ధర్మసందేహాలు

శివకేశవులలో ఎవరు గొప్ప ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శివలింగం యొక్క ఆది అంతాలను కనుగొనమని విష్ణువును, బ్రహ్మను పరీక్షలో నిలపడంలో ఆంతర్యమేమిటి? బ్రహ్మ ఆవుతో అబద్ధం చెప్పించాడా?
- రామలక్ష్మి , సికింద్రాబాదు
ఇలాంటి కథలను శాస్త్ర పరిభాషలో ‘అర్థవాదాలు’ అంటారు. అంటే ప్రశస్తి వాచకములైన గాథలు అని అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులనేవారు ఒకే మూల శక్తి యొక్క మూడు కొమ్మలనీ , వాటిలో హెచ్చుతగ్గులు లేవనీ -అసలైన పరమసిద్ధాంతం. ఐనప్పటికీ ఆయా దేవతల ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి తెలియ పరచటం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కలసి ఆడేక్రీడలే ఈ చర్యలన్నీ - అని మనం మరిచిపోరాదు.
* రామాయణాన్ని వాల్మీకి ముందు, తరువాత , ఎవరైనా రాశారా ?
- సత్యవతి, ముంబాయి
వాల్మీకికి ముందు వేదంలో రామకథాసూచకమైన మంత్రాలు కొన్ని ఉన్నాయని విమర్శకులు నిర్ణయించారు. అంతేగానీ కావ్యంగా ఎవరూ వ్రాయలేదు. అందుకే ఆయన ఆదికవి అనబడుతున్నాడు. వాల్మీకి తరువాత వ్యాసాది మహర్షుల నుంచీ అధునాతన కవుల దాకా ఎందరెందరో రామాయణాన్ని రచించారు.
* హనుమంతుడు, నారదుడు గూడా రామాయణం వ్రాశారా?
- మారుతి, సికింద్రాబాదు
అసలు రామకథను వాల్మీకికి పరిచయం చేసిందే నారదుడు. ఈ నాటి వాల్మీకి రామాయణంలోని ప్రప్రథమ సర్గ అంతా నారద వచనమే. ఇక హనుమన్నాటక మనే పేరుతో ఒక మంచి పురాతన సంస్కృత నాటకం దొరుకుతోంది. దానిలో రామ కథే వుంది. దాని కర్త సాక్షాత్తుగా హనుమంతుడేనని ప్రసిద్ధి వుంది.
* శివకేశవులకు భేదం లేనే లేకపోతే విష్ణు పురాణంలో విష్ణువే గొప్ప అనీ శివపురాణంలో శివుడేగొప్ప అనీ -వ్రాయటమేమిటి?
- రామ్, కోదాడ
వేద వ్యాసుడు పురాణాలకు సంకలనకర్తే గానీ పూర్తి స్వంత కర్తకాదు. ఆయా దేవతోపాసకుల సంప్రదాయాలలో అన్ని మార్గాల ద్వారానూ ఒకే పరబ్రహ్మ తత్త్వాన్ని సాధకులు అందుకోగలరనేదే ఆయన సిద్ధాంతం . ఈ సిద్ధాంతాన్ని ఆయన స్వీయ రచన అయిన బ్రహ్మ సూత్రాలలో శాస్త్ర బద్ధంగా నిరూపించాడు.
* ప్రస్తుతం నడుస్తున్నది 28వ కలియుగమని విన్నాను. వెనుకటి యుగాలన్నింటిలోను జరిగిన అవతారాల వివరాలన్నీ ఏ పురాణంలో దొరుకుతాయి.
- రామకృష్ణ , నెల్లూరు
నాలుగు యుగాలను కలిపితే ఒక మహాయుగమవుతుంది. అలాంటి మహాయుగాలు 27 జరిగాక 28వ ఆవర్తనం ఇప్పుడు జరుగుతోంది. దానిలో నాలుగవదైన కలియుగం ఇప్పుడు నడుస్తోంది. ఈ మహాయుగాలలో చాలా మటుకు అవతారాలు పునరావృత్తమవుతూ ఉంటాయి. కొన్ని చోట్ల కొద్ది భేదాలు వుంటాయి. ఈ వివరాలు అనేక పురాణాలలో వున్నా శ్రీమద్భాగవతంలో విశేషంగా వున్నాయి.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్-500 035. vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి