ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

హద్దు మీరిన గోరక్షణ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవుల రక్షణ పేరుతో కొందరు చేస్తున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవలసిన సమయం వచ్చింది. గోరక్షణ పేరుతో కొందరు చేస్తున్న రాజకీయం సమాజాన్ని నిలువునా చీలుస్తున్నాయి. మత ఘర్షణలతోపాటు కుల వివక్షకు దారి తీస్తున్నాయి. ఈ సంఘటనల మూలంగా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో చెడ్డపేరు వస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో మాంసం కోసం ఆవును చంపారనే ఆరోపణపై మహమ్మద్ అఖ్లాక్ సేఫిని హత్య చేసిన సంఘటన ఎలాంటి దుష్పరిణామాలకు దారి తీసిందో అందరికి తెలిసిందే. ఆవు చర్మం వలిచారనే నెపంతో గుజరాత్‌లోని ఊనా పట్టణంలో ఏడుగురు దళితులను చితకబాదిన సంఘటన పార్లమెంటును స్తంభింపజేసింది. గోరక్షణ రాజకీయం సమాజంలోని అత్యంత వెనుకబడి ఉన్న దళితుల జీవితాలను దుర్భరం చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహించే గుజరాత్‌లో దళితులకు రక్షణ లేకుండా పోయింది. హిందు మతానికి చెడ్డపేరు తెస్తున్న గో రక్షణ దళాల ఆటకట్టించకపోతే పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం నెలకొంటోంది.
గుజరాత్‌లోని గిర్ సోంనాథ్ జిల్లా ఉన్న ఉనా పట్టణంలో జూలై పదకొండో తేదీనాడు ఏడుగురు దళితులు ఆవు చర్మాన్ని వలుస్తున్నారనే ఆరోపణతో చితకబాదటం తెలిసిందే. ఈ సంఘటన పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయటంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో దళిత ఉద్యమానికి దారి తీసింది. కుల వివక్ష నుండి తమకు విముక్తి కల్పించాలంటూ పలు దళిత సంఘాలు అహమ్మదామాద్ నుండి ఊనాకు నాలుగు వందల కిలోమీటర్ల పాద యాత్ర చేపట్టాయి. ఆగస్టు పదిహేనో తేదీ నాడు ఊనాకు చేరుకున్న అనంతరం నిర్వహించే బహిరంగ సభలో కుల వివక్ష నుండి తమకు విముక్తి కల్పించాలని ఈ దళిత సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత డెబ్బై సంవత్సరాలకు కూడా కుల వివక్ష నుండి రక్షణ, విముక్తి కోరవలసిన పరిస్థితులు మన దేశంలో నెలకొనటం సిగ్గు చేటు. దళితులు ఇప్పటికి మరణించిన జంతువుల కళేబరాలను తొలగించటం, డ్రైనేజీలను శుభ్రం చేసే వృత్తులలో కొనసాగటం దురదృష్టకరం.
గోసంరఘణ పేరుతో దళితులపై జరుగుతున్న దాడుల వెనక పెద్ద వ్యాపార రాజకీయం ఉన్నది. అత్యంత లాభదాయకమైన చర్య వ్యాపారాన్ని పూర్తిగా స్వాధీన పరచుకునేందుకు తెర వెనక పెద్ద రాజకీయం జరుగుతోంది. ఉత్తర భారత దేశంలోని హర్యానా, రాజస్తాన్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తోళ్ల శుద్ధి కార్మాగారాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పాలతోపాటు ఆవు,గేదెల చర్మం, ఎముకలు, ఇతర అవయవాలు వివిధ వస్తువుల ఉత్పత్తికి ముడి సరుకులు. ఈ ముడి సరుకులతో పాద రక్షల ఉత్తత్తితోపాటు కాస్మోటిక్స్, గ్లు, రెసిన్ కోటింగ్స్, బ్రషెస్ తయారు చేస్తారు. ఉత్తర భారతంలోని ఐదారు రాష్ట్రాల్లో వేలాది గోరక్షణ దళాలు పని చేస్తున్నాయి. వీటిలో కొన్ని నిజంగానే గోవుల సంరక్షణ కోసం పని చేస్తున్నాయి. గోవుల సంరక్షణ కోసం ఈ దళాలు గోశాలలను నిర్వహిస్తున్నాయి. అయితే మిగతా దళాలన్నీ తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం గో సంరక్షణ నినాదాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మెజారిటీ గో సంరక్షణ దళాలు రాత్రి పూట సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ పగటి సమయంలో గోవుల రక్షణ పేరుతో తప్పించుకుని తిరుగుతున్నాయి. పలు గోసంరక్షణ సంఘా ల అధ్యక్షులు, కార్యదర్శులపై క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. పలువురిపై హత్యా నేరం కేసులు నడుస్తున్నాయి. గోరక్షణ సంఘాల సభ్యులు ఆవులు, గేదెల రవాణాను అడ్డుకుంటూ దారి దోపిడికి పాల్పడుతున్నారు. గోవులను హింసించే వారిని తప్పకుండా శిక్షించవలసిందే. గోవును భగవంతుడితో సమానంగా భావించి పూజించే వారి మనో భావాలను గౌరవించవలసిందే. అయితే గోసంరక్షణ శృతి మించి రాగాన పడకూడదు. సమాజాన్ని అశాంతిలో పడవేసే పరిస్థితులను రానివ్వకూడదు. రాజస్తాన్‌లోని పలు గోశాలల్లో గడ్డి లభించక అసువులు భాస్తున్న ఆవుల సంఖ్య వందల్లో ఉన్నది. గోరక్షణ సంఘాలు ఈ గోవుల బాగోగులు ఎందుకు చూసుకోవటం లేదు?
కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు ఆవుల సంరక్షణ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయి. పలు సంధర్భాల్లో బి.జె.పిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు గోరక్షణ అంశాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. 2014లో కేంద్రంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొన్ని నెలల్లోనే దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో చర్చ్‌లపై దాడుల సంఘటనలు పెద్ద ఎత్తున జరిగాయి. బి.జె.పి అధికారంలోకి రాగానే హిందూత్వ శక్తులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయనే ప్రచారం జరిగింది. ఢిల్లీలోని కొన్ని చర్చిలపై జరిగిన దాడుల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆం ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు బి.జె.పిని దెబ్బ తీసేందుకు చర్చ్‌లపై దాడులు చేయించారనేది దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడుల వెనక కూడా రాజకీయ పార్టీలు, నాయకులు, సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం తప్పకుండా ఉంటుంది. అందుకే మతం, మత సంబంధ అంశాలను రాజకీయాల కోసం దుర్వినియోగం చేసే వారిని కఠినంగా శిక్షించనంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.