ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రామమందిరంపై చిత్తశుద్ధి ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో భాజపా, సంఘ్ పరివార్‌లు అయోధ్య రామజన్మభూమి వివాదాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నాయి. ఆరెస్సెస్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ దసరా పర్వదినం సందర్భంగా నాగ్‌పూర్‌లో వార్షిక ప్రసంగం చేస్తూ, అయోధ్యలో ‘్భవ్య రామాలయం’ నిర్మించేలా కేంద్రం ప్రత్యేక చట్టం చేయాలని సలహా ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నందున ఆయన సూచన ప్రాధాన్యతను సంతరించుకొంది. ఎన్నికలకు ముందు ఆరెస్సెస్ ఈ ప్రకటన ఎందుకు చేయవలసి వచ్చింది?
మోదీ నేతృత్వంలో 2014లో భాజపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మోహన్ భాగవత్ ఈ డిమాండ్ చేసి ఉంటే బాగుండేది. అలనాడు కేంద్రంలో వాజపేయి నేతృత్వాన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు రామాలయ నిర్మాణం గురించి చర్చ జరిగింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు కేంద్రంలో మోదీ పాలన ప్రారంభం కాగానే రామాలయం నిర్మాణం కచ్చితంగా ప్రారంభమవుతుందని చాలా మంది ఆశించారు. సంకీర్ణ ప్రభుత్వం హయాంలో రామాలయ నిర్మాణం సాధ్యం కాదని వాజపేయి స్పష్టం చేశారు. భాజపాకు ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ ఇచ్చినప్పుడే రామాలయ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన ప్రకటించారు. 2014లో భారీ మెజారిటీతో కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే అయోధ్యలో రామాలయం తథ్యమనే భావన బలపడింది. అయితే, ప్రధాని మోదీ మాత్రం ఈ విషయమై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వ్యవహారం కోర్టు విచారణలో ఉన్నందున తామిప్పుడు ఏమీ చేయలేమంటూ ఆయన తప్పించుకున్నారు. గత నాలుగేళ్లలో ఆరెస్సెస్ కూడా రామాలయంపై ఏమీ మాట్లాడలేదు. మోదీ పాలన ముగుస్తున్న దశలో సర్‌సంఘ్ చాలక్ ఇప్పుడు రామాయలయం గురించి ప్రస్తావించడం గమనార్హం. 2014లోనే మోహన్ భాగవత్ ఇలాంటి డిమాండ్ చేసి ఉంటే ఈపాటికి రామాలయం నిర్మాణంపై కొన్ని అడుగులైనా ముందుకు పడేవి. ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా రామమందిరం గురించి మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు మళ్లీ ఊపు తెచ్చేందుకే ఆయన ఇలా మాట్లాడారా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్న చిత్తశుద్ధి భాజపా, ఆరెస్సెస్‌ల్లో ఉందా? అన్న విశ్వాసం ప్రజలకు కలగడం లేదు. కొంతైనా చిత్తశుద్ధి ఉంటే మందిరాన్ని నిర్మించాలనే దిశగా ఈపాటికి కొంత పనైనా జరిగేది. ఈ విషయమై మోదీ ప్రభుత్వంపై ఆరెస్సెస్ ఒత్తిడి చేసిన దాఖలాలు సైతం కనిపించటం లేదు. మందిరం విషయమై గత నాలుగున్నరేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వంతో ‘సంఘ్’ నేతలు ఎలాంటి చర్చలు జరపలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం చేయాలని మోదీ ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ కోరడం అర్థరహితం. సంఘ్ పరివార్ ఇప్పుడు పెదవి విప్పడంతో ప్రజలకు మోదీ సర్కారుపై తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. ఎన్నికల్లో లబ్ధి కోసం మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది. ఇలాంటి ప్రకటనలతో ఆరెస్సెస్ చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అవుతోంది. కేంద్రంలో మోదీ పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి మందిర నిర్మాణం కోసం ఆరెస్సెస్ ప్రయత్నించి ఉంటే ప్రజల్లో విశ్వాసం కలిగేది.
అయోధ్య వివాదాన్ని భాజపా ఆదినుంచీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందే తప్ప రామమందిర నిర్మాణానికి కాదు. భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ జరిపిన ‘రథయాత్ర’ వల్లనే భాజపా జాతీయ స్థాయిలో విస్తరించింది. ముస్లింలకు మక్కా, క్రైస్తవులకు వాటికన్ సిటీ ఉన్నట్లు హిందువులకు అయోధ్యలో రామమందిరం ఎందుకు నిర్మించరాదని అద్వానీ ప్రశ్నించేవారు. ఆయన ప్రశ్న ఇప్పటికీ అలాగే జవాబు లేకుండా మిగిలిపోయింది. మోదీ అధికారంలోకి వచ్చాక మందిరం విషయంలో తెరవెనక కొన్ని ప్రయత్నాలు జరిగినా, అవి నేటికీ నిర్దిష్ట రూపాన్ని సంతరించుకోలేదు. సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వగానే మందిర నిర్మాణం ప్రారంభం అవుతుందనే అభిప్రాయాన్ని కలిగించారు. మందిర నిర్మాణం అనివార్యం అన్న నినాదం ఎన్నికల సమయంలో ఊపందుకోవటం, అనంతరం చల్లబడిపోవటం ఒక తంతుగా మారింది. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడం ఆషామాషీ కాదు. మందిర నిర్మాణం ప్రారంభమైతే- దేశంలోని పలు ప్రాంతాల్లో మత కలహాలు జరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి ఘటనలకు తావులేని రీతిలో ఇరుపక్షాల మధ్య సామరస్యం కుదిర్చి మందిర నిర్మాణాన్ని చేపట్టాలి. ఈ లక్ష్య సాధన కోసం విస్తృత స్థాయిలో చిత్తశుద్ధితో ప్రయత్నం జరగాలి. ముఖ్యంగా సున్నీ ముస్లింలను ఒప్పించి మందిర నిర్మాణం జరపడం అత్యుత్తమం.
అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పలు షియా ముస్లిం సంస్థలు, కొందరు మత నాయకులు గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మిగతా మత పెద్దలను ఒప్పించేందుకు ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు జరగాలి. ఇది జరిగినపుడే రెండు మతాల మధ్య ఘర్షణను నివారించే వీలుంటుంది. బాబ్రీ మసీదు నేలమట్టమైన చోట- ఒకప్పుడు హిందూ దేవాలయం ఉండేదనేది ఇప్పుటికే రుజువైంది. ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేసిన బాబర్ ఆదేశాల మేరకు 1528లో అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చివేసి మసీదును నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని బాబర్ నిర్మించినందున ‘బాబ్రీ మసీదు’ అని పిలుస్తారు. దండయాత్ర చేసే ముందు బాబరు సూఫీ సన్యాసి వేషంలో ఉత్తర భారత దేశంలో పర్యటిస్తూ అయోధ్య వచ్చాడని, అక్కడ కలిసిన సూఫీ సన్యాసులకు ఇచ్చిన హామీ మేరకే దండయాత్ర అనంతరం అయోధ్యలోని రామమందిరాన్ని నేలమట్టం చేసి, మసీదును నిర్మించాడని వౌల్వీ అబ్దుల్ గఫ్ఫార్ అనే చరిత్రకారుడు పార్సీలో రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఇలాంటి చారిత్రాత్మాక అంశాల ఆధారంగా ముస్లిం మత పెద్దలను ఒప్పించేందుకు గట్టి ప్రయత్నం జరగాలి. అన్ని మసీదుల మాదిరిగానే బాబ్రీ మసీదు కూడా ఒక ప్రార్థనాస్థలం. అయితే రామజన్మ భూమి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. రాజకీయ ప్రయోజనాల కోసం ‘మందిర నిర్మాణం’ నినాదాన్ని వాడుకోకుండా, ముస్లిం మత పెద్దలను ఒప్పించి వివాదాన్ని పరిష్కరించడం ఏకైక ప్రత్యామ్నాయం.
*

-కె.కైలాష్ 98115 73262