మోదీకి ఎంతో ముఖ్యం. అందుకే అద్వానీ లాంటి సీనియర్ నాయకుడికి బదులు అణిగిమణిగి ఉండే రామ్‌నాథ్ కోవింద్‌ను మోదీ ఎంపిక చేశారా? రాష్టప్రతి భవన్‌లో స్వతంత్రంగా వ్యవహరించగలిగే నాయకుడు ఉండటం చాలా మంది ప్రదాన మంత్రులకు ఇష్టం ఉండదనేది మాజీ రాష్టప్రతుల చరిత్ర చదివితే ఎవరికైనా అర్థం అవుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. *