ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

శీతాకాల సమావేశాల్లో బీజేపీ వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందు ఊహించినట్లే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన గొడవలు, గందరగోళం మూలంగా కొట్టుకుపోయాయి. అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటు శీతాకాల సమావేశాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నించటం శోచనీయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా ఇరకాటంలో పెట్టాలనే పట్టుదలతో వ్యవహరించిన కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షం పార్లమెంటు ఉభయ సభలు ముఖ్యంగా రాజ్యసభలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు సంబంధించని అంశాలపై పార్లమెంటును స్తంభింపజేశాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరులపై చేసిన విమర్శలను అడ్డం పెట్టుకుని పార్లమెంటు ఉభయసభలను కొన్ని రోజుల పాటు ప్రతిపక్షం జరగనీయలేదు. అధికార పార్టీకి మెజారిటీ ఉన్న లోకసభ పలు సందర్భాలలో మధ్యాహ్నం నుండి పనిచేసినా రాజ్యసభ కార్యకలాపాలను మాత్రం ప్రతిపక్షం పూర్తిగా దెబ్బతీసింది. నరేంద్రమోదీ వచ్చి క్షమాపణలు చెబితే తప్ప సభను నడవనిచ్చేది లేదని ప్రతిపక్షం భీష్మించుకుని కూర్చున్నది. క్షమాపణలు చేప్పేది లేదంటూ మోదీ ప్రభుత్వం కూడా అంతే మొండి పట్టుదలతో వ్యవహరించటంతో చివరకు ప్రతిపక్షమే దిగిరాక తప్పలేదు. తెరవెనక జరిగిన పలు దఫాల చర్చల అనంతరం మోదీ తరపున రాజ్యసభ నాయకుడు, ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సభలో ఒక వివరణ ఇవ్వటంతో ప్రతిపక్షం చల్లబడింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఎలాంటి విలువ ఉండదనేది ప్రపంచానికి తెలుసు. అయినా ప్రతిపక్షం ప్రతిష్ఠకుపోయింది. నరేంద్ర మోదీ సభకు వచ్చి క్షమాపణలు చెప్పటం అటుంచితే చివరకు వివరణ కూడా ఇవ్వడదనేది ప్రతిపక్షానికి బాగా తెలుసు. అయినా తమ మొండిపట్టు విడువకుండా ఉభయసభల ముఖ్యంగా రాజ్యసభ విలువైన సమయాన్ని ప్రతిపక్షం వృధా చేయటాన్ని క్షమించలేము. ఏదైనా ఫలితం వస్తోందంటే పోరాడవచ్చు కానీ చివరకు మిగిలేదీ ఏమీ ఉండదని తెలిసి కూడా ప్రతిపక్షం గొడవ చేయటం అర్థరహితం. మహారాష్టల్రోని కోరేగావ్‌లో దళితులపై జరిగిన దాడి సంఘటనను కూడా ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయం చేసింది తప్ప దళితుల ప్రయోజనాలను కాపాడే దిశగా పార్లమెంటులో పనిచేయలేదు. కోరేగావ్‌లో దళితులపై జరిగిన దాడిని ఖండించే పేరుతో ప్రతిపక్షాలు ఉభయ సభల్లో గొడవచేసి స్తంభింపజేశాయి. గొడవలు, గందరగోళాల అనంతరం కొంత చర్చ జరిపారు. ఎవరి వాదన వారు వినిపించి వెళ్లిపోయారు తప్ప గొడవ ఎందుకు జరిగింది? దానికి కారకులు ఎవరు? ఇలాంటివి జరుగకుండా నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాలి? అనే అంశంపై స్పష్టత తీసుకురాలేకపోయాయి. ఆయా పార్టీలు తమ వాదన వినిపించటం మినహా సమస్య పరిష్కారానికి కృషి చేయకపోవటం సిగ్గుచేటు. రాజకీయ పార్టీలు, నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవటం, పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం మినహా అర్థవంతమైన చర్చ జరిపి ప్రజలకు ఆదర్శం కాలేకపోతున్నారు. అందుకే పార్లమెంటులో జరిగే చర్చల నుండి ఎవ్వరు ఏమీ నేర్చుకోలేకపోతున్నారు. వాస్తవానికి పార్లమెంటు చర్చలు ఊకదంపుడు ఉపన్యాసాలుగా మారుతున్నాయి తప్ప ప్రయోజనాలు సాధించే సాధనాలుగా మారటం లేదు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు చట్ట రూపం ఇచ్చే విషయంలో కూడా ఇదే జరిగింది. లోకసభ ఆమోదించిన ట్రిపుల్ తలాక్ బిల్లు, వెనుకబడిన కులాల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించకపోవటానికి ప్రతిపక్షంతోపాటు అధికారపక్షంకూడా బాధ్యత వహించకతప్పదు.
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎన్‌డీఏ రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లును లోకసభ ఆమోదించినా రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది. బి.జె.పికి మెజారిటీ ఉన్న లోకసభలో ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ కొద్దిపాటి నిరసనలతో ఆమోదించింది. లోకసభలో ఈ బిల్లుకు తాము ప్రతిపాదించిన సవరణలపై కాంగ్రెస్ ఓటింగ్‌కోసం పట్టుకూడా పట్టలేదు. ఎం.ఐ.ఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించిన సవరణలకు కూడా కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు. బిల్లులో ట్రిపుల్ తలాక్ ఇచ్చే ముస్లిం పురుషులకు విధించే మూడు సంవత్సరాల శిక్ష క్లాజును సవరించాలని కోరుతూ సవరణ ప్రతిపాదించిన కాంగ్రెస్ దానిపై ఓటింగ్ కోసం ఎందుకు పట్టుపట్టలేదు. లోకసభ ఆమోదించిన ఈ బిల్లు రాజ్యసభకు రాగానే కాంగ్రెస్ వైఖరి పూర్తిగా మారిపోయింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును గొడవ మధ్య సభలో ప్రతిపాదించగానే దీనిని సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ సవరణ ప్రతిపాదించింది. ముస్లిం మహిళలకు న్యాయం జరగాలంటే దీనిని సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిందేనంటూ గొడవ చేసింది. లోకసభలో ఆమోదించి రాజ్యసభలో ఎందుకు గొడవ చేస్తున్నారన్న అరుణ్‌జైట్లీ ప్రశ్నకు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పలేకపోయారు. ఇదిలా ఉంటే అధికారపక్షం కూడా దీనిని ప్రతిపక్షం కోరుతున్న విధంగా రాజ్యసభ సెలక్ట్ కమిటీకి పంపించి బడ్జెట్ సమావేశాల్లో చట్టరూపం ఇవ్వాలని మొదట భావించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలకు కూడా తెలియజేసింది. అయితే బి.జె.పి ఆఖరు నిముషంలో తమ మనసు మార్చుకోవటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. విచిత్రం ఏమిటంటే బి.జె.పి మిత్రపక్షాలైన తెలుగుదేశం, అన్నాడి.ఎం.కె, బిజూ జనతాదళ్ పార్టీలు కూడా ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేయటమే కాదు దీని కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపాయి. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం నాయకుడు, రాజ్యసభలో పార్టీ పక్షం ఉపనాయకుడు సి.ఎం.రమేష్ ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో దీనికోసం అంతర్ లాబీలో చర్చలు జరిపారు. అందుకే రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ సభలో సెలెక్ట్ కమిటీ తీర్మానం ప్రతిపాదిస్తూ ప్రతిపక్షం తరపున కమిటీలో ఉండే సభ్యుల జాబితాలో సి.ఎం.రమేష్ పేరు కూడా ప్రస్తావించటం గమనార్హం. తెలుగుదేశం, అన్నా డి.ఎం.కె, బిజూ జనతాదళ్ పార్టీలు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతుంటే బి.జె.పి అధినాయకత్వం చూస్తూ ఊరుకోవటం ఏమిటి? ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందకపోవటానికి ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం కూడా బాధ్యత వహించకతప్పదు. బి.జె.పి తమ మిత్రపక్షాల మద్దతు కూడా నిలబెట్టుకోలేకపోతే బిల్లుకు రాజ్యసభ ఆమోదం ఎలా లభిస్తుంది? బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు చేసిన తెరవెనక రాజకీయాల మూలంగానే ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించలేదని చెప్పకతప్పదు.
వెనుకబడిన కులాల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు లోకసభ ఆమోదం లభించకపోవటానికి అధికార పక్షమే పూర్తి బాధ్యత వహించతప్పదు. బి.సి జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును మూడింట రెండు వంతుల మెజారిటీతో లోకసభలో ఆమోదించవలసి ఉండింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి దీనిని సాధరణ మెజారిటీతో ఆమోదించేందుకు వీలులేదు. ఈ బిల్లును గతవారం బుధ, గురు, శుక్రవారాల్లో లోకసభ కార్యక్రమాల్లో చేర్చారు. భారీ మెజారిటీతో ఆమోదించేందుకు బి.జె.పి అధినాయకత్వం తమ ఎం.పిలకు విప్ కూడా జారీ చేసింది. అయితే బి.జె.పి ఎం.పిలు లోకసభకు పెద్దఎత్తున గైర్‌హాజరు కావటంతో అధికార పక్షం ఈ బిల్లుపై ఓటింగ్ జరపలేకపోయింది. లోకసభలో బి.జె.పికి భారీ మెజారిటీ ఉన్నా ఎందుకిలా జరిగింది? బి.జె.పి ఎం.పిలు విప్‌ను ఎందుకు బేఖాతరు చేశారు? అనే ప్రశ్నలకు పార్టీ పెద్దలు సమాధానం చెప్పవలసి ఉన్నది. తనను తాను వెనుకబడిన కులాల వ్యక్తిగా చెప్పుకునే నరేంద్ర మోదీ కూడా ఈ బిల్లు విషయంలో ఎందుకు పట్టుదలతో వ్యవహరించలేకపోయారు? శీతాకాల సమావేశాల్లో తాము రెండు చరిత్రాత్మిక బిల్లులు, ట్రిపుల్ తలాక్, బి.సి జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లులకు పార్లమెంటు ఆమోదం తీసుకోబోతోన్నామంటూ గొప్పగా చెప్పుకున్న బి.జె.పి తన లక్ష్యాన్ని సాధించటంలో ఘోరంగా విఫలమైంది.