దక్షిన తెలంగాణ

మాట్లాడాలని ఉంది.. ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చందూ.. చందూ.. అబ్బా ఎన్నిసార్లు పిలిచినా పలుకవేంటి.. కోపమొచ్చిందా..’
‘ఆ! రాదా మరి? ఎంత సేపటినుంచి ఫోన్ చేస్తున్నాను. లిఫ్ట్ చేయవేంటి. నేనొచ్చి ఎంత సేపయింది. ఎక్కడికి వెళ్లావు సుధా’
‘అదే చెబుతున్నాను, మీకో మంచి శుభవార్త తీసుకొచ్చి వచ్చాను. మనకి బాగా ఆదాయం వచ్చే వార్త’.
‘ఏంటా వార్త..?
‘నేను అన్నయ్య వాళ్లింటికి వెళ్లాను, అన్నయ్య వాళ్లింటి పక్కనే అపార్ట్‌మెంట్స్ కడుతున్నారు. అందులో ప్లాట్ చూడడానికి వెళ్లాను. అన్నయ్య, నేను, వదినతో కలిసి’
‘ఇంతకీ ఎవరు కొంటున్నారు సుధ’
‘అన్నయ్య వాళ్లు’.
‘వాళ్లు కొంటే మనకు ఆదాయం రావడమేంటి?’
‘మీ మట్టి బుర్రకు ఆదాయం ఎలా వస్తుందో అనే ఆలోచన రాదులెండి నేను చెప్పేంతవరకు.’
’ఇంకా నాన్చడం దేనికి చెప్పు’
‘అపార్ట్‌మెంట్ కట్టే బిల్డర్ ఒక విషయం చెప్పాడు. వెయ్యి గజాల ఖాళీ స్థలం ఉంటే, అందులో అతను అపార్ట్‌మెంట్స్ కట్టి ఆ ఖాళీ స్థలం ఇచ్చిన వారికి ఐదు ప్లాట్స్ ఇస్తారట అందులో. ఒక్కో ఫ్లాట్‌లో మూడు బెడ్‌రూంలు, వంట గది, హాలు ఉంటాయి తెలుసా?
‘దీనికీ, మనకి ఆదాయం రావడానికి సంబంధం ఏమిటి సుధా?’
‘ఆ విషయానికే వస్తున్నాను. మన ఇంటి చుట్టూ ఎంత స్థలం ఉందనుకుంటావు, ఎంతో నాకు తెలియదు. దాదాపు వెయ్యిగజాల పైనే’
‘అయితే ఏం చేద్దామని?’
‘ఏమీలేదు, వెరీ సింపుల్! మన ఇంటి చుట్టూ ఉన్న చెట్లను నరికివేసి ఆ స్థలం బిల్డర్‌కు ఇచ్చివేయడమే మన పని. మిగతా అంతా ఆయనే చూసుకుంటాడు. మనకు ఐదు ఫ్లాట్‌లు వస్తాయి. ఒక్క ఫ్లాట్‌లో మనముండవచ్చు. మిగతా నాలుగు అద్దెకు ఇవ్వవచ్చు. ఒక్కో ఫ్లాట్ అద్దె దాదాపు 20 వేలు అనుకున్నా నాలుగింటికి 80 వేలు, ఇది మనకు వచ్చే ఆదాయం. అందుకని నేను ఏం నిర్ణయించుకున్నానంటే చెట్లన్ని నరికివేయడం. రేపే అన్నయ్య బిల్డర్‌ను తీసుకొని వస్తున్నాడు. మీరు ఇంకేమీ ఆలోచించొద్దు. మీరు కాదంటే నేనేం చేస్తానో తెలుసుగా, అదీ గాక ఇన్ని రోజులు తీరని కోరికలు ఇప్పుడు తీర్చుకోవచ్చు. కారు కొనుక్కోవచ్చు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.’
సుధ మాట వినకపోతే ఇల్లు ఎంత నరకం చేస్తుందో తెలుసు చందూకి. చెట్లను నరికి వెయ్యాల్సిందే అనుకుంటాడు చందు.
రాత్రి భోజనలయ్యాక నిద్రపోతాడు చందు.
చందూ.. చందూ.. చందూ..
ఒకేసారి పది గొంతులు పిల్చినట్టుగా అనిపిస్తుంది.
‘చందూ.. మాకు నిద్రలేకుండా చేసి నువ్వు ఎంత హాయిగా నిద్రపోతున్నావు.
ఇంత అన్యాయం ఎక్కడా లేదు చందూ...’
‘ఎవరు మీరు?’
‘మేము ఎవరమా!’
‘ఒక్కసారి కళ్లు తెరిచి చూడు’
‘మీరు..’
‘ఆ మేమే.. జామ, చింత, మామిడి, నిమ్మ, వేప అందరం కలిసి వచ్చాము.’
‘నీ ఇంటిచుట్టు ఉన్న మేము రేపటి నుండి ఉండమని నీతో మాట్లాడాలని ఉంది అని వచ్చాము.
మా మనస్సులోని ఆవేదనను చెప్పుకోవాలని..
చందూ.. నేను వేపచెట్టును మమ్మల్ని నరికించేస్తావా,
నీవు ఇంత కఠినాత్ముడివి ఎలా అయ్యావు చందూ.. మాతో పాటే పెరిగావు. మా ఒడిలో ఆడుకున్నావు.
చందూ ఒక్కసారి ఏం జరిగిందో చెప్పనా, అప్పుడు 10 సంవత్సరాల పిల్లాడివి, నీకు అమ్మవారు పోసినప్పుడు, నీకు తగ్గాలని నా శరీరంలో కొమ్మలను, రెమ్మలను నీ ఒంటి చుట్టు కప్పి ఉంచానే, ఎందుకో తెలుసా, నా తమ్ముడికి తొందరగా తగ్గిపోవాలని, వెంటనే కోలుకోవాలని అలాంటిది నన్ను నరకడానికి నిర్ణయించుకున్నావా.’
‘చందూ.. నేను మామిడిని నా దగ్గరికి వచ్చి ఇష్టమైన పండును తెంపుకుని, నాలోని రసాన్ని తాగుతుంటే తల్లిదగ్గర బిడ్డ పాలు తాగే ఆనందాన్ని అనుభవించే దాన్ని అలాంటి నన్ను చంపాలనుకుంటావా.’
‘చందూ.. నేను నిమ్మచెట్టును, ఒక్క విషయం గుర్తు చేస్తున్నాను. నీకు పెండ్లి కుదుర్చుకోవడానికి, మీ అత్తింటి వారు వచ్చినప్పుడు మీ అమ్మగారు నిమ్మరసం చేసి ఇచ్చినపుడు వారు తాగి నిమ్మరసం బావుంది. నిమ్మకాయలు ఎక్కడివి అన్నప్పుడు నేను పెంచిన చెట్టువే అన్నావు కదా. నువ్వు పెంచిన నన్ను నీ చేతితోనే నరికివేస్తావా?’
‘చందూ.. నేను జామచెట్టును, నా జామ పండ్ల రుచికి అక్షర రూపం ఇచ్చి కవితలల్లి ఇప్పుడు నా రూపానే్న కాలరాసేస్తావా, జామ నిన్ను చూస్తుంటే ఒయ్యారి భామ గుర్తుకు వస్తుంది అనేవాడివే, నీ భామగా అగుపించిన ఈ జామ నీకు ఇప్పుడు భారమైందా!’
‘చందూ.. చందూ.. నేను చింతచెట్టును, నా చెంత చేరినప్పుడు నీ చింతలన్నీ దూరం చేసిన దానిని. నా చిగురుతో పప్పు వండితే లొట్టలు వేసుకుని నువ్వు తింటుంటే నేను చూసి మురిసిపోయేదానిని. అలాంటి నన్ను మట్టిలో కలిపేస్తావా?’
- ఇలా అన్ని చెట్లు వాటి అంతర ఘోషను వినిపించసాగాయి!
‘ఇంత చదువు చదువుకున్నావు, మా వల్ల ఎంతటి రక్షణ ఉంటుందో, ఎంతటి ఆరోగ్యం ప్రాప్తిస్తుందో చెప్పలేవా.
నీ చదువు నిరర్థకమేనా చెప్పు చందూ.. లే చెప్పు నీ వెంట మేముంటాము.
నీ ఇంట్లో వాళ్లని, సమాజాన్ని మేల్కొలుపు’ అని వేడుకున్నాయి.
‘చందూ.. చందూ.. ఏంటి మొద్దునిద్ర, లే, అన్నయ్య, బిల్డరు వచ్చే వేళయింది. లే.. లే.. అంది సుధ.
‘బిల్డరా ఎందుకు?’ అన్నాడు చందు.
రాత్రి చెప్పిన విషయం మరిచిపోయావా?
‘మరిచిపోలేదు కానీ.. నేను ఒక నిర్ణయానికి వచ్చాను.
నేను నా చెట్లను నరికి నా ప్రాణంతో సమానమైన వాటిని దూరం చేసుకోలేను. ఇదే నా ఆఖరి నిర్ణయం.
చూడు సుధ, ఒక విషయం చెబుతాను విను, నువ్వు అల్లారుముద్దుగా పెంచిన నీ చెల్లెండ్లు, నీ తమ్ముళ్లు, నిన్ను నరికివేస్తే వందకోట్లు ఇస్తాము అని ఎవరన్నా అంటే, వారు నిన్ను చంపడానికి పూనుకుంటే, నువ్వు బాధ పడవా?
డబ్బుకోసం చంపడానికి సిద్ధపడతారా అంటూ, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేశాను. ఈ రోజు మీరు ఇంత నిర్దయగా ప్రవర్తిస్తారా అంటూ గగ్గోలు పెడతావు.. కదా!
ఏడుస్తావు, అరుస్తావు అందరికి ఈ విషయం చెబుతావు..
నీకు మాట్లాడే శక్తి ఉంది కాబట్టి నీ భావాలను అందరికి వ్యక్తపరుస్తావు. చెట్లకు నోరు లేదు కదా అని వాటిని నరికివేసి మనం ఆనందమైన జీవితం గడపాలనుకోవడం తప్పు.
సుధా! నీ వయస్సులో ఉన్న నీ స్నేహితులు ‘అపార్ట్‌మెంట్స్’లో ఉండి, స్వచ్ఛమైన ప్రకృతి గాలికి దూరంగా, అనారోగ్యానికి దగ్గరగా నీ స్నేహితులు ఎంతమంది లేరు.
నీవు ఆరోగ్యంగా ఉండడానికి కారణం చెట్లని గ్రహించు. వాటివల్ల వచ్చే ప్రాణవాయువు వల్లే నీవు ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు.
ఒక్కసారి ఆలోచించి అవసరమైతే నువ్వు చెట్టులాగా ఆలోచించు’ అని అన్నాడు చందూ.
సుధ, చందూ చెప్పిన ప్రతి విషయాన్ని గ్రహించి, ఆకళింపు చేసుకుని..
‘చందూ నన్ను క్షమించు, చెట్లవల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నాను. మనము చెట్ల మధ్యనే ప్రశాంతంగా ఉందాము.
చందూ.. వాటితో మనస్సు విప్పి నాకు కూడా మాట్లాడాలని ఉంది’ అంది సుధ!

- డా. గంధం విజయలక్ష్మి
నిజామాబాద్, సెల్.నం.9948181458

అంతరంగం

అమరులకు ‘అక్షర నివాళి’

పేజీలు: 62 - వెల: 100/-
ప్రతులకు: బైస దేవదాస్
ఎస్‌ఆర్‌టి-74, జవహర్‌నగర్
హైదరాబాద్-20

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైన వేళ.. అమరుల త్యాగాలను స్మరిస్తూ నేటి నిజం పత్రికలో రాసిన కవితల్ని ఏర్చి కూర్చి ‘అక్షర నివాళి’ గ్రంథం వెలువడింది. నేటి నిజం పత్రిక సంపాదకులు బైస దేవదాస్ సంపాదకత్వంలో వచ్చిన ఈ గ్రంథంలో 60 మంది కవులు అమరులకు నివాళి సమర్పిస్తూ రాశారు. ఒక ప్రాంతం కోసం 60 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసిన నేపథ్యాన్ని, అమరుల త్యాగాలను ప్రతిబింబిస్తూ రాయబడిన ఇందలి కవితలు ఆర్ద్రంగా మలచబడ్డాయి. అమరులకు జోహార్లు అర్పిస్తూ ముందు ముందు మా ప్రతి అడుగులో మీరుంటారు. తరతరాల చరిత్ర పుటల్లో మీరు శిలాక్షరాలవుతారనీ.. మరికొందరికి పాఠాలవుతారని కవులు అమరులను కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర కల ఫలించిన వేళ.. ప్రత్యేక రాష్ట్ర ఫలాలు అనుభవించకుండానే దివికేగిన అమరులకు ప్రతి కవి అక్షరాంజలి ఘటించారు.
అమరుల త్యాగం మొగులు మీద తెలంగాణ నక్షత్రం పొడిచిందనీ.. వారి మరువలేని గాథలకు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి తమ కవితలో నివాళి సమర్పించారు.
‘సమరంలో అమరం’ అంటూ డాక్టర్ ఎన్.గోపి తమ కవితలో ఏ రోడ్డు మీద నడుస్తున్నా మీరే గుర్తుకొస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. మీరెప్పటికీ మా గూట్లో దీపాలై వెలుగుతారని పేర్కొన్నారు. డాక్టర్ సుద్దాల అశోక్ తేజ తెలంగాణ తారలుగా అమరులను అభివర్ణించారు. జూలూరి గౌరీశంకర్ తమ ‘ఉద్యమాగ్నులు’ కవితలో అమరులను నింగికెగిసిన ఆత్మగౌరవ జెండాలుగా కొనియాడారు. అమరుల కాష్ఠం కాలిన బూడిద మా నొసట విభూది అయ్యిందని ఆచార్య కడారు వీరారెడ్డి నివాళులర్పించారు.
దశాబ్దాల కల సాకారం కోసం ఉరికొయ్యను ముద్దాడిన అమరుల త్యాగం సదా స్మరణీయమని దాస్యం సేనాధిపతి తమ కవితలో ఆవిష్కరించారు. చరిత్ర నిర్మాణంలో అమరులు కనపడని పునాదిరాళ్లని బి.ఎస్.రాములు తమ కవిత ద్వారా అభిప్రాయపడ్డారు. అమరులను చారిత్రక వీరులుగా డాక్టర్ ద్వానాశాస్ర్తీ అభివర్ణించారు. భగభగమండే సూర్యగోళమై ఉద్యమాగ్నిని ప్రజ్వలించిన తెలంగాణ బిడ్డలకు పోతన జ్యోతి అక్షరాంజలి ఘటించారు.
సిహెచ్.మధు అమరుల అమరత్వం తెలంగాణ చరిత్రలో అమరంగా ఉంటుందని తమ కవితలో పేర్కొన్నారు. నేడు తెలంగాణ దీపం వెలిగిందని డాక్టర్ టి.గౌరీశంకర్, త్యాగాల తారలనీ రేడియమ్, వేగుచుక్కలుగా డాక్టర్ నలిమెల భాస్కర్‌లు తమ కవితల్లో చక్కగా ఆవిష్కరించారు. గోలుకొండ కోట మీద మీరు జెండాలై ఎగురుతారని డాక్టర్ పత్తిపాక మోహన్, అనగా అవనిలోని అణువణువులో మీరున్నారని డాక్టర్ ఆడువాల సుజాత పేర్కొన్నారు.
అమరుడెప్పుడూ అదృశ్యం కాడనీ, నిప్పుల జెండాగా ఆకాశంలో వ్యాపించి ఉంటారని సంగెనేని రవీంద్ర తమ కవిత ద్వారా తెలియజెప్పారు. ఆయువు కన్నా ఆశయం మిన్న అని నిరూపించిన అమరులకు మాడిశెట్టి గోపాల్ జోహార్లు సమర్పించారు. వారితో పాటు ఎస్.హరగోపాల్, డి.మాధవీలత, జి.విజయలక్ష్మి, ఎం.సుబ్బారావు, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, సింహాచలం లక్ష్మణస్వామి, డాక్టర్ దామెర రాములు, వౌనశ్రీ మల్లిక, డాక్టర్ నాళేశ్వరం శంకరం, కె.ఎస్.అనంతాచార్య, ఆచార్య రావికంటి వసునందన్, కందుకూరి శ్రీరాములు, డాక్టర్ పోరెడ్డి రంగయ్య, కన్నోజు లక్ష్మీకాంతం, శారదా హన్మాండ్లు, అనిశెట్టి రజిత, వేముల సత్యనారాయణ, సాదనాల వెంకట స్వామినాయుడు, ఎన్వీ రఘువీర్, ప్రతాప్, అంబల్ల జనార్ధన్, యెల్ది సుదర్శన్, కాసర్ల నరేష్ రావు, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, సాహిత్య ప్రకాష్, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ భీంపెల్లి శ్రీకాంత్, వడిచర్ల సత్యం, రమణ వెలమకన్ని, మచ్చ ప్రభాకర్, కందాళై, సిహెచ్.ప్రకాష్ వంటివారి కవితలు పాఠకులను కదిలించేలా ఉన్నాయి. ఆచార్య మసన చెన్నప్ప, సంకేపల్లి, స్వాతి శ్రీపాదాల కవితలు రూపుదిద్దుకున్న ఈ గ్రంథం అందరూ చదువదగింది.

- సాన్వి, కరీంనగర్

అంతరంగం

యోగ్యత, అర్హతలకే
పురస్కారాలు లభించాలి

అయాచితం నటేశ్వర శర్మ

చిరునామా:
డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ
రిటైర్డ్ ప్రిన్సిపాల్, కామారెడ్డి
సెల్.నం. 9440468557

సాహితీ పురస్కారాలు యోగ్యతను బట్టి అర్హులకు లభించాలని ప్రముఖ సంస్కృతాంధ్ర విద్వత్కవి, వ్యాకరణ శిరోమణి డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ అభిప్రాయపడ్డారు. వివిధ ప్రక్రియల్లో సాహిత్యసృజన చేస్తున్న శర్మగారు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నివాసి. వృత్తిరీత్యా సంస్కృత కళాశాల ప్రాచార్యులుగా ఉద్యోగ విరమణ చేశారు. నవ వసంతం, విక్రాంతిగీతి, సుప్రభాత శోభ, అభ్యుదయ గీతి, నవ్యగీతి అనే ఐదు సంకలనాలు శర్మగారి కలం నుండి జాలువారాయి! 1975లో ‘సినారె రామప్పకు’ సంస్కృతానువాదం చేసిన అనుభవం ఆయనకుంది. నిరంతర సాహితీ కృషీవలుడైన శర్మగారితో ‘మెరుపు’ ముచ్చటించి. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరింప ప్రయత్నించింది. వారితో ముఖాముఖి వివరాలు ‘మెరుపు‘ పాఠకులకు అందిస్తున్నాం.

ఆ మీ రచనా వ్యాసాంగానికి ప్రేరణను ఇచ్చింది ఎవరు?
1967లో నేను తిరుమలలోని వేద సంస్కృత పాఠశాలలో చదువుతున్నప్పుడు వారం వారం ‘విద్యాభివృద్ధినీ సభ’ అనే పేరుతో విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని ప్రోత్సహించేందుకు, వక్తలుగా రాణించేందుకు, మా ప్రాచార్యులు ఆర్.కృష్ణస్వామి అయ్యంగార్ గారు, అలా వారి ప్రేరణతో మొదట ‘దీపావళి’ పండుగపై సంస్కృతంలో అనుష్టుప్ ఛందస్సులో శ్లోకాలను రచించాను. తొలి ప్రేరణ అది.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
నా దృష్టిలో కవిత్వం ఒక బ్రహ్మ పదార్థం. అది ఎలా అన్వయించుకుంటే అలా సమన్వయమవుతుంది. ప్రాచీనులు కవిత్వం అంటే ‘వర్ణనాత్మకం’ అన్నారు. దాన్ని నేను నమ్ముతాను. రమణీయంగా వర్ణించడమే కవిత్వం.. అందమైన శరీరంలోని లావణ్యం వలె కవిత్వం రమణీయార్థక శబ్దమయమై ఉండాలని నేను విశ్వసిస్తాను. మార్మికత కవిత్వానికి ప్రాణం లాంటిది. పైకి కనిపించని అంతరార్థం అనుభవంలోకి వచ్చేలా చేసేదే నిజమైన కవిత్వమని నేను భావిస్తాను.

ఆ మిమ్మల్ని ప్రభావితం చేసిన గ్రంథం ఏది?
ఒక్క గ్రంథం అని చెప్పలేను.. వాల్మీకి, వ్యాసకాళిదాసుల రచనలు నాకు చాలా ఇష్టం.. తెలుగులో నన్నయ మహాభారతం నేను ఇష్టపడే రచన! ఆధునిక సాహిత్యంలో సినారె, దాసరథి రచనలు నన్ను బాగా ప్రభావితం చేశాయి!

ఆ మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే
ఏం చేయాలి?
తొలి నాళ్ల నుండి కూడా తెలంగాణ సాహిత్యకారులు ప్రచార విముఖులు. అంతర్ముఖులు. మన వారి అద్భుత రచనలన్నీ ఇంటికో, ఊరికో పరిమితమయ్యాయి! వాటిని వెలుగులోకి తీసుకొని రావలసిన గురుతర బాధ్యత నేటి విద్వత్కవులందరిదీ! ఇప్పుడిప్పుడే ఎందరో పాత, కొత్త కవులూ, రచయితలూ వెలుగులోకి వస్తున్నారు. అయినా ఈ కృషి చాలదు. ఎక్కడికక్కడ ఉద్యమస్ఫూర్తితో పనిచేస్తే కానీ మరుగునబడ్డ మన సాహిత్యం బయటపడదు. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన విషయాలను బహిర్గతం చేయడమే దీనికి మార్గం. అందుకుగాను ప్రచార సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
సాహితీ పురస్కారాలు యోగ్యతను బట్టి అర్హులకు లభించాలని నా అభిప్రాయం. పురస్కారాల ఎన్నిక ప్రక్రియలో లోపాలు లేకుండా చూడాలి. చిత్తశుద్ధిగా కృషి చేసే ఏ సాహిత్యకారుడూ తనకు తానుగా ఏ పురస్కారాన్ని కోరడు. సాహిత్య కృషిని సమాజం గుర్తించాలి. నిపుణులు గుర్తించాలి. కానీ ఇప్పుడు చాలాచోట్ల పురస్కారాలకై సాహితీకారులను దరఖాస్తు చేసుకొమ్మనడం ఆనవాయితీగా మారింది. దీనికి నేను వ్యతిరేకం!

ఆ వివిధ ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు కదా! మీకు ఏ ప్రక్రియ
అంటే ఇష్టం?
నేను అన్ని ప్రక్రియలనూ సమానంగానే గౌరవిస్తాను. అందుకే నా రచనల్లో వచనం, పద్యం, గేయం, పాట, శ్లోకం, విమర్శ, అవధానం ఇలా అన్నీ రంగరించుకుని ఉంటాయి. సందర్భాన్ని వస్తువునూ అనుసరించి ప్రక్రియను ఎన్నుకోవడం నాకు అలవాటు. అందుకే ప్రసన్నతకు పద్యాన్నీ, ప్రబోధానికి గేయాన్నీ, సంస్కరణ కోసం వచనాన్ని, స్థితికి శ్లోకాన్ని ఉపయోగిస్తాను. అయితే ప్రక్రియ ఏదైనా పసగల పలుకులనే సృజించాలన్నది నా ఆరాటం! అయినా నన్ను సాహితీ లోకం పద్య కవిగానే గుర్తించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు
ఏమిటి?
ఏ కవి అయినా, ఏ రచయిత అయినా, తాను చెప్పదలచుకొన్నది ఏమిటో మొదట నిష్కర్షగా తేల్చుకోవాలి. భావ స్పష్టత లేని రాతలకు విలువుండదు. దర్శనం, వర్ణనం లేనిది కవిత్వం కాదు.. విషయ స్పష్టత లేనిది రచన కాదు. ఈ సత్యాన్ని కవులూ, రచయితలూ గుర్తించాలి.

ఆ సాహితీ సంస్థలు క్రియాశీలకంగా పనిచేయడానికి
ఏం చేయాలి?
ప్రస్తుతం సాహితీ సంస్థలు చాలా వరకు క్రియాశీలకంగానే పని చేస్తున్నాయి. కొన్ని మూతపడ్డాయి. కొన్ని నత్త నడకలు నడుస్తున్నాయి. ఏ సాహితీ సంస్థలోనైనా క్రియాశీలకంగా వ్యవహరించే వారు ఒకరిద్దరే ఉంటారు. వారితోనే సంస్థలు మనగలుగుతున్నాయి. అయితే సభ్యులందరు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించగలం.

ఇంటర్వ్యూ : దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

మనోగీతికలు

మా జీవితం!
వాగు వంకల్లో
తోపెలతో చిన్న చిన్న
చేపలు పడతాం
గాలమేసి వలవేసి
చెరువుల్లో నదుల్లో పెద్ద
చేపలు పడుతాం
నాటుపడవల్లో
వేటకు వెళతాం
పెద్ద చాపలు ఎగిరిపడితే
దెబ్బలెన్నో వోర్చుకుంటాం
తుఫానులో చిక్కుకుని
ప్రాణాలను సైతం కోల్పోతాం
అమ్ముకోవటానికి లేదు
అన్నిచోట్ల మాకు సౌకర్యం
రోడ్డు పక్కన
చెత్త కుండీల పక్కన
మాకు దొరికే స్థలం
ఎండకు ఎండి
వానకు తడుస్తాం
ఉదయాన్నుండి రాత్రి వరకు
నీళ్లల్లో నానుతాం
అరచేతులు, పాదాలు
తెల్లబడిపోయి
చేప పొలుసుల్లాగా
ఊడిపోతుంది మా చర్మం
ధర మాకు మిగులుస్తుంది దరిద్రం
దళారుల వైపు వెళుతోంది ధనం
సాగరతీరాల వెంట
సాగిపోతుంది
కష్టాలతో మా కాపురం
తరతరాలుగా
తాటాకు గుడిసెల్లోనే
మా జీవితం!

- రంగు గోవర్థన్
కరీంనగర్, సెల్.నం.9849497679

కాలగతి
కాలం పరుగిడుతోంది
ఎందుకోసమో - ఎవరిని కలవడానికో!
ఎప్పటినుండో పరుగిడుతోందట కాలం!
నాకంటే పూర్వం
నా చిన్నప్పటి నుండి
ఇప్పటికీ, ఇనే్నళ్లైనా
పరుగిడుతూనే ఉంది..
ఎంతటి నీతి, నిజాయితీ కాలానికి!
ఎవరి కోసం తన పయనం!..
ఏమిటి తన గమ్యం?
తన నేస్తం, దినకరునితో సమంగా
ఆగకుండా, అలసట లేకుండా
పరుగెత్తడమే లక్ష్యంగా
పరుగిడుతోంది!.. కాలం..
మనమంతా తనలాగే, అలాగే
అలసట లేకుండా, ఆగకుండా
గమ్యం చేరుకోవాలనే ఆశతో
పరుగులు పెట్టాలని
పిల్లలకు, పెద్దలకు
వయోభేదం మరచి
పరుగులు పెట్టాలని కాలమిచ్చే
ఓ మంచి సలహా

- గరిశకుర్తి శ్యామల
హైదరాబాద్, సెల్.నం.9490189081

స్నేహం

మిత్రమా! ఓ మిత్రమా!
నా స్నేహ బంధమా!
నీతో వున్న ఆ క్షణం
మరిచిపోలేని ఓ చిరస్మరణ
అమ్మ అనే పదంలో మమకారమై
నాన్న అనే పదంలో స్ఫూర్తివై
నా సుఖ దుఃఖాలను మోసే బంటువై
నా జీవితంలో నీవే ఓ మార్గదర్శివై
నేను నడిచే బాటలో బాటసారివై
ఇలా ప్రతి విషయంలో నా అడుగువై
నువ్వున్న నా జీవితంలో
విలసిల్లుతున్న పుష్పం నీ స్నేహం!
వికసిస్తున్న సుమంలో సుగంధం వలె నీ ప్రేమ
మొగ్గవోలేనున్నది పుష్పంలా విరబూసింది
మన బంధం మిత్రమా!
నా ప్రేమానురాగాల ప్రాణమిత్రమా!

- ఎ.జ్యోతి, 10వ తరగతి,
ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా

పుడమి

ఘర్షణల ఘీంకారాలే
రాపిళ్ల రచ్చబండగా
ఉరుములు మెరుపులై
ఎవరో తరిమినట్లుగా..
పుడమి పిలిచినట్లు
నీవు లేక నేనుండలేననే
సమస్త జీవజాలం
ఆకాశం నుండి వచ్చే
నీటి ధారలకై నిరీక్షణ
గిరులు తరులు చెరువులు
నీ చెలిమి కోసం..
చెలికాడు లేని చెలిలా
విరహతాపంతో విరాగియైన
ధరిత్రి.. దాహంతో..
చినుకు చినుకుగా
గగనం నుండి గంగ
పరుగులెత్తి వస్తే
పుడమి తల్లి పులకరించి
ప్రకృతి కాంతకు
పచ్చటి తోరణాన్ని చుట్టినట్లు
నీ రాకతో
మరి కఠిన శిలలు కూడా
కరుణా పూరితమై
కరిగిపోయేందుకు సిద్ధంకావా?
email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- డా. గంధం విజయలక్ష్మి