ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

వ్యవస్థ మారనిదే నవభారతం అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుండా ఫలితాలు సాధించటం అసాధ్యం. 2022 నాటికి నవ భారతాన్ని నిర్మించాలని కలలు కంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ లక్ష్య సాధన కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన నవ భారత నిర్మాణానికి భాగస్వాములు కావాలని గవర్నర్లకు పిలుపు ఇచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు వందల విశ్వవిద్యాలయాల్లో మన దేశానికి చెందిన ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేకపోవటం పట్ల ఎంతో బాధపడుతున్న నరేంద్ర మోదీ ఈ లక్ష్య సాధన కోసం, విశ్వవిద్యాలయాల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. దేశానికి వేలాది సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్య వ్యవస్థను బహూకరించినా ఇప్పుడు అప్రజాస్వామ్యం, గూండాయిజానికి పేరు గాంచిన బిహార్ రాజధాని పాట్నాలోని పాట్నా విశ్వవిద్యాలయం శత జయంతి వేడుకల సందర్భంగా నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రపంచంలోని ఐదువందల అత్యుత్తమ విశ్వవిద్యాలయాల స్థాయికి దేశీయ విశ్వవిద్యాలయాలు ఎదిగేందుకు ఆయన పది వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతోపాటు కేంద్ర, రాష్ట్ర నియమ, నిబంధనల నుండి పూర్తి విముక్తి కల్పించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రంగంలోని పది, ప్రైవేట్ రంగంలోని పది విశ్వవిద్యాలయాలకు ఈ అవకాశం కల్పిస్తామంటూ దీని కోసం ఈ విశ్వవిద్యాలయాలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవలసి ఉంటుందంటూ వాటి మధ్య పోటీ పెట్టారు. గవర్నర్లు నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలుగా ఎదిగేందుకు ఇరవై దేశీయ విశ్వవిద్యాలయాలకు కొత్త పథకం ప్రకటిస్తూ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలు పూర్తిగా లోపభూయిష్టమైనవి.
కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు తన ఇష్టానుసారం గవర్నర్లను నియమిస్తున్నప్పుడు వారు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దిష్టిబొమ్మలుగా మారితే, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. గవర్నర్ల నియామకంలో రాజకీయాలే కీలకపాత్ర నిర్వహిస్తున్నాయి తప్ప అభివృద్ధి, సామర్థ్యం, నిష్పక్షపాతం, తెలివితేటలను పరిగణనలోకి తీసుకోవటం లేదనేది జగమెరిగిన సత్యం. కేంద్రంలో బి.జె.పి అధికారంలో ఉంటే బి.జె.పికి చెందిన వారిని, బి.జె.పికి అనుకూలంగా ఉండే వారిని గవర్నర్లుగా నియమిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే తమ పార్టీ సీనియర్ నాయకులు, తమకు అనుకూలంగా ఉండే వారిని నియమిస్తున్నారు. రాజ్‌భవన్‌లు సీనియర్ నాయకులు, అధికారంలో ఉన్న వారికి జీహుజూర్ అనే వారికి ఉపాధి కల్పనా కేంద్రాలుగా మారాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇదే తంతు కొనసాగుతోంది. గవర్నర్ ప్రజల వద్దకు వెళ్లే ప్రతి పనిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తిప్పికొట్టాయి తప్ప ప్రోత్సహించలేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల ఉత్సాహం రాజకీయ వివాదాలకు తావిస్తే అధికార పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల తప్పుల గురించి ఆలోచించటమే మానివేశారు. గవర్నర్లు తమ అవసరం ప్రకారం పని చేయటం నేర్చుకున్నారు తప్ప వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఏ రోజు పని చేయలేదు. నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా గవర్నర్ల విషయంలో ఇదే ధోరణి కొనసాగుతోంది. బి.జె.పి సీనియర్ నాయకులు లేదా అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉండే వారినే గవర్నర్లుగా నియమించారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కేవలం ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించే వారిని, తపన పడే వారిని, మదనపడే వారిని గవర్నర్లుగా నియమించిన దాఖలాలు బి.జె.పి హయాంలోకానీ, కాంగ్రెస్ హయాంలోనే కానీ మచ్చుకు కూడా కనిపించవు. ఈ నేపథ్యంలోగవర్నర్లు ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యారు తప్ప నిజంగా ప్రజలకు సేవ చేయగలిగే వ్యవస్థగా రూపారంతరం చెందలేకపోయారు. గవర్నర్ల నియామకం నిష్పక్షపాతంగా జరగనంత వరకు వారు అభివృద్ధి ప్రేరకాలుగా మారలేరు. రాజకీయ బంధనాలతో గవర్నర్ పదవి చేపడుతున్న వ్యక్తి తన రాజకీయావసరాల ఆధారంగానే పనిచేస్తాడు తప్ప నిష్పక్షపాతంగా పని చేయలేడు. గవర్నర్ వ్యవస్థను పరిశుభ్రపరచనంత వరకు దీని నుండి మంచి ఫలితాలను ఆశించలేము. వ్యవస్థను బాగుపరచకుండా మంచి ఫలితాలు కోరుకోవటం మంచి విధానం కాదు. రాష్టప్రతి ప్రొయాక్టివ్‌గా పనిచేస్తే ప్రధాన మంత్రికి నచ్చదు, గవర్నర్ ప్రోయాక్టివ్‌గా పనిచేయటం ముఖ్యమంత్రులకు ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలో గవర్నర్లు అభివృద్ధికి ప్రేరకాలుగా ఎరా మారగలుగుతారు?
గవర్నర్ల వ్యవస్థ మాదిరిగానే మన విశ్వవిద్యాలయాల వ్యవస్థ కూడా ఆశ్రీతపక్షపాతం, రాజకీయ వ్యవస్థ, వర్ణవ్యవస్థ, అవినీతి, జవాబుదారితనం లేకపోవడం, చిత్తశుద్ధిలేమి వంటి దుర్గుణాల ఊబిలో కూరుకుపోయాయి. ఢిల్లీలోని ప్రఖ్యాత జె.ఎన్.యు నుండి రాష్ట్ర స్థాయిలోని విశ్వవిద్యాలయాల వరకు అన్నింటిలో ఈ దుర్గుణాలు చోటు చేసుకున్నాయి. ఈ దుర్గుణాలు దూరం కానంత వరకు మన దేశంలోని ఏ ఒక్క విశ్వవిద్యాలయం కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగలేదు. ఈ విశ్వవిద్యాలయాలను బాగుపరచకుండా కొత్తగా ఇరవై విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచేందుకు కొత్త పథకాన్ని ప్రకటించటం అర్థరహితమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విశ్వవిద్యాలయాలు సక్రమంగా పనిచేయటం లేదని కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రారంభించారు. ఈరోజు అవి కూడా ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయాయి. నరేంద్ర మోదీ పాట్నాలో చేసిన ప్రకటన ప్రకారం ప్రభుత్వ పరిధిలోని పది విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ రంగంలోని పది విశ్వవిద్యాలయాలను వాటి సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేసి ఐదు సంవత్సరాల పాటు పది వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయటంతోపాటు అన్ని ప్రభుత్వ బంధనాల నుండి విముక్తి కల్పిస్తారు. అంటే ప్రభుత్వం ఎస్.సి. ఎస్.టి, బి.సిలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు, ఇతర షరతుల నుండి విముక్తి కల్పిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ పథకానికి ఎంపికయ్యేందుకు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని విశ్వవిద్యాలయాలు పోటీ పడవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక ప్రత్యేక కమిటీ ఈ ఇరవై విశ్వవిద్యాలయాలను అవి ప్రతిపాదించే తమ సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేస్తుంది. నరేంద్ర మోదీ కొత్త పథకం ప్రకటనతో దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఉన్నత విద్య పట్ల తమకు ఉన్న బాధ్యతల నుండి ఎలా తప్పుకుంటారు? ఇప్పుడున్న విశ్వవిద్యాలయాలలోని రుగ్మతలను తొలగించి సమర్థవంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రావటం లేదు? దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు నిధుల లోపం మూలంగా సక్రమంగా పని చేయలేకపోతున్నాయి. ఆయా ప్రభుత్వాల జోక్యం మూలంగా అవి ఎదగలేకపోతున్నాయనేది నరేంద్ర మోదీకి తెలియదా? విశ్వవిద్యాలయాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల జోక్యాన్ని తగ్గించి ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహిస్తే వాటి స్థాయి కూడా పెరుగుతుంది. నిధుల కొరత, బోధనా సిబ్బంది కొరత, రాజకీయాల జోక్యం మూలంగా కృంగిపోతున్న విశ్వవిద్యాలయాలను బాగుపరచకుండా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయటం వలన ఆశించిన ఫలితాలను సాధించటం సాధ్యం కాదు. వెయ్యి, పదిహేను వందల సంవత్సరాల క్రితం మన దేశంలో తక్షశిల, నలందా తదితర ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఈ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేసేందుకు ప్రంచంలోని పలు దేశాల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చే వారు. ఇప్పుడు మన దేశంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు లేకుండాపోయాయంటూ నరేంద్ర మోదీ వాపోయారు. ప్రపంచంలోని ఐదు వందల అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మన దేశానికి చెందిన విశ్వవిద్యాలయం ఒక్కటి కూడా లేకపోవటం పట్ల నరేంద్ర మోదీ పడిన బాధను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా ఎందుకు జరిగిందనేది ఆయన ఆర్థం చేసుకోకపోవటం బాధాకరం. రోగం ఏమిటనేది తెలుసుకుని దానికి అవసరమైన వైద్యం చేయటం మంచి వైద్యుడి లక్షణం. నరేంద్రమోదీ మొదట మన విశ్వవిద్యాలయాల దుస్థితికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకుని వాటి తొలగింపునకు అవసరమైన చర్యలు తీసుకోవటం మంచిది. ఇలా చేయకుండా ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని ఇరవై విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసి వాటిని ప్రభుత్వ నిబంధనల బంధనాల నుండి తొలగించి పది వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసినంత మాత్రాన బాధ్యత తీరుతుందా? దేశంలోని మొత్తం వ్యవస్థను బాగు పరచవలిసిన అవసరం ఉన్నది, అసలు వ్యవస్థ బాగుపడకుండా విద్యా వ్యవస్థ, గవర్నర్ల వ్యవస్థలు బాగుపడవు.

కె కైలాష్