ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అభివృద్ధి ఫలాలు కొందరికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసియాన్ దేశాలకు చెందిన పదిమంది అధినేతల సమక్షంలో రాజ్‌పథ్‌లో 69వ గణతంత్ర దినోత్సవం వేడుకలను మనం అత్యంత వైభవంగా జరుపుకున్నాము. మన సైనికశక్తితోపాటు సాంస్కృతిక భిన్నత్వాన్ని ఆసియాన్ దేశాల అధినేతల కళ్లకట్టేలా ప్రదర్శించాము. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆహ్వానించారు. భారతదేశంలో ‘రెడ్ టేప్’ను పూర్తిగా తొలగించి మీ కోసం ‘రెడ్ కార్పెట్’ను పరిచినట్లు నరేంద్ర మోదీ సగర్వంగా ప్రకటించారు. ‘మీకు సంపద కావాలన్నా, మంచితనం కావాలన్నా భారతదేశానికి రండి, మీకు ఆరోగ్యం, సంపూర్ణత్వం కావాలన్నా భారతదేశానికి రండి, మీకు శాంతి, సౌభాగ్యం కావాలంటే భారతదేశం రండి, మీరు ఎప్పుడు వచ్చినా స్వాగతిస్తాము’ అని వారికి పిలుపుఇచ్చారు. భారతదేశాన్ని పెట్టుబడులకు స్వర్గ్ధామంగా మార్చివేశామని ఈ సందర్భంగా ప్రకటించారు. మోదీ చెప్పినట్లు మన దేశంలో సంపద అంత పెరిగిపోయిందా? ఆరోగ్యం, సంపూర్ణత్వం, శాంతి, సౌభాగ్యం అంతగా ఉన్నాయా? దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత పుట్టిన వారు కూడా నిరక్ష్యరాస్యతలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉపాధి లేక అన్నమోరామచంద్రా అంటూ తల్లడిల్లిపోతున్నారు. గత డెబ్బయి సంవత్సరాల్లో దేశం పలు రంగాల్లో అభివృద్ధి చెందినా సగటు మనిషి ఇంకా బీదరికంలో కొట్టుమిట్టాడుతున్నాడు.
దావోస్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విడుదలైన వార్షిక ఓక్సఫామ్ సర్వే ప్రకారం దేశంలోని దాదాపు 70 కోట్లమంది బీదల ఆదాయం కేవలం ఒక శాతం చొప్పున పెరిగితే దేశంలోని ఒక శాతం ధనికుల వద్ద 73 శాతం దేశ సంపద ఉన్నది. దేశంలో 2017లో ఉత్పత్తి అయిన సంపదలో 73 శాతం సంపద ఒక శాతం ధనికులకు చేరింది. సరళీకృత ఆర్థిక విధానాల వలన దేశంలోని ధనికులకు అధికశాతం లాభం కలిగితే బడుగు ,బలహీన వర్గాల ప్రజలకు కలిగిన ప్రయోజనం అంతంత మాత్రమే. సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా కలుగుతున్న లాభం, ఉత్పత్తి అవుతున్న సంపద దేశంలోని కోట్లాది మంది పేదలకు చేరటం లేదు. సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా బీదలకు ప్రయోజనం కలిగించే వ్యవస్థను ఏర్పాటు చేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే సంపద సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడటంలో ప్రభుత్వాలు విఫలం కావటం వల్ల 2014లో కేవలం పది శాతం మంది ధనికులు 56 శాతం జాతీయ ఆదాయాన్ని స్వంతం చేసుకోగలిగారని ఓక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. ‘్భరత ఆదాయం అసమానత్వాలు, 1922-2014, బ్రిటిష్‌రాజ్ నుండి బిలియనీర్ రాజ్’ అనే పేరుతో విడుదల చేసిన ఈ పరిశోధనాపత్రంలో ఆదాయానికి సంబంధించిన పలు అసమానతలను వెలుగులోకి తెచ్చారు. ఈ పరిశోధనాపత్రం ప్రకారం 1930 సంవత్సరంలో దేశంలోని ఒక శాతం అత్యంత ధనికులు మొత్తం ఆదాయం నుండి 21 శాతం ఆదాయాన్ని తన్నుకుపోయారు. 1980లో ఇది ఆరుశాతానికి పడిపోగా 2014లో దేశంలోని ఒక శాతం అత్యంత ధనికులు దేశం మొత్తం ఆదాయం నుండి 22 శాతం ఆదాయాన్ని తమ స్వంతం చేసుకున్నారు. ఓక్స్‌ఫామ్ సర్వే నివేదిక ప్రకారం 2017లో దేశంలోని ఒక శాతం అత్యంత ధనికుల సంపద 20.9 లక్షల కోట్లు పెరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం 2017-18 మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలతో సమానం. కోట్లాది మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన కొట్టుమిట్టాడుతుంటే ధనికులు మాత్రం తమ ఆదాయాన్ని పెంచుకోగలలుగుతున్నారని నివేదిక వెల్లడించింది. బీదల ఆదాయం పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటే బిలియనీర్ల సంఖ్య మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరగటం దేశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి సంకేతం కానేకాదు. కోటీశ్వర్ల సంఖ్య పెరగటం అంటే సమ్మిళిత ఆర్థికాభివృద్ధి లేదనేందుకు సంకేతం, దేశ ఆర్థిక వ్యవస్థ విఫలమవుతోందనేందుకు నిదర్శనం. దేశంలో ఉత్పత్తి అవుతున్న సంపద ప్రజలందరికి చేరకుండా కొందరికి మాత్రమే చేరుతోందనేందుకు ప్రబల నిదర్శనం. కష్టపడి పనిచేస్తున్నవారు, దేశానికి అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నవారు, వౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నవారు, కార్మాగారాల్లో పనిచేస్తున్న వారు తమ పిల్లల విద్య, వైద్య అవసరాలు తీర్చేందుకు అష్టకష్టాలు పడవలసి వస్తోంది. వారికి రెండు పూటల తిండి సంపాదించటమే గగనమైపోతోంది. ధనికులు, బీదల మధ్య ఆర్థిక వ్యత్యాసం పెరిగిపోవటం వలన ప్రజాస్వామ్యం విఫలమవుతుంటే అవినీతి, ఆశ్రీతపక్షపాతం పెరిగిపోతున్నాయి. దేశంలోని పది శాతం మంది ధనికుల చేతుల్లో 73 శాతం దేశ సంపద కేంద్రీకృతమై ఉన్నది. సగటు మనిషి ఆదాయం ఒకటి, రెండు శాతం చొప్పున పెరుగుతుంటే కోటీశ్వరుల ఆదాయం మాత్రం పదమూడు శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలోని రెడీమేడ్ బట్టల కర్మాగారంలో పనిచేసే ఒక ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్ సంవత్సరాదాయమంత ఆదాయాన్ని ఒక కనీసవేతనం పొందే గ్రామీణుడు సంపాదించాలంటే 941 సంవత్సరాలు పడుతుందని నివేదికలలో పేర్కొన్నారు. ఆమెరికాలో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఒక సంవత్సరంలో సంపాదించేటంత ఆదాయాన్ని ఒక సగటు కార్మికుడు సంపాదించాలంటే ఒక సంవత్సర సమయం పడుతుంది. ఈ లెక్కన మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కూలీల జీవితాలు ఎంత దుర్భంగా ఉన్నాయనేది స్పష్టం అవుతుంది. సమ్మిళిత అభివృద్ది (ఇంక్లుజివ్ గ్రోత్) కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామంటూ మన జాతీయ, ప్రాంతీయ నాయకులు చేసే ప్రసంగాలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప వారి మాటల్లో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అర్థంపర్థం లేని హామీలు, పథకాల ద్వారా దేశంలోని సగటు మనిషిని గందరగోళంలో పడవేసి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప వారు నిజంగా సమ్మిళిత అభివృద్ధికి కృషి చేయటం లేదనే చెప్పాలి. దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ప్రభుత్వాన్ని, సగటు మనిషిని దోచుకోవటం ద్వారా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తారు తప్ప నిజమైన అభివృద్ధిని సాధించటం ద్వారా ప్రగతిని సాధించటం లేదు. బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులు నుండి తీసుకున్న వందలు, వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టటం ఇందుకు నిదర్శనం. సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పంచే రంగాలను ప్రోత్సహించవలసి ఉంటుందనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. అయినా ఈ దిశగా పెద్దగా కృషి జరగటం లేదు. వ్యవసాయ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడి పెడితే గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించవచ్చు. దేశంలోని బీదలకు సామాజిక భద్రత కల్పించే పథకాలను సమర్థంగా అమలు చేయటం ద్వారా ఈ లక్ష్య్యాన్ని సాధించవచ్చు. సామాజిక భద్రతా పథకాల నిధులు దుర్వినియోగం కాకుండా చూడగలగాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్దిదారులకు చేరాలి. కానీ అలా జరగటం లేదు. ప్రధాని మోదీ ప్రారంభించిన జనధన్ పథకాన్ని ఎన్ని బ్యాంకులు సక్రమంగా అమలు చేశాయి? చాలా బ్యాంకులు నిజమైన లబ్దిదారులకు ఈ పథకం కింద రుణాలు మంజూరు చేయకుండా తమకు నిర్ణయించిన లక్ష్యాలను సాధించేందుకు ఇష్టమైన వారికి రుణాలు మంజూరు చేసి చేతులు దలుపుకున్నాయి. జనధన్ రుణాల పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు జరగకపోవటం శోచనీయం. దేశంలో సులభంగా జీవించే వ్యాపార వాతావరణాన్ని ఏర్పాటు చేసిన తామిక మీదట దేశ ప్రజలకు సులభ జీవిత వాతావరణం సృష్టించేందుకు కృషి చేస్తామని మోదీ హామీ ఇస్తున్నారు. దేశ ప్రజలందరికి సులభ జీవిత వాతావుణం నెలకొనాలంటే సమ్మిళిత అభివృద్ది ఎంతో అవసరం. దేశానికి స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు అవుతున్నా సగటు మనిషి ఈ రోజుకు కూడా సాధికారత దక్కలేదంటే ప్రజలకు ఏ స్థాయిలో అన్యాయం జరిగిపోయిందనేది అర్థం అవుతుంది. సగటు మనిషి అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం పని చేసిన రోజే సులభ జీవిత లక్ష్యం సాధ్యమవుతుందనేది ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించటం మంచిది.

కె కైలాష్