జాతీయ వార్తలు

మళ్లీ ముసురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలపడుతున్న అల్పపీడన ద్రోణి
తమిళనాడుకు మళ్లీ వర్షాలు
బిక్కుబిక్కుమంటున్న చెన్నైవాసులు
జోరందుకున్న సహాయక చర్యలు
ప్రారంభమైన విమాన సర్వీసులు

చెన్నై, డిసెంబర్ 6: చెన్నై మహానగరంపై వరుణ దేవుడు పగబట్టినట్టుంది. శనివారం కాస్త తెరపిచ్చినట్టు కనిపించిన వర్షాలు, ఆదివారం తిరిగి నగరాన్ని కుదిపేయడంతో నగర ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుతున్నారు. రాబోయే 48 గంటల్లో తమిళనాడు అంతటా వర్షాలు కురుస్తాయని, ఇప్పటికే భారీ వర్షాలకు అతలాకుతలమైన కడలూర్ జిల్లాలో భారీనుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి ఆనుకుని ఇప్పటికే ఉన్న అల్పపీడన ద్రోణికి తోడుగా కొత్తగా మరో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, తీరానికి ఆగ్నేయంగా బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారి ఒకరు చెప్పారు. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో తమిళనాడు కోస్తా, లోతట్టు ప్రాంతాలు, పుదుచ్చేరిలలో రాబోయే 24-48 గంటల్లో వర్షాలు కురుస్తాయని, కడలూర్‌లాంటి కొన్ని ప్రాంతాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ అధికారి చెప్పారు. కాగా ఆదివారం ఉదయం నుంచి చెదురుమదురు వర్షాలు కురుస్తున్న చెన్నై నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండి, వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని కూడా ఆ అధికారి చెప్పారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కూడా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతోపాటు సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
ఇదిలావుంటే, విమానాశ్రయంలో పరిస్థితి మెరుగుపడటంతో ఆదివారం చెన్నైనుంచి పగటిపూట వాణిజ్య విమాన సర్వీసులు మొదలయ్యాయి. ఉదయం ఇక్కడినుంచి పోర్టుబ్లెయిర్‌కు మొట్టమొదటి ఎయిరిండియా విమానం బయలుదేరి వెళ్లింది. హైదరాబాద్, ఢిల్లీకి కూడా ఎయిరిండియా ఈ రోజు విమానాలను నడపనుంది. వరదల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు రోజుల క్రితం నిర్ణయించినప్పుడు విమానాశ్రయంలో వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 34 విమానాలు ఆగివున్నాయి.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఉత్తర చెన్నై సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయ సామగ్రి పంపిణీని రాష్టమ్రంత్రులు తనిఖీ చేశారు. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో సైతం పెద్దఎత్తున వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా జ్వరం, వొళ్లునొప్పులు లాంటి వాటికి దివ్యౌషధంలాగా పని చేసే ‘నీలవెంబు కుడినీర్’ అనే హెర్బల్ డ్రింక్‌ను కూడా నగర ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అలాగే నిత్యావసర సరకుల సరఫరాను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 11 మొబైల్ కూరగాయల దుకాణాలు ప్రారంభమైనాయి. నగరంలో చెత్తాచెదారాన్ని శుభ్రం చేయడానికి ఇతర జిల్లాలనుంచి పిలిపించిన 2వేల మందితో కలిపి మొత్తం 24,500 శానిటేషన్ కార్మికులను రంగంలోకి దింపుతున్నట్లు చెన్నై నగర కార్పొరేషన్ తెలియజేసింది. సహాయక చర్యలకోసం సైన్యానికి చెందిన రెండు కాలమ్‌లు కడలూర్‌కు వచ్చాయి. ఈ జిల్లాలో దాదాపు 140 గ్రామాలు ఇప్పటికీ వరద నీటిలో మునిగి ఉన్నాయి.
నగరంలో పెట్రోలు, డీజిలుకు ఎలాంటి కొరత లేదని, నగరం, శివార్లలోని తమ బంకుల్లో 81 శాతం పూర్తి స్టాక్‌తో పని చేస్తున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. కాగా, ఇన్నాళ్లుగా పేరుకుపోయిన చెక్కులు, డ్రాఫ్ట్‌లు క్లియర్ చేయడానికి, ఎటిఎంలలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా నగదు సదుపాయం కోసం చాలా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆదివారం కూడా పని చేశాయి.

(చిత్రం) హెలికాప్టర్ నుంచి అందిస్తున్న ఆహారాన్ని అందుకుంటున్న ఓ వరద బాధిత కుటుంబం. కొట్టుపురంలో సహాయక సామగ్రికోసం బారులుతీరిన బాధితులు