ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

జమిలి ఎన్నికలే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక దేశం, ఒక ఎన్నికల సిద్ధాంతాన్ని ఇకనైనా అమలు చేయటం మంచిది. ఒక దేశం ఒక పన్నుల విధానానికి శ్రీకారం చుట్టిన చోట ఒక దేశం ఒక ఎన్నికల విధానానికి కూడా ఓటు వేయటం మంచిది. గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ప్రక్రియ ముగిసిందో లేదో నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ఎన్నికలు వచ్చాయి. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ఒక కొలిక్కి రాగానే కర్నాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలు తన్నుకు వస్తాయి. ఇవి కాగానే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ మరి కొన్ని రాష్ట్రాల ఎన్నికలను జరుపవలసి ఉంటుంది. ఇవి కాగానే లోకసభ, తెలంగాణా, ఆంధ్రా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. శాసనసభలతోపాటు స్థానిక సంస్థలు, సహకార సంస్థలు, ఇతర ఎన్నికలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దీని వలన దేశానికి ఎంతో నష్టం జరుగుతోందనే వాస్తవాన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా గ్రహించి జమిలి ఎన్నికలకు సిద్ధమైపోవాలి. లోకసభతోపాటే అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు నిర్వహించటం ద్వారా ప్రజాధనం వృధా కాకుండా చూడటంతోపాటు ప్రభుత్వాలు అభివృద్ధి పథకాల అమలు, పరిపాలనపై దృష్టి పెట్టేందుకు వీలు కల్పించటం మంచిది. ఒకసారి లోకసభకు ఆ తరువాత ప్రతి సంవత్సరం నాలుగైదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరగటం వలన ప్రజాధనం వృధా కావటంతోపాటు ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాయి. నాయకుల దృష్టి అంతా ఎన్నికల కోసం సమాయత్తం కావటంపై కేంద్రీకృతం కావటంతో పాలనపై శ్రద్ధ తగ్గుతోంది. అభివృద్ధి పథకాలు అమలులో జాప్యం జరుగుతోంది. వాటి ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. దేశాభివృద్ధికంటే ఎన్నికల ప్రక్రియకే ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తోంది. 2014లో లోకసభ ఎన్నికలు జరగటం అందరికి తెలిసిందే. భారత పార్లమెంటరీ చరిత్రలో తొమ్మిది దశల్లో ఈ ఎన్నికలు జరిగాయి. లోకసభతోపాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. 2014 సంవత్సరాంతంలో హర్యానా, జమ్ముకశ్మీర్ జార్ఖండ్, మహారాష్ట్ర శాసన సభల ఎన్నికలు జరిగాయి. 2014 సంవత్సరమంతా ఎన్నికలతో సరిపోయింది. ఈ సంవత్సరం లోకసభతోపాటు మొత్తం ఎన్నిమిది రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరిగాయి. 2014లో జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా తమ పూర్తి సమయాన్ని ఎన్నికలకు ఖర్చు చేయటంతో ప్రజలు, వారి సమస్యల గురించి ఆలోచించటం గగనమైపోయింది. 2015లో దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన బిహార్ శాసన సభ ఎన్నికలు జరిగాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ సాధించేందుకు బి.జె.పి కూటమి కాంగ్రెస్, ఆర్.జె.డి, జనతాదళ్ (ఎస్) పార్టీలతో కూడిన మహాకూటమి మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. 2016లో ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరిగాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2017 సంవత్సరాన్ని కూడా ఎన్నికల సంవత్సరంగానే పరిగణించవచ్చు. 2017 సంవత్సరం ప్రారంభంలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత భారత రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నికల ప్రక్రియ చోటుచేసుకున్నది. ఇది ముగియగానే సంవత్సరాంతంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసనసభల ఎన్నికలు జరిగాయి. 2018 కొత్త సంవత్సరం మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో మన తలుపుతట్టింది. ఈ సంవత్సరం కూడా ఒక రంగంగా ఎన్నికల సంవత్సరంమే. 2018లో మొత్తం ఎనిమిది రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరుగవలసి ఉన్నది. ఈశాన్యంలోని త్రిపుర, నాగాలాండ్ మేఘాలయ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మన ముందు నిలుస్తాయి. మేలో శాసనసభ కాల పరిమితి ముగుస్తున్న కర్నాటక ఎన్నికల ప్రక్రియను మే నెల ప్రారంభంలో పూర్తి చేయవలసి ఉంటుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కుస్తీ ముగియగానే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు మన ముందుకు వస్తాయి. బి.జె.పి అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తోపాటు మిజోరం ఎన్నికలు ఈ సంవత్సరాంతంలో జరుగవలసి ఉన్నది. ఈ ఎన్నికల ప్రక్రియ ముగియగానే మళ్లీ లోకసభ, తెలంగాణా, ఆంధ్రా, ఒడిశా, సిక్కిం ఎన్నికల పండుగ ప్రారంభం అవుతుంది. ఈ లెక్కన 2014 నుండి దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఇకమీదట కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆయా రాష్ట్రాల నాయకులు ఒకసారి మాత్రమే ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నా జాతీయ పార్టీల నాయకులు మాత్రం ప్రతి సంవత్సరం ఎన్నికలపై దృష్టి కేంద్రీకరిచవలసి వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, ఇతర ప్రముఖ పార్టీల చాలా సమయం ఎన్నికల ఏర్పాట్ల కోసం వృధా అవుతోంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ఖర్చు, ప్రచారం తదితర పనులకే జాతీయ పార్టీల సమయాన్ని వెచ్చించవలసి వస్తోంది. ఎన్నికల ఖర్చు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నాలుగు సంవత్సరాలలో ఐదారు నెలల సమయాన్ని ఎన్నికల ప్రచారం, ఇతర పనుల కోసం వినియోగించవలసి వచ్చింది. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల కోసం సమయాన్ని వెచ్చించకతప్పలేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోకసభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఒకేసారి నిర్వహించటం మంచిదని వాదిస్తున్నారు. ఇలా చేయటం వలన అధికారంలో ఉన్న వారు పాలనపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలుంటుంది. ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేసేందుకు అవసరమైన సమయం లభిస్తుందన్నది అతని వాదన. నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జమిలి ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాల నుండి సానుకూల స్పందన పెద్దగా రావటం రాకపోవటం దురదృష్టకరం. నిరంతర ఎన్నికల విష వలయం నుండి దేశాన్ని, దేశ ప్రజలను కాపాడవలసిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీతోపాటు ప్రతిపక్షాలపై కూడా ఉన్నది. అధికార, ప్రతిపక్షాలు కలిసి పని చేస్తేనే జమిలి ఎన్నికలు సాధ్యమవుతాయి. అందుకే అధికార, ప్రతిపక్షాలు తమ పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి దేశ శ్రేయస్సు కోసం జమిలి ఎన్నికల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించటం మంచిది. నిరంతర ఎన్నికల మూలంగా సమర్థవంతమైన పరిపాలన అనేది అసాధ్యంగా మారింది. సమర్థ పరిపాలన కొరవడటం వలన దేశాభివృద్ది పెద్దఎత్తున కుంటుపడుతోంది. సమర్థ పాలన కరువుకావటంతోపాటు అధికార యంత్రాంగం దృష్టి అంతా ఎన్నికల పనులపై కేంద్రీకృతం కావటంతో అభివృద్ధి పథకాల అమలు అనేది ఒక కలగా మారుతోంది. అధికారులు నెలల తరబడి ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోవటంతో పథకాల అభివృద్ధి అనేది మూలకుపడుతోంది. ఎన్నికల సమయంలో కనీసం మూడు నెలలపాటు అభివృద్ధి పథకాల అమలుకు తాళం పడటం ఎంతవరకు శ్రేయస్కరం. ఎన్నికల మూలంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటంతోపాటు శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయి. ఎన్నికల సమయంలో సంఘ వ్యతిరేకశక్తుల పంటపడుతోంది. ప్రతి రాజకీయ పార్టీ ఎంతో కొంత సంఘ వ్యతిరేకశక్తులను ఎన్నికల సయమంలో ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మార్గదర్శక సూత్రాలు అమలులోకి రావటంతో అభివృద్ధి పథకాల అమలు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. లోకసభ, శాసనసభల ఎన్నికలతోపాటు ఇతర అన్నిరకాల ఎన్నికలు ఐదు సంవత్సరాలకు ఒకేసారి జరిగితే అధికారంలో ఉన్న పార్టీ తమ పూర్తి సమయం, దృష్టిని అభివృద్ధి, పరిపాలనపై కేంద్రీకరించగలుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగంకూడా ఏకాగ్రతతో ప్రభుత్వ పథకాలను అమలు చేయగలుగుతుంది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం తప్పొప్పులను ప్రజల ముందు పెట్టగలుగుతాయి. నిరంతర ఎన్నికల మూలంగా అధికార, ప్రతిపక్షాల తమ విద్యుక్త ధర్మాన్ని సమర్థంగా నిర్వహించలేకపోతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జమిలి ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు ఆమోద ముద్ర వేయాలి. ముందస్తు ఎన్నికలకు స్వస్తి పలకటంతోపాటు మధ్యలో ఎన్నికలు జరపవలసి వస్తే వాటిని మిగతా సమయానికి మాత్రమే వర్తించేలా చట్టం చేయాలి. తద్వారా లోకసభ, శాసన సభలతోపాటు ఇతర అన్ని రకాల ఎన్నికలను ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవటం మంచిది.