ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాజకీయాల రాతమార్చే ‘కర్నాటక ఫలితం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు భాజపా, కాంగ్రెస్ సహా మరికొన్ని రాజకీయ పక్షాల భవిష్యత్‌ను నిర్దేశించనున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డాయి. సామ, దాన,్భద, దండోపాయాలను ప్రయోగిస్తూ విజయమో.. వీరస్వర్గమో అన్నట్టు భాజపా, కాంగ్రెస్ శ్రేణులు సమరాన్ని సాగించాయి. భాజపాను గట్టెక్కించాలన్న తపనతో సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇరవై ఒక్క బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్నాటక సీఎం సిద్దరామయ్యలపై మోదీ ఆరోపణాస్త్రాలను సంధించారు. భాజపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఎన్నికల ప్రచారాన్ని మోదీ ఓ కదనరంగంలా నడిపించారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో విజయానికి తొలిమెట్టుగా భావించి కర్నాటకలో గెలుపు కోసం భాజపా అన్ని ప్రయత్నాలూ చేసింది. భారీగా అర్థబలాన్ని, అంగబలాన్ని మోహరించింది.
కర్నాటకలో అధికారాన్ని నిలుపుకునేందుకు ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడిన సిద్దరామయ్య కాంగ్రెస్ గెలుపును ఓ సవాల్‌గా తీసుకున్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతూ రాహుల్ గాంధీ తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. మోదీ ప్రచారంతో కాస్త డీలాపడిన కాంగ్రెస్ పార్టీ అందుకు విరుగుడుగా సోనియా గాంధీని ఆఖరి క్షణంలో ప్రచారంలోకి దింపింది. కర్నాటకలో అధికారాన్ని కోల్పోతే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో చోటుచేసుకుంది. ఈ కారణంగానే సోనియాను సైతం ప్రచారానికి రప్పించారు.
కాంగ్రెస్ ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను కోల్పోతోంది. ఆ పార్టీ కేవలం రెండు పెద్ద రాష్ట్రాలు పంజాబ్, కర్నాటకలో మాత్రమే అధికారంలో ఉంది. కర్నాటక చేయి జారితే కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారుతుంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి నేతలు రాహుల్ నాయకత్వాన్ని తిరస్కరించటంతోపాటు జాతీయ స్థాయిలో ఆధిక్యతను చాటుకునేందుకు పావులు కుదుపుతున్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరచేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు ఫెడరల్ ఫ్రంట్, తృతీయ ఫ్రంట్ పేరుతో జాతీయ స్థాయిలో తమ పలుకుబడిని పెంచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ తదితర విపక్షాలు ఒక కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపుప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో బలపడేందుకు ఎత్తులు వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రాజకీయ సమీకరణల మధ్య నలిగిపోయే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో కర్నాటక శాసనసభ ఎన్నికలు జరిగాయి. మమతా బెనర్జీ తదితర విపక్ష నేతలు రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నించకుండా ఉండాలంటే కర్నాటకలో విజయం సాధించటం కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్యం. తన నాయకత్వ పటిమను మమత వంటి నేతలు ప్రశ్నించినందుకే- 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తాను ప్రధాని పదవిని చేపడతానని రాహుల్ ప్రకటించాల్సి వచ్చింది. ప్రధాని పదవిని చేపడతానని ఆయన ఆషామాషీగా చెప్పలేదు. అయితే, కర్నాటకలో కాంగ్రెస్ ఓడిపోతే రాహుల్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది. ప్రతిపక్షాల దృష్టిలోనే కాకుండా స్వంత పార్టీలోనే ఆయన చులకనైపోతారు.
రాహుల్ వ్యవహార శైలిపై కాంగ్రెస్‌లో కొందరు సీనియర్ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. కర్నాటక ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సీనియర్ నాయకులైన గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ వంటి నాయకులకు అప్పగించకుండా ఐ.టి గురు శామ్ పిట్రోడాకు రాహుల్ అప్పగించటం తీవ్ర విమర్శలకు గురైంది. ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం ప్రతికూలంగా వచ్చినా రాహుల్ సొంత పార్టీ నేతల నుంచే విమర్శల వర్షం కురుస్తుంది. కర్నాటక ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తే మోదీ, అమిత్ షా నాయకత్వం మరింత పటిష్టం కావటంతోపాటు ఈ సంవత్సరాంతంలో జరిగే మధ్యప్రదేశ్,రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘కమలం’ మరింతగా వికసిస్తుందని భావిసున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు మార్గం కొంత సుగమం కావటంతోపాటు దక్షిణాదిలో ఆ పార్టీ పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుంది. ప్రస్తుతం దక్షిణాదిలో భాజపా హవా అంతంత మాత్రంగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భాజపాకు పెద్దగా ఉనికి లేదు. కర్నాటకలో గతంలో ఒకసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తే దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల ప్రజలకు భాజపా పట్ల కొంత విశ్వాసం కలగవచ్చు. వీటన్నింటి కంటే 2019 లోక్‌సభ ఎన్నికలపై కర్నాటక ప్రభావం ఎంతో ఉంటుంది. కర్నాటకలో ‘కమలనాథులు’ ఓటమి చెందితే మోదీ, అమిత్ షా నాయకత్వం పట్ల పార్టీలో, ప్రజల్లో విశ్వాసం తగ్గుతుంది.
కర్నాటక ఎన్నికల ఫలితాలు జేడీ (ఎస్) వంటి ప్రాంతీయపార్టీల రాజకీయ ప్రాధాన్యతకు అద్దం పట్టవచ్చు. మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ నాయకత్వంలోని జేడీ (ఎస్) ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర నిర్వహించవచ్చునని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, భాజపాలకు మెజారిటీ రాకుండా, ‘హంగ్’ అసెంబ్లీ ఏర్పడితే జేడీ (ఎస్) కీలకపాత్ర నిర్వహిస్తుంది. కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా ఉంచేందుకు దేవెగౌడ ప్రతిపాదించే వ్యక్తిని ముఖ్యమంత్రి చేసేందుకు భాజపా ముందుకు రావచ్చు. భాజపాను నిలువరించేందుకు కాంగ్రెస్ కూడా ఇలాంటి వ్యూహానే్న అమలుచేసే అవకాశం ఉంది. ‘హంగ్’ ఏర్పడితే దేవెగౌడ ప్రాధాన్యత రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా పెరుగుతుంది. దేవెగౌడ మద్దతు ఇపుడు అనివార్యమైతే- 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ జేడీ (ఎస్) ఆధిక్యతను చూపే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే 2019లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర నిర్వహించవచ్చు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే రాహుల్ నాయకత్వంలో ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. రాజకీయంగా ప్రాధాన్యతను కోల్పోతున్న కాంగ్రెస్‌కు కర్నాటక విజయం ఒక ఊతంగా నిలుస్తుంది.

- కె.కైలాష్ సెల్: 98115 73262