ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

వ్యవస్థీకృత అవినీతికి బాధ్యులెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే వ్యవస్థీకృత అవినీతి అంతం కావటం ఎంతో అవసరం. వ్యవస్థీకృత అవినీతికి చరమగీతం పాడుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు వంటి విప్లవాత్మక చర్యల ద్వారా అవినీతిని అంతం చేసే దిశగా ప్రయాణం ప్రారంభించానని ఆయన చెబుతున్నారు. అయితే, దేశ ప్రజలు ఆశిస్తున్న విధంగా వ్యవస్థీకృత అవినీతికి చరమ గీతం పాడాలంటే ఏం చేయాలనేది ముందు నిర్ణయించుకోవలసి ఉంటుంది. వ్యవస్థీకృత అవినీతికి మూల స్తంభం- రాజకీయ అవినీతి అనే వాస్తవాన్ని నరేంద్ర మోదీ మొదట గ్రహించటం మంచిది. రాజకీయ వ్యవస్థీకృత అవినీతిని అంతం చేసేందుకు అవసరమైన చర్యలను చిత్తశుద్ధితో తీసుకుంటే మిగతా అవినీతి దానంతటదే దారికి వస్తుంది. దేశంలోని చిన్న,పెద్ద నాయకులందరూ కూడా అవినీతికి మంగళం పాడాలని కోడై కూస్తూనే ఉంటారు తప్ప దానిని ఆచరణలో పెట్టరనేది పచ్చి నిజం. అందుకే ప్రతి రంగంలో పాతుకుపోయిన అవినీతిని అంతం చేయలేకపోతున్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ యువ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ, వ్యవస్థీకృత అవినీతిని కూకటివేళ్లతో తొలగించకపోతే దేశాభివృద్ధి ఎన్నటికీ సాధ్యం కాదన్నారు. వ్యవస్థీకృత అవినీతిని అంతం చేసేందుకు యువ పారిశ్రామికవేత్తలు నడుము బిగించాలని ప్రధాన మంత్రి పిలుపు ఇచ్చారు. ఇటువంటి పిలుపులతో అవినీతి అంతం కాదనేది జగమెరిగిన సత్యం. అవినీతి అదుపులోకి రావాలంటే మొదట రాజకీయ అవినీతిని అదుపు చేయవలసి ఉంటుంది. అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ స్థాయిలో యథాశక్తిన అవినీతికి పాల్పడటం వల్లనే దీనిని అదుపుచేయటం సాధ్యం కావటం లేదు. ‘యథారాజా తథా ప్రజ’ అన్నట్లు పాలకులు నీతి నిజాయితీతో వ్యవహరిస్తే కింది స్థాయిలో ఉన్నవారు తమంత తాము దారిలోకి వస్తారు, వ్యవస్థలోని ప్రతి అంగం నిజాయితీతో పని చేస్తే మొత్తం వ్యవస్థ అవినీతి రహితం అవుతుంది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో భారీ కుంభకోణాలు లేకుండాపోయాయనేది నిజం.
కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ పది సంవత్సరాల పాలనలో అనేకానేక కుంభకోణాలతో దేశం అవినీతిమయమైపోయింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిజాయితీపరుడే. అయితే అతడ్ని నడిపించేవారు, అతని మంత్రివర్గ సహచరులు అవినీతిపరులు కావటం వల్లనే యు.పి.ఏ పది సంవత్సరాల కాలంలో అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలింది. దీనికి భిన్నంగా ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం కుంభకోణాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతోంది. ‘తినను.. తిననివ్వను’ అనే నినాదానికి నరేంద్ర మోదీ కట్టుబడి ఉండటం వల్ల మంత్రులు కూడా నిజాయితీగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్.డి.ఏ హయాంలో పెద్దపెద్ద కుంభకోణాలు జరగకపోయినా కింది స్థాయిలో అవినీతి, అక్రమాలు ఎప్పటి మాదిరిగానే కొనసాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు బి.జె.పి ముఖ్యమంత్రులతోపాటు ఎన్.డి.ఏ భాగస్వామ్య పార్టీలు తమ రాష్ట్రాల్లో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
బి.జె.పి పాలిత ఝార్ఖండ్‌లో ఒక మంత్రి భార్య అటవీ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించలేదు. ఒక మంత్రి భార్య ఇలా అక్రమాలకు పాల్పడుతుంటే మిగతా మంత్రులు, అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారనేది విడిగా చెప్పనక్కర లేదు. మధ్యప్రదేశ్‌లో కూడా కొందరు మంత్రులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాజస్తాన్‌లో కూడా ఇదే పరిస్థితి. హర్యానాలో రాష్ట్ర బి.జె.పి అధ్యక్షుడు, ఆయన సన్నిహితులు అడ్డుఅదుపు లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. హర్యానా బి.జె.పి అధ్యక్షుడి కుమారుడు చండీగఢ్‌లో అర్ధరాత్రి సమయంలో ఒక యువతిని వెంటాడి వేధించడం సంచలనం సృష్టించింది. ఇక ఎన్.డి.ఏ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్న పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాయనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
కేంద్ర స్థాయిలో అవినీతిని అదుపుచేసేందుకు కృషి చేస్తున్న నరేంద్ర మోదీ ఎన్.డి.ఏ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొనసాగుతున్న అవినీతినిపై ఎందుకు దృష్టి సారించటం లేదు? ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పాలకులకు అధికారులు తోడు కావటంతో అవినీతికి అదుపు లేకుండా పోతోంది. కొందరు ముఖ్యమంత్రులు నీతి నిజాయితీల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు తప్ప తాము చెప్పే దానిని ఆచరణలో అమలు చేయరు. ప్రజలకు నీతినిజాయితీలను బోధిస్తూ తాము మాత్రం తెర వెనక అవినీతికి పాల్పడుతుంటారు. రోడ్ల నిర్మాణాలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో భయంకరమైన అవినీతి చోటుచేసుకుంటోంది. కొన్ని పథకాలు, ప్రాజెక్టుల్లో వందలు, వేల కోట్లు స్వాహా అవుతున్నాయి. పాలకులు ఇలా అవినీతిని ప్రోత్సహించటం వలన అధికారులు కూడా పేట్రేగిపోతున్నారు. కొందరు నాయకుల మాదిరిగానే కొంతమంది అధికారులు కూడా నిజాయితీగా పని చేసినా అవినీతికి పాల్పడే నాయకులు, అధికారుల సంఖ్య అధికం కావటంతో సమాజం కుప్పకూలుతోంది. వ్యవస్థీకృత అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి వేయాలంటే మొదట రాజకీయ వ్యవస్థలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలి.
ఎన్నికల్లో ‘గెలుపు గుర్రాల’కు ప్రాధాన్యత ఇచ్చినంత కాలం అవినీతిని అదుపు చేయటం సాధ్యం కాదనే వాస్తవాన్ని నరేంద్ర మోదీ, ఇతర నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో సీట్లు విక్రయించటం మానివేయనంత వరకు ఏ స్థాయిలోనూ అవినీతిని అదుపు చేయటమే సాధ్యం కాదు. అలాంటప్పుడు వ్యవస్థీకృత అవినీతిని ఎలా అదుపు చేస్తారు? లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల కోసం వేట మానివేయాలి. గెలుస్తామన్న ధీమా ఉన్నవారికే ఎన్నికల్లో కోట్లకు కోట్లు ఖర్చు చేయగలిగే శక్తియుక్తులు ఉంటాయి. లోక్‌సభకు గెలిచేందుకు యాభై నుండి వంద కోట్లు ఖర్చు చేసే వారు, అసెంబ్లీకి పది నుండి యాభై కోట్ల వరకు ఖర్చు చేసేవారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చినంత కాలం అవినీతిని అదుపు చేయటం కలలోని మాటే అవుతుంది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి చట్టసభలకు ఎన్నికైన వారు తమ పెట్టుబడిని రాబట్టుకునేందుకు అవినీతికి పాల్పడకుండా ఎలా ఊరుకుంటారు? గెలిచేందుకు పెట్టిన పెట్టుబడికి రెండింతలు,నాలుగింతలు సంపాదించేందుకు సహజంగానే ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నమే అవినీతికి మూలం అవుతోంది. డెబ్బై కోట్లు ఖర్చు చేసి లోక్‌సభకు గెలిచాను, ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి ఐదు శాతం వడ్డీ కూడా లభించటం లేదని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో కొందరు ఎం.పిలు వాపోతుంటే మరి కొందరు చక్రం తిప్పే ఎం.పిలు ఇబ్బడికి ముబ్బడిగా సంపాదించుకుంటున్నారు.
ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలిచే ఎం.పిలు ప్రజల అభివృద్ది, దేశాభివృద్దికి ఎలా పని చేస్తారు? వారి దృష్టి అంతా అక్రమ సంపాదనపై కేంద్రీకృతమవుతోంది. అందుకే ఎన్నికల సంస్కరణలు రానంత వరకు రాజకీయ అవినీతిని అదుపుచేయటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లు గెలుచుకోవటం ద్వారా భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి రావాలనే కార్యచరణ పథకాన్ని భారతీయ జనతాపార్టీ సిద్ధం చేసుకుంటోంది. ఈ కార్యచరణ పథకంలో ‘గెలుపు గుర్రాల’కే ప్రాధాన్యత ఇస్తారనేది నిర్వివాదాంశం. రాజకీయ పార్టీలు ఏం చేసైనా విజయం సాధించాలని, అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి. ఈ లక్ష్య సాధన కోసం మొత్తం వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదనకు ఎలాంటి మార్గాన్ని అనుసరించినా తప్పులేదని భావించటం సర్వసామాన్యమైపోయింది.
అక్రమ సంపాదనను వెలికి తీసేందుకు అదాయం పన్ను అధికారులు, సి.బి.ఐ చేసే దాడులను అక్రమార్కులు తమ ప్రతిష్టగా భావించే మనస్తతత్వం పెరుగుతోంది. అక్రమ సంపాదన పరువుప్రతిష్టలకు చిహ్నంగా మారుతోంది. నిజాయితీపరులను ‘పనికిరాని వారిగా, దద్దమ్మలు’గా భావించే వారి సంఖ్య బాగా పెరిగింది. అందుకే అవినీతి వ్యవస్థీకృతమైంది. వ్యవస్థీకృత అవినీతి విష వలయాన్ని ఛేదించేందుకు మొదట రాజకీయ అవినీతిని కనిష్ట స్థాయికి తీసుకురావాలి. అర్థబలం, అంగబలం ఉన్న వారికి టికెట్లు ఇచ్చి గెలిపించే బదులు నీతి నిజాయితీతో పని చేసే వారిని చట్టసభల్లోకి తెస్తే వ్యవస్థీకృత అవినీతి దానంతటదే అదృశ్యమైపోతుంది. రాజ్యసభ సీటును ఇరవై నుండి యాభై కోట్లకు విక్రయించే ముఖ్యమంత్రులున్నంత కాలం వ్యవస్థీకృత అవినీతిని అదుపు చేయటం సాధ్యం కాదు. ‘ఓటుకు నోటు’ ఇచ్చే వారిపై చర్య తీసుకోకుండా వ్యవస్థీకృత అవినీతిని ఎలా అంతం చేస్తారు?
*

కె కైలాష్