ఆంధ్రప్రదేశ్‌

‘దేశం’లో వలసల చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 19:పార్టీ మారిన వారిని సమన్వయం చేసుకుని పనిచేయాలన్న టిడిపి అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. మొదటినుంచి పనిచేస్తున్న వారిని పక్కకుపెట్టి, కేవలం జగన్ పార్టీని నిర్వీర్యం చేయాలన్న వ్యూహంలో భాగంగా, ఆ పార్టీవారిని చేర్చుకుని పెద్దపీట వేస్తున్న వైనం టిడిపి నేతలకు మింగుడుపడటం లేదు. దానికితోడు త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో పార్టీ మారి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరికి మంత్రిపదవి వస్తోందంటూ జరుగుతున్న విస్తృత ప్రచారం తమ్ముళ్లను వైసీపీ వైపు చూసేలా ప్రేరేపిస్తున్నాయి. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, అనంతపురం నుంచి చాంద్‌పాషా, విజయనగరం నుంచి సుజయకృష్ణ రంగారావుకు పదవులు లభిస్తాయంటూ మొదలైన ప్రచారం టిడిపి సీనియర్లలో కలకలం రేకెత్తిస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథరెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతున్నా అక్కడ అసమ్మతి ప్రభావం పెద్దగా లేదంటున్నారు.
పదేళ్లు పార్టీని భుజాన వేసుకుని మోసిన తమపై వైసీపీ నుంచి వచ్చిన వారిని రుద్దడమే కాకుండా, వారికి మళ్లీ మంత్రి పదవులిచ్చేందుకు ప్రయత్నించడమే వారి ఆగ్రహానికి కారణం. దీనితో కొందరు సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ కూడా టిడిపి సీనియర్ల ఆగ్రహాన్ని, తనకు అనుకూలంగా మలచుకునేందుకు సీనియర్లను రంగంలోకి దింపటం ఆసక్తికరంగా మారింది. తాజాగా కర్నూలులో భూమాకు మంత్రి పదవి వస్తోందంటూ మొదలైన ప్రచారం ఆయన ప్రత్యర్థులైన శిల్పా బ్రదర్స్, ఇరిగెల రాంపుల్లారెడ్డి తదితర నేతల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే గంగుల పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ముగ్గురు సీనియర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నప్పటికీ అధికారం ఉన్నందున తమ మాటకు విలువ ఉంటుందన్న భావనతో, ఇప్పటివరకూ పార్టీలో కొనసాగుతున్న వారికి, భూమా మంత్రి అవుతున్నారన్న ప్రచారం మింగుడుపడటం లేదు. వీరంతా ఉప ముఖ్యమంత్రి కెఇని కలిసి తమకు జరుగుతున్న అవమానంపై వాపోయినట్లు తెలిసింది.
శిల్పా బ్రదర్స్ ఇటీవల బాబును కలసి తమ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, అసమ్మతి నేతలను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత జగన్ సీనియర్లను బరిలోకి దింపగా, ఇప్పటికే వారు టిడిపి నేతలతో ఒక దఫా చర్చలు ముగించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి శిల్పా బ్రదర్స్‌ను బుజ్జగించేందుకు చంద్రబాబు పార్టీ నేతలను రాయబారానికి పంపినా, వారు అసంతృప్తి వీడటం లేదని తెలుస్తోంది.
ఇక ఇటీవలి కాలంలో ఆరోపణలు, తరచూ బాబు ఆగ్రహానికి గురవుతున్న గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి, రానున్న విస్తరణలో తనను తొలగిస్తారని ముందే గ్రహించి, వైసీపీ ఎంపీతో ఇటీవల రహస్య మంతనాలు జరిపిన వైనం అటు టిడిపి నాయకత్వానికి షాక్ ఇచ్చింది. దానితో కీలకమైన ఫైళ్లను ఆయనకు పంపవద్దని వౌఖిక ఆదేశాలిచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి సదరు మంత్రి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి సీటు ఆశించి విఫలమైన తర్వాత టిడిపిలో చేరి, ఒక కేంద్రమంత్రి ద్వారా టికెట్, మంత్రి పదవి సాధించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్‌కు మంత్రి పదవి వస్తోందంటూ జరుగుతున్న ప్రచారం జిల్లాల్లోని టిడిపి సీనియర్ల ఆగ్రహానికి కారణమయింది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే తమ దారి తాము చూసుకునేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ఒకరంటే మరొకరికి పొసగని నేతలంతా ఏకమవుతుండటం విశేషం. జనార్దన్ వంటి సీనియర్ ఉండగా, కొత్తగా పార్టీలోకి వచ్చిన గొట్టిపాటికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కరణం బలరాం వర్గం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది.
ఒకవేళ గొట్టిపాటికి మంత్రి పదవి ఇస్తే ప్రకాశం జిల్లాలో తిరుగుబాట్లు తప్పేలా లేవు. వైసీపీ బలపడుతున్న జిల్లాల్లో ప్రకాశం ఒకటి కావడంతో రాగల పరిణామాలపై నాయకత్వం కూడా ఆందోళనతో ఉంది. విజయనగరం జిల్లాలో తమను కాదని సుజయకృష్ణ రంగారావుకు ఎలా మంత్రి పదవి ఇస్తారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. వెలమ సామాజికవర్గానికి రాష్ట్రంలో ఎంత బలం ఉందని వాదిస్తున్నారు. అనంతపురం చాంద్‌పాషాకు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆయన ప్రత్యర్థి వర్గం వ్యతిరేకిస్తోంది. అంతగా ముస్లిం కోటాలో మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ షరీఫ్‌కు ఇవ్వమని వాదిస్తున్నారు.
మరో ఏడాది తర్వాత ఎన్నికల వాతావరణం మొదలవుతుంది కాబట్టి, ఇప్పటినుంచే తమ రాజకీయ భవిష్యత్తును బాట వేసుకోవాలని టిడిపి సీనియర్లు భావిస్తున్నారు. పార్టీలో తగిన గౌరవం లేకపోయినా తమ ప్రత్యర్ధులకు పెద్దపీట వేస్తుంటే చూస్తూ ఉండటం కంటే వైసీపీలో చేరడమే మంచిదన్న భావనతో కనిపిస్తున్నారు. అటు పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టిడిపి సీనియర్లు వెళ్లిపోతే ఇక తమకు అడ్డు ఉండదన్న ఆశతో కనిపిస్తున్నారు.

మార్తి సుబ్రహ్మణ్యం