విజయనగరం

ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 25: జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సందర్భంగా ప్రభుత్వం విధించిన బ్యాంక్ గ్యారంటీ మినహాయింపు పొందేందుకు మిల్లర్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపించటం లేదు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తూ ధాన్యం కొనుగోలు చేయటం తమకు ఆర్థికభారం అవుతుందని మిల్లర్లు చెబుతుంటే, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లకు అనుమతించేది లేదంటూ జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్యాంక్ గ్యారంటీ మినహాయింపు పేరిట కొనుగోళ్లలో జాప్యం చేస్తే, చివరాఖరుకు ప్రభుత్వం దిగి వస్తుందనే అభిప్రాయంతో మిల్లరు వ్యవహరిస్తుంటే, జిల్లాయంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యల గురించి ఆలోచిస్తోంది. జిల్లాకు చెందిన మిల్లర్లు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం తీసుకోకుంటే జిల్లాను అనుకుని ఉన్న ఇతర జిల్లాలకు చెందిన మిల్లర్లతో ధాన్యం కొనుగోలు చేయించాలనే ఆలోచనతో అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. జిల్లా ఈ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయవలసి ఉంది. జిల్లావ్యాప్తంగా గడచిన రెండువారాలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను దశలవారీగా ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం 27.10కోట్ల రుపాయల విలువచేసే 19216మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు మాత్రమే జరిగింది. మొదట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వౌలిక సదుపాయాలు లేవనే కారణంగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగగా, తాజాగా ధాన్యం కొనుగోలు సందర్భంలో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధనను జిల్లాలోని రైస్‌మిల్లర్లు వ్యతిరేకిస్తున్న కారణంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడింది. రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బుల చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా బ్యాంక్ గ్యారంటీ నిబంధనను ప్రభుత్వం విధించింది. కానీ బ్యాంకు గ్యారంటీ పేరుతో ఎక్కువ మొత్తం పెట్టుబడులు పెట్టి ధాన్యం కొనుగోలు సాధ్యం కాదంటూ మిల్లర్లు భీష్మించుకుని కూర్చున్నారు. పరిమిత గ్యారంటీతోనే ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు జరుగగా, పూర్తిస్థాయి గ్యారంటీ లేనికారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మకాలు నిలచిపోయాయి. దాంతో రైతులు అమ్మకానికి సిద్ధంగా ఉన్న తమ వరిపంటను ఏమిచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కొందరు వ్యాపారులు తక్కువ ధరలకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ జిల్లాయంత్రాంగం మాత్రం ఇటువంటి చర్యలను అడ్డుకుంటామని చెబుతోంది. బ్యాంకు గ్యారంటీ లేని కారణంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన కొంత ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండిపోగా, ఈ స్థితిలో ధాన్యం కొనుగోలు నిలిపివేసిన కారణంగా రైతులు లబోదిబో అంటున్నారు. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటంతో తమ ధాన్యం ఎక్కడ నిలువ చేసుకోవాలని, ధాన్యం అమ్మకాల్లో జాప్యం ఏర్పడుతున్న కారణంగా బయట తెచ్చిన అప్పుల విషయంలో ఒత్తిళ్లు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. కాగా బ్యాంకు గ్యారంటీ మిషతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తే ప్రభుత్వం దిగిరాక తప్పదనే అభిప్రాయంతో మిల్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల నుంచి ఒత్తిడి కారణంగా చివరాఖరుకు తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్ప షరతులతో ధాన్యం కొనుగోళ్లకు అనుమతిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో మిల్లర్లు బ్యాంకు గ్యారంటీని తొలగించాలని కోరగా జెసి మాత్రం తన అశక్తతను వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు దిగివస్తారా, లేకనిపక్షంలో జిల్లాయంత్రాంగం ధాన్యం కొనుగోలు విషయంలో తీసుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటని రైతులు ఎదురుచూస్తున్నారు.