దక్షిన తెలంగాణ

మార్పు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకమాసం... ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయం.. చీకట్లు ఇంకా తొలగిపోలేదు. అపుడే నిద్రలేచిన నేను నిద్రమత్తును విడిచి మెల్లగా పనులు మొదలుబెట్టాను. మధ్యలో ఎందుకో నా చూపు మా పక్కింటిపై పడింది. వాళ్లు ఇంకా రాలేదు. వారింటికి ఇంకా తాళం వేసే ఉంది.
మా పక్కింట్లో ఒక ముస్లిం కుటుంబం ఉంటుంది. తల్లితో బాటు ఇద్దరు కొడుకులు ఉంటారందులో.
ఇంతలో ఫోన్ మోగింది. ఇంత ప్రొద్దునే్న ఎవరబ్బా అనుకుంటూ కొంచెం భయపడుతూనే ఫోన్ దగ్గరికెళ్లాను. ఫోన్‌లో అవతలి వైపునుండి ఏడుస్తూ మా పక్కింటామె మాట్లాడుతూ ఉంది.
‘వదినమ్మా మా ఆసిఫ్ డెంగ్యూతో ఉస్మానియా హాస్పిటల్‌లో ఉన్నాడు. వాడికి చాలా సీరియస్‌గా ఉంది. ప్లేట్‌లెట్స్ బాగా తగ్గిపోయినై. మా పెద్దోడికి ఆ విషయం తెలియదు. వాడొస్తే కొంచెం చెప్పరా. నా ఫోన్ నిన్ననే పోయింది’ అని చెప్పింది.
నేను ఆమెకు ఫోన్‌లోనే ధైర్యం చెప్పి, మా వారిని నిద్రలేపి విషయం తెలిపాను. పిల్లల్ని రెడీ చేసి టిఫిన్ పెట్టి వెళ్లి చూసొద్దామండీ అన్నాను.
వెంటనే మా శ్రీవారు నాపై ఒంటికాలిమీద లేచారు. ‘వాళ్ల కొరకు హాస్పిటల్ కెళ్లడమా? నీకేమైనా మతుందా? వాళ్లెలాంటి వాళ్లో మరిచావా?’ అన్నాడు. అంతటితో ఆగకుండా ‘వాళ్లకి ఎంతసేపు మన హిందువులంటే ఎంత కోపం? వాళ్లకి వాళ్ల ఇస్లాం అంటే ఎంత పిచ్చో తెలుసుకదా!’ వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడంతో నేను మళ్లీ పనిలో నిమగ్నమయ్యాను. ఇంతలో వాళ్ల పెద్దబ్బాయి హఫీజ్ వచ్చాడు. ఇంటికి ఉన్న తాళాన్ని చూస్తూ అక్కడే నిలబడ్డాడు.
నేను అతన్ని గమనించగానే ‘బాబు.. మీ అమ్మగారు ఫోన్ చేశారు. మీ తమ్ముడు డెంగ్యూతో ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాడు. కండీషన్ సీరియస్సంట. మీ అమ్మగారి ఫోన్ పోయిందంట’ అని చెప్పాను. ‘అయ్యో అలాగా’ అంటూ వెంటనే ఆ అబ్బాయి వెళ్లిపోయాడు.
మధ్యాహ్నం పనె్నండయ్యింది.
భోజనాలు ముగించాము.
ఏమనుకున్నారో ఏమో కాని మా శ్రీవారు ‘హాస్పిటల్‌కి వెళ్లొద్దామన్నావు కదా వెళ్దాం పద’ అన్నారు.
ఇద్దరం బయలుదేరి హాస్పిటల్‌కి చేరుకున్నాం. అక్కడ మందుల వాసనతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. అక్కడ నర్సులు, డాక్టర్లు హడావిడిగా తిరుగుతున్నారు.
మమ్మల్ని చూడగానే ఆసిఫ్ అన్న హఫీజ్ ఏడ్చుకుంటూ పరుగెత్తుకొని వచ్చాడు.
‘ఆంటీ, తమ్ముడి మీద ఆశలేదు. వాడికి అర్జంటుగా బ్లడ్ కావాలంట . అది ఎ, బి రేర్ గ్రూప్. ఎక్కడా దొరకడం లేదు. నేను నా ఫ్రెండ్స్‌కి ఫోన్ కూడా చేశాను. ఎవరిదీ ఎ, బి నెగెటివ్ కాదు’ అని అన్నాడు. ఇంతలో అతని స్నేహితులు ఒక పదిమంది దాకా వచ్చారు. అందరు ముస్లింలే.
వాళ్లని చూస్తుంటే ఎక్కువగా చదువుకున్న వారిలా లేరు. అల్లరి చిల్లరగా తిరిగే వారిలానే ఉన్నారు.
మమ్మల్ని ఎంతో నిర్లక్ష్యంగా చూస్తూ ‘అరే హఫీజ్ కైసాహైరే ఆసిఫ్? కూన్ మిలా క్యా?’ అని అడిగారు. వాడు ఏడుస్తూనే ‘నైరే? క్యాకర్‌నా సమఝమే నై ఆరై?’ అన్నాడు.
ఇంతలో నర్స్ వచ్చి ‘ఏమైంది? బ్లడ్ ఇంకా దొరకలేదా?’ అని అడిగింది. లేదనగానే ‘ఎలా? ఇక్కడ కూడా ఎవరూ లేరు ఆ గ్రూప్ బ్లడ్ ఉన్నవాళ్లు’ అని వెళ్లిపోయింది.
వాళ్లమ్మ వచ్చి ఏడవసాగింది.
నేను బాధతో మావారి వైపు చూసాను సాలోచనగా...
వెంటనే మా శ్రీవారు ‘నాది ఎబి బ్లడే, నేనిస్తాను రక్తం’ అని చెప్పారు.
మా వారు తన రక్తాన్ని ఆ అబ్బాయికి డొనేట్ చేశారు.
నాలుగు రోజులు గడిచాయి.
ఆసిఫ్ గండం గడిచి ఇల్లు చేరాడు. ఒక రోజు ప్రొద్దునే్న కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని వెళ్లి చూస్తే ఆసిఫ్, హఫీజ్. ‘అంకుల్ థ్యాంక్యూ. మీ సహాయాన్ని మేమెప్పుడు మరువలేము. మీరు మాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. అసలు మేము పాకిస్థాన్ అన్నా, ముస్లింలన్న పడిచచ్చే వాళ్లం. కానీ ఈ రోజు మేము ప్రాంతం మతం కాదు. మనిషిలోని మానవత్వమే గొప్ప. అందరిలో ప్రవహించేది. ఎర్ర రక్తమే మనందరిది. మానవత్వం అనే మతమే అని తెలుసుకున్నాం’ అని చెప్పారు.
వారిలోని ఆ మార్పుకు మా కాలనీవాళ్లంతా సంతోషపడ్డారు!

- సవ్వాజి వాణి, కరీంనగర్
సెల్.నం.9000282372

పుస్తక సమీక్ష

దేహమన్నది భ్రాంతియేనా!
ప్రతులకు:
- వరిగొండ కాంతారావు
‘ఆదిత్య’ 35-5-70, జీవన్‌మిత్రనగర్
విద్యారణ్యపురి,
హన్మకొండ-506 009
వెల : అమూల్యం

ఇదివరకే..వివిధ ప్రక్రయల్లో తమ రచనల్ని ప్రకటించిన వరిగొండ కాంతారావు గారి కలం నుండి మరో చిన్ని గంథం ‘దేహమన్నది భ్రాంతియేనా!’ శీర్షికతో గేయశతక రూపంలో రూపుదిద్దుకుని మనముందుకొచ్చింది. తత్త్వము తెలిసిన వారు మునులవుతారనీ..తెలియని వారు మిన్నకుంటారనీ..తెలిసీ తెలియని వారు వాచాలురవుతారనీ..ఆయన ఈ మూడో కోవకు చెందినవాడినని స్వయంగా ప్రకటించుకొనడం విశేషం!
తత్త్వం పట్ల కాంతారావు గారికి కొంతైనా జిజ్ఞాస ఉండటం వల్లే తాత్విక చింతనతో చిన్ని కావ్యాన్ని ప్రచురించే సాహసం చేశారు. ఈ కావ్యాన్ని శరీర మాధ్యమం అనివార్యం కాదని చెప్పి వెళ్లిన సద్గురు శ్రీ కందుకూరి శివానంద మూర్తి దివ్యస్మృతికి అంకితమివ్వడం అన్ని విధాలా సమర్థనీయంగా ఉంది.
దేహమన్నది భ్రాంతియేనా! మకుటంతో సాగే ఇందలి గేయాలు పాఠకుల్ని తాత్త్విక చింతన వైపు ఆలోచించేలా చేస్తాయి..కొన్ని సందేహాలను నివృత్తి చేయడంతో పాటు..కొత్త అనుమానాలకు ఆహ్వానం పలుకుతాయి! ఉండిలేనిది భ్రాంతి అనాలనీ..లేక వుండిన కూడ భ్రాంతియేననీ..ఉండి యుండిన భ్రాంతి అగునా..అని తమ సందేహాన్ని ప్రకటించారు. నిన్నమాదిరి నేడు లేదు..నేటి మాదిరి రేపు ఉండదు..మారు చుండుంటె మాయయనుకొన’ అన్న పంక్తుల్లో జీవన సత్యాలను ప్రతిబింభించారు. సాలోక్యము, సామీప్యము..కాయముండిన సాధ్యమగునని తేల్చి చెప్పినారు. ధర్మమన్నది శాశ్వతం కనుక..్ధర్మాన్ని నిలబెట్టే పనిలో దేహమే తొలి మెట్టు అవుతుందని వివరించారు. ప్రాణమన్నది దేహమందున ఎచటనున్నదో చెప్పజాలమని ఒక గేయంలో ప్రస్తావించిన తీరు బాగుంది. ఉండి పోయెడు దేహమందున..ఎన్నో రంగుల రుచుల గాంతుము..రుచికి మరణం లేదన్న సంగతిని మరోగేయంలో గుర్తు చేశారు. దేహాధికారిని నేనగా..నేను దేహము వేరనే కదా! ‘నేను’ సత్యము ననుచు చెప్పగ దేహమన్నది భ్రాంతియేనా! అని వ్యాఖ్యానించారు. ఇలా ఈ గేయశతకంలో దేహంపై విభిన్న కోణాల్లో తమ భావాలను అక్షర బద్ధం చేశారు. ఈ చిన్ని కావ్యానికి ఏ విధమగు వెల నిర్ణయించకుండా..ఈ పుస్తకాన్ని ఆమూలాగ్రంగా చదవడమే వెల అని చెప్పడం ఆయన సామాజిక చింతనకు ఔదర్యానికి నిదర్శనం!
- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

మనోగీతికలు

అన్నీ తానై..!
కవిత్వమంటే..
కాదు కరపత్రం!
ఎప్పటికీ తుప్పుపట్టని
పదునైన కరవాలం!
నిరంతర భావఝరి!
చురకలకు నిప్పుకణిక
మిణుకులకు నింగి చుక్క
హాస్యానికి గిలిగింతలమొలక
దుఃఖానికి లోతు అందని సాగరం
సంతోషానికి హద్దుల్లేని గగనతలం
ప్రేమికులకు ఊసుల భాష్యం
సమరానికి సంఘటిత ఆయుధం
ఉద్యమానికి బలమైన ఊపిరి
పదాల సరళ సంజీవని
పాటల ఊయల తరంగిణి
మాటల తూటాల ఫిరంగిని
అక్షర రూపక్షిపణి!
పగలు వెనె్నల చల్లదనాన్ని
రాత్రి సూర్యుడి వేడిని
తలపింపజేసే శక్తి స్వరూపిణి!
భావోద్వేగాలకు
అన్నీ తానై.. అలరించే..
నవరసాల మిళిత నవ్య రూపిణి!

- ఆచార్య కడారు వీరారెడ్డి
కరీంనగర్
సెల్.నం.7893366363

కావ్యనాయికవై..!
కలలో కనిపించి..
కవ్విస్తావు!
కనురెప్పలపై జాలువారుతూ..
గిలిగింతలు పెడతావు!
మనసంతా మల్లెలు పరిచి..
వసంతంవోలే
మధుమాసాలు కురిపిస్తావు!
నా హృదయపు అగాథంలో..
ఆణిముత్యానివా?
నా మనసు పూలగదిలో
కొలువుదీరిన..
మమతల పందిరివా?
నా ఆనంద సాగరంలో..
కురుస్తూ మురిపించే..
తుషార మేఘానివా?
నా హృదయపు గవాక్షంలో..
మెరిసే కాంతి పుంజానివా?
కలలో కనిపించి
కలవర పెడతావు?
కళ్లు తెరిస్తే..
మాయమవుతావు?
కన్నీళ్లు వర్షిస్తున్నా..
కనికరం చూపవా?
ఇకనైనా.. కలగా మిగిలిపోకుమా!
నా కావ్య నాయికవై..
కనిపించవా?!

- టి.వసంత
నిజామాబాద్

నేను కాక..!
నేను కాకపోతే ఇంకెవరూ
ఇప్పుడు కాకపోతే ఇంకెపుడు
ఎవరో ఎందుకు నేనే
చెబుతాను ఇప్పటికే
ఆలస్యమైంది
అమ్మగా ప్రేమకు
చెల్లిగా ఆత్మీయతను
ఆలిగా తోడు నీడై..
బంధాలతో విత్తనాలను
ఈ నేలంతా చల్లినా!
అమానవీయ చర్యల్తో
సృష్టినే చిన్నాభిన్నం చేస్తున్నా మానవ మేధస్సు
నన్ను తల్లి గర్భం నుండి
అణచి వేస్తున్నా..
పితృస్వామ్య సంస్కృతిలో
అడుగడుగున వివక్షతో..
నన్ను కుడి ఎడమలుగా
విభజించినా...
స్ర్తి ఔన్నత్యాన్ని ఏ ‘సీత’ చాటినా..
సమానత్వానికి ఏ ‘చట్టాలు’ తెచ్చినా
నువ్వు గీసిన సరిహద్దుల్లోనే
కాలాన్ని చదును చేస్తూ
పూదోటనే పెంచాను!
నిలువెల్లా మెలిపెట్టి
గాయపరిచే!
వ్యవస్థ అల్లిన కట్టుబాట్లల్లో
ఊపిరి తీస్తూ..
జీవితాన్ని ఒడిసి పట్టిన
సగర్వనై సజ్జననై..
నిర్భీతిగా నిరంతరంగా
మరణాన్ని జయిస్తూ..
జీవన సౌధాన్ని నిర్మించుకుంటూ..
ఈ విష సాంప్రదాయ
వేర్లను పెకిలిస్తూ స్ర్తిగా..
సాగిపోతున్నది నేను కాక..
మరెవరు?

- రామానుజం సుజాత
కరీంనగర్
సెల్.నం.9701149302

కాగజ్‌కీ పూల్ !
కాగజ్‌కీ ఫూల్ చందంలా..
అచ్చులేని తెల్ల కాగితాలు కార్మిక జీవితాలు
నీటిలో మునిగిన కాగితపు పడవలు!
అందమైన చీర వలె బతుకులు
వట్టి వాగులో ఆరేసినట్టు..
ఆరేదెన్నడు? అందేదెన్నడు?
పడుగుపోసే జీవం పడగనీడ చేరినట్టు..
విషప్రయోగాల వీధి నాటకమాయె బతుకు!
సరిపేకల బతుకు సరితూగేదెన్నడు?
పేక మేడల బతుకు పేనుకునేదెప్పుడు?
కాలగతుల్లో జీవనోపాధికి
కనికరము లేని ఈ భగవంతుడు
కరుణ చూపేదెన్నడో..?
వారి మోముల్లో వెలుగులు చూసేదెన్నడో?

- హనుమాండ్ల రమాదేవి
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9959835745

నేను..నువ్వు!
నేను..
నీకు వేల మైళ్ల దూరంలో
నీ గాఢ పరిష్వంగానికై తపిస్తూ
నిత్య జీవమై ఉద్భవిస్తూ ఉనికిని చాటుతూ
ఉత్సాహంతో ఉరకలేస్తూ
చెట్లు కొండలు దాటుకుంటూ
పరుగులు తీస్తూనే ఉంటా..
ఎక్కడ ఆయాసపడిపోతానో
ఏ ఎడారిలో ఇంకిపోతానో
ఏ ఆనకట్ట వెనుక సేదతీరతానో
అని ఎన్నడూ ఆలోచించను
మనసంతా ఒకటే కోరిక
నీతో మమేకమై పోవాలని
మనసును బార్ల తెరచి
నిన్ను హత్తుకునే వేళ..
నీకు నాకు మధ్య ప్రేమ చిహ్నాలుగా
ఏర్పడ్డ సారవంతమైన డెల్టాలు
నీ గురించి చెవులు చెమ్మగిల్లేలా చెప్పాయి
నువ్వు..
పైకి గంభీరంగా కనిపిస్తావుగాని
అంతరంగంలో ఎంత ఆందోళన పడుతున్నావో
మనసు లోతు పొరల్లో ఎలా మదనపడుతున్నావో
నా చేతులు పట్టిలాగి నీతో కలుపుకునేందుకు
ఎంత ఎత్తున కెరటమై ఎగసిపడుతున్నావో
ఏమరుపాటు లేకుండా ఎదురుచూస్తున్నావో!
ప్రియా నీ తపన చూసి
నా సుదీర్ఘ ప్రయాణంలో
తగిలిన రాళ్ల దెబ్బలు మర్చిపోయా
అంతులేని వేదన చూసి
ఇంతకాలపు విరహాన్ని మర్చిపోయా
నేను తప్పక వస్తానని
నువ్వక్కడే కదలకుండ ఉన్నావని
ఆర్ద్రతతో అర్థం చేసుకున్నా
నీతో జతకలిసే క్షణాలు
జన్మజన్మలకు సజీవం!
మనం ఒక్కటైన మధుర దృశ్యం
పరిణామోత్పత్తి నాగరికతకు
శాశ్వత ప్రథమ చిహ్నం!

- పెనుగొండ బసవేశ్వర్
కరీంనగర్, సెల్.నం.9059568432

కవిత్వమంటే ?
కవిత్వమంటే...
కాలే కడుపుల ఆకలి మంట!
కవిత్వమంటే..
కార్మికుల కండరాలపై మెరిసే చెమట!
కవిత్వమంటే..
కర్షకుడు పడే ఆవేదన!
కవిత్వమంటే..
కామం కాటుకు బలయ్యే పసి పిల్లల ఆక్రందన!
కవిత్వమంటే..
కటిక చీకటిని పారద్రోలే వెలుగుల మంట!
కవిత్వమంటే..
కనులకు అందని విజయ బావుటా!

- గుండు రమణయ్య గౌడ్
పెద్దాపూర్ - జూలపల్లి
సెల్.నం.9440642809

అగ్ని పరీక్ష
సమాజం వర్ణాలుగా చీలిపోతే
సమ సమాజం కలల సంగతేమిటి?
దేశవాసులు వర్గాలుగా విడిపోతే
భవిష్యత్తు కోడి బంగారు గుడ్లు పెడుతుందా?
సాహిత్యంలో దృక్పథాలు
ఎవరికి వారే యమునా తీరేను
అక్షరాలా అమలు చేస్తుంటే..
భిన్నత్వంలో ఏకత్వం బతికుంటుందా?
బాధ్యతలను మరచిన హక్కులు
కోతి కొమ్మాటలో చెంగలిస్తుంటే..
మతము నల్లమందు నములుతుంటే
మేధావుల కర్తవ్యానికి అగ్నిపరీక్షనే కదా!

- ఐతా చంద్రయ్య
సిద్ధిపేట
సెల్.నం.9391205299

లోకం నాడూ - నేడు
అలనాడు
పాండవులు అయిదు మందైనా
న్యాయం, ధర్మం వారి పక్షానే్న
ఉన్నాయనీ,
కౌరవులు నూరుమందైనా
వారి సంఖ్యకు భయపడకుండా
లోకం - పాండవుల విజయానే్న కోరి,
యుద్ధంలో వారు సాధించిన
దిగ్విజయానికి
హర్షాన్ని ప్రకటించింది!
కానీ..నేడు -
ఇప్పటి లోకానికి
ఆ న్యాయం, ధర్మం అక్కరలేదు!
సంఖ్యలో తక్కువగా ఉన్న
మంచివాళ్లనూ, అమాయకులనూ
క్రూరమైన విధికి నిర్ధాక్షిణ్యంగా
వదిలేసి
సంఖ్యలో ఎవరు ఎక్కువగా ఉంటే
వారికీ,
ఎవరి దగ్గర పుష్కలంగా
అర్ధబలం, అంగబలం ఉంటే
వారికీ..
‘దాసోహం’ అంటూ
నిర్లజ్జగా లొంగిపోయి,
వారు అడగకుండానే
వారి పక్షాన భజనలు చేస్తూ
వారికే వంత పాడుతోంది
ఈ లోకం!!

- రఘువర్మ, జగిత్యాల, సెల్.నం.9290093933

భైరవులు

విశ్వాసానికి మారుపేరైనా మమ్ము
అవిశ్వాస తీర్మానంతో
అవతలికి నెట్టేస్తున్నారు
మా ఆకలి ఆర్తనాదాలు
మీకు పిచ్చి అరుపుల్లా
వినబడుతున్నాయంటూ
మా తనువుపై పిచ్చివి అను ముద్రవేసి
మమకారం మరిచిపోయి
మటుమాయం చేస్తున్నారు
కబళం దానం చేసి
కనికరించండి మహాప్రభో అంటూ
కాళ్లావేళ్లా పట్టుకొని బతిమాలుతుంటే
కరుస్తున్నావంటూ కసిరి ఛీ కొడుతున్నారు
తోచినంత పడేస్తే తోక ఆడించుకుంటూ
తోడు నీడగా మసలే వాళ్లం
గుప్పెడు మెతుకులు విదిలిస్తే
గూర్ఖాలా మీ ఇంటికి కాపలా కాసేవాళ్లం
కుప్పతొట్ల సహజీవనం సాగిస్తున్న మాకు
చెప్పుకునేందుకు మీలా
ఏ సంఘాలు లేని వాళ్లం
డొక్కలు ఎండి బొక్కలు తేలి
దిక్కులేకుండా బక్క చిక్కిపోతున్నాం
నేరాల ఆచూకి తెలిపే మేము
ఘోరంగా తరిమేయబడుతున్నాం
‘అన్నమో రామచంద్రా’ అంటూ
వీధులెంబడి తిరుగుతూ
కన్నీరొల్కుతూ మొరుగుతున్నాం
ఆకలికి తాళలేక కరుస్తున్నాం
పట్టెడన్నం పెట్టి మీ పంచన చేర్చుకోండి
పట్టించుకోకుండా మమ్ము
తుదముట్టించకండి
చేతలకు దూరంగా ఉండకుండా
నేతలు జీవకారుణ్యానికి దగ్గరవ్వాలని
మూగ మనసుతో సాగిలపడి
మొక్కుతున్నాం

- రాకుమార, గోదావరిఖని
సెల్.నం.9550184758

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి. merupuknr@andhrabhoomi.net
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్.

- సవ్వాజి వాణి