దక్షిన తెలంగాణ

రాఖీ బాధితుడు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఖీ బాధితుడు (కథ)

రాఖీ పండుగ అంటే అందరికీ సరదాయే, సంతోషమే, ఒక్క రాకేష్‌కు తప్ప! రాఖీ పండుగ వస్తుందంటే అతనికి ఒకే దడ, భయం. కారణం గత మూడేళ్లుగా రాఖీ పండుగ రోజు అతడు ‘షాక్’కు గురికావడం, అతని ప్రేమ వికటించడం.
అందరు యువకుల్లాగే రాకేష్ కూడా ఓ అమ్మాయిని చూసి ప్రేమించడం ప్రారంభించాడు. ఆమె అతని ‘క్లాస్‌మెట్’. ఆమెను ప్రేమించాడో, ప్రేమించానని అనుకుంటున్నాడో అతనికే సరిగా తెలియదు. మూడేళ్ల క్రితం ప్రేమించిన అమ్మాయి రాఖీ పండుగ దాకా ఊరించి పండుగ రోజు హఠాత్తుగా అన్నయ్యా అంటూ రాఖీ కట్టింది. పాపం రాకేష్ దుఃఖం కట్టలు తెంచుకుంది. తన ప్రేమ ఇలా వికటించినందుకు నొచ్చుకుని ప్రేమించాలంటే ఆడపిల్లలే కరువయ్యారని తనను తానే ఓదార్చుకున్నాడు.
గత సంవత్సరం తన క్లాస్‌మేట్ అయిన మరో అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా ఆమెకు సన్నిహితంగా మెలగడం ప్రారంభించాడు. ఆమె అవసరాలు తీరుస్తూ తన పర్సు ఖాళీ చేసుకున్నాడు. ఎదురు చూడకుండానే మళ్లీ రాఖీ పండుగ వచ్చింది. తను ఊహించని మలుపు తిప్పింది. తన ప్రేమ ‘అన్నయ్యా’! అంటూ ఈ రెండవ ప్రియురాలు కూడా తన ప్రమేయం లేకుండానే, అనుమతి కోరకుండానే కుడి చేయి లాక్కుని ముంజేతికి రాఖీ కట్టింది. అతన్ని మళ్లీ విచారంలోకి నెట్టేస్తూ..
ఈసారి అంటే మూడవసారి బాగా ఆలోచించి తన ప్రేమ వికటించకుండా ‘ప్లాను’ వేశాడు.
రాఖీ పండుగ రోజు కాలేజీకి ఎగనామం పెట్టి తన ప్రేమ సోదర, సోదరీ ప్రేమ కాకుండా ప్రియురాలి ప్రేమగా నిలిచేలా జాగ్రత్తపడ్డాడు.
తన ప్రేమ సోదర ప్రేమ కాదని, ప్రియుడి ప్రేమ అని నెత్తి, నోరు బాదుకున్నా బలవంతంగా రాఖీ కట్టిన ఇద్దరు ప్రియురాళ్లను గుర్తుకు తెచ్చుకుని, మూడవ ప్రియురాలికి ఆ అవకాశం ఇవ్వకుండా వేసిన ‘ప్లాను’కు తనను తానే మెచ్చుకున్నాడు.
రెండు రోజుల తరువాత ‘పోస్ట్‌మెన్’ క్లాస్ రూంకు వచ్చి రాకేష్‌కు ఓ కవరు అందించి వెళ్లాడు.
ఆత్రంగా కవరు విప్పి చూశాడు. ఆ కవరులో ఒక రాఖీ, ఉత్తరం కనిపించాయి.
ఆదుర్దాగా కవరు విప్పి చదవడం ప్రారంభించాడు.
‘అన్నయ్యా! రాఖీ పండుగ రోజు ‘రాఖీ’ కట్టించుకోడానికి నీవు రాలేదు. అందుకే పోస్టులో పంపిస్తున్నాను. తప్పక ఈ సోదరి ప్రేమతో పంపిన రాఖీ కట్టుకుంటావు కదూ!’ ఇది ఆ ఉత్తరంలోని సారాంశం.
తనకు ప్రేమించడం, ప్రేమించబడటం కలిసి రాలేదని, సోదర ప్రేమనే తన జాతకంలో వుందని తెగ వాపోయాడు. పాపం రాకేష్!
- గరిశకుర్తి రాజేంద్ర, కామారెడ్డి, సెల్.నం.9493702652

ఒక మరణం...

పోలీస్ వాహనం వేగంతో దూసుకువెళ్తోంది. ఇంతలో ఓ యువకుడు హఠాత్తుగా రావడంతో ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ గ్రామ జనమంతా అక్కడికి చేరుకొన్నారు. కొంత మంది జీపు వెనకాలే పరిగెత్తారు. లాభం లేకపోవడంతో వెనుతిరిగారు. ఆ యువకుడు మరణించాడు.
ఆ యువకుడు తల్లిదండ్రులకు విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవ్వరివల్ల కాలేదు. ఇదంతా తెలుసుకున్న విలేఖరి అక్కడికి చేరుకొని ఆ పోలీస్ వాహనంలో ఎస్‌ఐతో పాటు డ్రైవర్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారని, ఓ మంత్రి సుడిగాలి పర్యటన ఉండడంతో వేగంగా వెళ్లే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగిందని తెలుసుకొంటాడు.
విలేఖరి విషయాలని ఆ యువకుడు తల్లిదండ్రులకు, ఊరి జనానికి వివరిస్తాడు.
ఆ యువకుడు తల్లిదండ్రులతో మీకు న్యాయం జరిగేవరకు వాళ్లకి శిక్షపడే వరకు మీతో నేను ఉంటానని విలేఖరి చెప్పడంతో వాళ్లలో కొండంత ధైర్యం వచ్చినట్లు అన్పిస్తుంది.
ఎస్‌ఐకి విషయం తెలియడంతో ‘రాజీ’ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కొందరి పెద్దమనుషుల సహాయంతో ఐదు లక్షల రూపాయలకు కేసు పెట్టకుండా చూడమని ఒప్పందం కుదుర్చుకుంటాడు.
ఆ యువకుడు తల్లిదండ్రులు సరే అనడంతో ఈ విషయం చల్లారిపోతుంది.
విలేఖరికి విషయం తెలిసి వారి దగ్గరికి వస్తాడు.
‘కేసు ఎందుకు పెట్టలేదు’
‘కేసు పెడితే మాకు ఏమి వస్తుంది. ఎస్‌ఐ బాబు 5 లక్షలు ఇస్తారని హామీ ఇచ్చారు’ అని యువకుడు తండ్రి చెబుతాడు.
‘డబ్బు కోసం రాజీపడ్డారా? మీ అబ్బాయి ప్రాణం నిర్లక్ష్యంగా పోయింది’
‘వాడు పుట్టినప్పుడు ఏదో అయ్యిందట మతిస్థిమితం లేదు. ఎలాగో కష్టం చేసుకొని ఇరవై ఏళ్లు పెంచామని కానీ భగవంతుడు వాడి ప్రాణం పోయేలా చేసి మాకు డబ్బు అందిస్తున్నాడు’ అన్నాడు.
‘అదేంటండి అలా మాట్లాడుతున్నారు’ అన్నాడు కోపంగా విలేఖరి. ‘లేకపోతే ఏంటి? కేసు పెట్టి కోర్టు చుట్టు, పోలీస్ స్టేషన్ చుట్టు తిరగాలా? వాడి ‘అవిటితనంతో’ బాధపెట్టిన డబ్బులిచ్చి సుఖపెట్టాడు.
విలేఖరి ‘ఒక మరణం’ విషాదం నింపుతుందని అనుకుంటే ‘ఒక మరణం’ సుఖపెట్టడం చూసి అక్కడి నుండి వెళ్లాపోయాడు బరువైన హృదయంతో.

- నల్లపాటి సురేంద్ర, వైజాగ్, సెల్.నం.9490792553

పుస్తక సమీక్ష

కవి కోయిలల
‘పంచమ స్వరం’!

పేజీలు : 110, వెల : 100/-
ప్రతులకు:
కె.ఎస్.అనంతాచార్య
7-2-237,
(న్యూ) మంకమ్మతోట
కరీంనగర్ - 505001
సెల్.నం.9441195765

గత ఇరవై ఆరు ఏళ్లుగా సాహితీ రంగంలో విశేష కృషి చేస్తున్న కరీంనగర్ సాహితీ గౌతమి (జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య) వైవిధ్య భరితమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. శ్రీ కె.ఎస్.అనంతాచార్య, దాస్యం సేనాధిపతి అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న సాహితీ గౌతమి రాష్టస్థ్రాయిలో సినారె కవితా పురస్కారంతో పాటు గండ్ర హన్మంత రావు స్మారక సాహితీ పురస్కారం, చింతల లక్ష్మారెడ్డి స్మారక సాహితీ పురస్కారం, బొందుగుల పాటి స్మారక సాహితీ పురస్కారాలను ప్రతీ ఏటా అందిస్తోంది. గ్రంథావిష్కరణలు, గ్రంథ పరిచయాలు, సాహిత్య సంబంధ కార్యశాలలు వంటి కార్యక్రమాలతో పాటు గ్రంథ ప్రచురణలు చేపట్టడం విశేషం! శ్రీ కె.ఎస్.అనంతాచార్య నేతృత్వంలో వారాల ఆనంద్, ఎం.గోపాల్, డాక్టర్ బి.వి.ఎన్.స్వామి, దాస్యం సేనాధిపతి సహకారంతో వసంతరాగం, జయగానం, పంచమ స్వరం, వచన కవితా సంకలనాలను వెలువరించారు. ‘కుదురు’, ‘పంచపాల’ పేరుతో కరీంనగర్ కథా సంకలనాలను వెలువరించడం విశేషం! ప్రతి ఉగాదికి కవి సమ్మేళనాన్ని నిర్వహించి..కవితలన్నింటినీ ఏర్చి కూర్చి ఓ కవితా సంకలనాన్ని ప్రచురించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే..‘పంచమ స్వరం’ పేరుతో ఉగాది కవితా సంకలనం-3ను వెలువరించారు. శ్రీ కడారి అనంత రెడ్డి సౌజన్యంతో వెలువడిన ఈ గ్రంథంలో 67 మంది కవుల రచనలు చోటు చేసుకున్నాయి. ‘మన్మథ’నామ సంవత్సర కవి సమ్మేళనం సందర్భంగా వచ్చిన కవితల్ని ఇందులో పొందుపరిచారు.
‘రమ్ము రావోయి తెలంగాణ రాష్టమ్రునకు/దండి బతుకమ్మ బోనాల పండుగలను! సంబరములు నిండారంగ జరుపుకొనుచు/ ఏడు గడుపుదమోయి మన మాడుకుంటు’ డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు.
పేరు ఏదైతేనేం...పేదల పెన్నిధి కావాలని డాక్టర్ డింగరి నరహరి ఆచార్య ఆకాంక్షించారు. ఇవాళ ‘రుబ్బురోలు’ నిర్వహించే రోల్ పెద్దగా ఏమీ లేకపోయినా..మనుషులు మాత్రం ఇప్పటికీ ఏ రోటి పాట ఆరోటి దగ్గర పాడటమే బొత్తిగా బాగోలేదని డాక్టర్ నలిమెల భాస్కర్ తమ కవితలో వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దేదీప్యమానంగా వెలగాలని జి.వి.కృష్ణమూర్తి తమ కవిత ద్వారా ఆకాంక్షించారు.
బడుగువర్గాల బతుకులు బాగుపడాలని సముద్రాల వేణుగోపాలాచార్య కొత్త వత్సరాన్ని వేడుకున్నారు. మరణమే శరణ్యమంటూ ఆత్మహత్య బాట పట్టిన రైతన్నలకు దాస్యం తమ కవిత ద్వారా భరోసానిచ్చారు. తొలకరి జల్లు సిగ్గుతో పృథ్వీ పొరల్ని ముద్దాడిన వైనాన్ని పోరెడ్డి సౌజన్య తమ కవితలో వివరించారు. వరములిస్తూ తరలి రమ్మని కొత్త సంవత్సరాన్ని మాడిశెట్టి గోపాల్ ఆహ్వానించారు. ఓ వ్యక్తిలోని భావప్రకంపనలే కవిత్వమని గంప ఉమాపతి తేల్చి చెప్పారు. ధనమెంత కుప్ప చేసుకున్నది కాదు లెక్క..్ధర్మం ఎంత నిలబెట్టుకున్నవన్నదే పత్రం అని అన్నవరం దేవేందర్ తమ కవితలో పేర్కొన్నారు.
కె.ఎస్.అనంతాచార్య ‘ఆకుపాట’ చక్కని భావుకతతో రూపుదిద్దుకుంది. యవ్వనం మిసమిసలు తొణికిసలాడిన..పూవుల మకరందం లోంచి..తుమ్మెదల ఝంకారపు వయసు పాట అంటూ తమ కవితకు చక్కని ముగింపునిచ్చారు. బంగారు తెలంగాణ భవితను ప్రసాదించుమని కొత్త సంవత్సరాన్ని డాక్టర్ అడువాల సుజాత అభ్యర్థించారు. డాక్టర్ బి.వి.ఎన్.స్వామి ‘పర్సయింది’ కవిత ఆసక్తికరంగా మలచబడింది. అక్షరం తొడిగిన ఆలోచనలను ఆచార్య కడారు వీరారెడ్డి పాఠకులతో పంచుకున్నారు. ఉగాదులైనా..ఉషస్సులైనా మా నేల పచ్చగా పండినప్పుడే..మారైతు నిండుగా నవ్వినప్పుడే నిజమైన ఉగాది అని కవి గాజోజు నాగభూషణం చక్కగా ఆవిష్కరించారు.
బూర్ల వేంకటేశ్వర్లు తమ కవిత..ద్వారా రారా మన్మధా అంటూ ఆహ్వానించారు. నువ్వస్తే మనుషులకు కొంత ఇరాము దొరికినట్టు ఐతది! కవులకు కొంత కలం కదిలినట్టు ఐతది/ రైతులకు భూమీద సాలుపెట్టినట్టు ఐతదని వ్యాఖ్యానించారు. ఆత్మ చెప్పిన మాటను వినుమని కడారి అనంతరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ ఉగాదైనా..పల్లె తల్లి కొప్పుల నవ్వుల ముద్దబంతులు సింగారించనీ అని డాక్టర్ కలువకుంట రామకృష్ణ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో సల్లగ బతుకుతమం’ అంటూ కొత్త అనిల్ కుమార్ తమ కవితలో పేర్కొన్నారు. పచ్చని చేలతో, పాడి పంటలతో తెలంగాణం వర్దిల్లాలని సంకేపల్లి నాగేంద్ర శర్మ కోరారు. మన జీవితాల్లోని వేదనలు, ఆవేదనలు సమసిపోవాలని బి.హరిప్రియ తమ కవితలోఅభిప్రాయపడ్డారు. ఏమరుపాటు తగదని దామరకుంట శంకరయ్య అంటే..చిరులాస్యాలు పంచుతూ ప్రకృతికాంతను ఎ.పద్మశ్రీ ఆహ్వానించారు. కొత్త వత్సరంలో అనురాగ పుష్పాలు గుబాళించాలని డాక్టర్ సముద్రాల జనార్ధన్ రావు, తమ కవిత ద్వారా ఆశించారు. తీపి చేదుల కలబోతే జీవితమని విలాసాగరం రవీందర్ పేర్కొన్నారు. స్వచ్ఛ్భారత్, స్వేచ్ఛ తెలంగాణను కాంక్షిస్తూ తంగెడ నవనీత రావు తమ కవితను తీర్చిదిద్దారు.
బుట్టెడు కవితా పూలతో కళామతల్లిని పూజించే పరమ ‘్భక్తుడు’ కవి అని పెనుగొండ సరసిజ తమ కవితలో పేర్కొన్నారు. పద్ధతిగా ఆటో నడిపించుమంటూ ఎం.డి.ఖాన్ పిలుపునిచ్చారు. కొత్త వత్సరాన్ని స్వాగతించడానికి ఆమని అందాలతో సిద్ధంగా ఉందనీ సమేదా సమీనా పర్వీన్ తమ కవితలోవివరించారు.
సిరిపురం వాణిశ్రీ తమ కవిత ద్వారా షడ్రుల పచ్చడి రుచి చూపించారు. మంచి చెడులను సమంగా స్వీకరించే శక్తి నివ్వుమని నవ వసంతాన్ని బొమ్మకంటి కిషన్ వేడుకున్నారు. ప్రకృతి ఒడిలో జీవనరాగమంతా/ వసంతగానమై పాడుకోవాలని మమత వేణు కాంక్షించారు. కాలాన్ని జీవన యాగంగా అభివర్ణిస్తూ మొహ్మద్ నసీరోద్దీన్ తమ కవిత రాశారు. ‘పొదన’ పేరుతో తెలంగాణ మాండలికంలో కూకట్ల తిరుపతి రాసిన కవిత అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రతి ఉగాది జనహృదిలో చిగురాశల పల్లవులేనని రామ కవి విఠల శర్మ పేర్కొన్నారు. మొలకే మొగ్గై పూవై వికసిస్తుంది..పరిమళకు కవిత్వమై విరబూస్తుందని వారాల ఆనంద్ చక్కని భావుకతతో ‘మొలక’ కవితను రూపుదిద్దారు.
కవిత్వం పంచే మానవతా సిరులను కవి ఎస్.వేణుశ్రీ తమ కవితలో ఏకరువు పెట్టారు. కవితకేదీ కాదనర్హం అని శ్రీశ్రీ గారన్నట్లు గాజుల రవీందర్ ‘గుమ్మి’పై కవిత రాసి అందరినీ మెప్పించారు. ఇలా ఇందులో ఉగాది కవితలేకాక..వివిధ అంశాలపై రాసిన కవితలూ ఉన్నాయి.. వర్ధమానులు, ప్రవర్థమానుల కవితలతో ముస్తాబై వచ్చిన ‘పంచమ స్వరం’కు స్వాగతం పలుకుదాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు

చెరువు
గల్లు గల్లున గంగమ్మ పాదాల గజ్జెలరావాలు
పొంగింది గంగ గగనము దద్దరిల్లు
సెలయేరులన్నీ సర్రున పారంగ
వూరూరా ఉబికి వచ్చిన నీరు
రొయ్య పాపారలన్నీ మీసాలుదువ్వంగ
చేప పిల్లలన్ని నాట్యాలు చేయంగ
రైతన్న కడగండ్ల కన్నీళ్లు తుడిచేనా?
చెరువులా నీళ్లతో చేనుపండేనా?
వురిమి కొట్టిన వాన వూర్లన్నినిండ
చెరువులు నిండి మత్తల్లు పారంగ
మత్స్యకారుల చేపల వేటకు వెళ్లగ..
ఎదురెక్కే శాపలు సందమామ కొడిపెలు
గురిజె పిల్లలుకొన్ని, బొమ్మలోలే వచ్చే
బొమ్మ శాపలన్నీ, కరుణించిన వేళ..
వరుణుణ్ణి ప్రణమిల్లి వరమడిగిన..
రైతన్న కళలన్నీ నెరవేరు వేళ
ధాన్యరాశులతో గాదెలన్నీ నిండిన వేళ
పల్లెల మోముల్లో వెలుగులు విరజిమ్మవా!

- హన్మాండ్ల రమాదేవి, బెల్లంపల్లి
సెల్.నం. 9959835745

సాంత్వన

తొలకరి జల్లులతో
ధరణి మాత
అక్షర ముత్యాలతో
తెల్లకాగితం
కోయిలల కుహుకుహు రావాలతో
కొమ్మ రెమ్మలు
అమ్మ మృదుస్పర్శతో
పాల బుగ్గల పాపాయి
స్నేహ మాధుర్యాన్ని పంచే కరచాలనంతో
మిత్రులు
ప్రకృతి రమణీయకాంతులతో
మన నయనాలు
పసందైన సంగీత స్వరాలతో
మన హృదయాలు
నిరీక్షణకు తెరపడి
ప్రియుడు ప్రత్యక్షమైతే
ప్రియురాలు
సాంత్వన పొందడం సహజం!
కష్టసుఖాల్లో..అంతరంగాలను
పంచుకునే నేస్తంతో సాంత్వన!
వృద్ధాప్యంలో తోడుంటే
సహచరితో సాంత్వన!
సాంత్వన ఓ మధురానుభూతి!
సాంత్వన ఓ అనిర్వచనీయ
మనసును సేద దీర్చేది సాంత్వననే!
సాంత్వనతోనే..
ఒత్తిడులను అధిగమిస్తాం!
సాంత్వనతోనే...
ప్రశాంతంగా మనగలుగుతాం!!
- డి.సవీణ
హైదరాబాద్
సెల్.నం.9440525544

శాంతి
ఇలలో...
శాంతిని మించిన సాధనం లేదు!
అది..
మన వ్యక్తిత్వానికి భూషణం!
విజయానికి ఆయుధం!
శాంతితోనే..
సకల సమస్యల పరిష్కారానికి
మార్గం సుగమం!
అందుకు మన జాతిపితే ఆదర్శం!
హింసకు తావివ్వవి..
ప్రశాంత సమాజానికి బాటలు వేద్దాం!
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదాలతో
త్రొక్కి పెడదాం!

- రేగుంట పోచయ్య
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా

నాన్నకు ప్రేమతో..
‘నాన్న’ రెండక్షరాలే కానీ..
నాన్న మన జీవితానికి వారధి! ఓ సారథి!
అమ్మ నొసటన..
ఆయన రుధిర కుంకుమ రేఖై ప్రకాశిస్తాడు!
కుటుంబమనే దేవాలయంలో..
దీపమై వెలుగులు పంచుతాడు!
బిడ్డల ఆట పాటల
మాధుర్యపు జల్లుల్లో తడిసి..
పరవశించే ప్రేమమూర్తి నాన్న!
తాను కష్టాల కొలిమిలో కాలుతూ..
తన పిల్లల భవిష్యత్తుకు..
బంగారంలా మెరుగులు కూర్చే
ధీమంతుడు నాన్న!
ఇంటిల్లిపాది ఆకలి దప్పులను తీర్చే
అనురాగమూర్తి నాన్న!
ఆవేదనా జ్వాలలను..
గుండెల్లోనే దిగమింగుకుని
పెదవులపై నవ్వులు పూయించే..
మాంత్రికుడు నాన్న!
భార్యా, బిడ్డల అవసరాలను తీర్చడానికి అడక్కుండా
కావలసినవి సమకూర్చే అక్షయ పాత్ర నాన్న!
చిన్ననాటి గుండెలపై ఆటలాడినవారే..
పెద్దయ్యాక..గునపాలు దించే
ప్రబుద్ధులు పెట్టే బాధలను భరించే వౌనముని నాన్న!
నాన్నంటే ఓ ఆసరా!
నాన్నంటే ఓ ధైర్యం!
నాన్నంటే ఓ ఆలాపాన!
నాన్నను తలచుకుంటేనే హృది పులకరింత!
నాన్నంటే..సంతానపు స్మృతివనంలో
విరబూసిన ఓ కాంతి సుమం!
అందుకే..
నాన్నకు ప్రేమతో నా అక్షరాభిషేకం!

- ఎలిగేటి సాక్షరి రెడ్డి (9వ తరగతి)
గుర్రంపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా
సెల్.నం.9949260262

ఏమనుకోను!
నేనేమనుకోను!!
అవి రవి అలకతో
ఆడే దోబూచులాటలా.. లేక..
మబ్బుల మాటున గిలిగింతలు పెట్టే
దాగుడుమూతలా..
సంధ్యా సమయాన
ఆకాశపు వాకిట్లో తళుక్కుమనే
వెలుగొక్కటి మా ముంగిట
వెలుగు జిలుగులు వెదజల్లుతూ
క్షణాల్లో కనుమరుగయి ఊరిస్తుంటే
ఏమనుకోను!
తప్పెట తాళంలా
టపటప చినుకులతో
పుడమి తల్లికి హారతి పడుతుంటే
ధరణి మాత ఒడిలోకి
ఒక్కో అమృత ధార జారిపోతుంటే..
మయూరాలు
ముగ్ధ మనోహరంగా నాట్యమాడుతుంటే
చకోర పక్షిలా
వర్షపు రాకకై ఎదురుచూసిన నాకు
మనసు కుదుట పడింది!
హృది పరవశించింది!
ఈ మధురానుభూతిని ఏమనుకోను!
నేను ఏమనుకోను!!

- గంప ఉమాపతి, కరీంనగర్, సెల్.నం. 9849467551

వెలుగులు!
తెలంగాణ స్వేచ్ఛకోసం
ఆరిన ఆత్మజ్యోతుల కాంతులు
తెలంగాణ అవనిలో
తెలుగు వెలుగు ప్రభలు నింపాలి!
తెలంగాణ మాగాణిలో
పసిడి పంటల సిరులు
విరులుగా పూయాలి
కాకతీయ మిషను పనులు
తటాకమున జల సిరులై
జీవ కోటికి ప్రాణమ్ము పోయాలి
కల్యాణ లక్ష్మి కటాక్షమ్ము
తెలుగు కనె్నల మెడలోన
మణిహారాలై ప్రకాశించాలి!
ఆసర ఫించను మోడువారిన
జీవితానికి తోడుగా నిలువాలి
బ్రతుకుదెరువును చూపాలి
ప్రభుత్వ పథకాలతో
జనం మోముల్లో వెలుగులు చూడాలి!

- జాదవ్ పుండలిక్ రావు
భైంసా, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9441333315
మేలు కట్లు
తరులు నిఖిలవౌ ప్రకృతికి గురులు,
వర్ష ప్రాభవమునకాదరులు,
కరాళ కరువు రక్కసికి భీకరులు,
జీవరాశికెల్ల శ్రీకరులు,
హితవరులు ఈ సృష్టికెపుడు
వేదనాయుతమైన నీ విన్నపాల
నించుకైన మేఘాలాలకించలేవు
చెట్లతో రాయభారము చేసి చూడు
వర్ధ్ధారలై మేఘాలు పలుకరించు
ప్రకృతి సమకౌల్య నిత్య సంరక్షణకయి
పైడి పైకపుసంపద పనికి రాదు
వృక్ష సంపద నొక్కటి పెంచి చూడు
రక్షణకవచమై నిల్చు లక్షణముగ
మండుటెండల వేళ నిండయిన గొడుగు
భిక్షు సంఘాలకు పెద్ద విడిది
స్ర్తి జన చెలువము దిద్దు విరులరాశి
పూజలో పువ్వుల పుణ్యరాశి
బతుకును నడిపించు ప్రాణవాయువు
తుష్టి పుష్టి పెంపొందించు పూర్ణ్ఫలము
ఇంటి వాకిట ద్వారమింటిలో పీఠము
తాతగారికి ఉతవౌ చేతి కర్ర
అఖిల జీవజాలమ్మున కాయుపట్లు
చెట్లు మనిషి మనుగడకు మెట్లు
సృష్టికాల సంరక్షణమునకు మేలు కట్లు

- డా. తత్త్వాది ప్రమోద్ కుమార్
కరీంనగర్, సెల్.నం.9441024607

నాన్నంటే..!
నాన్నంటే బాధ్యత!
నాన్నంటే భద్రత!
నాన్నంటే భరోసా!
నాన్నంటే నడిపించే వాహనం!
నాన్నంటే నడిచొచ్చే దైవం!
నాన్నంటే బిడ్డల కోసం
శ్రమించే సైనికుడు!
నాన్నంటే విద్యాబుద్ధులు నేర్పే గురువు!
నాన్నంటే భుజాలకెత్తుకొనే నేస్తం!
అమ్మ పరిచయం చేసే
మొదటి వ్యక్తి నానే్న కదా!

- గుండు రమణయ్య, పెద్దాపూర్,
జూలపల్లి, కరీంనగర్ - 505415
సెల్.నం.9440642809

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- గరిశకుర్తి రాజేంద్ర