హైదరాబాద్

ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కార్యరూపం దాల్చిన డబుల్ బెడ్ రూం * ఆదర్శంగా ఐడిహెచ్‌కాలనీ * ఎస్‌ఆర్‌డిపికి ఆదిలోనే అడ్డంకులు
* కమిషనర్ మారినా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు * కొత్త పాలక మండలి ఎన్నికకు చురుకుగా ఏర్పాట్లు
హైదరాబాద్, డిసెంబర్ 29: మహానగర పాలక సంస్థ 2015 సంవత్సరం మొత్తం ఆద్యంతం ఆసక్తికరమైన పరిణామాలతో కొనసాగింది. ఏడాది మొత్తం కార్యకలాపాలు, అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టు తయారయ్యాయి. స్వరాష్ట్రం స్వపరిపాలనలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ సిటీగా రూపకల్పన చేసేందుకు సర్కారు రూపొందించిన ప్రణాళికలు అమలు చేయలేకపోయింది. తొలి విడతగా చేపట్టాల్సిన రూ. 1100 కోట్ల పనులకు ఆదిలోనే అడ్డంకులొచ్చి పడ్డాయి.
ఇదిలా ఉండగా, పట్టణ పేదల కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన డబుల్ బెడ్ రూం స్కీం దేశంలోనే మొట్టమొదటి సారిగా సికిందరాబాద్‌లోని ఐడిహెచ్‌కాలనీలో కార్యరూపం దాల్చింది. 2013 అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయటంతో ఈ కాలనీ పేదల గృహనిర్మాణ రంగంలో దేశానికే తలమానికంగా నిలిచింది. ఏడాది ప్రారంభంలో చేపట్టిన ఆస్తిపన్ను వసూళ్లు అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ అంచనాల మేరకు ఫలించి రూ. వెయ్యి కోట్లు దాటింది. స్మార్ట్‌సిటీపై దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రదాని నరేంద్రమోడి సైతం జిహెచ్‌ఎంసి ఆదాయ సమీకరణను అభినందించారు. హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇదే కార్యక్రమంలో ప్రధాన నరేంద్రమోడికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అరుదైన అవకాశం అప్పటి నగర మున్సిపల్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కే దక్కింది.
స్వచ్ఛ భారత్‌కు సవాలక్ష అడ్డంకులు
నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా తీర్చిదిద్దేందుకు జూలై మాసంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అధికారులు అయిదు రోజుల పాటు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరాన్ని 400 స్వచ్ఛ యూనిట్లుగా విభజించి, గవర్నర్ మొదలుకుని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సైతం యూనిట్లకు మెంటర్లుగా నియమితులై నేరుగా ప్రజల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. అంతేగాక, అప్పటికపుడే యుద్దప్రాతిపదికన ప్రజలకు అవసరమైన పనులు చేపట్టేందుకు వీలుగా ఒక్కో మెంటర్‌కు రూ. 50లక్షల నిధులను కూడా కేటాయించారు. గవర్నర్ నరసింహన్ ఎర్రమంజిల్‌కాలనీకి, సిఎం కెసిఆర్ పార్శిగుట్టకు మెంటర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలయ్యేందుకు రూ. 200 కోట్లను కేటాయించినా, పనులు మాత్రం అంతంతమాత్రంగానే ముందుకు సాగుతున్నాయి.
సర్కారుకు కోపం తెప్పించిన కార్మికుల సమ్మె
జీతాల పెంపును డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభుత్వానికి కోపం కలిగింది. నెలరోజుల పాటు కార్మికులు సమ్మె చేపట్టడంతో రంజాన్, బోనాల పండుగల్లో పారిశుద్ధ్య పనులు అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే జీతాల పెంపు ప్రభుత్వం పరిశీలనలో ఉందని, త్వరలోనే సానుకూలమైన నిర్ణయం వస్తుందని, కార్మికులంతా విధుల్లో చేరాలని అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఆదేశాలను సైతం కార్మికులు లెక్క చేయకుండా సమ్మెలోనే కొనసాగారు. దీంతో కోపమొచ్చిన సర్కారు విధులకు హజరుకాని 1305 మంది కార్మికులను విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశించింది. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని రెండు నెలల క్రితం మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలిచ్చినా, నేటికీ అధికారులు పూర్తి స్థాయిలో కార్మికులను విధుల్లోకి చేర్చుకోలేదు. పైగా కొందరు మెడికల్ ఆఫీసర్లు తొలగించిన కార్మికులను తిరిగి తీసుకునేందుకు ఒక్కోక్కరి నుంచి రూ. లక్ష లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
వివాదాస్పదంగా మారిన ఓటరు జాబితా సవరణ
మహానగరంలో జనాభా కన్నా ఎక్కువ మంది ఓటర్లుండటాన్ని గుర్తించిన అధికారులు మొత్తం 24 అసెంబ్లీ సెగ్మెంట్లు, 150 డివిజన్లలో ఓటరు జాబితాను ఫిల్టర్ చేసేందుకు చేపట్టిన ఆధార్ కార్డు అనుసంధానం, ఓటరు జాబితా మొత్తం కూడా వివాదాస్పదంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 17లక్షల మంది సెటిలర్ల ఓట్లు తొలగించారంటూ మాజీ మంత్రి మర్రిశశిధర్‌రెడ్డి ఈ విషయాన్ని జాతీయ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయటంతో ఉన్నతాధికారుల ప్రత్యేక బృందం నేరుగా నగరానికొచ్చి ఓట్ల తొలగింపుపై అధికారులకు అక్షింతలు వేసింది. తొలగించిన ఓట్లను పరిశీలించాలని ఆదేశించినా, నేటికీ తొలగించిన ఓట్లను మళ్లీ జాబితాలో చేర్చలేదంటూ ఈ నెల 28న కొందరు నేతలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. గతంలో ఎన్నో సార్లు జిహెచ్‌ఎంసి ఓటరు జాబితా సవరణ చేపట్టినా, ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. ఈ సంవత్సరం చేపట్టిన ఈ సవరణ అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ స్థానచలనానికి ఓ కారణమైందని కూడా చెప్పవచ్చు.
ఎన్నికల బిజీ
ఓట్ల తొలగింపు, నగరంలో పౌరసేవల నిర్వహణలో కీలకమైన రోడ్ల విషయంలో అక్టోబర్ 30వ తేదీన కమిషనర్ సోమేశ్‌కుమార్ బదిలీ కావటంతో ఆయన స్థానంలో డా.బి. జనార్దన్‌రెడ్డిని కమిషనర్‌గా నియమించారు. అప్పటికే ఎన్నికల డివిజన్ల పునర్విభజన ముసాయిదా సర్కారుకు చేరటంతో స్వల్పంగా మార్పులు చేసి పంపిన కొత్త కమిషనర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గ్రేటర్‌లోని మొత్తం 7వేల 51 పోలింగ్ బూత్‌లను డివిజన్ల వారీగా ఖరారు చేయటంతో పాటు పునర్విభజన, బిసి ఓటర్ల గణన వంటి ముఖ్యమైన ప్రక్రియను ఖరారు చేసిన జిహెచ్‌ఎంసి నేడోరేపో రిజర్వేషన్లను ప్రకటించనుంది. కొత్త సంవత్సరంలో కొత్త పాలక మండలిని ఎన్నుకునేందుకు జిహెచ్‌ఎంసి ఏర్పాట్లలో నిమగ్నమైంది.
సరికొత్త ‘పరిచయం’
కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే బల్దియా బాసు డి.బి.జనార్దన్‌రెడ్డి గ్రేటర్‌లో తనదైన మార్కు వేసేందుకు వెంటనే శ్రీకారం చుట్టారు. జిహెచ్‌ఎంసి ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచటంలో ప్రజలను కూడా భాగస్వాములను చేసేందుకు వీలుగా సరికొత్త పరిచయం కార్యక్రమాన్ని అమలు చేశారు.
నగరంలోని ప్రతి ప్రాంతంలోని పారిశుద్ధ్య కార్మికులు స్థానికుల వద్ధకు వెళ్లి తమను పరిచయం చేసుకుని, తాము చేసే పనుల గురించి వివరించి, వారికి తమ ఫోన్ నెంబర్లను ఇచ్చి వారిలో సన్నిహిత్యాన్ని పెంపొందుకునే ప్రయత్నం ప్రారంభమైంది. కమిషనర్ సైతం పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను కలిసి తాను జిహెచ్‌ఎంసి కమిషనర్‌నంటూ, తనను తన విధులను పరిచయం చేసుకున్నారు. పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు తాము పనులు చేసినట్లు నిర్ధారిస్తూ, రోడ్లకు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టే ఇంజనీర్లు సైతం పనులు చేపట్టినట్లు ఈ కార్యక్రమం కింద ప్రజల నుంచి సంతకాలను తీసుకునే విధానాన్ని ఈ కార్యక్రమం ద్వారా అలవాటు చేశారు కమిషనర్.
కమిషనర్ మారినా యధావిధిగా ‘సేవ’
జిహెచ్‌ఎంసి అంటే కేవలం పౌరసేవల నిర్వహణ, అభివృద్దే కాకుండా అర్దాకలితో అలమటించే వారికి అన్నం పెట్టే గొప్ప సేవా తత్పరతను కూడా అలవర్చుకోవాలన్న సంకల్పంతో పూర్వ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రారంభించిన రూ.5కే సబ్సిడీ ఆహార పథకం ఆయన బదిలీ అయిన తర్వాత కూడా యధావిధిగా కొనసాగుతున్నాయి. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే సేవా కార్యక్రమాలు యదావిదిగా కొనసాగుతాయని ప్రకటించిన జనార్దన్‌రెడ్డి ఆ తర్వాత లక్డీకాపూల్, సికిందరాబాద్ ప్రాంతాల్లో రూ.5 భోజనం స్టాళ్లను ప్రారంభించారు. వీటిని మరింత విస్తరించేందుకు గతంలోనే ప్రారంభమైన ప్రయత్నాలను సైతం ముమ్మరం చేశారు.
సర్కిళ్ల పెంపు
నగర పాలక సంస్థ ఏడు సర్కిళ్ల నుంచి గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత 18 సర్కిళ్లకు పెరిగాయి. ఈ సంవత్సరం రెండో అర్ద్భాగంలో కమిషనర్ సోమేశ్‌కుమార్ పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి కోసం సర్కిళ్లను 24కు పెంచారు. కొన్ని సర్కిళ్లను రెండుగా విభజిస్తూ సర్కిల్, సర్కిల్ బిగా నామకరణం చేశారు. ఇద్దరు డిప్యూటీ కమిషనర్లతో పాటు ఇద్దరు సహాయ వైద్యారోగ్యాధికారులను కూడా నియమించారు.
మురికివాడలపై ఎంత ముందు చూపో?
మురికివాడల్లోని ప్రజలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హౌజింగ్ స్కీంలను అమలు చేస్తూ గుణపాఠం నేర్చుకున్న జిహెచ్‌ఎంసి మున్ముందు ఇలాంటి స్కీంలు నీరుగారకుండా ఉండేందుకు కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఎంతో ముందుచూపుతో ముందుకెళ్తున్నారు. తొలుత హౌజింగ్ స్కీం పట్ల మురికివాడల ప్రజల్లో అవగాహన కల్పించి, వారు అంగీకరించిన తర్వాత లిఖిపూర్వకమైన హామీ తీసుకున్న తర్వాతే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. కమిషనర్ చొరవతో మురికివాడల ప్రజలకు తొలుత కౌనె్సలింగ్ నిర్వహించి, ఇపుడు డబుల్ బెడ్ రూం స్కీంను అమలు చేసేందుకు 30 మురికివాడల ప్రజలు ముందుకు రావటం హర్షణీయమే, అయినా వారి కల సకాలంలో నెరవేరాలని ఆకాంక్షిద్దాం!