ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘మతతత్వంపై పోరు’లో నిజాయితీ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు లోక్‌సభ, పదకొండు అసెంబ్లీ స్థానాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో భాజపాకు చేదు ఫలితాలు రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా యూపీలోని కైరానా లోక్‌సభ, నూర్‌పుర్ అసెంబ్లీ స్థానాల ఫలితాలపై పెద్దఎత్తున విశే్లషణ జరిగింది. ఈ రెండు చోట్ల భాజపాను ఓడించడం ద్వారా ‘మతతత్వం వల్ల ప్రజాస్వామ్యానికి కలుగుతున్న ముప్పు నుండి దేశాన్ని రక్షించటంలో విపక్షాలు విజయం సాధించాయ’ని చాలా పత్రికలు కోడై కూశాయి. ప్రతిపక్షాలు సమష్టిగా పోటీ చేస్తే భాజపాను ఓడించవచ్చనేది మరోసారి రుజువైంది. మతతత్వం నుంచి దేశాన్ని రక్షించుకోగలిగామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితర నేతలు ప్రకటనలు చేశారు.
కైరానా, నూర్‌పుర్‌తో పాటు మరికొన్ని చోట్ల భాజపాను ఓడించడం వల్ల నిజంగానే మతతత్వాన్ని నిలువరించారా? ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారా? అలా అని కొందరు విపక్ష నేతలు చెబుతున్నది నిజమేనా? ఈ నేతల మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. కైరానాలో ఆర్‌ఎల్‌డి అభ్యర్థి తబస్సుమ్ సాధించిన విజయాన్ని పరిశీలిస్తే ఏ పార్టీవారు మతతత్వంతో, కులతత్వంతో వ్యవహరించారు? ఎవరు ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీశారనేది స్పష్టం అవుతుంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బిఎస్‌పిలు కేవలం భాజపాను, ప్రధాని మోదీని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేశాయి. అందుకే అజిత్‌సింగ్ నాయకత్వంలోని ఆల్‌ఎల్‌డి అభ్యర్థి తబస్సుమ్‌కు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. కైరానాలో భాజపాకు, విపక్షాలకు మధ్య పోటీ జరిగింది. కైరానా నియోజకవర్గంలో మొత్తం ఓట్ల సంఖ్య 16.13 లక్షలు. వీటిలో 9.34 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఆర్‌ఎల్‌డి అభ్యర్థి తబస్సుమ్‌కు 4,81,182 ఓట్లు పోలైతే భాజపా అభ్యర్థి మృగాంగికా సింగ్‌కు 4,36,564 ఓట్లు వచ్చాయి. విపక్షాలన్నీ కలసి ఉప ఎన్నిక ప్రచారంలో భాజపాను మతతత్వ పార్టీగా ముద్ర వేశాయి. దీంతో కైరానా నియోజకవర్గంలోని దాదాపు నాలుగు లక్షల మంది ముస్లిం ఓటర్లు కట్టకట్టుకుని తబస్సుమ్‌కు ఓటు వేశారు. హిందువులు మాత్రం తమ అభీష్టం మేరకు ఓట్లు వేసుకున్నారు.
ఆర్‌ఎల్‌డి జాట్ కులానికి ప్రాతినిధ్యం వహించే పార్టీ. అందుకే ఆ కులానికి చెందిన దాదాపు ఒకటిన్నర లక్షల మంది ఓటర్లలో మెజారిటీ ఓటర్లు తబస్సుమ్‌కు మద్దతు ఇచ్చారు. ముస్లిం, జాట్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అజిత్‌సింగ్, ఆయన కుమారుడు జయంత్ సింగ్ కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరిగారు. ‘మతతత్వ భాజపా’ను ఎదుర్కొనేందుకు ఈ వర్గాలు కలసికట్టుగా ఓటు వేయాలని విపక్షాలు పిలుపునిచ్చాయి. జయంత్ సింగ్ ప్రతి గ్రామానికి వెళ్లి జాట్-గుజ్జర్, దళిత్-రాజ్‌పుత్, జాట్-సైనీ, గుజ్జర్-షేక్‌ల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించటం ద్వారా వారి మద్దతు సంపాదించారు. భాజపాను ఎదుర్కోవాలనే నెపంతో ముస్లింలను రెచ్చగొట్టారు. జాట్,గుజ్జర్, సైనీ,దళిత్, రాజ్‌పూత్ కులాల మద్దతు కూడగట్టుకోవటం ద్వారా విజయం సాధించారు.
సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నైముల్ హసన్ విజయం సాధించిన నూర్‌పూర్ అసెంబ్లీ స్థానంలోనూ మతతత్వ, కులతత్వ రాజకీయం జరిగింది. నూర్‌పూర్‌లో ఎస్‌పి అభ్యర్థికి ఆర్‌ఎల్‌డి, బిఎస్‌పి, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్షాలు ఎస్‌పి నాయకత్వంలో ముస్లిం మైనారిటీలు, జాట్, గుజ్జర్, దళిత్, ఠాకూర్లను తమ వైపు తిప్పుకున్నాయి. నూర్‌పూర్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు లక్షల ఆరు వేలు. ఇందులో ముస్లిం ఓటర్ల సంఖ్య దాదాపు లక్షా పదిహేను వేలు, జాట్‌లు పదిహేనువేల ఓటర్లు, దళిత ఓటర్లు యాభై వేలు. ఆరు వేల మంది యాదవ్, పదివేల మంది పాల్ వర్గం వారున్నారు. ఎస్‌పి అభ్యర్థి హసన్‌కు ముస్లింలు కట్టకట్టుకుని ఓటు వేయగా, యాదవ్, పాల్, జాట్, దళిత ఓటర్లు మద్దతు ఇవ్వడంతో భాజపా అభ్యర్థి అవినాష్ సింగ్ ఓటమి చెందారు.
బిహార్‌లోని జోకిహట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రతిపక్షం ‘హిందూ మతతత్వ బూచి’ని చూపించింది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2.40 లక్షలు. ఇందులో మెజారిటీ ఓటర్లు ముస్లింలే. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ భాజపాతో చేతులు కలిపి మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారనేది ఆర్‌జెడి ప్రధాన ప్రచార ఆయుధం. ప్రస్తుతం ముంబయిలోని ఒక ప్రైవేట్ ఆసుప్రతిలో వైద్య చికిత్స చేయించుకుంటున్న ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మొదటి నుండి భాజపా వ్యతిరేకి. భాజపాకు మతతత్వ ముద్ర వేయటంతోపాటు దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారిలో లాలూ ప్రసాద్ ముఖ్యుడు. ఉత్తరాదిలో మెజారిటీ ముస్లింలు లాలూకు మద్దతు ఇస్తారు. జోకిహాట్‌లో ఇది బాగా పని చేసింది. మెజారిటీ ఓటర్లలైన ముస్లింలు ఆర్‌జెడి అభ్యర్థి షానవాజ్‌కు ఓటు వేయటంతో ఆయన 41వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపఎన్నికల సందర్భంగా ‘ముస్లింలకు భాజపా ప్రధాన శత్రువం’టూ ప్రతిపక్షాలు ప్రచారం చేయటం మతతత్వం కాదా? భాజపా ఎంత మతతత్వంతో వ్యవహరించిందో అంతే మతతత్వాన్ని ప్రతిపక్షాలు భుజాన వేసుకున్నాయి. అధికార, విపక్షాలు కులతత్వాన్ని, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలూ ఒకేలా వ్యవహరిస్తున్నాయి.
ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాలకు గుణపాఠం చెప్పడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించామంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలో రవ్వంత నిజం కూడా లేదు. భాజపాను నిలువరించిన ఆర్‌ఎల్‌డి, ఎస్‌పి, ఎన్‌సిపి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు అప్రజాస్వామిక, కుటుంబ పాలనను కొనసాగిస్తున్నవే. కైరానాలో విజయం సాధించిన తబస్సుమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌ఎల్‌డి చౌదరి చరణ్‌సింగ్ స్థాపించిన పార్టీ. చరణ్‌సింగ్ మరణానంతరం ఆయన కుమారుడు అజిత్‌సింగ్ దానికి అధ్యక్షుడయ్యాడు. అజిత్ స్థానంలో ఆయన కుమారుడు జయంత్ సింగ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. నూర్‌పూర్‌లో గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ ములాయం సింగ్ కుటుంబ పార్టీ. ములాయంను పక్కకు తప్పించి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అతని కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోని మెజారిటీ పదవులు, ఉద్యోగాలు యాదవ్‌లు తన్నుకుపోయారనేది అందరికీ తెలిసిందే. జోకిహాట్ అసెంబ్లీ సీటును గెలుచుకున్న ఆర్‌జెడి లాలూ ప్రసాద్ కుటుంబ పార్టీ. అవినీతి ఆరోపణలతో లాలూ జైలుకు వెళ్లటంతో ఆయన రెండో కుమారుడు తేజస్వీ యాదవ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బెంగాల్‌లోని మెహస్థలి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ నూటికి నూరు పాళ్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ. ఉపఎన్నికల్లో భాజపాను ఓడించినందుకు విపక్షాలను ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎవరిదనేది వేరే చెప్పనక్కర లేదు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను పార్టీ నాయకత్వం చేపట్టేందుకు సిద్ధం చేస్తుండడం బహిరంగ రహస్యమే. మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ (ఎస్) పేరుకే సెక్యులర్. జె.డి (ఎస్) కర్నాటకలోని వక్కలిగల కులానికి ప్రాతినిధ్యం వహిస్తుందనేది తెలిసిందే. వీరంతా మతతత్వం, కులతత్వం గురించి మాట్లాడటం, ప్రజాస్వామ్యం మంటకలుస్తోందని ఆవేదన చెందడం వింత కాదా?

-- కె.కైలాష్ సెల్: 98115 73262