ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాని ‘హోదా’ కోసం రగడ దేనికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార, విపక్ష పార్టీలు ఇప్పుడు అర్ధసత్యాలు, అసత్యాలు, తప్పుదోవ పట్టించే మాటలతో
పార్లమెంటును సైతం భ్రష్టుపట్టిస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై గత శుక్రవారం లోక్‌సభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై పనె్నండు గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ ఇందుకు
నిదర్శనం. చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు చెప్పిన మాటలు, పరస్పరం చేసుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేవే తప్ప వాస్తవాలను ప్రజల ముందు పెట్టి, వారి తీర్పు కోరే వాదనలు ఎంత మాత్రం కావు. అధికార పక్షంపై అసత్య ఆరోపణలు చేసి
ప్రజలను తప్పుదోవ పట్టించటం ద్వారా విపక్షం రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నించింది.
అధికార పక్షం సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. ఏదోదో చేశామంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది తప్ప తమ లోపాలను సరిదిద్దుకుంటామనే భరోసా ఇవ్వలేకపోయింది. తాము అధికారంలో ఉంటే తప్ప ఈ దేశం బాగుపడదనే అభిప్రాయం కలిగించేందుకు అధికార, ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా, ప్రతికూలంగా జరిగిన ఇరుపక్షాల వాదనలు రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎవరితో జత కడతారన్న అంచనాలకు చూచాయగా అద్దం పట్టాయి. చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం సభ్యులు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కొందరు విపక్ష నేతలు, ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ప్రజలను తప్పుదోపట్టిస్తూ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారే తప్ప వాస్తవాలను సభ ముందు ఉంచలేదు. జయదేవ్, రామ్మోహన్ సహా అనేక మంది విపక్ష సభ్యులు గతంలో చెప్పిన విషయాలనే మరోసారి వివరించారు. జయదేవ్ ఒక సదస్సులో మాట్లాడినట్లు మాట్లాడితే, రామ్మోహన్ నాయుడు తన వాదనకు రాజకీయ మలుపు ఇచ్చి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈశాన్య రాష్ట్రాలు మినహా మరే ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే విధాన పరమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పదే పదే చెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే నిజాన్ని సభలో గట్టిగా చెప్పలేదు. తెలుగుదేశం ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించారు. ‘అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు.. నరేంద్ర మోదీ తిరుమల ఎన్నికల సభలో హామీ ఇచ్చారు.. భాజపా తన ఎన్నికల ప్రణాలికలో పొందుపరిచింది..’ కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయటం ద్వారా తెలుగుదేశం సభ్యులు రాజకీయానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ప్రజల్లోకి వెళ్లిన వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి అధికారాన్ని తన్నుకుపోతాడేమోననే భయంతోనే తెలుగుదేశం ఇపుడు ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది.
ఏపీకి ప్రత్యేక హోదా రాదనే వాస్తవం ముఖ్యమంత్రి చంద్రబాబుకు, జగన్‌కు బాగా తెలుసు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చినా ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేడనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఇరుపక్షాలు ప్రత్యేక హోదా సాధన పేరుతో రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ప్రధాని మోదీ ఏపీకి ‘హోదా’ ఇవ్వకుండా, విభజన హామీలను అమలు చేయకుండా ఆంధ్రులను అవమానిస్తున్నారని, తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్నారని చంద్రబాబు ఢిల్లీలో చేసిన ఆరోపణలు ఎన్నికల నేపథ్యంలో చేసినవే తప్ప ప్రజల సంక్షేమం, రాష్ట్భ్రావృద్ధి కోసం కాదు.
ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అవిశ్వాస తీర్మానంపై అర్ధ సత్యాలు, అసత్యాలతో అద్భుతంగా ప్రసంగించారు. మోదీని అన్ని రకాలుగా దుయ్యబట్టిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గల్లా జయదేవ్ మాటల్లోని బాధను అర్థం చేసుకోగలనని చెప్పి తప్పించుకున్న రాహుల్ ప్రధాని మోదీని అవమానించేందుకు ప్రయత్నించారే తప్ప వాస్తవ రాజకీయాల గురించి మాట్లాడలేకపోయారు. ఫ్రాన్స్‌తో కుదిరిన ‘రాఫెల్ ఒప్పందం’పై ఆయన మాట్లాడుతూ, మోదీని ‘అవినీతిలో వాటాదారు’గా అభివర్ణించారు. మోదీపై ఆయన చేసిన ఆరోపణలు నిలవవని కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. మోదీ తన కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోతున్నారని ఆరోపించటం ద్వారా రాహుల్ పార్లమెంటు చర్చల స్థాయిని దిగజార్చారు. రాజకీయ పరిణతిలో మోదీ, రాహుల్ మధ్య ఎంతటి వ్యత్యాసం ఉందో దేశ ప్రజలందరికీ తెలుసు. నిన్నటి మొన్నటి వరకు ‘పప్పు’ అని పిలిపించుకున్న రాహుల్ నాలుగు పడికట్టుపదాలను వల్లెవేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు గొప్ప నాయకుడు కాలేడు. మోదీని వ్యక్తిగతంగా విమర్శించినంత మాత్రాన రాజకీయంగా ఎదిగినట్టు రాహుల్ గాంధీ గానీ, ఆయన అనుచరులు గానీ భావిస్తే పప్పులో కాలేసినట్లే. ప్రసంగం ముగిస్తూ హడావుడిగా అధికార పక్షం వైపువెళ్లి ప్రధాన మంత్రిని రాహుల్ కౌగిలించుకోవడం రాజకీయ పరిణతి కాదు. ఆ ఆకస్మిక చర్యకు మోదీ ఆశ్చర్యంగా చూస్తుంటే, లేచి నిలబడాలంటూ డిమాండ్ చేయటం, ఆయన లేవకపోతే తానే వంగి బలవంతంగా మోదీ మెడ చుట్టూ చేతులు వేసి ఆలింగనం చేసుకోవడం విపరీత చేష్టగా ఉంది. ఇది రాహుల్ రాజకీయ పరిపక్వతను చాటేలా లేదు. రాజకీయం ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమా కాదు. ఆలింగనం డ్రామా పూర్తయ్యాక- రాహుల్ తన సీట్లో కూర్చుని ‘బాగా చేశానా?’ అన్నట్లు తన తోటి సహచరులకు కన్నుగీటడం రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతోంది. ఏదైనా సహజంగా రావాలి తప్ప ముందు రాసుకున్న స్క్రిప్ట్ ద్వారా జరగరాదు.
ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని నిర్ణయించినప్పుడు ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు ఎందుకు చెప్పకూడదు? 14వ ఆర్థిక సంఘం ‘హోదా’ ఉన్న రాష్ట్రాలు, హోదా లేని రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని తొలగించిందన్న వాదనను పక్కన పెట్టాలి. పర్వత ప్రాంతాలైన ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే విధాన నిర్ణయం తీసుకున్నాం కనుక- ప్రత్యేక హోదాను ఎవరూ అడగరాదని స్పష్టమైన ప్రకటన చేయాలి. డొంక తిరుగుడు మాటలను పక్కన పెట్టి, మోదీ ఇకనైనా ఏపీ ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ప్రత్యేక హోదాకు బదులు ఇచ్చే రాయితీల గురించి స్పష్టమైన ప్రకటన చేయటం ద్వారా ఈ వివాదానికి తెర దించడం ఉత్తమం. ప్రత్యేక హోదా పేరుతో జరిగే రాజకీయానికి స్వస్తి పలికేందుకు తెదేపా, వైకాపాలు ఎంత మాత్రం అంగీకరించవు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ప్రత్యేక హోదా అసాధ్యమని ఎన్నికల ముందు ప్రకటన చేయటం వలన రాజకీయంగా నష్టం కలుగుతుందని భాజపా అధినాయకత్వం భావించరాదు. చంద్రబాబు గత నాలుగు నెలలుగా చేస్తున్న ప్రచారం మూలంగా రాష్ట్రంలో భాజపాకు గడ్డుకాలం మొదలైంది. ఈ పరిస్థితుల్లో హోదాపై ఎలాంటి ప్రకటన చేసినా భాజపాకు నష్టమేమీ లేదు. కాబట్టి ప్రత్యేక హోదా సాధ్యం కాదనే స్పష్టమైన ప్రకటన చేయటం ద్వారా మోదీ ఈ వివాదానికి శాశ్వతంగా తెర దించటం మంచిది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యం. ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్నపుడే విభజన చట్టంలో చేర్చేది. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, భాజపా, తెదేపా, వైకాపా సహా అన్ని పార్టీలూ రాజకీయం చేశాయి. హోదా అంశాన్ని రావణకాష్టంలా చేసి, రాజకీయ లబ్ది పొందాలన్న ప్రయత్నాలను ఇకనైనా అన్ని పార్టీలూ విరమించడం మంచిది.

-కె.కైలాష్ 98115 73262