ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అధికారుల నిర్వాకంతో వ్యవస్థలు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రమాలపై దర్యాప్తు జరపాల్సిన కేంద్ర నేరపరిశోధక సంస్థ (సీబీఐ) సీనియర్ అధికారులే అడ్డదారులు తొక్కారు. అత్యుత్తమ దర్యాప్తు సంస్థ అయిన సీబీఐలో తాజా పరిణామాలు, దీనిపై అధికార, విపక్ష పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అధికార దాహంతో ఉన్న నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని భ్రష్టుపట్టిస్తున్నారు. మరోవైపు అధికారులు తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. అధికారంలో ఉన్న నేతలు సీబీఐని తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేయటం కొత్తేమీ కాదు. గతంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడినా సీబీఐ మొత్తానికి చెడ్డపేరు రాలేదు.
ఇప్పుడు ఆ సంస్థ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, వారి కింద పని చేసే దాదాపు పదిహేను మంది సీనియర్ అధికారులు వ్యవహరించిన తీరు సీబీఐ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చింది. అలోక్ వర్మ తన కుటుంబ సభ్యుల పేర్లతో బినామీ సంస్థలు నడిపిస్తూ వాటి ప్రయోజనాల పరిరక్షణకు అధికార దుర్వినియోగం చేశారన్నది రాకేష్ ఆస్థానా ప్రధాన ఆరోపణ. ఆస్థానా తన ఆరోపణలను నిరూపించేందుకు ఆలోక్ వర్మ కుటుంబ సభ్యులు నడిపిస్తున్న బోగస్ సంస్థల పేర్లను, ఇతర వివరాలను బహిర్గతం చేశాడు. ఆస్థానా బలవంతంగా డబ్బు వసూలు చేసే గ్యాంగ్‌లను నడిపిస్తున్నాడని, బెదిరించి లంచాలు వసూలు చేస్తున్నాడంటూ అలోక్ వర్మ ఆరోపణలు చేయడమే గాక, అతనితోపాటు కొంతమంది కిందిస్థాయి అధికారులపై కేసులు పెట్టాడు. వర్మ అంతటితో ఆగకుండా ఆస్థానా కింద పని చేసే ఒక డీఎస్పీని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాడు. డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ ఇలా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవటం సీబీఐ చరిత్రలో ఇదే మొదటిసారి. వర్మ, ఆస్థానా ఏడాది కాలంగా ఒకరిపైఒకరు బురద చల్లుకుంటున్నారు. సీబీఐని పర్యవేక్షించే విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
అలోక్ వర్మ కాంగ్రెస్ సహా కొన్ని విపక్ష పార్టీలకు సన్నిహితుడైతే, గుజరాత్ క్యాడర్‌కు చెందిన రాకేష్ అస్థానా భాజపాకు సన్నిహితుడని పేరుంది. ఆస్థానా సీబీఐలో అడుగు పెట్టటం వెనక ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉన్నదనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీనియర్ అధికారులు అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉండటం అనేది అత్యంత సహజం. అయితే వీరు తమ పరిధిని అతిక్రమించి ఏదోఒక రాజకీయ పార్టీకి సేవలందించటం మన దేశంలో ఓ దుష్ట సంప్రదాయం. ఐఏఎస్, ఐపిఎస్ వంటి కీలక సర్వీస్‌లలో పనిచేస్తున్న కొందరు అధికారులు రాజకీయ నేతలకు సన్నిహితంగా ఉంటు తమ పబ్బం గడుపుకుంటారు. విధి నిర్వహణలో అలసత్వం చూపుతుంటారు. అధికారులు తమ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులకు సలాములు చేస్తారు, అవినీతికి పాల్పడతారు. అందుకే నేతలు తమ ఇష్టానుసారం అవినీతికి పాల్పడుతూ, చట్టాలకు చిక్కకుండా తప్పించుకుంటారు. నేతలకు వంతపాడే అధికారులు అవినీతికి పాల్పడటంతోపాటు తమకు ఇష్టమైన పోస్టింగులు దక్కించుకుంటారు. పాలకులు, అధికారులు కుమ్మక్కు కావడంతో దేశాభివృద్ధి, బడుగు వర్గాల ప్రగతి కుంటుపడుతోంది.
సీబీఐలో ఉన్నతాధికారులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవటం మామూలు విషయం కాదు. అధికార యంత్రాంగంలో పేరుకున్న అవినీతి, ఆశ్రీత పక్షపాతం, అధికార దుర్వినియోగానికి ఇది దర్పణం. సీబీఐలో డైరెక్టర్, అదనపు డైరెక్టర్ బరితెగించి ఆరోపణలు చేసుకోవడాన్ని చూస్తే- ఆ సంస్థలో పాలనా యంత్రాంగం ఏ స్థాయిలో చెడిపోయిందనేది స్పష్టమవుతోంది. ఇద్దరు అధికారుల వివాదం కారణంగా ఇతర అధికారుల అక్రమాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఇక, బహిర్గతం కాని లొసుగులు, అక్రమ కలాపాలు ఏ మేరకు ఉన్నాయో మనం ఊహించలేం. అధికారులంతా ఒకటిగా పని చేసుకుపోతారు కాబట్టే వారి అక్రమాలు వెలుగు చూడటం లేదు. వీరంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తారు గనుక అసలు బాగోతాలు వెలుగు చూడవు. అవినీతి బాగోతాన్ని అదుపు చేయవలసిన పాలకులు అధికారులతో చేతులు కలుపుతారు కాబట్టే అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి తిష్ట వేసింది.
అలోక్ వర్మ, ఆస్థానాలు బహిరంగంగా గొడవ పడుతూంటే ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు కురిపించాయి. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ పెదవి విప్పడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్‌ను సెలవుపై పంపించి అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు ఆదేశించగానే ఎన్‌డీఏ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ రాహుల్ ఆరోపణలకు దిగారు. సీబీఐ డైరెక్టర్‌ను సెలవుపై పంపించటం అక్రమమంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులో పిటిషన్ వేశారు. అలోక్ వర్మ కూడా తన తొలగింపును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు తలుపులు తట్టాడు.
సీబీఐలో ఇద్దరు అధికారులు బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటుంటే మోదీ చూస్తూ కూర్చోవాలా? త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఇరువురి వ్యవహారంపై చర్చింది ఒక నిర్ణయానికి రావాలా? త్రిసభ్య కమిటీ సమావేశం జరగనంత వరకూ అధికారుల మధ్య గొడవ కొనసాగవలసిందేనా? కాగా, కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిఫారసు మేరకు ఇద్దరు అధికారులనూ సెలవుపై పంపిస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం సమర్థనీయం. దర్యాప్తు నివేదికలు అందేటప్పటికి ఆలస్యమవుతుంది కాబట్టి, ఇద్దరు అధికారులు విధులకు దూరంగా ఉంచడం సబబే. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక అందగానే ఆ ఇద్దరు అధికారులపైనా చర్యలు తీసుకోవలసిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉంది. సీబీఐ పట్ల జనంలో విశ్వాసం పెంచాలంటే ఇలాంటి చర్యలు అనివార్యం.
కింది స్థాయి అధికారులు నిబంధనల ప్రకారం పని చేయాలే తప్ప, ఉన్నతాధికారుల ఒత్తిడికి లొంగిపోరాదు. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు పని చేసేందుకు దేశంలోని అధికార యంత్రాంగం అలవాటు పడిపోయింది. ఇది అత్యంత ప్రమాదక పరిణామం అని పాలకులు, అధికార యంత్రాంగం, పాలితులు గ్రహించటం మంచిది. ఎవరు ఏ పదవిలో ఉన్నా- వ్యవస్థను గౌరవించినపుడే సగటు మనిషికి న్యాయం కలుగుతుంది. బాధ్యతలను మరచిన అధికారులు వారి చిత్తానుసారం ప్రవర్తిస్తే- సీబీఐ మాత్రమే కాదు.. దేశంలో ఏ వ్యవస్థ అయినా కుప్పకూలక తప్పదు! *

-కె.కైలాష్ 98115 73262