ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అధికారం తప్ప ఇంకేమీ పట్టదా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతాపార్టీ అధినాయకులు అధికారం కోసం తమ మూల సిద్ధాంతాలను సైతం పక్కన పెడుతున్నారా? జమ్ము-కశ్మీర్, గుజరాత్, బిహార్ వంటి రా ష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే బిజెపి నాయకత్వానికి అధికారం తప్ప మరో అంశం పట్టటం లేదనే భావన కలుగుతోంది. జమ్ము-కశ్మీర్‌లో పిడిపి, బిజెపి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మన త్రివర్ణ పతాకాన్ని అవమానించినా ‘కమలదళం’ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మెహబూబా ముఫ్తీ దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ- కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదాను తొలగించేందుకు ప్రయత్నిస్తే తమ రాష్ట్రంలో త్రివర్ణ పతాకాన్ని మోసే వారుండరని బహిరంగంగానే హెచ్చరించారు. ఒక రకంగా ఆమె ఇస్లామిక్ తీవ్రవాదులకు మద్దతుగా మాట్లాడుతోంది, జమ్ము-కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తోంది. అయినా బిజెపి అధినాయకత్వం ఈ పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్య చేయటం లేదు. మామూలుగా అయితే త్రివర్ణ పతాకాన్ని ఎవరైనా అవమానిస్తే మొదట స్పందించేది బిజెపి, దాని అనుబంధ సంస్థలేనన్న విషయం అందరికీ తెలిసిందే.
కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదాను తొలగించాలని బిజెపి చాలాకాలం నుండి ఆలోచిస్తున్నా దానిని కార్యరూపంలో పెట్టటం లేదు. కేంద్రంలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మరుక్షణం జమ్ము-కశ్మీర్‌కు రాజ్యాంగంలోని 370వ ఆర్టికల్ కింద కల్పించిన ప్రత్యేక హోదాను తొలగించి దేశంలో పూర్తి అంతర్భాగంగా పరిగణిస్తామని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పదే పదే చెబుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజారిటీ వచ్చినా బిజెపి అధినాయకత్వం మాత్రం జమ్ము-కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదాను తొలగించేందుకు ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పిడిపితో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం కొనసాగేందుకు బిజెపి ప్రయత్నిస్తోందే తప్ప- ప్రత్యేక హోదాను తొలగించటం గురించి మాట్లాడటమే మానివేసింది. ఇప్పుడు మెహబూబా ముఫ్తీ మన జాతీయ పతాకాన్ని అవమానించే విధంగా మాట్లాడినా బిజెపి అగ్రనేతలు ఆశించిన స్థాయిలో స్పందించటం లేదు. ‘త్రివర్ణ పతాకం శవయాత్ర’ జరిపితే దాన్ని మోసేందుకు ఒక్కరు కూడా ముందుకు రారని మెహబూబా బాహాటంగా ప్రకటించినా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన ‘కమలనాథులు’ నోరు విప్పటం లేదు. మెహబూబా నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుండి తప్పుకోవాలనే ఆలోచన కూడా బిజెపికి రాకపోవటం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకు నిరసనగా నితీశ్‌కుమార్ బిజెపితో తెగతెంపులు చేసుకోవటం అందరికీ తెలిసిందే. బిజెపితో బంధం తెంచుకునేందుకు నరేంద్ర మోదీని ‘మతతత్వ వాది’గా ముద్రవేసిన ఘనత నితీష్‌కుమార్‌ది. బిహార్‌లో బిజెపి అధికారంలోకి రాకుండా చేసేందుకు నితీష్‌కుమార్ గత ఎన్నికల్లో ఆర్‌జెడి, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసి విజయం సాధించాడు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించి కేంద్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పిన రాజకీయ పండితుడు నితీష్‌కుమార్. బిహార్‌లో అధికారం కోసం బిజెపి నాయకత్వం- మోదీని మతతత్వ వాదిగా నిందించిన నితీష్‌కుమార్‌తో చేతులు కలిపింది. అవినీతిని ఎదుర్కొంటున్నందుకే నితీష్‌కుమార్‌కు మద్దతు పలికినట్లు బిజెపి ప్రకటించటం హాస్యాస్పదంగా ఉంది.
అవినీతికి కేంద్రంగా మారిన ఆర్‌జెడి అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌తో తెగతెంపులు చేసుకునేందుకే బిజెపి నుంచి తాను మద్దతు తీసుకున్నానని, ఇందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని నితీష్‌కుమార్ రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. మహాకూటమిని ఏర్పాటు చేసినప్పుడు లాలూప్రసాద్ యాదవ్ అవినీతిపరుడని నితీష్‌కుమార్‌కు తెలియదా? పశుగ్రాసం కుంభకోణం మూలంగా లాలూ ప్రసాద్ జైలు జీవితం గడిపిరావటం నితీష్‌కుమార్‌కు గుర్తులేదా? నితీష్‌కుమార్ అధికారం కోసం అవకాశవాద రాజకీయాలు చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. తాను అధికారంలో ఉండేందుకు ఆయన కాంగ్రెస్, ఆర్‌జెడి, బిజెపి తదితర అన్ని పార్టీలను ఉపయోగించుకున్నాడు. నితీష్‌కుమార్‌కు నిజంగానే అధికార దాహం లేకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జెడితో చేతులు కలిపి ఉండాల్సింది కాదు. అధికారంలో కొనసాగేందుకు ఆయన ఇప్పుడు మరోసారి బి.జె.పిని వాడుకుంటున్నాడు. బిజెపి అధినాయకత్వం కూడా బిహార్‌లో అధికారం కోసం అవకాశవాద రాజకీయానికి పెద్దపీట వేసి నితీష్‌కుమార్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధం కావడం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి అంతా 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవటంపైనే పూర్తిగా కేంద్రీకృతమై ఉన్నది. ఈ లక్ష్యసాధన కోసం బిజెపి అధినాయకత్వం ఇప్పుడు బిహార్‌లో నితీష్‌కుమార్ అధికారంలో కొనసాగేందుకు మద్దతు ఇస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ అవివీతిపరుడనేది జగమెరిగిన సత్యం. అంతటి అవినీతిపరుడితో కలిసి పని చేయటం కూడా అవినీతికి పాల్పడటంతో సమానమే. తప్పుచేసే వారిని కాపాడటం, వెనకేసుకు రావటం కూడా తప్పే అనే వాస్తవం నితీష్‌కుమార్, నరేంద్ర మోదీలకు తెలియదా? 2019 లోక్‌సభ ఎన్నికల కోసం బిహార్‌లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బిజెపి, జె.డి యు నేతలు రాజకీయ కుట్ర చేశారా? అనే అనుమానం కలుగకమానదు. లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యుల నివాసాలపై సి.బి.ఐ దాడులు చేయటం, లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని నితీష్‌కుమార్ పరోక్షంగా సూచించటం వంటి పరిణామాలు ఒక పథకం ప్రకారం జరిగాయనే అనుమానం కలుగుతోంది.
అవినీతి ఆరోపణలు వచ్చిన తేజస్వీ యాదవ్ మంత్రి పదవికి రాజీనామా చేయనందుకు నితీష్‌కుమార్ చివరికి సిఎం పదవికి రాజీనామా చేయటం, ఆ మరుసటి రోజే బిజెపి మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటమంతా ఒక రాజకీయ నాటకంగా జరిగిపోయింది. నితీష్‌కుమార్ రాజీనామా చేసినందున, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎక్కువ మంది శాసన సభ్యులు ఉన్న ఆర్.జె.డికి గవర్నర్ అవకాశం ఇవ్వాలి. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని పక్షంలో మరో పార్టీని ఆహ్వానించవలసిన బాధ్యత రాష్ట్ర గవర్నర్‌ది. అయితే, బిహార్ గవర్నర్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్‌కుమార్‌కు వెనువెంటనే బి.జె.పి మద్దతు ఇవ్వటం, ఆ మరుసటి రోజే గవర్నర్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించటం ప్రజాస్వామ్య విధానానికి విరుద్దంగా జరిగిందని చెప్పకతప్పదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తినే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఎలా ఆహ్వానిస్తారు?
ఇక గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చే తెచ్చేలా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఐదోసారి రాజ్యసభకు ఎన్నిక కాకుండా చేసేందుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రజాస్వామ్యానికి తిలోదకాలిస్తున్నారు. గుజరాత్ శాసనసభలో కాంగ్రెస్ పక్షం చీఫ్‌విప్ బల్వంత్‌సింగ్ తన పార్టీకి రాజీనామా చేసి వచ్చిన కొన్ని నిమిషాలకే బి.జె.పి తీర్థం ఇవ్వటంతోపాటు రాజ్యసభకు పోటీ చేసేందుకు టిక్కెట్ కేటాయించటం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ఠ. ఆరుగురు కాంగ్రెస్ శాసన సభ్యుల చేత పార్టీ ఫిరాయింపు చేయించటం రాజకీయ అవినీతి కాదా? ఈ సంవత్సరం డిసెంబర్‌లో జరిగే గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావటంతోపాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుండి ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు బిజెపి తహతహలాడుతోంది. అహ్మద్ పటేల్‌ను రాజ్యసభ ఎన్నికల్లో ఓడించటం ద్వారా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయాలన్నది అమిత్ షా, మోదీ వ్యూహం. ఈ ప్రక్రియలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమైపోతోంది, ప్రతిష్టను కోల్పోతోందనే వాస్తవాన్ని వారు గ్రహించటం లేదు.
*

కె