ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విపక్షాలకు రాహుల్ నాయకత్వమే శరణ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించి, కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టాలని ఆరాటపడుతున్న విపక్షానికి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి కన్పిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టాక రాహుల్ నాయకత్వానికి కొన్ని విపక్షాలు సుముఖత చూపడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్‌తో పొత్తులేకుండా మోదీని ఢీకొనే స్థాయి మిగతా విపక్షాలకు లేదు. కాంగ్రెస్‌తో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నా, రాహుల్ నాయకత్వాన్ని కొంతమంది విపక్షనేతలు వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వంటి నేతలు ఎంతగా వద్దనుకున్నా రాహుల్ నాయకత్వాన్ని ఆమోదించక తప్పదు. ప్రతిపక్షం స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగకపోతే ఓటర్లు వారికి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతిపక్షంలో ప్రస్తుతం రాహుల్ ఒక్కరే జాతీయ స్థాయి నేత. మిగతా వారంతా ప్రాంతీయ నాయకులే.
రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదంటూ మొండికేసిన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌కు పరిమితమయ్యారే తప్ప జాతీయ స్థాయికి ఎదగలేకపోయారనేది జగమెరిగిన సత్యం. ఆమెకు బెంగాల్‌లో మంచి పలుకుబడి ఉన్న మాట నిజమే. ఉత్తర ప్రదేశ్, బిహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మమతకు కొంత గుర్తింపు ఉన్నా అది ఓట్లను సంపాదించే స్థాయిలో లేదు. దక్షిణాదిలో ఆమెకున్న గుర్తింపు నామమాత్రమే. బెంగాల్‌లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకున్నంత మాత్రాన ఆమె జాతీయ స్థాయికి ఎదగలేరు.
ప్రతిపక్షంలో మిగతా నాయకులకు మమతకు ఉన్న స్థాయి కూడా లేదు. ఎన్‌సీపీ అధ్యక్షుడు, ‘మరాఠా బాహుబలి’ శరద్ పవార్ ఒకప్పుడు జాతీయ స్థాయి నాయకుడే. దేశంలోని అన్ని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆయన రాజకీయం చేశారు. ప్రాంతీయ పార్టీలకు నిధులు, సలహాలు అందజేస్తూ ఆయన చక్రం తిప్పేవాడే. ఇప్పుడాయన పలుకుబడి మహారాష్టల్రో సైతం పరిమితంగా పని చేస్తోంది. ఒకప్పుడు మహారాష్టన్రు తన చెప్పుచేతుల్లో ఉంచుకున్న పవార్ ఇటీవలి కాలంలో అనారోగ్యం మూలంగా రాజ్యసభకు పరిమితమైపోయారు. జాతీయ స్థాయి రాజకీయాలను కొంత మేర ప్రభావితం చేయగలుగుతున్నారు. రాహుల్ నాయకత్వంలో పని చేయటం ద్వారా ఎన్‌డీఏను దెబ్బతీయవచ్చునని వాదిస్తున్న ఏకైక విపక్షనేత ఆయనే. ప్రతిపక్షాలు ఇప్పటికి ఒక తాటిపై నడుస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం శరద్ పవారే. ప్రస్తుత రాజకీయాల్లో పవార్ ఒక్కరే ప్రతిపక్షాలను ముందుకు నడిపించలేరు. అందుకే ఆయన ప్రతిపక్షంలో ఒక సూత్రధారిగానే వ్యవహరిస్తున్నారు. రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తే ప్రతిపక్షం తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, భాజపాను నిలువరించవచ్చునని పవార్ భావిస్తున్నారు.
జేడీ (యు) బహిష్కృత నాయకుడు శరద్ యాదవ్ జాతీయ స్థాయి నాయకుడే. కానీ, అతనికి వెనకాముందు ఏ రాజకీయ శక్తి అండగా లేదు. శరద్ యాదవ్ ఒక రకంగా ఏకాకిగా మిగిలిపోయారు. దక్షిణాది రాష్ట్రాల్లో కొంత పలుకుబడి ఉన్నప్పటికీ, ప్రతిపక్షానికి నాయకత్వం వహించే పరిస్థితిలో శరద్ యాదవ్ లేరన్నది వాస్తవం. ఆర్‌జేడీ అధినాయకుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసుల వల్ల ప్రస్తుతం తన శేషజీవితాన్ని జైలులో గడుపుతున్నారు. కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇచ్చే లాలూ వల్ల ప్రతిపక్ష కూటమికి నష్టమే తప్ప లాభం ఉండదు. పశుదాణాను సైతం ఆరగించటం ద్వారా తన అవినీతిని చాటుకున్న లాలూ ప్రసాద్‌ను, ఆయన కుమారులను ఎంత దూరం పెడితే ప్రతిపక్షానికి అంత మంచిది.
వామపక్షాల నాయకులు కేవలం సలహాలు ఇవ్వటం, వ్యూహరచన చేయటం తప్ప ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించలేరని ఇప్పటికే పలుసార్లు రుజువైంది. దేశవ్యాప్తంగా వామపక్షాలకు ప్రజల్లో ఆదరణ నానాటికీ దిగజారుతోంది. పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయాక- వామపక్షాలు ముఖ్యంగా సీపీఎం ఎందుకూ కొరగాకుండాపోతోంది. సీపీఐ ఘనత ఇప్పటికే చరిత్రపుటలకు పరిమితమైంది. కేరళలోనూ అధికారం కోల్పోతే సీపీఎం తెరమరుగయ్యే పరిస్థితి పరిస్థితి తప్పదు. ఈ నేపథ్యంలో సీపీఎం సహా ఇతర వామపక్షాలు తృతీయ ఫ్రంట్‌ను వెనక ఉంటూ నడిపించాల్సిందే తప్ప ప్రత్యక్షంగా నాయకత్వం వహించే పరిస్థితి లేదు. వామపక్షాల పేరెత్తితే మమతా బెనర్జీ ఏ స్థాయిలో మండిపడతారనేది అందరికీ తెలిసిందే. మహాకూటమిలో వామపక్షాలకు అధిక ప్రాధాన్యత లభిస్తున్నట్లు కనిపించిన మరుక్షణం మమత పక్కకు తప్పుకుంటారు. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్‌కు పరిమితమైందే తప్ప జాతీయ స్థాయి రాజకీయం నడిపించాలనే ఆకాంక్ష ఆ పార్టీలో లేదు. బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కూడా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలకు పరిమితమవుతున్నారు. వాస్తవానికి ఆమె జాతీయ స్థాయి రాజకీయ నాయకురాలుగా ఎదగవచ్చు. ఆమెకు దేశంలోని దళిత వర్గాల్లో మంచి పట్టు,పలుకుబడి ఉన్నాయి. మాయావతి తన రాజకీయాన్ని కొంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటే దేశవ్యాప్తంగా కొంతమేరకు చక్రం తిప్పివచ్చు. కానీ, ఆమె తన రాజకీయ తంత్రానంతా ఉత్తర ప్రదేశ్‌కు పరిమితం చేసుకున్నారు. మొదట భాజపాను నిలువరిస్తే, ఆ తరువాత అఖిలేశ్ పార్టీ సంగతి చూడవచ్చని ఆమె ఆలోచన. అందుకే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ఆమె అఖిలేశ్‌తో చేతులు కలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల్లో భాజపాను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు మాయావతి సుముఖత చూపుతున్నారు. అజిత్ సింగ్, ఫారూఖ్ అబ్దుల్లా వంటి నేతలు రాష్ట్ర స్థాయి నాయకులే తప్ప జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయలేరు.
ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చి, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు రాహుల్ ఎంతో పరిపక్వతతో వ్యవహరించవలసి ఉంటుంది. విపక్షాల కలయికతో ‘మహాకూటమి’ ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని సృష్టించి, ఈ కూటమి పట్ల దేశ ప్రజలకు విశ్వాసం కలిగించాలి. ‘మహాకూటమి’ అంటే పరస్పర విరుద్ధ ఆలోచనలు, సిద్ధాంతాలతో కూడుకున్నది. కాంగ్రెస్ విధానాలు తృణమూల్ కాంగ్రెస్‌కు నచ్చవు. తృణమూల్ కాంగ్రెస్ విధానాలను వామపక్షాలు ఎంత మాత్రం అంగీకరించవు. ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల చేయి చేయి కలిపి ముందుకు సాగుతున్న ఎస్పీ, బిఎస్పీల మధ్య విభేదాలున్నాయి. విపక్ష శిబిరంలో ఏ ఒక్క పార్టీకి మరో పార్టీతో ఎంతమాత్రం కుదరదు. కాంగ్రెస్ నాయకత్వంతో సరిపడకనే మమతా బెనర్జీ సొంత పార్టీని పెట్టుకోవటం తెలిసిందే. శరద్ పవార్ కూడా కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు చేసి బయటకు వెళ్లిన నేతే. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలకు కాంగ్రెస్ అంటే ఎంత మాత్రం గిట్టదు.
నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి రాకుండా చూసేందుకే విపక్షాలన్నీ ఒక తాటిపైకి వస్తున్నాయి. భాజపా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగితే తమ మనుగడకు ప్రమాదం వస్తుందనే భయంతోనే వీరంతా ఏకమవుతున్నారు. దేశ సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తామంతా కలుస్తున్నామంటూ ప్రతిపక్షం చేస్తున్న వాదనలో ఎలాంటి పస లేదు. అధికారం కోసమే వీరంతా ఐక్యతా నినాదాన్ని వినిపిస్తున్నారు. రాజకీయమనేది అధికారం కోసమే కాబట్టి వారి ప్రయత్నాలను తప్పుపట్టలేము. అయితే విపక్షాల కలయిక దేశ ప్రయోజనాలను కొంత వరకైనా పరిరక్షించగలిగితే ప్రజలకు కొంత మేలు జరుగుతుంది. రాహుల్ జాతీయ నాయకుడి మాదిరి వ్యవహరిస్తూ, మహాకూటమి ప్రతిష్ట పెంచేందుకు కృషి చేయవలసి ఉంటుంది. మహాకూటమిని ప్రజలు దీవిస్తారా? లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తారా? అనేది ఇప్పుడే చెప్పలేము. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత మహాకూటమిలో విభేదాలు పొడసూపితే ప్రజాస్వామ్యానికి ముప్పు తప్పదు. మహాకూటమి విఫలమై, అధికార పీఠం కోసం బేరసారాలు అనివార్యమైనపుడు- ‘గోడ దూకే నేతల’కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
*

-కె.కైలాష్ 98115 73262