కరీంనగర్

రైల్వేలో డిజిల్ మాఫీయాపై పోలీసుల ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- 14 మంది డిజిల్ దొంగల బైండోవర్
- ‘ఆంధ్రభూమి-దక్కన్ క్రానికల్’ కథనాలకు స్పందన
రామగుండం, మార్చి 11: కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ కేంద్రంగా కొనసాగుతున్న డిజిల్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే పెట్రోల్, డిజిల్‌ను చోరి చేస్తున్న దొంగల ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల ‘రామగుండంలో డిజిల్ మఫీయా’ అనే శీర్షికతో ‘ ఆంధ్రభూమి-దక్కన్ క్రానికల్’ లో వచ్చిన ప్రధాన కథనాలతో పోలీస్ యంత్రాంగంలో కథలిక వచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్ధాన్ పెట్రోలియం నిల్వ కేంద్రాలకు ఇంథన సరఫరా చేసే రైల్వే వ్యాగెన్ ట్యాంకర్ల నుండి రామగుండం రైల్వేస్టేషన్ ప్రాంతంలో జరుగుతున్న డిజిల్ చోరీ దందా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ప్రత్యేక నిఘాను పెంచి డిజిల్ దొంగల ముఠా వివరాలను ఆరాదీశారు. శుక్రవారం సాయంత్రం రామగుండం పట్టణం, కుందనపల్లికి చెందిన 14మంది డిజిల్ దొంగల ముఠాను రామగుండం పోలీసులు పట్టుకొని తహసిల్ధార్ ముందు బైండోవర్ చేశారు. దొంగల ముఠా సభ్యులు మోర మల్లేశం, చిలుక రాజేశం, బొడ్డు నరేష్, ఠాకూర్ కిషన్ సింగ్, బొమ్మ సురేష్ గౌడ్, గంధం నాగరాజు, ఒల్లాల పద్మనాభం, ఇంజపల్లి ప్రదీప్ కుమార్, కినె్నర బాలకృష్ణ, ఎం డి తాజ్‌బాబా, మెరుగు మల్లేష్, చింతల తిరుపతి, చింతల అభిలాష్, నక్క రాజ్ కుమార్‌లను బైండోవర్ చేసినట్లు ఎస్ ఐ విద్యాసాగర్ తెలిపారు. బైండోవర్ అయిన డిజిల్ దొంగలు మళ్లీ ఇంథన చోరికి పాల్పడితే లక్ష రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటున్నట్లు పేర్కొన్నారు. రైల్వేలో కొనసాగుతున్న డిజిల్ దందా వ్యవహారం అంత కూడా రామగుండం రైల్వేస్టేషన్ ప్రాంతంలో పనిచేసే రైల్వేకాంట్రాక్టు కార్మికులు కొందరు ముఠాగా ఏర్పాడి ఈ దందాను నిర్వహిస్తుండగా, పోలీసులు పట్టుకున్న వారిలో 6గురు రైల్వే కాంట్రాక్టు కార్మికులుగా ఉన్నారు. ఇదిలా ఉండగా గోదావరిఖని ఏ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ డిజిల్ దొంగ దందా నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో ఐ ఓసి, హెచ్ పి ఉన్నత అధికారులతో పాటు రైల్వే ఆర్ పి ఎఫ్, జి ఆర్ ఫి పోలీస్, స్ధానిక సివిల్ పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డిజిల్ దొంగ దందా కొనసాగడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా అన్ని శాఖల అధికారులు నిబద్ధతతో వ్యవహరిస్తూ సంపూర్ణ నిఘాను పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. అలాగే ఈ డిజిల్ దందా నిర్వాహకుల పూర్వపరాలను కూడా ఆరాతీస్తున్నట్లు సమాచారం.

గ్రేటర్ సిరిసిల్లగా మార్చి రుణం తీర్చకుంటా..
* పట్టణం చుట్టూ రింగ్ రోడ్డుకు రూ.60 కోట్లు
* రూ.10 కోట్లతో ఎయిట్ టెల్ సహకారంతో మాడల్ స్కూల్
* సిరిసిల్ల నియోజకవర్గ టిఆర్‌ఎస్ నేతల సమావేశంలో మంత్రి కెటిఆర్
టిఆర్‌ఎస్

సిరిసిల్ల, మార్చి 11: సిరిసిల్ల రూపు రేఖలు మార్చేందుకు నియోజకవర్గ ప్రజలు, నాయకులు కలిసి రావాలని మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిథులు, నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టిన సిరిసిల్లను అభివృద్ది పదాన నిలబెట్టడమే ఏకైక లక్ష్యమని, దశాబ్దాల తరువాత ప్రభుత్వంలో ఉన్న సిరిసిల్ల ఎమ్మెల్యే లభించడం అందునా మంత్రిగా పని చేయడం అదృష్టమని, సిరిసిల్ల రుణం తీర్చుకునేలా పని చేస్తానన్నారు. ఇప్పటికే కొంత అభివృద్ది జరుగుతున్నా చేయాల్సింది చాలా ఉందని, వచ్చే ఎన్నికల నాటికి సిరిసిల్ల పట్టణ ప్రజలే నమ్మలేనంతగా పట్టణాన్ని తీర్చిదిద్దుతానన్నారు. సిరిసిల్ల పట్టణాన్ని గ్రేటర్ సిరిసిల్లగా మార్చి విస్తరణ ప్రధాన లక్ష్యంగా భవిష్యత్ విజన్‌ను మంత్రి నాయకులకు వివరించారు. పట్టణ విస్తరణలో సిరిసిల్లను కేంద్రం రూపొందించిన అమృత్ పథకంలో చేర్పించేందుకు వీలు కలుగుతుందన్నారు. దీనితో కనీసం రూ.60 కోట్ల నిథులు పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఏడాదిన్నర లోపు సిరిసిల్ల నమూన మార్పులు తేవాలని, అధునాతన పట్టణంగా అభివృద్ది చెందాలన్నారు. ఇందు కోసం ప్రభుత్వం నుండి ఎన్ని కోట్ల నిథులైనా తేవడానికి సిద్దంగా ఉన్నానని మంత్రి హామీ ఇచ్చారు. వంద శాతం మరుగుదొడ్లు, రోడ్ల సౌకర్యం రానున్న మూడేళ్ళలో అందిస్తామన్నారు. పట్టణం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు కోసం ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్నామన్నారు. మరో రూ.30 కోట్లు అందించి పూర్తి చేస్తామన్నారు. పట్టణానికి కనురెప్ప పాటు కరెంటు పోకుండా సెస్ సహకారంతో ప్రణాళిక సిద్దం చేశామని, సిరిసిల్ల నుండి సిద్దిపేట, సిరిసిల్ల నుండి కామారెడ్డి ఫోర్ లైన్ల రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మొదటి మాడల్ స్కూల్‌ను ఎయిర్ టెల్ సహకారంతో రూ.10 కోట్లతో నిర్మించబోతున్నామని, అలాగే బాంబినా, మఫత్‌లాల్ లాంటి కంపెనీలు ఇప్పటికే స్థలాలు పరిశీలించి వెళ్ళాయన్నారు. ఈ స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే తొలి ఇంటర్‌నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు అవుతుందని, మిషన్ భగీరథలో ఇంటింటికీ మంచినీరు వచ్చే సౌకర్యం ఏడాదిలోగా పూర్తి అవుతుందన్నారు. సిరిసిల్లకు రూ.1500 డబుల్ బెడ్ రూంలను ఈ సంవత్సరం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సాగు నీటి రంగంలో సిరిసిల్లకు లక్ష ఎకరాలకు నీరందిస్తామని, దీనితో నియోజకవర్గంలో సంపద సృష్టికి అవకాశం ఏర్పడబోతుందన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో ప్రజల వారి సమస్యలు, పరిష్కారమే కేంద్రంగా సమర్థంగా సిరిసిల్లను సర్వతోముఖాభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత కోసం ప్రత్యేక ప్యాకేజీ తయారు చేసి ముఖ్య మంత్రి జిల్లా పర్యటన సందర్భంగా సిరిసిల్లకు ఆహ్వానించి, ప్రకటిస్తామని మంత్రి కెటి ఆర్ పేర్కొన్నారు.

ఇంజనీర్ పోస్టుల ఎంపికలో...
టాపర్‌గా నిలిచిన జిల్లా అభ్యర్థి సాయి
* విద్యార్థికి పలువురి అభినందన
* బంగారు తెలంగాణ కోసం పనిచేస్తా
కరీంనగర్, మార్చి 11: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సివిల్ ఇంజనీర్ల పోస్టుల పోటీ పరీక్షలో కరీంనగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన సంకేపల్లి సాయికిరణ్ (22) అనే విద్యార్థి టాపర్‌గా నిలిచి కరీంనగర్ సత్తాను చాటాడు. తెలంగాణలోని పది జిల్లాల నుండి సుమారు 30వేల మంది బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పట్ట్భద్రులు 930ఎఇఇ పోస్టుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి టాపర్‌గా సాయికిరణ్ నిలిచాడు. తెలంగాణ నూతన పబ్లిక్ సర్వీస్ కమిషన్ రోడ్డు, భవనాలు, కమాండ్ ఏరియా అభివృద్ధి, ఇరిగేషన్, కాకతీయ మిషన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తదితర శాఖల్లో 930 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఎఇఇ) పోస్టుల భర్తీ కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్‌ను జారీ చేయగా, సెప్టెంబర్ 20న జరిగిన రాత పరీక్షలకు సుమారు 30వేల మంది పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. ఈఫలితాలకు సంబంధించి గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి, సభ్యులు మంగారి రాజేందర్ వెల్లడించారు. ఇందులో 500 మార్కులకుగాను 390.4 మార్కులతో టాపర్‌గా నిలిచిన కరీంనగర్‌కు చెందిన సాయికిరణ్‌తోపాటు, తదుపరి స్థానాలలో నిలిచిన మరో ఐదుగురిని చక్రపాణి, రాజేందర్‌లు అభినందించారు. కరీంనగర్‌కు చెందిన సాయికిరణ్ కరీంనగర్‌లోని విద్యాధరి హైస్కూల్‌లో పదో తరగతి వరకు, హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో ఇంటర్, ఉస్మానియాలో ఇంజనీరింగ్ (సివిల్) పూర్తిచేశాడు. మే 2015లో ఇంజనీరింగ్ పూర్తయింది. సాయికిరణ్ టాపర్‌గా నిలువడం పట్ల తల్లిదండ్రులు ఎస్.నాగేంద్రశర్మ, శారదలతోపాటు విద్యావేత్తలు, సాహితీవేత్తలు సబ్బని లక్ష్మీనారాయణ, వారాల ఆనంద్, పిఎస్.రవీంద్ర, సంగవేని రవీంద్ర, మేకల రవీంద్ర, మాడిశెట్టి గోపాల్, నమిలకొండ హరిప్రసాద్ తదితరులు సాయికిరణ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా టాఫర్‌గా నిలిచిన సాయికిరణ్ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ, తనకు రోడ్డు భవనాల శాఖలో కేటాయించారని, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎఇఇ)గా బంగారు తెలంగాణ కోసం అంకితభావంతో కృషిచేస్తానని అన్నారు.

నీటి సరఫరాలో బల్దియా బద్‌నాం
* ఖాళీ బిందెలతో మహిళా ప్రతినిధుల నిరసన
* వందరోజుల ప్రణాళిక అమలుపై దృష్టిశూన్యం
* నీటి సరఫరాలో అధికారుల ఇష్టారాజ్యం
* సిబ్బంది నిర్లక్ష్యంపై విరుచుకుపడ్డ స్వపక్షం
* పార్టీలకతీతంగా గళమెత్తిన కార్పొరేటర్లు

* వాడివేడిగా నగరపాలిక సమావేశం
కరీంనగర్ , మార్చి 11: మార్చికి ముందునుంచే ఎండలు మండుతున్నాయ్. వరుస వర్షాభావ పరిస్థితులతో నగరంలో నీటి కొరత పెరుగుతోంది. తాగునీటికి సైతం నగరవాసులు తండ్లాడుతున్నారు. తలాపున మానేరు ఉన్నా తాగునీరు మాత్రం లేదు. ఎల్‌ఎండి ఎండుముఖం పట్టగా, ఉన్ననీటిని సక్రమంగా వినియోగించటంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంతో నీటిసరఫరాలో బల్దియా పూర్తిగా బద్‌నామైంది. అయినా, పాలకవర్గంలో కాని, అధికారుల్లోకాని కించిత్ బాధ కానరావటంలేదంటూ పార్టీలకతీతంగా పలువురు నగర ప్రజాప్రతినిధులు బల్దియా పనితీరుపై అసహనం వెలిబుచ్చారు. గత జనవరి 11న వాయిదాపడ్డ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం శుక్రవారం సమావేశమందిరంలో జరిగింది. ఈసందర్భంగా నగరంలో రోజురోజుకు పెరుగుతున్న నీటి ఎద్దడికి కారణమవుతున్న అధికారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నీటికొరత వేధిస్తుంటే ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవటంలో బల్దియా అధికారులు,సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, నగర ప్రజలకు రాబోయే రోజుల్లో ఖాళీ ట్యాంకులు మిగిల్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మహిళా కార్పొరేటర్లు మేయర్ పోడియం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్పొరేటర్ల బలాన్ని బేరీజువేస్తూ నగరపాలిక అధికారులు వ్యవహరిస్తున్నారని, తమకనుకూలంగా వ్యవహరించే నేతల డివిజన్లలో గంటల తరబడి నీటి సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలు తుంగలో తొక్కి నీటిసరఫరాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో శివారుప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటి కోసం గంటల తరబడి వేచిచూసే దీనస్థితులు నెలకొన్నాయంటూ పార్టీలకతీతంగా పలువురు కార్పొరేటర్లు గళమెత్తటంతో వాడివేడిగా సమావేశం కొనసాగింది. వేసవిలో నీటి కొరత ఉండదంటూ నగరవాసులను మభ్యపెట్టకుండా, ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేలా బల్దియా యంత్రాంగం వందరోజుల ప్రణాళికను అమలుచేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్ చెన్నాడి అజిత్‌రావు సూచించారు. నీటి సరఫరా సిబ్బంది పనితీరుపై అధికారపక్ష కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, కోడూరి రవీందర్‌గౌడ్, బండారి వేణు, చల్ల స్వరూపరాణి, కంసాల శ్రీనివాస్, గుగ్గిల్లపు రమేశ్‌లతో పాటు పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నీటి సరఫరాలో కనబరుస్తున్న నిర్లక్ష్యంతో పాలకవర్గానికి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. రహదారుల వెడల్పుతో పైపులైన్లు పగిలిపోతున్నా పట్టింపులేకుండా పోయిందని, బల్దియా, ఆర్ అండ్ బి అధికారుల మధ్య సమన్వయం కొరవడి, ప్రధాన రహదారుల్లో పలు డివిజన్లకు రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోయిందని కాంగ్రెస్ సభ్యురాలు గందె మాధవి విమర్శించారు. పైపులైన్ల నిర్మాణం కోసం రూ.1.50కోట్లు కేటాయించినా సరిపోలేదని, నగరవీధుల్లో ఎల్‌ఈడి బల్బులకు కేటాయించిన రూ.3.5కోట్లు కూడా పైప్‌లైన్ల నిర్మాణం కోసం మళ్ళించాలని డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్ సూచించారు. తమ డివిజన్‌లో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై పలుమార్లు రాతపూర్వకంగా ఫిర్యాదుచేసినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని, పరిష్కారానికి మాత్రం నోచుకోవటంలేదని 1వ డివిజన్ కార్పొరేటర్ గంట కళ్యాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో పారిశుద్ధ్య సమస్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నా బల్దియా సిబ్బంది మాత్రం నిర్లక్ష్యపు జాడ్యం ప్రదర్శిస్తున్నారని, కార్పొరేటర్ ఆకుల ప్రకాశ్ ఆరోపించారు. మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ నగరంలో నీటి సమస్య వాస్తవమే అయినా, దీనిని పరిష్కరించేందుకు వంద రోజుల ప్రణాళికను సత్వరమే అమలుచేస్తున్నట్లు స్పష్టంచేశారు. నగరంలో నీటి సరఫరాపై కమిషనర్ ప్రత్యేక దృష్టిసారించారని, పైప్‌లైన్ల నిర్మాణం చేపడుతున్న గుత్తేదారులకు ఒకేసారి పెద్దమొత్తంలో పనులు అప్పగించటంతోనే నిర్మాణంలో జాప్యం నెలకొందన్నారు. నీటి సరఫరా సిబ్బంది మధ్య సమన్వయలేమితోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. నల్లాలకు మోటార్లు బిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నీటి సరఫరాలో కలుగుతున్న ఇబ్బందులు తొలగించేందుకు వాటర్‌సప్లై విభాగంలో పనిచేస్తున్న ఎఈలకు ఒక్కొక్కరికి రూ.25వేల మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని సూచించారు. పెండింగ్ బకాయిలద్వారా వచ్చిన ఏరియర్స్ రూ.1.11కోట్ల మొత్తాన్ని కూడా నీటి సరఫరా కోసమే వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా డివిజన్‌లలో నెలకొన్న సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు అధికారులు, డివిజన్ ప్రతినిధులతో కలిసి మూడు రోజుల కోమారు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. హోర్డింగ్‌ల ద్వారా ప్రస్తుతం వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేపట్టినట్లు తెలిపారు. వాహనాలు నిలిపే ప్రదేశాలు లేని వ్యాపార, వాణిజ్యసముదాయాలకు నోటీసులు అందజేయనున్నట్లు చెప్పారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పెంచుతున్నామన్నారు. అనంతరం ఎజెండాలోని పలు అంశాలకు అమోదముద్ర వేశారు.

టెన్త్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం
కరీంనగర్ బ్యూరో, మార్చి 11: తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పరీక్షా కేంద్రాలలో కనీస సౌకర్యాలను కల్పించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బేంచీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫర్నీచర్ లేకపోతే ఇతర పాఠశాలల నుండి లేదా ప్రైవేటుగా అద్దెకు తీసుకోవాలని సూచించారు. వీటికి అవసరమైన నిదులను విధ్యాశాఖ ఇస్తుందని అన్నారు. పరీక్షా కేంద్రంలో తాగునీటి సౌకర్యాన్ని, టాయ్‌లెట్స్‌ను ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షా సమయంలో విద్యుత్ సౌకర్యానికి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంపౌండ్ లేని పాఠశాలలకు కంపౌండ్ వాల్ మంజూరు చేశామని నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌తో పాటు సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో కనీస సౌకర్యాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి డా. ఎ.నాగేంద్ర, అదనపు ఎస్పి అన్నపూర్ణ, డిఇఒ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలను విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధం
* టిడిపి జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
సుల్తానాబాద్, మార్చి 11: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో స్పీకర్ విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని టిడిపి జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం సుల్తానాబాద్ మండల కేంద్రంలో పెద్దపల్లి నియోజకవర్గ టిడిపి సమన్వయ కమిటి సమావేశం జరిగింది. ఇందులో విజయరమణారావు మాట్లాడుతూ ఈ ప్రాంతం నుండి గజ్వేలుకు వెళ్లే నీటిని ఇక్కడి చెరువులు, కుంటలు నింపాలని, లేకుంటే పైపులు పగులగొడతామన్నారు. ఎన్ని కేసులైనా ఫర్వాలేదు రైతుల కోసం తాము ఎంతటి ఆందోళననైనా చేపడుతామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటం లేదని మండిపడ్డారు. అర్హులైన వారందరికీ వెంటనే డబుల్ బెడ్‌రూములను నిర్మించాలన్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టుపెట్టారన్నారు. కోటి ఎకరాలకు నీరందించడం ఉత్తమాటే అన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే ఈ నెల 29 నుండి 35వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జెండావిష్కరణలు, ప్రతీ కార్యకర్త ఇంటిపై జెండా పెట్టుకోవడం, మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించడం పెద్దఎత్తున వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గంట రాములు, మండల పార్టీ అధ్యక్షుడు పాల రామారావు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి సాయిరి మహేందర్, మినుపాల ప్రకాష్ రావు, ఉప్పు రాజు, తిరుపతి రెడ్డి, అమిరిశెట్టి తిరుపతి, పన్నాల రాములు, వెగోలం అబ్బయ్య, కుమార్ కిషోర్, దేవేందర్ పలువురు పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మల్హార్, మార్చి 11: అప్పుల బాధలు బరించలేక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్హార్ మండలం తాడిచెర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. తాడిచర్ల గ్రామంలో మిర్చి, పత్తి, వరి పంటలు వేసిన రైతు నేలం రాజబాబు(40) అప్పుల బాధతో తన మిర్చి చేనులో వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 6 ఎకరాలలో మిర్చి, వరి, పత్తి పంటలు వేసిన సాగునీరు లభించకపోవడంతో బోర్లు వేసిన నిరు లభించక భూగర్భ జలాలు అడుగంటుక పోవడంతో పంట పొలాలలకు నీరు అందకపోవడంతో దిగుబడి రాక అప్పుల పాలు అయ్యాడని భార్య మంజుల తెలిపింది. గత 5సంవత్సరాలుగా పంటలు వేయడానికి, బోర్లు వేయడానికి దాదాపు 13లక్షల అప్పు అయ్యాయని, ఆ అప్పుల బాధలు బరించలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. భార్య మంజూల ఫిర్యాదు మేరకు కొయ్యురు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బాలికపై అత్యాచారం
బెజ్జంకి, మార్చి 11: జిల్లాలో మహళలపై నేరాల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్నటి చల్లూరు ఘటన మరువకముందే నేడు తాజాగా గాగిల్లాపూర్‌లో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైన సంఘటన వెలుగుచూసింది. బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో మైనర్ బాలిక (13)పై అదే గ్రామానికి చెందిన బాలుడు అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి ఆరుబయటికి బహిర్భూమికి వెళ్లగా బాలికను మైనర్ బాలుడు నోట్లో గుడ్డలు కుక్కి గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి ఆపై అత్యాచారం చేశాడని, తెల్లవారుజామున ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులకు విన్నవించింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు వెళ్లి పరిశీలించారు. ట్రైనీ ఐపిఎస్ అధికారి సింధూ శర్మ, డిఎస్పీ రామారావు స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం బాలికను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

ఈతకు వెళ్లి బాలుడు మృత్యువాత
పెద్దపల్లి రూరల్, మార్చి 11: ఈత రాని ముగ్గురు బాలురు ఈత నేర్చుకోవడానికి చెరువుకు వెళ్లగా, అందులో ఒక బాలుడు మృత్యువాత పడిన ఉదంతమిది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అప్పన్నపేట గ్రామానికి చెందిన బొబ్బిలి గణేష్ (13) అనే బాలుడు ఈత కోసం చెరువులోకి వెళ్లి శుక్రవారం మధ్యాహ్నం దుర్మణం చెందాడు. గణేష్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతుండగా, శనివారం ఫైనల్ పరీక్ష రాసి ఇంటికి చేరుకున్నాడు. మధ్యాహ్న భోజనం అనంతరం అదే గ్రామానికి చెందిన తన స్నేహితులు పరుశం వర్థన్, ఎర్రోజు సాయిశివతో కలసి గ్రామ శివారులోని చెరువులోకి ఈత కోసం వెళ్లారు. ముగ్గురికి ఈత రాదు. చెరువులోకి వెళ్లిన తర్వాత లోతు ఎంతో చూద్దామని కొంత దూరం వెళ్లగా, అక్కడ ఎక్కువ లోతు ఉండటంతో ముగ్గురు చెరువులో మునిగిపోయారు. బయట ఉన్న వారు కర్ర అందివ్వడంతో ఇద్దరు బయటపడగా, గణేష్ మృత్యువాత పడ్డాడు. మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బసంత్‌నగర్ ఎస్‌ఐ విజయేందర్ తెలిపారు.

డిగ్రీ వార్షిక పరీక్షల్లో నలుగురు విద్యార్థుల డిబార్
హుజూరాబాద్, మార్చి 11: హుజూరాబాద్ పట్టణంలో జరుగుతున్న శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ వార్షిక పరీక్షల్లో నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. శుక్రవార డిగ్రీ తృతీయ సంవత్సరం గణిత పరీక్ష జరుగుతుండగా కాపీయింగ్‌కు పాల్పడిన నలుగురిని ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకుని డిబార్ చేశారు. ఇందులో వాగ్దేవి డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఒకరిని, మాతృశ్రీ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో ముగ్గురు డిబార్ అయినట్లు అధికారులు తెలిపారు.

బిసి విద్యార్థుల ఉపకార వేతనాల జారీలో దొర్లిన తప్పులు
* ఒక్కొ విద్యార్థికి రెండింతలు జమ అయిన వైనం
* విచారించిన రాష్ట్ర ఖజానా డైరెక్టర్ భీమారెడ్డి
కరీంనగర్, మార్చి 11: సాంకేతిక లోపంతో బిసి విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల జారీలో తప్పులు దొర్లడంతో ఒక్కో విద్యార్థికి రెండింతల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అయ్యాయి. ఒక్కొ విద్యార్థికి రూ.3.200 బదిలీ చేయాల్సి ఉండగా, రూ.6.400లు బదిలీ అయ్యాయి. మొత్తం 4,758మంది ప్రెష్ విద్యార్థులకు సంబంధించి ఖజానా నుంచి కోటి 52లక్షల 25వేల 600 రూపాయలను బదిలీ చేయాల్సి ఉండగా, 3కోట్ల 4లక్షల 51వేల 200 బదిలీ అయ్యాయి. దీంతో ఖజానా నుంచి అదనంగా కోటి 52లక్షల 25వేల 600రూపాయలు విద్యార్థుల ఖాతాల్లోకి అధికారికంగా బదిలీ అయింది. ఇదంతా ఈ నెల 2,3తేదీల్లో జరుగగా, ఈ విషయాన్ని శుక్రవారం ట్రెజరీ అధికారులు గమనించారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమకావటంతో అధికారులు కొంత ఆందోళనకు గురై ట్రెజరీ చెల్లింపులను నిలిపివేశారు. ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర ఖజానా డైరెక్టర్ భీమారెడ్డి హుటాహుటిన కరీంనగర్ చేరుకుని విచారణ జరిపారు. మొత్తం 4,758 మంది విద్యార్థులకు సంబంధించి చెల్లించే ఉపకార వేతనాల జారీ విషయంలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఈ పొరపాటు జరిగిందని, ఇప్పటికే బ్యాంకుల్లో నుంచి డ్రా చేయని విద్యార్థుల ఖాతాలను స్తంభింపజేసి, రూ.98లక్షలు రీకవరి చేసినట్లు జిల్లా ట్రెజరీ శ్రీనివాస్ తెలిపారు. మిగితా రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందులో కళాశాలల సహాయం తీసుకుంటామని శ్రీనివాస్ చెప్పారు. కాగా, ఈ వ్యవహారంలో తప్పు చేసిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడంతో విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఆందోళన చేపట్టారు.