ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విమర్శలు సరే.. విచారణ సంగతేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై ప్రజల డబ్బును దోచుకుంటుంటే- ‘అంతా మీ హయాంలోనే జరిగిందంటే.. మీ హయాంలోనే జరిగిందం’టూ అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవటం సిగ్గుచేటు. ‘రత్నాల వ్యాపారి’ నీరవ్ మోదీ ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలకు టోపీ పెడితే- కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకుండా ‘యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో ఈ మోసం జరిగిందం’టూ ఆరోపణలకు దిగడం బాద్యతారాహిత్యానికి ప్రతీక. ప్రజాధనాన్ని దోచుకునే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను శిక్షించటంలో యూపీఏ ప్రభుత్వం మాదిరిగానే మోదీ సర్కారు కూడా ఘోరంగా విఫలమవుతోంది. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇతర బ్యాంకుల నుండి నీరవ్ మోదీ భారీగా రుణాలు తీసుకోవటం నిజమే కావచ్చు. కానీ కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నీరవ్ మోదీ తప్పుడు పత్రాల సహాయంతో వేల కోట్ల రుణాలు తీసుకోవటం నిజం కాదా? మోదీ ప్రభుత్వం ఇంకెంత కాలం యూపీఏ పాలనపై విరుచుకుపడడం ద్వారా పబ్బం గడుపుకుంటుంది?
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నో అక్రమాలు జరిగాయి. నీరవ్ మోదీ మాదిరిగానే విజయ్ మాల్యా కూడా బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగవేశాడు. అయితే వీరిద్దరూ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే దేశం నుండి పారిపోయారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగానే ఈ ఇద్దరు ఆర్థిక నేరస్థులూ దేశం విడిచి పారిపోగలిగారనేది నిజం కాదా? యూపీఏ ప్రభుత్వం అవినీతికి, అసమర్థ పాలనకు నిలయంగా మారింది గనుకనే ప్రజలు మోదీకి పట్టం కట్టారు. తమకు సమర్థవంతమైన, అవినీతి రహిత పాలనను మోదీ అందిస్తారని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మోదీ ప్రభుత్వం సైతం సగటు మనిషి ఆశలను వమ్ము చేస్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని మోదీ చాటుకోవాలంటే- వేలాది కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటున్న వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, వారికి తోడ్పడుతున్న బ్యాంకు అధికారులపై మోదీ కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఫలితాలను మాత్రమే కోరుకుంటున్నారు. ‘నిందితులను వదిలేది లేదు, తప్పు చేసిన వారు ఎంత పెద్ద వారైనా తప్పించుకోలేర’నే ఊకదంపుడు ఉపన్యాసాలను ఆశించడం లేదు.
కాగా, నీరవ్ మోదీ కుంభకోణాన్ని కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రాజకీయం చేసింది. ఇక ముందు కూడా చేస్తుంది. నేడు ప్రతిపక్షంలో భాజపా ఉన్నా ఇదే జరిగేది. వీలైనంత తొందరగా నీరవ్ వంటి నిందితులను స్వదేశానికి తీసుకురాగలగాలి. నీరవ్ మోదీ ప్రపంచంలో ఏ దేశంలో తలదాచుకున్నా అతన్ని భారత దేశానికి పట్టుకురావాలి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చేసిన మోసంపై వెంటనే విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. నీరవ్ మోదీ వ్యవహారం కూడా విజయ్ మాల్యా మాదిరిగా మారిపోతే దేశ ప్రజలకు నరేంద్ర మోదీపై విశ్వాసం సన్నగిల్లుతుంది. దేశంలోని పలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టటంతో పాటు వందలాది మంది ఉద్యోగులను బజారులో పడవేసిన విజయ్ మాల్యా ఇప్పుడు లండన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ‘కింగ్ ఫిషర్’ తదితర సంస్థల సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయి నానాకష్టాలు పడుతుంటే మాల్యా మాత్రం లండన్‌లో అన్ని రకాల సుఖాలతో జీవితం గడుపుతున్నాడు. లండన్ కోర్టు ఇటీవల ఆయన రోజువారీ ఖర్చులను మరింత పెంచటం చూస్తుంటే మాల్యా ఎలాంటి విలాసవంతంగా జీవిస్తున్నాడనేది స్పష్టం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం గట్టిగా వ్యవహరించకపోవటం వల్లనే మాల్యా కోర్టులను అడ్డం పెట్టుకుని హాయిగా రోజులు గడుపుతున్నాడు. నీరవ్ మోదీ కూడా విదేశాల్లో కోర్టుల సహాయంతో విలాసవంత జీవితం గడుపుతాడు. కేంద్ర ప్రభుత్వం తమ శక్తినంతా కూడగట్టుకుని పని చేయకపోతే నీరవ్ కూడా అక్రమంగా సంపాదించిన డబ్బుతో హాయిగా జీవిస్తే- మన జాతీయ బ్యాంకులు మరోసారి దివాలా తీస్తాయి.
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి వాటికి పెట్టుబడుల సహాయం చేయకతప్పదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులకు పెట్టుబడుల రూపంలో సాయం అందజేయటం తెలిసిందే. సగటు మనిషి కడుతున్న పన్నులను కేంద్రం ఇలా బ్యాంకుల ద్వారా మోసగాళ్లకు అందజేయటం క్షమించరాని నేరం. నీరవ్ మోదీని స్వదేశానికి పట్టుకు వచ్చి కఠినంగా శిక్షించటం ఒక ఎత్తయితే, కేంద్ర ప్రభుత్వం వెంటనే నిందితులైన బ్యాంకు అధికారులకు గట్టిగా బుద్ధి చెప్పగలగాలి. మన బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయమైపోయిందనేది జగమెరిగిన సత్యం. కేవలం ఒక్క పంజాబ్ నేషనల్ బ్యాంకు ఒకే వ్యక్తికి దాదాపు పదిహేను వేల కోట్ల రుణాలను అక్రమంగా తీసుకునేందుకు వీలు కల్పించిందంటే మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాయనేది అర్థం అవుతుంది.
అవినీతిలో కూరుకుపోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను దారికి తీసుకురావలసిన అవసరం ఉన్నది. నిరవ్ మోదీకి పదిహేను వేల కోట్ల రుణాలకు సంబంధించిన లేఖలు ఇచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంకు చైర్మన్ సహా కుంభకోణంతో సంబంధం ఉన్న సీనియర్ అధికారులందరినీ వెంటనే అరెస్టు చేయాలి. కొందరు జూనియర్ అధికారులను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటే అది మోదీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యానికి సాక్ష్యం అవుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఇద్దరు అధికారుల సహకారంతో ఇంత పెద్ద స్థాయి కుంభకోణం జరిగిందనటం సరికాదు. ఇందులో ఇంకా ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలి. 2011 నుండి నీరవ్ మోదీ కుంభకోణాన్ని కొనసాగిస్తున్నాడంటే బ్యాంకు చైర్మన్‌తోపాటు కేంద్ర ఆర్థిక శాఖలోని సీనియర్ అదికారులకు సైతం దీనితో సంబంధం ఉండి ఉండాలి. అందుకే వీరందరినీ సస్పెండ్ చేయటం లేదా కేసులు నమోదు చేయడంతో చేతులు దులుపుకుంటే సరిపోదు. మొదట వీరందరినీ కటకటాల్లోకి నెట్టి కట్టుదిట్టమైన దర్యాప్తు జరిపించటం ద్వారా మోసగాళ్లకు కఠిన శిక్ష పడేలా చూడాలి.
నీరవ్ మోదీకి చెందిన గీతాంజలి ఆభరాణాల సంస్థ కుంభకోణం 2013లోనే వెలుగులోకి వచ్చినా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. నీరవ్ మోదీ కుంభకోణం 2015లో ఎన్‌డిఏ ప్రభుత్వం దృష్టికి వచ్చినా స్పందించక పోవడానికి కారణాలేమిటి? అవినీతిపై యుద్ధం ప్రకటించిన నరేంద్ర మోదీ ఈ కుంభకోణంపై 2015లోనే దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదు. బ్యాంకింగ్ వ్యవస్థ నుండి వేలాది కోట్ల రూపాయలు చేజారిపోతున్నా కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వు బ్యాంకు ఎందుకు పట్టించుకోలేదు? బ్యాంకింగ్ వ్యవస్థలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలను అరికట్టే యంత్రాంగం ఎందుకు ఈ కుంభకోణాన్ని పసిగట్టలేకపోయింది. దినేష్ దూబే అనే వ్యక్తి గీతాంజలి ఆభరణాల సంస్థ తీసుకుంటున్న బ్యాంకు రుణాలపై అనుమానాలు వ్యక్తం చేయటంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్దురపోయింది? బ్యాంకుల్లో ఇలాంటి భారీ కుంభకోణాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. అంతర్జాతీయ స్థాయిలో మన పరువు మంటగలుస్తోంది. ఈ పరిస్థితిలో కూడా నరేంద్ర మోదీ తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే నిజంగానే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.

- కె.కైలాష్ సెల్: 98115 73262