ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాజకీయ స్వార్థంతో అరాచక వాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక నేత లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ధర్నా చేయడం బాధ్యతారాహిత్యం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల పేరిట చేస్తున్న ఈ అరాచక రాజకీయాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాల్సిందే. మన దేశంలో రాజకీయం మితిమీరిపోతోంది. నేతలు తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం అనేదే లేకుండాపోతుంది. కేజ్రీవాల్ వారం రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజల్ అధికార నివాసంలోని అతిథుల గదిలో బైఠాయింపు చేస్తున్నారు. ‘్ఢల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఐఏఎస్ అధికారులు సమ్మె విరమించాలి.. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్రం హోదా కల్పించాలి..’ అన్నవి కేజ్రీవాల్ ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్ల సాధన ద్వారా ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్నాన్నది కేజ్రీవాల్ ‘క్రేజీ’ ఆలోచన. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి సిసోడియా, మరో ఇద్దరు మంత్రివర్గ సహచరులు దీక్షలో పాల్గొంటున్నారు.
కేజ్రీవాల్ గతంలోనూ ముఖ్యమంత్రిగా ఉంటూనే ధర్నాలు, నిరాహార దీక్షలు చేశారు. 2014లో గణతంత్ర దినోత్సవాలకు కొన్ని రోజుల ముందు సెంట్రల్ ఢిల్లీలోని రైల్వే భవన్ వద్ద రోడ్డుపై ఆయన నిరాహార దీక్ష చేయడం తెలిసిందే. ఢిల్లీకి చెందిన కొందరు పోలీసు అధికారులను తొలగించాలంటూ ఆయన ధర్నా చేస్తూ తనను తాను అరాచకవాదిగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు మరోసారి తన అరాచకాన్ని ప్రదర్శిస్తూ రోడ్డు మీద బైఠాయించడానికి బదులు లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలోని అతిథుల ఏసీ గదిలో నిరసన వ్రతం చేపట్టారు. ఓ ముఖ్యమంత్రి ఇలా లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసంలోకి చొరబడి ధర్నా చేయడం సబబేనా? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
నిజానికి కెజ్రీవాల్ చేస్తున్న డిమాండ్లు హేతుబద్ధం కానివి, అరాచకమైనవి. విచక్షణ, వివేచన ఉన్న వారెవ్వరూ ఇలాంటి డిమాండ్లతో లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ధర్నా చేయరు. ఐఏఎస్ అధికారులు సమ్మెను ఉపసంహరించుకోవాలన్న ఆయన డిమాండ్ కూడా అసమంజసంగా ఉంది. ఢిల్లీ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి అంశు ప్రకాశ్, ఇతర ఐఏఎస్ అధికారులు నిజంగానే సమ్మె చేస్తున్నారా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే- కేజ్రీవాల్, ఆయన మంత్రులు, ఎంఎల్‌ఏలు అంశు ప్రకాశ్‌పై అర్ధరాత్రి సమయంలో చేయి చేసుకున్నప్పటి నుండి ఢిల్లీకి చెందిన ఐఏఎస్ అధికారులు నిబంధనల ప్రకారం పని చేస్తున్నారు. మెజారిటీ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వద్ద పని చేసేందుకు నిరాకరిస్తున్నారు. సాయంత్రం ఆ రు గంటలు దాటాక ఢిల్లీ సచివాలయంలో ఉండేందుకు వారు ఎంతమా త్రం సిద్ధంగా లేరు. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేసేందుకు నిధులు విడుదల చేసేది లేదని అంశు ప్రకాష్ నిరాకరించారు.
ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఒక సంస్థకు లాభం చేకూర్చేందుకు ఈ ప్రతిపాదనను రూపొందించారంటూ అంశు ప్రకాశ్ ఇందుకు సంబంధించిన ఫైల్‌ను పక్కన పడేశారు. దీనికి ఆగ్రహించిన కేజ్రీవాల్, మరో ఇద్దరు శాసన సభ్యులు అర్ధరాత్రి వేళ అంశు ప్రకాశ్‌ను సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి కార్యాలయంలో చేయి చేసుకున్నారు. ఈ సంఘటన అనంతరం కేజ్రీవాల్ సహా ఆయన మంత్రులకు, అధికారులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర సీనియర్,జూనియర్ ఐఏఎస్ అధికారులంతా ముఖ్యమంత్రితో, మంత్రులతో కలిసి పనిచేయటం లేదు. ఐఏఎస్ అధికారులు క్రమం తప్పకుండా తమ కార్యాలయాలకు వెళ్లి నిబంధనల మేరకు విధులకు హాజరవుతున్నారు. దీనిని కేజ్రీవాల్ ‘ఐఏఎస్‌ల సమ్మె’ చిత్రీకరిస్తున్నారు. అధికారులు మాత్రం తామంతా ఆఫీసులకు వస్తున్నామని, విధులను నిర్వహిస్తున్నామని మీడియాకు ఫొటోలతో కూడిన ప్రకటనలు జారీ చేశారు. దీంతో కేజ్రీవాల్ తాను సృష్టించుకున్న సుడిగుండంలో తానే పడి గిలగిలలాడుతున్నారు. ఇక, కేజ్రీవాల్ రెండో డిమాండ్- ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్రం హోదా కల్పంచడం. ఇది ఎంతమాత్రం అమలుకు నోచుకోలేని డిమాండ్ అనేది కేజ్రీ సహా అందరికీ తెలిసిందే. దేశ రాజధాని అయిన ఢిల్లీ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసం కేం ద్రం, రాష్ట్రం కలిసి పనిచేయవలసి ఉంటుంది. పో లీసు, పట్టణాభివృద్ధి, పురపాలన విషయంలో రెండు ప్రభుత్వాలూ సంయమనంతో పని చేయవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడి నుండే పని చేస్తుంది కాబట్టి పోలీసు, పురపాలన, పట్టణాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించి పూర్తి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం ఎంత మాత్రం సాధ్యం కాదు.
శాంతిభద్రతల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వం పని చేయటం అసాధ్యం అవుతుంది. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీకి సంబంధించి శాంతిభద్రతలను కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంచారు. శాంతిభద్రతల బాధ్యతలను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రం హోదా ఇవ్వాలని మంకుపట్టు పడుతున్న ఆయన ముందుగా భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలి. దేశ రాజధాని ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటిస్తే- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య రాజ్యాంగపరమైన ప్రతిష్టంభన నెలకొంటుందని కేజ్రీవాల్‌కు తెలియదా? రాజ్యాంగాన్ని సవరించటం ద్వారా ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్రం హోదా కల్పిస్తే- ముఖ్యమంత్రి అధికార పరిధిలో దేశ ప్రధాని పని చేయవలసిన విపత్కర పరిస్థితులు నెలకొంటాయి. దేశానికి నాయకత్వం వహించే ప్రధాన మంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి పరిధిలో పనిచేయటం ఎలా సాధ్యం? ఢిల్లీ నగరాభివృద్ధికి కృషి చేయవలసిన కేజ్రీవాల్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ధర్నా చేపట్టి అరాచక పరిణామాలకు తెరతీశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను కేజ్రీవాల్ లాంటి నేతలు రెచ్చగొడుతూనే ఉంటారు. ఇలాంటి కొందరు ముఖ్యమంత్రులు ప్రజలకు అనునిత్యం అబద్ధాలు చెబుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. తమ వైఫల్యాలను మరుగునపడవేసేందుకు వీరు ఇలాంటి విన్యాసాలు చేయడం పరిపాటైంది. అవసరమైతే ప్రజలను రెచ్చగొట్టేందుకు కూడా వీరు వెనుకాడడం లేదు. ప్రజలంతా కేజ్రీవాల్ చుట్టూ రక్షణ కవచంగా నిలబడాలని ఓ ముఖ్యమంత్రి పిలుపునిస్తే, మరో ముఖ్యమంత్రి ఓ అడుగు ముందుకేసి ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించాలని ఢిల్లీలోని పది లక్షల కుటుంబాలకు పిలుపు ఇవ్వటం అరాచక రాజకీయం కాదా?. కేంద్రంలో అధికారంలో ఉన్నది దేశ ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే తప్ప బ్రిటీష్ పాలకులు కాదనేది ఈ ముఖ్యమంత్రులకు తెలియదా? ఈ నాయకులు దేశాన్ని, ప్రజలను ఎటువైపు తీసుకుపోతున్నారు? పూటకో అబద్ధం చెప్పే వీరా మన యువకులకు, భావితరాలకు ఆదర్శప్రాయులు?

- కె.కైలాష్ సెల్: 98115 73262