ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘సంఘ్’ దెబ్బకు కామ్రేడ్లు విలవిల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురలో పాతికేళ్లుగా అజేయంగా నిలిచిన ‘ఎర్ర’ కోట కుప్పకూలింది. కొంతకాలం క్రితమే అ స్సాంలో అడుగుపెట్టిన భాజపా ఇప్పుడు త్రిపురలో తన పతాకాన్ని ఎగురవేసింది. నాగాలాండ్‌లో మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మేఘాలయలో మెజారిటీ సీట్లు సాధించకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకునేలా భాజపా ఎదగడం ఆషామాషీ కాదు. ప్రధాని మోదీ చెప్పినట్లు త్రిపురలో భాజపా ‘శూన్యం నుండి శిఖరానికి’ చేరితే సీపీఎం మాత్రం శిఖరం నుండి శూన్యంలోకి జారిపోయింది. వామపక్షం మొదటిసారి భాజపా చెతిలో ఘోర పరాజయానికి గురైంది. గుజరాత్‌లో ఇరవై మూడేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా ఇటీవల తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా, త్రిపురలో పాతికేళ్లుగా పరిపాలిస్తున్న సీపీఎం దారుణ ఓటమికి గురికావల్సి వచ్చింది.
ప్రజా సంక్షేమం కోసం సీపీఎం కృషి చేసి ఉంటే ఈ స్థాయిలో ఎందుకు ఓడిపోయింది? పార్టీ రాజకీయాల కోసం సీపీఎం పనిచేసినందున ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది. ముఖ్యమంత్రి మణిక్ సర్కార్ ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తే జనం ఎందుకు ఆ పార్టీకి దూరమయ్యారు? ఈశాన్యంలో వామపక్షాలు, కాంగ్రెస్‌ను మట్టికరిపించి భాజపాను అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత నలభై, యాభై సంవత్సరాల నుండి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. మత మార్పిడులను భారీగా ప్రోత్సహించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను తమ చెప్పుచెతుల్లోకి తీసుకునేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రలను వమ్ము చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్ చాలాకాలం నుంచి పోరాటం చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో పలువురు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకులు, కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కొందరు ప్రచారక్‌లు పలుమార్లు దాడులకు గురైనా పట్టు వదలకుండా భాజపా కోసం పని చేశారు. త్రిపురలో భాజపా ఘన విజయానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కారణం. దీనికి మోదీ నాయకత్వం తోడు కావటంతో త్రిపుర ప్రజలు భాజపాకు భారీ మెజారిటీ ఇచ్చారు.
త్రిపుర, నాగాలాండ్‌ల్లో తమ విజయానికి మోదీ అవలంబించిన అభివృద్ధి విధానాలే కారణమని భాజపా అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. త్రిపుర, నాగాలాండ్‌ల్లో భాజపా విజయం వెనక అభివృద్ధి మంత్రమే కాదు ఎన్నో కారణాలున్నాయి. దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలు కూడా దాగి ఉన్నాయి. రాజకీయేతర కారణాలతో ఈశాన్య రాష్ట్రాలు జాతీయ స్రవంతికి దూరమవుతూ వచ్చాయి. ఈ దూరాన్ని తగ్గించేందుకు చేస్తున్న కృషిలో భాగంగానే త్రిపురలో బిజెపి విజయం సాధించింది. ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజనులను అభివృద్ధికి దూరంగా ఉంచటం ద్వారా మత మార్పిడులను ప్రోత్సహించారు. ఈ మత మార్పిడుల వెనక పలు స్వదేశీ, విదేశీ శక్తులు పని చేస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ ఈ శక్తులతో పోరాటం చేస్తూనే బిజెపి విజయానికి పునాదులు వేసింది. ఈ పునాదుల ఆధారంగానే బిజెపి ఇప్పుడు ఘన విజయాలను నమోదు చేసింది. అమిత్ షా చెప్పినట్లు ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు గత యాభై ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. గతంలో ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఇప్పుడు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర్, నాగాలాండ్‌లలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మేఘాలయలో మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మిజోరం మినహా మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో బి.జె.పి అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ అధినాయకత్వం అనుసరించిన అసంబద్ధ విధానాలతో ఆ పార్టీ కొట్టుకుపోయింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేవలం వారం రోజుల సమయం కేటాయించారు. త్రిపురకు కేవలం ఒకసారి, నాగాలాండ్, మేఘాలయకు ఆయన రెండు లేదా మూడు సార్లు మాత్రమే వెళ్లారు. పోలింగ్‌కు ముందే మూడు రాష్ట్రాలను ఆయన గాలికి వదిలివేశారని చెప్పకతప్పదు. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలో రాహుల్ తన అమ్మమ్మతో కలిసి హోలీ పండుగ చేసుకునేందుకు ఇటలీకి వెళ్లిపోయారంటే ఆయనకు దేశ రాజకీయాల పట్ల ఎంత ఆసక్తి ఉన్నదనేది అర్థం అవుతోంది.
భాజపా ఒకప్పుడు ఉత్తరాదికి చెందిన పార్టీగా పిలవబడేది. ఇటీవల సాధించిన విజయాలతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో విజయం సాధించటంతో బిజెపి ఇప్పుడు అఖిల భారత స్థాయి పార్టీగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం కేవలం మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేరళ, ఒడిశా, బెంగాల్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. నాగాలాండ్‌లో దాదాపు డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు క్రైస్తవులు అయినా వారు బిజెపి కూటమికి పట్టం కట్టడటం గమనార్హం. ఎనభై శాతం మంది ప్రజలు క్రైస్తవులే అయిన మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే బిజెపిపై ఇపుడున్న మతతత్వ ముద్ర ఇక మీదట ఎక్కువ కాలం కొనసాగదు.
ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా సాధించిన ఘన విజయం ప్రభావం మరో రెండు నెలల్లో జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. కర్నాటకలోనూ తాము భారీ విజయాన్ని సాధిస్తామంటూ అమిత్ షా చేస్తున్న ప్రకటనలు నిజం కావచ్చు. ఎందుకంటే విజయం సాధించాలనే కసితో మోదీ పని చేస్తున్నారు.
2019లో మరోసారి అధికారంలోకి వచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం కర్నాటకలో పాగా వేసేందుకు వ్యూహరచన చేయడం గమనార్హం. కర్నాటకలో విజయం సాధించేందుకు భాజపా ఏ స్థాయిలో కష్టపడుతుంది? ఎలాంటి ప్రణాళికలు వేస్తుందనేది ఊహించుకోవచ్చు. రాహుల్ చీటికీ మాటికీ విదేశాలకు చక్కర్లు కొడుతూంటే కర్నాటకలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం తప్పదేమో?

- కె.కైలాష్ సెల్: 98115 73262