ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ కొట్టుకుపోతోంది, గాంధీ కుటుంబ సభ్యులతోపాటు సీనియర్ నాయకులు కనీసం ఇప్పుడైనా కళ్లు తెరవకపోతే పార్టీని కాపాడటం చాలా కష్టం. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక అంశంపై పార్టీ రెండుగా చీలిపోవటంతోపాటు ఇరు పక్షాల మధ్య అంతర్యుద్ధం కొనసాతోంది. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రమే పార్టీ అధ్యక్షులుగా కొనసాగాలని ఒక వర్గం వాదిస్తోంటే రెండో వర్గం సీనియర్ నాయకులలో ఒకరిని అధ్యక్షుడుగా ఎన్నుకుని ముందుకు సాగాలని వాదిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య ఇంత కాలం తెర వెనక కొనసాగిన యుద్ధం ఇప్పుడు బహిరంగ వేదికలెక్కింది. సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ వీరిద్దరు కాని పక్షంలో ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ అద్యక్ష పదవి చేపట్టాలని మొదటి వర్గం పట్టుబట్టి కూర్చున్నది. గాంధీ కుటుంబ సభ్యులు పార్టీ నాయకత్వాన్ని వదులుకున్న మరుక్షణం కాంగ్రెస్ కుప్పకూలుతుందని మొదటి వర్గం ప్రగాఢ విశ్వాసం. గాంధీ కుటుంబ సభ్యులు నాయకత్వం వహించకోతే కాంగ్రెస్ నిలదొక్కుకోలేదు, వారే కాంగ్రెస్‌కు పునాదులంటూ గతంలో ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర అని ప్రకటించిన దేవకాంత్ బరువాను వీరు అనుసరిస్తున్నారు. గాంధీ కుటుంబం తప్పుకుంటే కాంగ్రెస్ అనే భవనం కుప్పకూలుతుంది కాబట్టి వారే నాయకత్వం వహించాలని మొదటి వర్గం స్పష్టం చేస్తోంది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న తరువాత సోనియా గాంధీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి చేపట్టకుంటే కాంగ్రెస్ ఈ పాటికి చీలిక పేలికలయ్యేదని వారంటున్నారు. కాంగ్రెస్ మద్దతు దారులు, దేశంలోని బీద, బిక్కి, బడుగు,దళిత వర్గాలు, ముస్లిం మైనారిటీలు గాంధీ కుటుంబ సభ్యులను మినహా మరొకరిని కాంగ్రెస్ అధ్యక్షులుగా చూసేందుకు ఇష్టపడటం లేదన్నది వీరాభిమానుల వాదన. గాంధీ కుటుంబం మూలంగానే కాంగ్రెస్ ఒక పార్టీగా కొనసాగుతుంది. కాంగ్రెస్ అస్తిత్వం గాంధీ కుటుంబం అది లేనిరోజు పార్టీ ఉండదని మొదటి వర్గం బల్లగుద్ది చెబుతోంది.
గాంధీ కుటుంబం నాయకత్వం వహిస్తేనే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుస్తుంది, బతికి బట్టకట్టే రోజులు పోయాయని రెండో వర్గం వాదిస్తోంది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు, సోనియా గాంధీ కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు తప్ప పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేరు, ఈ పరిస్థితుల్లో గాంధీ కుటుంబం వెలుపల నుండి కొత్త నాయకుడిని ఎన్నుకుంటే తప్పేమిటన్నది రెండో వర్గం నాయకుల వాదన. సోనియా గాంధీ అనారోగ్యం మూలంగా పార్టీ బాధ్యతలను పూర్తి స్థాయిలో మోసేందుకు సిద్దంగా లేరు. నిజానికి ఆమె కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను కూడా కేవలం ఆరునెలల కోసమే చెప్పారు. అందుకే ఆమె పార్టీకి తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆమె మొదట విధించిన ఆరు నెలల గడువు ఏప్పుడో ఐపోయింది. వాస్తవానికి తన పూర్తి సమయాన్ని పార్టీకి ఇచ్చేందుకు ఆమె సుముఖంగా లేరు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగేందుకు ఇష్టపడటం లేదు, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎవ్వరు ఆమోదించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బయటి వారిని అధ్యక్షుడుగా ఎన్నుకోకుండా ఈ రాద్ధాంతం ఏమిటని శశిథరూర్, జయరాం రమేష్, అభిషేక్ సింఘ్వి లాంటి నాయకులు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది అభ్యర్థులు ధరావతును కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పలుకుబడి ఏ పాటిదనేది ఈ ఎన్నికలు మరోసారి స్పష్టం చేశాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ ఓటర్లందరు ఆం ఆద్మీ పార్టీకి వెళ్లిపోయారు. ఢిల్లీ శాసన సభలోని మొత్తం 70 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తే వారికి లభించిన ఓట్లు కేవలం నాలుగు శాతం మాత్రమే. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ దక్కించుకోలేకపోయాడు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తరువాతి స్థానం బి.జె.పి.ది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పలు సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పుడు మూడు, నాలుగో స్థానానికి నెట్టివేయబడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు కార్యకర్తలు కరువవుతున్నారు. ఇక ఉత్తర ప్రదేశ్ సంగతి అందరికి తెలిసిందే. యు.పి. రాజకీయాలలో బి.జె.పి. తరువాత స్థానం సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీలది. కాంగ్రెస్ నాలుగో స్థానానికి పడిపోయింది. బిహార్‌లో జె.డి.యు., బి.జె.పి., ఆర్.జె.డి. తరువాత కాంగ్రెస్ ఉంటోంది. అదికూడా ఆర్.జె.డి. భుజాలెక్కి కూర్చోవటం వల్లనే కాంగ్రెస్ పరువు కొంతైనా దక్కుతోంది. కర్నాటకలో బి.జె.పి. తరువాత దేవేగౌడ నాయకత్వంలోని జె.డి., ఆ తరువాతనే కాంగ్రెస్ అంటే మూడో స్థానం కాంగ్రెస్‌ది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ భూ స్థాపితమైపోయింది. తెలంగాణాలో భూస్థాపితమయ్యే పరిస్థితులను కాంగ్రెస్ నాయకులే సృష్టించుకుంటున్నారు. తమిళనాడులో కాంగ్రెస్ అస్తిత్వం ఏ పాటిదనేది అందరికి తెలిసిందే. డి.ఎం.కె. మద్దతు లేకపోతే కాంగ్రెస్ మనుగడే ఉండదు. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం లాంటి నాయకులున్నా కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. కేరళలో కాంగ్రెస్ పరిస్థితి కొంతే మెరుగే. రాష్ట్ర ప్రజలు ఒకసారి కాంగ్రెస్‌కు మరోసారి వామపక్షాలకు అధికారం అప్పగిస్తున్నారు. కేరళ రాజకీయాల్లో పాగా వేసేందుకు బి.జె.పి. చేస్తున్న కృషి ఆశించిన స్థాయిలో ఫలించటం లేదు. మహారాష్టల్రో కూడా కాంగ్రెస్‌ది నాలుగో స్థానమే. బి.జె.పి అధికారంలోకి రాకుండా చూసేందుకు కాంగ్రెస్ తన రాజకీయ ఆగర్భ శతృవు శివసేనతో చేతులు కలిపింది. రాష్ట్రంలో మొదటి స్థానం బి.జె.పి.దైతే రెండో స్థానం శివసేనది. మూడో స్థానంలో ఎన్.సి.పి. ఉంటే నాలుగో స్థానంలో కాంగ్రెస్ ఉన్నది. ఎన్.సి.పి. అధినాయకుడు శరద్ పవార్ సూచనలు, సలహాల మేరకు నడుచుకోవలసిన దుస్థితిలో కాంగ్రెస్ పడిపోయింది. బి.జె.పి. అధినాయకత్వం అభ్యర్థుల ఎంపికలో చేసిన తప్పుల మూలంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గడ్‌లో అధికారంలోకి వచ్చింది. జార్కండ్‌లో ప్రాంతీయ పార్టీ జె.ఎం.ఎం. తోకపట్టుకుని ముందుకు సాగుతోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి క్యాప్టెన్ అమరీందర్ సింగ్. రాహుల్ గాంధీ రాజకీయం అమరీందర్ సింగ్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదు అందుకే ఆయన నేరుగా సోనియా గాంధీతో మాట్లాడుకుంటాడు. ఒకప్పుడు రాజ్యమేలిన ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ దాదాపుగా కనుమరుగైపోయింది. ఉత్తరాధిలోని పలు ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ఏ ఒక్క సీనియర్ నాయకుడు కూడా సిద్ధంగా లేడు. రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీఆజాద్ కూడా రాహుల్ గాంధీ ట్విట్టర్ రాజకీయాల మూలంగా తన పదవి నుండి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతోపాటు పలువురు ఇతర సీనియర్ నాయకులకు పార్టీపై విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. అందుకే కాంగ్రెస్ చుక్కాని లేని నావ మాదిరిగా కొట్టుకుపోతోందంటూ శశిథరూర్ బహిరంగంగా తన ఆవేదనను వెళ్లగక్కారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులెవ్వరు కూడా పరస్పరం చర్చించుకుని నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరు. రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సీనియర్ నాయకులకు ఎవ్వరికి అర్థం కాదు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్నా ట్విట్టర్ ప్రకటనలు, ఇష్టానుసారం మాట్లాడటం వంటి కార్యకలాపాలను ఏమాత్రం తగ్గించలేదు. రాహుల్ గాంధీ బాధ్యతలు లేని రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్నాడు. దీని మూలంగా కాంగ్రెస్ నిర్ణయాక వ్యవస్థ, ప్రభుత్వ నిర్ణయాలపై వెంటనే స్పందించే వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సమిష్టి ఆలోచన, సమిష్టి నిర్ణయం అనేది కాంగ్రెస్‌లో ఎప్పుడో కరువైపోయాయి. రాహుల్ గాంధీని ఆయన నిర్ణయాలను ఇష్టపడని వారి సంఖ్య కాంగ్రెస్‌లో రోజు,రోజుకు పెరుగుతుంది. రాహుల్ గాంధీ చుట్టూ చేరిన కోటరీ మూలంగా గులాం నబీ ఆజాద్, అహమద్ పటేల్ లాంటి సీనియర్ నాయకులు పార్టీకి దూరమవుతున్నారు. గాంధీ కుటుంబం చేతిలో నాయకత్వం ఉన్నంత కాలం కాంగ్రెస్ బాగుపడదని అభిప్రాయపడే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. అందుకే కనీసం ఇప్పుడైనా జాగ్రత్తపడి గాంధీ కుటుంబానికి చెందని వారిని పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకుని ముందుకు సాగాలన్నది రెండోవర్గం వాదన.

కె.కైలాష్ 98115 73262