నల్గొండ

ధర్మభిక్షం జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఫిబ్రవరి 15: తెలంగాణ సాయుధపోరాట యోధుడు, మాజీ ఎంపి దివంగత బొమ్మగాని ధర్మభిక్షం జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ధర్మభిక్షం 94వ జయంతి సందర్భంగా పట్టణంలోని ధర్మభిక్షం చౌక్‌లోగల విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాం పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి తిరుబాటు చేసిన గొప్పపోరాటయోధుడని స్మరించారు. శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా నిస్వార్ధంగా పనిచేసి సూర్యాపేట అభివృద్ధికి పాటుపడిన మహనీయుడని కొనియాడారు. ధర్మభిక్షం జీవితచరిత్రను పాఠ్యాంశాల్లో చేర్పించేందుకు తమవంతుగా కృషి చేస్తానని చెప్పారు. ధర్మభిక్షంచౌక్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయిస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కెవిఎల్, పట్టణ కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్, సీనియర్ నాయకులు దోరెపల్లి శంకర్, బొమ్మగాని వెంకటయ్య, ఖమ్మంపాటి అంతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ, వివిధ పార్టీల నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, పెద్దిరెడ్డి రాజా, వై.వెంకటేశ్వర్లు, కట్కూరి గన్నారెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, తల్లమళ్ల హస్సేన్, బెల్లంకొండ రాంమూర్తి, బైరు దుర్గయ్య, నేరేళ్ల మధు, బూర రాములు, కౌన్సిలర్ అనంతుల మల్లీశ్వరి, మాజీ మార్కెట్ డైరెక్టర్ శనగాని రాంబాబుగౌడ్, సుధా బ్యాంకు ఎండి పెద్దిరెడ్డి గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెవిఎల్ రచించిన లాల్‌సలాం కామ్రెడ్ ధర్మభిక్షం పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఘనంగా సంతుసేవాలాల్ జయంతి
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 15: గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నాగార్జునసాగర్‌లో గిరిజన దైవమైన సంతుసేవాలాల్ 277వ జయంతిని విజయవిహార్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బుద్ధవనం నుండి గిరిజన నాయకులు ర్యాలి నిర్వహించారు. పైలాన్, హిల్‌కాలనీలలో ర్యాలి నిర్వహించిన అనంతరం విజయవిహార్ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల ఆరాద్యదైవమైన లచ్చిరాంనాయక్ ఆధ్వర్యంలో హోమం నిర్వహించి బోగ్‌బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా లచ్చిరాంనాయక్ మాట్లాడుతూ 200సంవత్సరాల క్రితమే గిరిజనుల ఐక్యత కోసం, సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసిన సంతుసేవాలాల్ మార్గంలో ప్రతిఒక్క గిరిజనులు నడవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. గిరిజనుల ఆత్మగౌరవం సేవాలాల్ అని కొనియాడారు. ఈసందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో నిర్వాహణ కమిటి సభ్యులు కేశవ్‌అజ్మీర్, చందులాల్‌నాయక్, భగవాన్‌నాయక్, శ్రీనునాయక్, రవినాయక్, నాగార్జుననాయక్, శంకర్‌నాయక్, బాబురావునాయక్, రామచందర్‌నాయక్, అశోక్‌నాయక్, శివనాయక్‌లు పాల్గొన్నారు.
పోరాటంతోనే బొల్లెపల్లి కాల్వను సాధించుకుంటాం
భువనగిరి, ఫిబ్రవరి 15: బొల్లెపల్లి కాల్వ ఆయకట్టు రైతాంగంతో కలిసి పోరాటాలు చేపట్టి కాల్వకు నిధులు సాధించుకుంటామని భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. బొల్లెపల్లి కాల్వపనులకు, భూనిర్వాసితులకు 5కోట్లరూపాయల నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం బీబీనగర్ మండలంలోని రాఘవపురం నుండి బ్రాహ్మణపల్లి, రామునిగుండ్లతండా, బొడ్కతండా, చిన్నపలుగు, పెద్దపలుగుతండాలు, రావిపహడ్ తండా, మాదారం, సిరివేణికుంట గ్రామాల మీదుగా భువనగిరి మండలంలోని బొల్లెపల్లి చెరువువరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర్లుకు సంఘీభావం తెలుపుతూ స్వాగతం పలికారు. ఈసందర్భంగా బొల్లెపల్లి చెర్వులో ఏర్పాటుచేసిన సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గంలో గెలుపొందిన ప్రజాప్రతినిధులు కాల్వపనులు పూర్తయ్యాయని, నీటిని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతుల అండదండలతో బొల్లెపల్లికాల్వ పనులకు నిధులు సాధించేందుకు కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేపడ్తామని హెచ్చరించారు. కాల్వపనులకు నిధులు విడుదల చేయని పక్షంలో భువనగిరి ఐబి కార్యాలయాన్ని ముట్టడిచేస్తామని, రోడ్డుదిగ్బంధన కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వం మెడలు వంచి నిధులు సాధిస్తామని వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తంచేశారు. వెంటనే ప్రభుత్వం భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, రాఘవాపురం వద్ద బ్రిడ్జి నిర్మించాలని, శ్రీరాంసాగర్ చెరువుకట్ట ఎత్తు పెంచాలని, నందగిరి బావికుంటకు మరమ్మతులు చేపట్టి నీటితో నింపాలని కోరారు.
ఈ పాదయాత్ర కార్యక్రమంలో భువనగిరి వైస్ ఎంపిపి మోడెపు శ్రీనివాస్, సర్పంచ్‌లు రాసాల రవికుమార్, పద్మ జంగయ్య, రఘునాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్టొళ్ల శ్యాంమ్‌గౌడ్, చందునాయక్, చిక్కుల వెంకటేశం, ఎటిమినేటి సురేష్, బర్రె నరేష్, జంగిటి వినోద్, కంచె మహేష్, లింగస్వామి, పాండు, బొల్లెపల్లి కాల్వ ఆయకట్టు రైతులు, మహిళలు పాల్గొన్నారు.
ప్రజల అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టరేట్(నల్లగొండ), ఫిబ్రవరి 15: ప్రజలు తమ సమస్యలపై అందించే అర్జీలు, ఫిర్యాదులను అధికారులు తక్షణమే శాశ్వత ప్రాతిపదికన పరిష్కారించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్‌డే పిదప నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం కార్యాలయం నుండి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. తాగునీటి ఎద్దడిపై రోజువారీ నివేదికలు ఇవ్వాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. ఒకేసారి 12అసెంబ్లీ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం పథకం లేఅవుట్లు పూర్తి చేసి నెలాఖరులోగా ఒకేసారి టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. 2013-14ఆర్ధిక సంవత్సరం నిధులతో చేపట్టిన ఎస్సీ, ఎస్టీ పాఠశాలల, హాస్టల్స్ భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి నిధులు సద్వినియోగం జరిగేలా చూడాలన్నారు. ఈ నెల 17న ఎన్‌జి కళాశాల మైదానంలో 28కంపెనీలు నిర్వహించే భారీ జాబ్‌మేళా విజయవంతమయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, చిల్డ్రన్స్ హోమ్స్, నైట్ షెల్టర్స్ వంటి స్వచ్చంద సంస్థల వివరాలను వారంలోగా తనకు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి ఎన్. సత్యనారాయణ, డిఆర్‌వో రవినాయక్, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.
హాస్టల్ తెరిపించాలని ధర్నా
కేతేపల్లి, ఫిబ్రవరి 15: మండలపరిధిలోని కొర్లపహాడ్ గ్రామ శివారులో ఉన్న ఆదర్శ పాఠశాల వసతి గృహాన్ని తెరిపించాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆ పాఠశాల విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కన్వీనర్, నార్కెట్‌పల్లి రమేష్, తెలంగాణ ఉద్యమ వేదిక జిల్లా నాయకుడు బొల్లెపల్లి అంజయ్యలు మాట్లాడుతూ వసతి గృహాన్ని నిర్మించి కనీస వసతులు నిర్వాహకులు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థుల చదువుకు ఆటకం కలుగుతుందన్నారు. వసతి గృహానికి ప్రత్యేక వార్డెను ఏర్పాటు చేయకపోవడం వల్ల వసతి గృహం ప్రారంభించిన నెలరోజులకే మూసి వేశారని చెప్పారు. జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థుల సంక్షేమం కోసం తక్షణమే వార్డెను ఏర్పాటు చేసి సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం మూతపడిన వసతి గృహాన్ని తెరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంపత్, నాగరాజు, వెంకటేష్ పాల్గొన్నారు.
పేటలో మంత్రికి ఘనస్వాగతం
* భారీ మోటార్ సైకిల్ ర్యాలీ
సూర్యాపేట, ఫిబ్రవరి 15: రాష్ట్ర దళిత సంక్షేమ, సహకార శాఖల మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డి తొలిసారిగా పట్టణానికి వచ్చిన సందర్భంగా టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం పట్టణంలో ఘనస్వాగతం పలికారు. పట్టణ శివారులోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలవద్ద మంత్రి కాన్వాయికి ఎదురెళ్లి పూలమాలలతో స్వాగతించారు. ఈ సందర్భంగా వెయ్యి ద్విచక్ర వాహానాలతో పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు వై. వెంకటేశ్వర్లు, కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎంపిపి వట్టె జానయ్యయాదవ్, మారిపెద్ది శ్రీనివాస్, టిఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, కౌన్సిలర్లు గాజుల రాంబాయమ్మ, తాహేర్, బాణాల విజయ్‌కుమార్, మాజీ మార్కెట్ డైరెక్టర్ శనగాని రాంబాబుగౌడ్, మాజీ పెద్దగట్టు చైర్మన్ మద్ది శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఉన్నారు.
గ్రీవెన్స్‌లో వినతుల వెల్లువ
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 15: వివిధ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో వినతులు వెలువెత్తాయి. తాగునీటి సమస్య, ఫించన్‌లు, ఆహార భద్రత కార్డులు, పెండింగ్ ఇండ్ల బిల్లులు తదితర సమస్యలు పరిష్కరించాలని జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి వినతి పత్రాలు అందించారు. యాదాద్రిలో ఎరుకల సత్రాన్ని నిర్మించాలని జిల్లా ఎరుకల పోరాట సమితి అధ్యక్షులు కోనేటి నర్సింహ, రాష్ట్ర కోశాధికారి రుద్రాక్షి నర్సింహలు వినతినందించారు. బాల్య వివాహాలు నిరోద కమిటి ఏర్పాటు చేసి బాల్య వివాహాల నిర్మూలన చేపట్టాలని సిఆర్‌పిఎఫ్ జిల్లా కార్యదర్శి శివరాజ్, రవీంద్ర కుమార్‌లు వినతినందించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కోసం భూములు కోల్పోయిన వారికి న్యాయం అందడంలేదని టిఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు పోకల కిరణ్, బోసంగి శ్రీనులు వినతినందించారు. తమ గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూర్తిగా పూడ్చి వేశామని చౌటుప్పల్ మండలం పీపల్ పహడ్ గ్రామ సర్పంచ్ మంత్రీనాయక్, ఉప సర్పంచ్ యాదగిరిగౌడ్‌లు కలెక్టర్‌ను కలిసి ప్రగతిని అందించారు.
కమనీయం.. జడల రామలింగేశ్వరుని కల్యాణం
ఆ కల్యాణ వేడుకల్లో మంత్రి దంపతులు

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 15: శివనామ స్మరణలతో, శివుని కల్యాణంతో సోమవారం నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు కొండ పులకించి పోయింది. బ్రహ్మోత్సవాల తొలిరోజున జడల రామలింగేశ్వరుని కల్యాణంకు చెర్వుగట్టు భక్తులతో కిటకిటలాడింది. ఎటు చూసినా చెర్వుగట్టుకు తలంబ్రాలతో తరలి వస్తున్న భక్తుల జన సమూహమే కనిపించింది. నార్కట్‌పల్లి, నల్లగొండ పరిసర ప్రాంతాల నుండి బస్సులన్నీ చెర్వుగట్టుకే బారులు తీరాయి. తెల్లవారక ముందే చెర్వుగట్టుకు లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారి కల్యాణ ఘడియల కోసం ఎదురు చూశారు. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలోనే బోళా శంకరునికి, పార్వతి దేవికి కమనీయంగా కళ్యాణం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో కలిసి స్వామి అమ్మవార్లకు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. లోకాన్ని రక్షించే పరమ శివుని పెళ్లి కుమారుడిగా నూతన పట్టు వస్త్రాలతో అలంకరించగా స్వామిని చూసి సిగ్గులొలుకుతున్న పార్వతి దేవిని ముచ్చటగా పట్టు చీరలతో అలంకరించి కొండపైన పురవీధుల్లో ఎదురుకోల్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణ వేడుకలు నిర్వహించిన ఆలయ అర్చకులు రామలింగేశ్వర శర్మ స్వామివారి కల్యాణ వేడుకలను వర్ణిస్తూ కల్యాణ వేడుక నిర్వహిస్తూ భక్తులకు వివరించారు. పరమ శివుడి కల్యాణం తిలకించిన భక్తులకు ఇహపర లోకాల్లో జన్మ చరితార్ధం అవుతుందన్నారు. కల్యాణ ఘట్టంలో ముఖ్యంగా స్వామి, అమ్మవారి తలంబ్రాల వేడుకలు పండితులు చూడ ముచ్చటగా నిర్వహించారు. మాంగల్య ధారణ సమయంలో శివనామ స్మరణతో మార్మోగింది. మొదట మంత్రి జగదీశ్వర్‌రెడ్డి జడల రామలింగేశ్వరుని గర్భాలయంలో సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ ఘట్టంలో నిర్వహించే పలు కార్యక్రమాలలో పాల్గొని తన్మయత్వం చెందారు. స్వామి వారి కల్యాణం తిలకించేందుకు మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసి సత్తయ్యయాదవ్, ఎంపిపి రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణ అధికారి మనోహర్‌రెడ్డి, సర్పంచ్ రమణబాలకృష్ణ పాల్గొన్నారు.
చెర్వుగట్టులో పోటెత్తిన భక్తజనం
బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తులతో చెర్వుగట్టు పోటెత్తింది. హైద్రాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున వాహనాలలో తరలి వచ్చిన భక్తులతో చెర్వుగట్టు నిండి పోయింది. ఎటు చూసినా భక్తజనం బారులు తీరిన వాహనాలే కనిపించాయి. పుణ్యక్షేత్రంలో జరిగే వేడుకలకు ఆర్‌టిసి యంత్రాంగం ప్రత్యేక బస్టాండ్‌ను ఏర్పాటు చేసి బస్సులను నడిపించడంతో భక్తులు సునాయాసంగా చెర్వుగట్టుకు తరలివస్తున్నారు. కొండకు చేరుకున్న భక్తులు మొదట కొండపైన గల పుష్కరిణిలో స్నానమాచరించి శిరస్సుపై స్వామివారి పాదాలు ధరించి మొక్కులు తీర్చుకొంటున్నారు. అనంతరం కొండపైగల పలు ఆలయాలను సందర్శించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.

గ్రూప్స్ ప్రిపరేషన్‌లో గురువులు
తీపరీక్షల టెన్షన్‌లో విద్యార్థులు
తీసర్కార్ బడుల చదువులపై కొరవడిన పర్యవేక్షణ
తీఫలితాలు..అడ్మిషన్లపై ప్రతికూల ప్రభావం
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 15: విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాల్సిన ఉపాధ్యాయులు ఉన్నత ఉద్యోగాల వేటలో పడ్డారు. గ్రూప్-2 పోటీ పరీక్షల సన్నద్ధమవుతున్న కొందరు ఉపాధ్యాయులు అనారోగ్యం కారణాలతో దీర్ఘకాలిక సెలవులు పెడుతుండగా, మరికొందరు పాఠశాలల్లోనే పిల్లల చదువులను పట్టించుకోకుండా తమ చదువులే సాగిస్తున్న వైనం విమర్శలకు గురవుతుంది. ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పరీక్షల వేళ ప్రత్యేక పర్యవేక్షణ, తరగతుల నిర్వాహణతో కృషి చేయాల్సిన ఉపాధ్యాయుల్లో కొంత మంది ఇప్పుడు గ్రూప్-2పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చదువులు గాలిలో దీపంలా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్‌లు వేల సంఖ్యలో జిల్లాలో గ్రూప్-2పరీక్షల ప్రిపరేషన్‌లో పడ్డారు. ఉపాధ్యాయుల దృష్టి అంతా తమ పోటీ పరీక్షలపైనే సారించడంతో వార్షిక పరీక్షల వేళ పిల్లల చదువులపై పర్యవేక్షణ దెబ్బతింది. ముఖ్యంగా వచ్చే మార్చి 21నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల శ్రద్ధ కొరవడి ఫలితాలు తగ్గిపోయే ప్రమాదముందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అటు 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఇంకా సిలబస్ పూర్తి కాకపోవడంతో ఉపాధ్యాయులు గ్రూప్-2పరీక్షల సన్నాహాల్లో పడి వారి సిలబస్, రివిజన్‌ను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అసలే కొన్ని పాఠశాలల్లో ఇద్ధరు ముగ్గురు ఉపాధ్యాయులే ఉండగా వారిలో ఇద్దరు గ్రూప్ పరీక్షల కోసం అనారోగ్యంతో సెలవు పెడితే ఇక పిల్లల చదువులు అంతే సంగతులన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ప్రభావం వచ్చే సంవత్సరం అడ్మిషన్లపై ప్రతికూలతను చూపుతుందని ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి.
గ్రూప్-2 పరీక్షల్లో 3వేల వరకు ఉపాధ్యాయులు!
జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ తదితర 3,283పాఠశాలలు ఉండగా అందులో 2358ప్రాథమిక పాఠశాలలు, 292ప్రాథమికోన్నత పాఠశాలలు, 633ఉన్నత పాఠశాలలున్నాయి. 1నుండి 5వ తరగతి వరకు 1,42,912మంది, 4నుండి 8వరకు 89,559మంది, 9నుండి 10తరగతుల్లో 58,888మందితో కలిపి మొత్తం 2,91,359మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. 12వేల మంది ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో పనిచేస్తుండగా వారిలో గరిష్టంగా 3వేల మంది వరకు గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లుగా ఉపాధ్యాయల సంఘాలు లెక్కలు చాటుతున్నాయి. గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు విధిగా డిఇవోకు సమాచారం ఇవ్వాల్సివుంటుంది. సమాచారం వరకు సమస్య లేకపోయినా అనారోగ్యంతో దీర్ఘకాలిక సెలవు పెడుతూ ఉపాధ్యాయ విధులకు డుమ్మా కొడుతు గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో సర్కారీ చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు పోటీ పరీక్షల నేపధ్యంలో సెలవులు కోరడంతో మేల్కోన్న డిఇవో విశ్వనాథం అత్యవసరమైతే తప్ప ఎవరికి సెలవులు ఇవ్వరాదంటు ఆదేశించారు. దీంతో ఆనారోగ్యం సాకుతో పలువురు ఉపాధ్యాయులు గ్రూప్స్ పరీక్షల కోసం సెలవులు పెడుతుండటం ప్రభుత్వ పాఠశాలల పిల్లల చదువులను దెబ్బతీస్తుందన్న ఆందోళనకు కారణమవుతుంది. అసలు పాఠశాలల్లో పరీక్షల ఉపాధ్యాయుల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ కొరవడటం మరింత సమస్యాత్మకంగా తయారైంది.
కాగా కొంతమంది ఉపాధ్యాయులు గ్రూప్స్ పరీక్షల కోసం పాఠశాలలకు డుమ్మా కొట్టేందుకు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారంటు జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డికి, డిఇవో విశ్వనాథంకు తెలంగాణ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము సుధాకర్ సోమవారం వినతి పత్రం అందించారు. ప్రభుత్వ బడులలో దళిత, గిరిజనులు, నిరుపేదల కుటుంబాల పిల్లలే చదువుతున్నారని పరీక్షల సమయాన ఉపాధ్యాయులు గ్రూప్స్ పరీక్షల కోసం సెలవు పెడుతు తమ పిల్లల చదువులు దెబ్బతీస్తున్నారంటు అటువంటి వారిని అడ్డుకోవాలంటు వారు డిమాండ్ చేశారు.
పథకాల పరిశీలనకు నేడు కేంద్ర బృందం రాక
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 15: కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఈ నెల 16నుండి 23వరకు జాతీయ స్థాయి పర్యవేక్షణ కమిటీ బృందం జిల్లాలో పర్యటించనున్నట్లుగా నేషనల్ లెవల్ మానిటరింగ్ కమిటీ కన్వీనర్ వి.పి.లక్ష్మిదేవి తెలిపారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమై జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకాల తీరుతెన్నులను సమీక్షించి కేంద్ర బృందం రాక ఏర్పాట్లను వివరించారు. జిల్లాలోని ఆరు మండలాల్లో కేంద్ర బృందం పర్యటించి కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు. 16న మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి, తక్కెళ్లపాడు, 16న భువనగిరి మండలం అనాజీపురం, వలిగొండ మండల రెడ్లరేపాక, 18న భువనగిరి మండలం వడపర్తి, అనంతారం, 19న పోచంపల్లి మండలం ఇంద్రియాల, జుబ్లక్‌పల్లి, 20న దేవరకొండ, 22న మర్రిగూడలో కేంద్ర బృందం పర్యటించనున్నట్లుగా వెల్లడించారు. జిల్లాలోని మూడు సంసద్ ఆదర్శ గ్రామాల్లోనూ పర్యటన కొసాగుతుందన్నారు. ఈ సందర్భంగా వారు ఉపాధి హామీ, ఐఏవై, ఫించన్లు, స్వచ్ఛ్భారత్, పిఎంజిఎస్‌వై, ఐసిడిఎస్, వాటర్‌షెడ్ తదితర కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకాల పురగతిని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిశీలిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సిఇవో మహేందర్‌రెడ్డి, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి అంజయ్య, గృహనిర్మాణ శాఖ పిడి రాజ్‌కుమార్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమణ, ఐసిడిఎస్ పిడి మోతిభారతి పాల్గొన్నారు.
తెలంగాణ శ్రీశైలంగా చెర్వుగట్టు
చెర్వుగట్టు అభివృద్ధికై త్వరలో సమీక్ష
తీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 15: తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం త్వరలోనే తెంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న చెర్వుగట్టును కూడా సమీక్ష నిర్వహించి అభివృద్ధికై శ్రీకారం చుట్టనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జడల రామలింగేశ్వరుని కళ్యాణ వేడుకల్లో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించిన ఆయన తరువాత కొండపైన విలేఖరులతో మాట్లాడారు. అన్ని మతాలు, సంప్రదాయాల పట్ల తెలంగాణ ప్రభుత్వం సమతుల్యంగా వ్యవహరిస్తూ అందిరి సహకారంతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నామన్నారు. యాదగిరిగుట్ట తరువాత చెర్వుగట్టును కూడా శ్రీశైలం తరహాలో అభివృద్ధిలోకి తీసుకు వచ్చేందుకు త్వరలో సమీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కూడా చెర్వుగట్టుకు తీసుకురానున్నారు. ఈ క్షేత్ర మహిమలు అపారం, అద్భుతమని స్వామి దర్శనం తరువాత స్వయంగా అనుభూతి కలిగిందని వెల్లడించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, కరీంనగర్, హైద్రాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలనుండి పెద్ద ఎత్తున తరలివచ్చి అమావాస్య నిద్రలు చేపట్టే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. దీర్గకాలిక వ్యాధులతోపాటు మానసిక రోగులకు శివుడి కరుణ వల్ల నివృత్తి కలుగుతుందని భక్తులు చెప్పుతున్న వార్తలు విని మొదట్లో నమ్మలేక పోయానని, అమావాస్యకు పెరుగుతున్న విశిష్టతతో స్వామి కరుణాకటాక్షాలు నిజమని తేటతెల్లవౌతున్నాయన్నారు. చెర్వుగట్టును అభివృద్ధి పథంలో నడిపించేందుకు దేవాదాయ శాఖ అధికారులతోపాటు అన్ని శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొండపైన భక్తుల కొరకు ఏర్పాటు చేసిన వసతి గృహాల సముదాయాన్ని 3లక్షల 60వేల సామర్ధ్యం గల నీటి ట్యాంకును, నూతనంగా నిర్మించిన గణపతి భారీ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆర్‌డివో వెంకటాచారి, ఎంపిపి రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
ఆ సేవాలాల్ జయంతిలో మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 15: గిరిజనుల సంక్షేమానికి కేసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర విద్యుత్, దళిత సంక్షేమ శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. గిరిజనుల ఆరాధ్యదైవం సంత్‌సేవాలాల్ జయంతి సందర్భంగా పట్టణంలోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. నిరుపేద వర్గాలైన గిరిజనులకు కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాలు, మతాల వారికి సముచిత ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా సేవాలాల్ జయంతి వేడుకలను అధికారింగా నిర్వహించేందుకు జిల్లాకు రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు చెప్పారు. సంత్ సేవాలాల్ స్ఫూర్తితో గిరిజనులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పట్టణంలో గిరిజనుల కోసం కమ్యూనిటి హాల్ నిర్మించడంతో పాటు పాతవ్యవసాయ మార్కెట్ యార్డులో కూరగాయాల మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మారెపెద్ది శ్రీనివాస్, కట్కూరి గన్నారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ వాంకుడోతు వెంకన్ననాయక్, ధరావత్ మోతిలాల్‌నాయక్, భూక్య శంకర్‌నాయక్, లచ్చిరాంనాయక్, పాశ్యనాయక్, నాగునాయక్, బాలునాయక్, కృష్ణనాయక్, ప్రవీణ్‌నాయక్, రాజేష్‌నాయక్, వీరన్ననాయక్, ధరాసింగ్, తహశీల్దార్ మహమూద్ అలీ, సిఐలు మొగిలయ్య, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.