ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రంగు మారుతున్న జాతీయ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు అనేదేదీ ఉండదు. నాయకులు తమ రాజకీయ అవసరాల కోసం కలుస్తుంటారు, విడిపోతుంటారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న కొత్త రాజకీయ సమీకరణరలు ఇందుకు తాజా ఉదాహరణ. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వై.ఎస్.ఆర్.సి.పి, ఏ.పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎన్.డి.ఏ మంత్రివర్గంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలకు లభించిన మద్దతు చూస్తుంటే జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసమే పని చేస్తాయి తప్ప ప్రజల అవసరాలు, సంక్షేమం కోసం కాదనేది మరోసారి రుజువవుతోంది. గత వారం వరకు కూడా కాంగ్రెస్ పేరు చెబితే తెలుగుదేశం ఒంటిగాలు మీద లేచేది. కాంగ్రెస్ మూలంగానే ఆంధ్రప్రదేశ్‌కు ఈ దుర్గతి పట్టిందని తెలుగుదేశం ఆరోపణల వర్షం కురిపించేది. అందుకే రాష్టప్రతి ప్రంసగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు లేచిన కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గేకు తెలుగుదేశం ఎం.పిలు పెద్ద ఎత్తున అడ్డుపడ్డారు. ఖర్గే మాట్లాడకుండా అడ్డుకోవటంతోపాటు టి.డి.పి సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని శ్రీనివాస్, కె.రామమోహన్ నాయుడు తదితరులు కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ, చీఫ్‌విప్ జ్యోతిరాధిత్య సిందియాతో గొడవకు దిగారు. కాంగ్రెస్ కూడా తెలుగుదేశం పేరు చెమితే మండిపడేది. బి.జె.పికి తొత్తులంటూ టి.డి.పిపై విమర్శలు గుప్పించేది అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు తమ శతృవైన తెలుగుదేశం ఇప్పుడు తమ మిత్రపక్షమని మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల వేదిక పై నుండి ప్రకటించటం చూస్తుంటే రాజకీయాల్లో ఎవరికి ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శతృవులు కాదంటూ చాలా సంవత్సరాల క్రితం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.బి.రాజు చెప్పిన సూత్రం మరోసారి నిజమైంది. కాంగ్రెస్, వామపక్షాలు సైతం వై.ఎస్.ఆర్.సి.సి, కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నాయి. దేశం, ప్రజల సంక్షేమం కోసం ఏ పార్టీ ఎవరితో కలిసినా అభ్యంతరం ఉండకూడదు. అయితే ప్రజల సంక్షేమం పేరుతో రాజకీయ అవసరాల కోసం పునరేకీకరణం జరగటం దేశానికి కీడు చేస్తుందనేది పచ్చి నిజం. ప్రతిపక్షంలోని జాతీయ పార్టీలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు సైతం అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇస్తున్నాయి. శతృవు శతృవు తమ మిత్రుడనే సూత్రానికి కట్టుబడి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అందుకే నిన్నటి వరకు బి.జె.పితో ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్‌తో చేతులు కలుపుతుంటే ఇంత వరకు పరోక్షంగా బి.జె.పికి మద్దతు ఇస్తూ వచ్చిన అన్నా డి.ఎం.కె, తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలు ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయి. అన్నా డి.ఎం.కె, తెలంగాణా రాష్ట్ర సమితి ఎం.పిలు పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటం వలన అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాలేకపోయాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంపై వై.ఎస్.ఆర్.సి.పి, తెలుగుదేశం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలకు అడగకముందే మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ తదితర పార్టీలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎందుకు ముందుకు రావటం లేదనేది ప్రశ్న. పార్లమెంటును స్తంభింపజేయటం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్రతిష్టపాలు చేయాలనే లక్ష్య సాధన కోసం ప్రతిపపక్షాలు పని చేస్తున్నాయి తప్ప దేశ సమస్యలపై చర్చ జరపటం ద్వారా పరిష్కారాలు కనుగొనాలనే చిత్తశుద్దిని ప్రదర్శించటం లేదు. పార్లమెంటు ఉభయ సభలు గత రెండు వారాల నుండి పని చేయటం లేదు. ప్రతిపక్షం, స్పపక్షం సభ్యులు లోకసభలో సృష్టిస్తున్న గందరగోళం మూలంగా బడ్జెట్ సమావేశాలు స్తంభించిపోయాయి. వ్యవసాయ రంగం ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంజాబ్ నేషనల్ బ్యాంకు తదితర బ్యాంకుల కుంభకోణాలు, ధరల పెరగుదల వంటి ముఖ్యమైన సమస్యల గురించి విస్తృతంగా చర్చించి తగు పరిష్కార చర్యలు తీసుకోవలసి ఉన్నది. అయితే ప్రతిపక్షం ఈ సమస్యలపై దృష్టి సారించటం లేదు. ఈ సమస్యల పేరుతో పార్లమెంటును స్తంభింపజేస్తున్నారు తప్ప వాటిపై చర్చ జరిపి తగు చర్యలు తీసుకోవాలనే ఇంగిత జానాన్ని ఆయా రాజకీయ పార్టీలు ప్రదర్శించటం లేదు. పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయటం ద్వారా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ కూడా ప్రాంతీయ, జిల్లా స్థాయి రాజకీయాలు చేస్తున్నాయి. దీని వలన ప్రజలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతోందనే వాస్తవాన్ని గ్రహించటం లేదు. పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన మూలంగా 2018-19 వార్షిక బడ్జెట్‌ను గొడవ, గందరగోళం మధ్య ఆమోదించుకునే దుర్గతి పట్టింది. ఏ ఒక్క శాఖకు సంబంధించిన పద్దులపై కూడా చర్చ జరగలేదు. అన్ని శాఖల పద్దులను గిలెటిన్ చేయవలసి రావటం పార్లమెంటుకు పట్టిన దురదృష్టానికి అద్దం పడుతోంది. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల మూలంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసి వస్తోంది. రైతులకు సంబంధించిన వ్యవసాయ శాఖ పద్దులపై కూడా పార్లమెంటులో జరగకపోతే ఎలా? రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని చెప్పుకునే రాజకీయ పార్టీలు పార్లమెంటులో వ్యవసాయ శాఖ పద్దులపై చర్చ జరపాలని ఎందుకు సభలో గొడవ చేయలేదు?
తెలుగుదేశం, వై.ఎస్.ఆర్.సి.పిల అవిశ్వాస తీర్మానం వెనక ప్రాంతీయ రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి తప్ప ప్రజల ప్రయోజనాలు కాదు. ప్రాంతీయ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును స్తంభింపజేయటం ఎంత వరకు సమంజసం? కేంద్రంలో రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏ.పికి ప్రత్యేక హోదా ఇవ్వలేదనేది పచ్చి నిజం. ఇది తెలిసి కూడా ఆయా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాలకు మద్దతు పలికాయి. అవిశ్వాస తీర్మానాలను చేపట్టినా వీటిపై జరిగే చర్చలో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోణలు ఉంటాయి, అర్థం, పర్థం లేని ఆరోపణలు చేసుకుంటారు తప్ప వాస్తవాలపై చర్చ జరగనీయరు. తెలుగుదేశం ఎన్.డి.ఏ నుండి బైటికి రాగానే మరోసారి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చర్చలు గుప్పుమన్నాయి. తృతీయ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు వ్యవహారం కూడా రాజకీయ రంగు పులుముకున్నది. బి.జె.పి బలహీన పడుతోందనేది ముందే గ్రహించిన తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు పిలుపు ఇచ్చి జాతీయ నాయకులను సైతం కలవర పరిచారు. తృతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖరరావు చేస్తున్న కసరత్తుకు ఇప్పుడు చంద్రబాబునాయుడు పోటీకి వచ్చారు. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆయన తెర వెనక కసరత్తు ప్రారంభించారు. యునైటెడ్ ఫ్రంట్ ఎప్పుడే ఏర్పాటైంది, దానినిప్పుడు పునరుజ్జీవింపజేయటమేనని తెలుగుదేశం దేశం నాయకులు వాదిస్తున్నారు. చంద్రబాబునాయుడును యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ప్రకటిస్తే సరిపోతుందని టి.డి.పి రాజ్యసభ సభ్యుడొకరు వ్యాఖ్యానించటం గమనార్హం. ఎన్.డి.ఏ నుండి తప్పుకున్న మరుక్షణం నుండి ఆయన కాంగ్రెసేతర, బి.జె.పేతర ఫ్రంట్ ఏర్పాటు కోసం తెర వెనక చర్చలు ప్రారంభించారు. చంద్రబాబునాయుడు ఆదేశం మేరకు కొందరు టి.డి.పి ఎం.పిలు తృణమూల్ కాంగ్రెస్, శివసేన, బి.జె.డి, సమాజ్‌వాదీ, ఆర్.జె.డి, శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్.సి.పి, వామపక్షాలతో చర్చలు ప్రారంభించారు. తెలుగుదేశం నాయకులు చివరకు కాంగ్రెస్ నాయకులతో సైతం తెర వెనక మంతనాలు జరుపుతున్నారు. అకస్మాత్తుగా శత్రువులందరు మిత్రులైపోతే మిత్రులందరు శత్రువులుగా మారిపోయారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేది మరోసారి రుజువైంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల సమయంలో బిజెపియేతర రాజకీయ పార్టీల మధ్య కనిపిస్తున్న సమైక్యత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత కనుమరుగైపోవచ్చు. నాన్-బి.జె.పి, నాన్-కాంగ్రెస్ తృతీయ కూటమి లేదా ఫెడరల్ ఫ్రంట్ లేదా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలు ఈసారి ఆశించిన ఫలితాలు సాధించకపోవచ్చు. యునైటెడ్ ఫ్రంట్‌లో ఇంతకాలం చంద్రబాబునాయుడు ఎదురులేని రాజకీయం చేశారు. అయితే ఇప్పుడు చంద్రశేఖరరావుజాతీయ రాజకీయాల్లోకి దూకటంతో చంద్రబాబునాయుడుకు జాతీయ స్థాయిలో చక్రం తిప్పటం అంత సులభం కాకపోవచ్చు.

- కె. కైలాష్, 9811573262