రాష్ట్రీయం

నల్లగొండ ‘దేశం’లో జగడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లా కేంద్రంగా యాదాద్రి కోసం మోత్కుపల్లి.. భువనగిరి కోసం ఉమా కిరికిరి
నల్లగొండ, నవంబర్ 28: నల్లగొండ జిల్లా టిడిపి పార్టీ సీనియర్లు..పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులైన మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి మధ్య మరోసారి రాజకీయ ఆధిపత్య పోరు ఆజ్యం పోసుకుంది. రెండు వర్గాల మధ్య తరుచూ బహిర్గతమవుతున్న విభేదాలు కొత్త జిల్లా కేంద్రాల పంచాయతీతో మరింత రచ్చకెక్కాయి. తన ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ మోత్కుపల్లి నరసింహులు ప్రజా ఉద్యమం సాగిస్తుంటే, తన నియోజకవర్గ కేంద్రమైన భువనగిరినే కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఉమామాధవరెడ్డి తాజాగా గళమెత్తి ఉద్యమ భేరి మోగించారు. భువనగిరిలో సంతకాల సేకరణ, పాదయాత్రలో పాల్గొని తన డిమాండ్ వినిపించారు. దీంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కొత్త జిల్లాల వ్యవహారం కాస్తా జిల్లా టిడిపి అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే మోత్కుపల్లి ఆలేరు నియోజకవర్గంలో అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేసి యాదాద్రినే కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న వాదనతో ఆందోళనలు ఉద్ధృతం చేశారు. విద్యాసంస్థల బంద్, పాదయాత్రలు నిర్వహించి డిసెంబర్ 1న దీక్షకు సిద్ధమవుతున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తేనే యాదాద్రికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి దక్కుతుందంటూ మోత్కుపల్లి డిమాండ్. అయితే రెవెన్యూ డివిజన్‌గా, నియోజకవర్గ కేంద్రంగా హైదరాబాద్‌కు, మెదక్‌కు దగ్గరగా ఉన్న భువనగిరినే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఉమామాధవరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి, భువనగిరి జిల్లా కేంద్రాల వివాదం కాస్తా టిడిపికి చెందిన ఇద్దరు పొలిట్‌బ్యూరో సభ్యుల మధ్య పోరాటంగా మారిపోగా ప్రాంతాల వారిగా ఇతర పక్షాలు వారి వెనుక సాగిపోతుండడం గమనార్హం. మోత్కుపల్లి గత పక్షం రోజుల నుండి యాదాద్రి జిల్లా కేంద్రం సాధనకు ఉద్యమాలు సాగిస్తున్నారు. తాజాగా భువనగిరి జిల్లా కేంద్ర సాధన కోసం ఉమామాధవరెడ్డి సైతం ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం కాస్తా జిల్లాల పంచాయితీతో మరోసారి రోడ్డున పడ్డట్లయింది. టిడిపి నేతల మధ్య సాగుతున్న పోరును అధికార పార్టీ టిఆర్‌ఎస్ నేతలు ఆసక్తిగా పరిశీలిస్తు ప్రజల ధోరణిని గమనిస్తూ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. అసలు ప్రభుత్వం నియమించిన కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటులో ఎలాంటి నివేదిక ఇస్తుందో చివరకు ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తారో..జిల్లా కేంద్రాలుగా వేటిని ప్రకటిస్తారన్నదానిపై చేస్తున్న కసరత్తు ముసాయిదా స్థాయిలోనే ఉందని గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు. టిడిపి నాయకులు మాత్రం జిల్లా కేంద్రాల గొడవతో రచ్చ చేయడం విడ్డూరంగా ఉందంటూ టిఆర్‌ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. గతంలో రైతు ఆత్మహత్యలు, రుణమాఫీలపైనా టిడిపి చేపట్టిన ఆందోళనల్లో సైతం మోత్కుపల్లి, ఉమా వర్గాలు గతంలో తలోదారి అన్నట్లుగా వ్యవహరించాయి. కొత్త జిల్లా కేంద్రాల పేచిలో సైతం తలో డిమాండ్ నెత్తినెత్తుకోవడంతో పార్టీ శ్రేణులు కూడా గ్రూపుల వారిగా వారిని అనుసరిస్తుండడం పార్టీలో వర్గపోరుకు నిదర్శనంగా కనిపిస్తుంది.