సంజీవని

పిల్లల్లో షుగరు -- మీకు మీరే డాక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: షుగరు వ్యాధి పిల్లలని పట్టి పీడించటానికి కారణం ఏమిటి? నివారణ చెప్పగలరు?
-కె.తాండవ కృష్ణమూర్తి, నరసరావుపేట
జ: షుగరు రోగుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ వ్యాధి ఉపద్రవాలు ఒకప్పటికన్నా ఎక్కువగా ఇపుడు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. పిల్లల్లో షుగరు వ్యాధి సోకినవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 350 మిలియన్లకుపైగా ఉందని ఒక అంచనా. ఇది పాత లెక్కే! ఈ వ్యాధి వచ్చిన పిల్లల సంఖ్య ఇంకా ఎక్కువేనని చెప్పాలి. మరో 20 ఏళ్ళకి ఈ సంఖ్య రెట్టింపు కానున్నది.
షుగరు వ్యాధి అంటే, గుండెనీ, రక్తనాళాలను, కళ్ళను, కిడ్నీలను, నరాలను ఇంకా శరీరంలో ముఖ్యమైన అవయవాలను దెబ్బతీసే జబ్బు అనే అర్థం స్థిరపడిపోతోంది. ఈ వ్యాధిని లెక్క చేయకుండా అశ్రద్ధగా వ్యవహరించటమే ఇందుకు ముఖ్య కారణం.
ఇప్పటికి కనుక్కున్న మందుల వాడకం రీత్యా షుగరు వ్యాధిని ఇన్సులిన్‌తో మాత్రమే తగ్గేదనీ, ఇన్సులిన్ ఇంజెక్షన్ లేకుండా మందులతో తగ్గేదని రెండు రకాలుగా వర్గీకరించారు. తగ్గటం అంటే వ్యాధి తగ్గిపోవటం అని కాదు, అదుపు చేయటం అనే అర్థం! పిల్లలకు వచ్చేది సాధారణంగా పైన చెప్పిన ఒకటవ రకం (టైపు 1) షుగరు వ్యాధి. వీళ్ళ శరీరంలో పాంక్రియాజ్ (అగ్న్యాశయ) ఏ మాత్రం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనపుడు, బయటనుండి కృత్రిమంగా తయారుచేసి ఇన్సులిన్ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టవలసి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతోందో కారణం తెలీదు. కాబట్టి నివారణ కూడా తెలీదు.
ఇంక రెండో రకం షుగరు వ్యాధిని టైపు 2 డయాబెటీస్ అంటారు. ఈ వ్యాధి వచ్చినవారిలో పాంక్రియాజ్ ద్వారా కొంత ఇన్సులిన్ తయారీ జరుగుతుంది గానీ, అది చాలినంత జరగకపోవటంవలనగానీ, లేదా శరీరం ఈ ఇన్సులిన్‌ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోవటంవలన గానీ ఈ రెండో రకం షుగరు వ్యాధి వస్తుంది. ఆ మేరకు మందులు వేసి ఈ వ్యాధిని కొంతవరకూ అదుపు చేయటం సాధ్యం అవుతుంది. వంశపారంపర్య కారణాలు ఇందులో ముఖ్యమైనవి కావచ్చు.
ఒకపుడు పిల్లల్లో షుగరు వ్యాధి కేవలం టైప్ 1 వ్యాధేననుకునేవారు. ఇపుడు మన జీవన విధానం, ఆహార విహారాల కారణంగా టైప్ 2 డయాబెటీస్ కూడా పిల్లల్లో కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. కొంతమందిలో ఇన్సులిన్‌ని శరీరం ఉయోగించుకోలేని స్థితి వలన ఈ రెండో రకం షుగరు వ్యాధి రావచ్చు. ఇన్సులిన్ కొరతకు తోడు శరీర వ్యాయామం లేకపోవటం, స్థూలకాయం లాంటి అంశాలు రేపు వచ్చే వ్యాధిని ఈపూటే తెచ్చి పెడుతుంటాయి. మనం పిల్లల్ని శారీరక మానసిక వ్యాయామాలు లేకుండా పెంచుతున్నాం కాబట్టి, వాళ్ళలో ఈ షుగరు వ్యాధి వస్తే, అందుకు బాధ్యత మనదే అవుతుంది. కారణానికి అనుగుణమైన నివారణ చర్యలు తీసుకోవటమే చికిత్స. ఏవో ప్రత్యేకంగా తెచ్చి తినటంతో తగ్గేది కాదు.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com