ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

నిందలు వదలి.. నిజాయితీతో గెలవలేరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారానికి అలవాటుపడిన రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించటం పూర్తిగా మరిచిపోయారు. ఎన్నికల సమయంలో ఈ మరుపు మరింత పెరిగి ఒకరినొకరు అత్యంత హేమమైన పద్ధతిలో విమర్శించుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బి.జె.పి, కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మణిశంకర్ అయ్యర్ లాంటి నాయకుల అసభ్యకర పదజాలం ప్రజలకు నాయకుల పట్ల ఉన్న జుగుప్సను మరింత పెంచుతున్నాయి. ప్రజలకు అబద్ధాలు చెప్పటంతోపాటు తప్పుదోవ పట్టించటం ద్వారా గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బి.జె.పి కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతమాత్రం హర్షణీయం కాదు. ప్రత్యర్థులపై బురద చల్లేందుకు రెండు పార్టీలు చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. మణిశంకర్ అయ్యర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘నీచుడు’గా ముద్ర వేశారు. నరేంద్ర మోదీ దీనిని రాజకీయం చేస్తూ మణిశంకర్ అయ్యర్ తనను హత్య చేయించేందుకు పాకిస్తాన్‌కు వెళ్లి ఉగ్రవాదులకు సుపారి (కాంట్రాక్ట్) ఇచ్చి వచ్చాడని ఆరోపించారు. గుజరాత్‌లో బి.జె.పి, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతోంది. అందుకే తమ ప్రత్యర్థులను ప్రజల దృష్టిలో అప్రతిష్టపాలు చేసేందుకు ఒకరిపై మరొకరు బురదచల్లుకుంటున్నారు. తాము చేపట్టిన బురద చల్లే కార్యక్రమం వలన గుజరాత్‌లో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీయటంతోపాటు పార్టీని గెలిపించేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని నిర్వీర్యం చేస్తున్నాయనేది మణిశంకర్ అయ్యర్, కపిల్ సిబల్ వంటి సీనియర్ నాయకులు అర్థం చేసుకోవటం లేదు.
బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి సంధర్భంగా ఢిల్లీలో జరిగిన ఒక సభలో నరేంద్ర మోదీ చేసిన ఒక వ్యాఖ్య మూలంగా నెలకొన్న వివాదం కాంగ్రెస్‌ను ఊహించని స్థాయిలో దెబ్బ తీసింది. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను తుడిచివేసేందుకు కొందరు ప్రయత్నించారని మోదీ ఆరోపించారు. దీనికి మణిశంకర్ అయ్యర్ స్పందిస్తూ అంబేద్కర్ వర్థంతిని కూడా రాజకీయం చేసిన నరేంద్ర మోదీ నీచుడు, నీచ స్థాయికి చెందిన వాడు, అతనికి సభ్యత, సంస్కారం లేదంటూ దుమ్మెత్తిపోశారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం రాహుల్‌గాంధీ బి.జె.పితో హోరాహోరి పోరాటం చేస్తున్న సమయంలో అయ్యర్ ఇలాంటి అరోపణలు చేయటం ఆత్మహత్యాసదృశం. మణిశంకర్ అయ్యర్ రుద్దిన ఈ బురదను నరేంద్ర మోదీ బి.జె.పికి అనుకూలంగా మార్చుకునేందుకు ఒక నిమిషం కూడా వృధా చేయలేదు. ‘నీచుడ’ని మణిశంకర్ అయ్యర్ చేసిన విమర్శ తనతోపాటు మొత్తం దేశాన్ని అవమానపరచడమేనని, దేశ ప్రధాన మంత్రిని నీచుడని అనటం అంటే ప్రజలందరిని అన్నట్లు కాదా? అంటూ నరేంద్ర మోదీ రాజకీయం చేయటంతో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగిపోయింది. తాను వెనుకబడిన కులాలకుచెందిన వాడిని కాబట్టే నీచుడిగా ముద్ర వేశారంటూ మోదీ చేసిన ప్రకటన కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగులు తీయించింది. మణిశంకర్ అయ్యర్ ఆరోపణల మూలంగా గుజరాత్‌లో కాంగ్రెస్‌కు జరుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలించిందనేది ఎన్నికల ఫలితాల తరువాతనే తెలుస్తుంది. మణిశంకర్ అయ్యర్ చేత ప్రధానికిక్షమాపణలు చెప్పించడంవలన ప్రయోజనం లేదని గ్రహించిన రాహుల్ గాంధీ ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించారు. ప్రధాన మంత్రి పట్ల తమకు పూర్తి గౌరవం ఉందంటూ రాహుల్ గాంధీ బహిరంగ ప్రకటన చేసినా ఫలితం లేకుండాపోయింది. మణిశంకర్ అయ్యర్ గతంలో కూడా నరేంద్రమోదీపై బాధ్యతారహితమైన ప్రకటనలు చేయటం ద్వారా కాంగ్రెస్‌ను నవ్వులపాలు చేశారు. చాయ్‌వాలా ప్రధానమంత్రి అయ్యారంటూ మణిశంకర్ అయ్యర్ చేసిన విమర్శ ఇప్పటికీ కాంగ్రెస్‌ను పట్టిపీడిస్తోంది. చాయ్ అమ్ముకునే నరేంద్రమోదీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరు, ఓటమి తరువాత ఆయన చాయ్ అమ్ముకోవాలనుకుంటే ఏ.ఐ.సి.సి కార్యాలయం ఎదుట తగు ఏర్పాట్లు చేసి పెడతామని మణిశంకర్ అయ్యర్ 2014 లోకసభ ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించటం తెలిసిందే. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత చాయ్‌వాలా విమర్శను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయారు. ఒక చాయ్‌వాలా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యే స్థాయికి భారత ప్రజాస్వామ్యం ఎదిగిపోయిందని విదేశీ ప్రముఖులు కితాబులివ్వటం కాంగ్రెస్‌ను ఇప్పటికీ ఇబ్బందుల్లో పడవేస్తోంది. దేశాన్ని ఆమ్ముకునే వారికంటే చాయ్ అమ్మే వాడిగా ఉండటమే మంచిదంటూ మోదీ ఇప్పటికీ సూటిపోటి మాటలతో కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే ఉన్నారు. మణిశంకర్ అయ్యర్ ఇటీవల కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల విషయంలో చేసిన మరో వ్యాఖ్య ఆ పార్టీ పరువు తీయటంతోపాటు రాహుల్ గాంధీని ఇరకాటంలో పడవేసింది. షాజహాన్ తరువాత జహంగీర్ అధికారం చేపట్టినప్పుడు ఎన్నిక జరిగిందా? ఔరంగజేబ్ చక్రవర్తి అయినప్పుడు ఎన్నిక జరిగిందా? రాజు కొడుకు రాజు అవుతాడు అదే విధంగా సోనియా గాంధి తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతాడని మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించటం తెలిసిందే. మణిశంకర్ అయ్యర్ చేసిన ఈ ప్రకటనకు మోదీ తనదైన మలుపు ఇస్తూ రాహుల్ గాంధీ ఔరంగజేబ్‌తో సమానమంటూ ఎద్దేవ చేశారు. ఔరంగజేబ్ పాలనను కోరుకుంటున్న కాంగ్రెస్‌ను అభినందిస్తున్నానని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ తనను ఔరంగజేబ్ అనేందుకు అవకాశం కల్పించినందుకు రాహుల్ గాంధీ మండిపడుతున్న సమయంలో మణిశంకర్ అయ్యర్ ప్రధానమంత్రిని ‘నీచుడు’ అంటూ దుయ్యబట్టారు. అందుకే మణిశంకర్ అయ్యర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఊడిపోయింది.
మరో సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ బాబ్రీ మసీదు-రాజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టులో చేసిన ప్రతిపాదన కూడా కాంగ్రెస్‌ను గుజరాత్‌లో ఇరకాటంలో పడవేసింది. బాబ్రీమసీదు-రామజన్మభూమి వివాదానికి సంబంధించిన విచారణ 2019 లోకసభ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు వాయిదా వేయాలంటూ కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో ప్రతిపాదించారు. కపిల్ సిబల్ చేసిన ఈ ప్రతిపాదన గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసే అవకాశాన్నిస్తోంది. అంతేగాక కాంగ్రెస్‌ను విమర్శించేందుకు మోదీకి మరో మంచి అస్త్రంగా మారింది. సున్ని వక్ఫ్ బోర్డు తరపున సుప్రీంకోర్టుకు హాజరైన కపిల్ సిబల్ 2019లో లోకసభ ఎన్నికలు జరిగేంత వరకు బాబ్రీమసీదు-రామజన్మభూమి కేసు విచారణను వాయిదా వేయాలని డిమాండ్ చేసి నాలిక కరుచుకున్నారు. గుజరాత్‌లో హిందువుల ఓట్లు సంపాదించేందుకు రాహుల్ గాంధీ ప్రతి గుడికి వెళ్లి దండాలు పెట్టుకుంటుంటే బుద్ధి ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఎవరైనా సుప్రీంకోర్టులో ఇలాంటి ప్రతిపాదన చేస్తారా? కాంగ్రెస్ నాయకులు అతి తెలివికి పెట్టింది పేరు. అందుకే కపిల్ సిబల్‌లాంటి సీనియర్ నాయకుడు సైతం చేసిన తప్పు నుండి తప్పించుకునేందుకు నరేంద్ర మోదీపై ప్రత్యారోపణలు చేసి మరింత బురదలో ఇరుక్కున్నారు. రాహుల్ గాంధీ గుజరాత్‌లో దేవాలయాల చుట్టు తిరుగుతుంటే కపిల్ సిబల్ సున్ని వక్ఫ్ బోర్డు తరపున అయోధ్య కేసుకు ఎలా హాజరవుతారని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. దీనికి కపిల్ సిబల్ స్పందిస్తూ మోదీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, తాను సున్ని వక్ఫ్ బోర్డు తరపున అయోధ్య కేసుకు హాజరు కాలేదని వివరణ ఇచ్చారు. అయితే ఆయన సున్ని వక్ఫ్ బోర్డు తరపున సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణకు హాజరయ్యారనేది నిర్ధారణ కావటంతో కాంగ్రెస్‌కు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. గుజరాత్‌లో హిందు ఓటర్ల మద్దతు సంపాదించేందుకు రాహుల్ గాంధీ రాష్ట్రంలోని ప్రతి చిన్న, పెద్ద దేవాలయానికి వెళ్లివచ్చారు. కనిపించిన ప్రతి దేవుడికి మొక్కటంతోపాటు తాను యజ్ఞోపవీతం ధరించే బ్రాహ్మణుడినంటూ ఒక చోట మాట కూడా జారారు. బి.జె.పి లాంటి హిందువాద పార్టీ ఉండగా రాహుల్ గాంధీ లాంటి నకిలీ హిందుత్వవాదికి గుజరాత్ ప్రజలు ఓటు వేయరంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లి వ్యాఖ్యానించిన నేపథ్యంలో కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో సున్ని వక్ఫ్ బోర్డు తరపున హాజరై అయోధ్య రామమందిరం కేసును లోకసభ ఎన్నికలు జరిగేంత వరకు వాయిదా వేయాలని ప్రతిపాదించటం వలన కాంగ్రెస్‌కు ఊహకందని దెబ్బ తగిలింది. హిందూ ఓటర్ల సానుభూతి సంపాదించేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలకు కపిల్ సిబల్ ప్రతిపాదన అశనిపాతంగా తగిలింది. గుజరాత్ శాసన సభ ఎన్నికలు బి.జె.పికి ఏకపక్షం అవుతాయనుకున్న వారందరి ఆంచనాలను రాహుల్ గాంధీ తలకిందులు చేశాడు. కాంగ్రెస్‌ను బి.జె.పి స్థాయికి తీసుకురావటంతోపాటు మోదీకి గట్టి ప్రత్యర్థిగా రాహుల్ గాంధీ ఎదిగారు. బి.జె.పికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వటంతోపాటు విజయం సాధించే సూచనలు ఉన్నాయనే అభిప్రాయం రాహుల్ గాంధీ కలిగించగలిగారు. ఈ నేపథ్యంలో మణిశంకర్ అయ్యర్, కపిల్ సిబల్‌లు రాహుల్ గాంధీ కృషిపై నీళ్లు చల్లారని చెప్పకతప్పదు. ఈ ఇరువురు నాయకులు కొంత హుందాగా వ్యవహరిస్తే గుజరాత్‌లో కాంగ్రెస్ మరింత బలపడేది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే పక్షంలో దానికి మణిశంకర్ అయ్యర్, కపిల్ సిబల్‌లు బాధ్యత వహించక తప్పదు.

కె కైలాష్